Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ : ఖేలా హోబే – దుమ్ము రేపిన ప్రచారగీతం

ఎమ్బీయస్ : ఖేలా హోబే – దుమ్ము రేపిన ప్రచారగీతం

బెంగాల్ ఎన్నికలలో తృణమూల్‌కు ప్రచారాస్త్రంగా ఉపయోగపడిన ఓ పాట గురించి యీ వ్యాసం. నినాదాల కంటె ఓ మంచి ప్రచారగీతం ఎంత గొప్పగా పనిచేసిందో రాజకీయ నాయకులందరూ గమనించ వలసినదేనని నా అభిప్రాయం. అందరికీ తెలుసు, బిజెపి పిడుక్కీ, బియ్యానికీ జై శ్రీరామే వాడుతుందని. భగవన్నామం ఉచ్చరించేటప్పుడు సమయం, సందర్భం, స్థలం చూడాలని పెద్దలు చెప్పారు. కానీ యిటీవల ఆ యింగితం లోపిస్తోంది. గాయత్రీ మంత్రమైనా సరే, విష్ణు సహస్రనామాలైనా సరే ఎక్కడపడితే అక్కడ మైకుల్లో వినిపించేస్తున్నారు. శ్రోతలు శుచిగా వుండాలన్న పట్టింపు లేదు. ఇక ఘంటసాల భగవద్గీత అయితే శోకగీతం అయిపోయింది. చనిపోయినప్పుడు తప్ప వేరే సందర్భాల్లో వినటం లేదు. అసలది ఎలా జీవించాలో చెప్పే గీతోపదేశం. అంత్యక్రియలు ఎలా జరపాలో చెప్పేది కాదు.

ఇక బిజెపి జై శ్రీరామ్‌ని రాజకీయ సభల్లోనూ వాడేసుకుంటోంది. బెంగాల్ బిజెపి సభల్లో పార్టీ జండాల కంటె, ఓం జండాలు, భగ్‌వా జండాలు ఎక్కువగా వున్నాయని, వాళ్ల ఉపన్యాసాల్లో రాజకీయ చర్చల కంటె జై శ్రీరామ్ నినాదాలే ఎక్కువ వున్నాయని, యివన్నీ ఎన్నికల కమిషనర్‌కు కనబడలేదా అని ప్రశాంత కిశోర్ అడిగారు. ఇండియా టుడే సీనియర్ ఎడిటర్స్ తామూ ఆ విషయాలను గమనించామని ఒప్పుకున్నారు. జై శ్రీరామ్ వంటి నినాదాల్లో ఒక చిక్కు వుంది. దాదాపు 30, 35 ఏళ్ల క్రితం నార్త్ ఇండియాలో ఒక ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో కాంగ్రెసు ప్రభుత్వాన్ని చెరిగేస్తూ వుంటే, వాళ్లు సమాధానం చెప్పలేక తమ సభ్యుల్ని ఉసిగొల్పారు. ఇతను మాట్లాడుతూ వుంటే కాంగ్రెసు వాళ్లు ‘గాంధీకీ జై’ అంటూ నినాదాలు యివ్వసాగారు. తను చెప్పేది ఎవరికీ వినబడకుండా, యిలా అసందర్భంగా నినాదాలు యిస్తూంటే సహనం కోల్పోయిన సభ్యుడు కోపంగా ‘గోడ్సేకీ జై’ అన్నాడు.

నిజానికి అది అతని పార్టీ విధానమూ కాదు, వ్యక్తిగతంగా గోడ్సేపై ప్రేమా లేదు. అడ్డు తగిలినవాళ్లు గాంధీ అన్నారు కాబట్టి యితను గోడ్సే అన్నాడంతే. ఇక అక్కణ్నుంచి ‘అదిగో గోడ్సేని కీర్తించా’వంటూ కాంగ్రెసు వాళ్లు యాగీ చేశారు. ఎంజె అక్బర్ అయితే (బిజెపిలో చేరడానికి ముందు రోజుల్లెండి) ‘ద మ్యాన్ హూ సెడ్ గోడ్సేకి జై’ అంటూ తప్పుపడుతూ పెద్ద వ్యాసమే రాశాడు. అలాగ బిజెపి వాళ్లు ఎదుటివాళ్లను మాట్లాడనీయకుండా జై శ్రీరామ్ నినాదాలతో విసిగిస్తూ వుంటే, తృణమూల్ వాళ్లు ‘జై రావణ్’ అన్నారనుకోండి, పెద్ద గోల అయిపోయేది. బిజెపికి పెద్ద ప్రచారాస్త్రం దొరికేది. తృణమూల్ ఆ పని చేయలేదు కానీ మమత రామబాణాన్ని చండీస్తోత్రంతో ఎదుర్కుంది. రాముడు కూడా చండీ భక్తుడే అనేసింది. చండీపాఠాలు సభల్లో వల్లె వేసింది.

నిజానికి బెంగాలీలకు రాముడు ప్రధాన దేవుడు కాదు. దుర్గే ముఖ్యం. దసరా మండపాలలో చూడండి, దుర్గ కుటుంబం మొత్తం కనబడుతుంది. వినాయకుడు, కార్తికేయుడు ఎలాగూ వుంటారు. లక్ష్మీ, సరస్వతి వాళ్ల పురాణాల ప్రకారం అక్కాచెల్లెళ్లు, అత్తాకోడళ్లు కాదు. ఇద్దరూ దుర్గ కూతుళ్లు. శివుడు ఎలాగూ దుర్గ భర్తే. చదువు, డబ్బు, శక్తి, విఘ్నరాహిత్యం, మేధస్సు అన్నీ దుర్గ స్వయంగానో, తన పిల్లల ద్వారానో యిప్పించేస్తుంది. ఇతర దేవుళ్లతో పెద్దగా పనిబడదు. దుర్గ రుద్రరూపమే కాళి. బెంగాల్‌లో దీపావళిని కాళీపూజగా జరుపుకుంటారు. మండపాలు పెడతారు. చైతన్య మహాప్రభు అనుయాయులు కృష్ణుణ్ని పూజిస్తారు. నేను విశ్వకర్మ జయంతి రోజున విశ్వకర్మ మండపాలు చూశాను కానీ రామనవమి, హనుమజ్జయంతికి మండపాలు, ఊరేగింపులు చూడలేదు. ఇవన్నీ బిజెపి యిటీవల కొత్తగా పరిచయం చేసింది. అవి వూపందుకున్నాయి.

అందువలన  యీ ధాటిని ఎలా ఎదుర్కోవాలా అని తృణమూల్ ఆలోచిస్తూండగా ఆ పార్టీ కార్యకర్త 25 ఏళ్ల సివిల్ యింజనియర్ దేవాంశు భట్టాచార్య యీ జనవరిలో ‘ఖేలా హోబే’ అనే ర్యాప్ పాట పాడి, ఫేస్‌బుక్‌లో పెట్టాడు. అది విపరీతంగా వైరల్ కావడంతో తృణమూల్ పార్టీ దాన్ని అధికార ప్రచారగీతం చేసేసుకుంది. ఖేలా హోబే గురించి గతంలోనే ప్రస్తావించాను. ఆటాడుకుందాం రా అనే అర్థంలో వాడవచ్చు. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని గీతరచయితను అడిగితే ‘మా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ గారు మాట్లాడితే కొడతాం, కోస్తాం, పాతిపెడతాం, స్మశానానికి పంపుతాం అంటూంటాడు. ఇంత హింస ఎందుకు, రాజకీయాలంటే క్రీడ మాత్రమే కదాని మా యువత అనుకుంటాం. అందుకని దీన్ని ఒక ఆటగానే చూద్దామనే విజ్ఞప్తితో  యిది రాశాను’ అన్నాడు.

తృణమూల్ పథకాల గురించి వివరించే ఆ గీతంలో తొలి పంక్తులు మాత్రం రాస్తున్నాను. ‘బాయిరే థేకే (బయటి నుంచి) బొర్గి ఆసే (బర్గీలు వస్తున్నారు), నియమ్ కొరే ప్రతి మాసే (ప్రతి నెలా రూలు తప్పకుండా వచ్చేస్తున్నారు), అమియో ఆచ్చి, తుమియో రొబే, బంధూ, ఏబార్ ఖేలా హోబే, (నేనూ ఉన్నా, నువ్వూ వున్నావ్, స్నేహితుడా, యీసారి ఆట జరుగుతుందిలే) ఖేలా ఖేలా ఖేలా హోబే..’ దీనిలో ముఖ్యమైన పదం బర్గీ. 1741-51 మధ్య బెంగాల్‌లో పశ్చిమ భాగంపై మరాఠా ఆశ్వికదళం ఏటేటా వచ్చి దోచుకుపోయేవారు. అందువలన బెంగాలీలు దోపిడీ దొంగలను ఆ పేరుతో పిలుస్తారు. ఇప్పుడు గుజరాతీ నాయకులతో నిండి వున్న బిజెపి పశ్చిమ భారతం నుంచి వచ్చి పడినది కాబట్టి దేవాంశు బర్గీ పదాన్ని ధారాళంగా వాడాడు. ‘బయటివాళ్లు’ థీమ్‌ను తృణమూల్ శుబ్భరంగా వాడుకుందని మరో వ్యాసంలో రాశాను. ఈ గేయరచయిత గతచరిత్రలోని దోపిడీని కూడా దానికి జోడించాడు. అందువలన బెంగాలీలను ఆ పాట విశేషంగా ఆకట్టుకుంది.

ఈ పాట మమత దృష్టికి రావడంతో ఆమె యీ పాటకు దృశ్యరూపం కూడా యిచ్చింది. ఆట అంటే బెంగాలీలకు ముందుగా తట్టేది – ఫుట్‌బాల్. వాళ్లు క్రికెట్‌ను కూడా విపరీతంగా యిష్టపడతారు. కానీ ప్రథమ స్థానం ఫుట్‌బాల్‌కే. దేశమంతా క్రికెట్ ఆటగాళ్లనే ఆరాధిస్తే, అక్కడ ఫుట్‌బాల్ ఆటగాళ్లను కూడా ఆరాధిస్తారు. మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ టీముల అభిమానులుగా ప్రజలందరూ విడిపోయి తెగ వాదించేసుకుంటూ వుంటారు. అందువలన మమత తన వేదికలపైకి ఫుట్‌బాల్ తెచ్చి, రెండు మూడు సార్లు గాల్లోకి ఎగరేసి, ఖేలా హోబే నినాదాన్ని యిచ్చి, ప్రజలను ఉత్తేజ పరచి, ఆ బంతిని జనాల్లోకి విసిరేసేది. ఈ పాట గురించిన యూట్యూబు లింకులను కింద యిస్తున్నాను. చూడండి. చాలా ఉత్తేజభరితంగా సాగుతుంది. ర్యాలీలలో యువకులు దానికి గొంతు కలిపి కోరస్ చేసేశారు. రాత్రి వేళల్లో అయితే సెల్‌ఫోన్‌ల టార్చ్ వేస్తూ, వాటిని ఊపుతూ గాయకుడికి హుషారు తెప్పించారు. దాని రీమిక్స్ వెర్షన్ కూడా వచ్చేసింది, చూడండి.

ఈ పాట యింత హిట్ కావడంతో బిజెపి కూడా దాన్ని వాడుకోసాగింది. మేమూ ఆటకు రెడీ, గోదాలో చూపిస్తాం మా తడాఖా అనే అర్థంలో పాటలు రాయించారు. రాజనాథ్ సింగ్ దగ్గర్నుంచి ‘ఖేలా నిశ్చయ్ హోబే’ అని తన ఉపన్యాసాల్లో అన్నారు. సందట్లో సడేమియాగా కాంగ్రెస్ ‘దీదీ, ఖేలా హోబే’ అంటూ పాట కట్టించింది. ఏది ఏమైనా తృణమూలే ఆట గెలిచింది. ప్రశాంత కిశోర్ ఐ-పాక్ టీముని టీవీలో చూపించినపుడు వాళ్లంతా విక్టరీ సింబల్ చూపిస్తూ ‘ఖేలా హోబే’ అంటూ నినదించారు.

ఈ రోజుల్లో ఎన్నికలంటే మార్కెటింగ్ ఎక్సర్‌సైజ్‌గానే మారిపోయాయి. ‘అబ్ కీ బార్, మోదీ సర్‌కార్’, ‘బాబు రావాలి, జాబు రావాలి’, ‘నేను ఉన్నాను, నేను విన్నాను’ వంటి స్లోగన్ల కోసం యాడ్ ఏజన్సీలను, కన్సల్టెంట్లను పెట్టుకుంటున్నాయి. అలాటి హై ప్రొఫైల్ ఏమీ లేకుండానే పాతికేళ్ల కుర్రాడు రాసిన యీ పాట సంచలనం సృష్టించింది. భవిష్యత్తులో ఇతర పార్టీలు కూడా యిలాటి పాటలను రాయించుకుంటాయేమో చూడాలి.

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2021) ​  [email protected]

https://www.youtube.com/watch?v=GuPeBqDDlP4

https://www.youtube.com/watch?v=AWdHKVgV_b8

https://www.youtube.com/watch?v=Z9opjo9uqm8

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?