Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: ‘కింగ్‌మేకర్‌’గా ఎన్టీయార్

ఎమ్బీయస్: ‘కింగ్‌మేకర్‌’గా ఎన్టీయార్

6.8.1988న ఏర్పడిన నేషనల్ ఫ్రంట్‍కు ఇద్దరు నాయకులు - అధ్యక్షుడు రామారావు, కన్వీనర్‍ వి.పి.సింగ్‍. ఆ పై నెలలో మద్రాసులో డిఎంకె ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ర్యాలీ జరిగింది. విపి సింగ్‌యే అక్కడ హైలైట్. అధికారంలోకి వచ్చిన మూడు వారాల్లో బోఫోర్స్ భోక్తలను పట్టుకుని శిక్షిస్తామని ఆయనంటే ఆ సభలో చప్పట్లు కొట్టినవారిలో నేనూ ఒకణ్ని. తర్వాత 11 నెలల పాటు నేషనల్ ఫ్రంట్ అధికారంలో వున్నా పట్టుకోలేదు. 30 ఏళ్లు దాటినా ఎవరికీ శిక్షా పడలేదు. 1988 అక్టోబరులో జనతా పార్టీ, జనమోర్చా, లోకదళ్ కలిసిపోయి జనతాదళ్‌గా ఆవిర్భవించారు. 

ఇక ఫ్రంట్‌కు అదే కేంద్రబిందువు అయింది. దానికి విపి నాయకుడు కావడం చంద్రశేఖర్‌కు నచ్చలేదు. 1975లో కాంగ్రెసును వ్యతిరేకించి, ఎమర్జన్సీలో జైలుకి వెళ్లి, జనతా పార్టీ ఏర్పడ్డాక అధ్యక్షుడిగా వెలిగి, యిన్నాళ్లూ కాంగ్రెసుకు వ్యతిరేకంగా పోరాడుతూ వస్తున్న తనను కాదని, నిన్నమొన్నటివరకూ కాంగ్రెసులోనే వుండి అన్ని రకాల పదవులు అనుభవించిన విపి ప్రతిపక్ష నాయకుడు అయిపోవడమేమిటని ఆయన అభ్యంతరం. కానీ దేవీలాల్ ఆయనకు నచ్చచెప్పి చల్లార్చాడు.

విపి సింగ్, ఎన్టీయార్‌ మనోభావాలు పట్టించుకోదలచుకోలేదు. తనకు ఆత్మీయుడైన రామ్‌లాల్‌ను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిద్దామనుకున్నారు. కాంగ్రెసులో వుండగా ఎపి గవర్నరుగా నాదెండ్ల కుట్రలో భాగస్వామిగా వుంటూ ఎన్టీయార్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసినది రామ్‌లాలే. అది తెలిసీ విపి ఆ నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీయార్‌కు ఒళ్లు మండిపోయింది. అదే జరిగితే నేను ఫ్రంట్‌లోంచే తప్పుకుంటానన్నారు. ‘సర్లెండి, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ పదవి యిస్తాను.’ అని విపి కాస్త తగ్గాడు తప్ప రామ్‌లాల్‌ను పూర్తిగా పక్కన పెట్టలేదు. 1989 ప్రారంభంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగి కరుణానిధి పార్టీ నెగ్గింది. ఎమ్జీయార్ మరణంతో ఎడిఎంకె జానకి, జయలలిత వర్గాలుగా రెండు ముక్కలై డిఎంకెకు ఎదురు లేకపోయింది. ఈ గెలుపును నేషనల్ ఫ్రంట్‌కు శుభసూచకంగా ఆ నాయకులు భావించారు.

1989 ఏప్రిల్‌లో కాగ్ రిపోర్టు బోఫోర్స్ విషయంలో రాజీవ్‌ను చీల్చి చెండాడింది. వెంటనే ఎన్టీయార్‌కి ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది. ప్రతిపక్షాల సభ్యులందరూ మూకుమ్మడిగా రాజీనామా చేసి నిరసన తెలిపితే ఎఫెక్టివ్‌గా వుంటుందని! కాస్త తటపటాయించినా విపి ఆ ఐడియాకు ఒప్పుకున్నారు. 1989 జులైలో ప్రతిపక్ష ఎంపీలందరూ రాజీనామా చేశారు. ఇక ఎన్నికలు ముంచుకుని వచ్చాయి. 1989లో ఎలక్షన్‍ మేనిఫెస్టో రాయడానికి నేషనల్‍ ప్రిసీడియం ప్రారంభమవగానే ఎన్టీయార్ ఒక ప్రతిపాదన ముందుకు తెచ్చారు.

‘‘ఇదంతా రాయడం దండగ. దేశప్రజలందరికీ కావలసినది రెండు రూపాయలకు కిలో బియ్యం, ఇల్లు, గుడ్డ, వైద్యసౌకర్యాలు, పరిపాలనా సంస్కరణలు, అవినీతి నిర్మూలన. అంతే! మానిఫెస్టోలో యింకేమీ రాయనక్కరలేదు. ఫ్రంట్‍ గెలిచి, మాట వరసకు నేను ప్రధానమంత్రినయితే ముందు నేను ఒక్కడ్నే ప్రమాణస్వీకారం చేస్తాను. మంత్రివర్గాన్ని ఏర్పరచను. వెంటనే అధికారవర్గం (బ్యూరాక్రసీ) మొత్తాన్ని రద్దు చేస్తాను. పరిపాలనా సంస్కరణలు సూచించడానికి నిపుణులతో ఒక కమిటీని వేస్తాను. ఆ కమిటీ నివేదిక వచ్చేవరకు ఒక్క ఫైలుపై కూడా సంతకం పెట్టను. సంతకం పెడితే వ్యవహారం చెడుతుంది. ఆ రిపోర్టును పరిశీలించి అమలు చేసిన తర్వాతగానీ మిగతా మంత్రులను నియమించను. ఇది మేనిఫెస్టోలో పెట్టండి. అంతేగానీ మిగతా చెత్తాచెదారం అంతా అనవసరం.’’

ఆచరణసాధ్యం కాని ఈ ఆలోచన వినగానే నాయకులందరూ ముఖాముఖాలు చూసుకున్నారు. బిజూ ‘‘డామిట్‍! ఆ కమిటీ ఏదో ముందే వేసి కార్యాచరణ పథకాన్ని రూపొందించవచ్చుకదా. అధికారంలోకి వచ్చాక యిది మొదలుపెడితే ఈ ఫార్సు అంతా అయ్యేసరికి నెలలు, సంవత్సరాలు పట్టవచ్చు. అంతవరకూ దేశాన్ని దేవుడు నడుపుతాడా? లేక నీవొక్కడివే చలాయిస్తావా?’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. రామారావుకు కోపం వచ్చి ప్రణాళికపై తర్వాత జరిగిన చర్చలో పాల్గొనలేదు. తన విప్లవాత్మక సూచనలు ఫ్రంట్‍ పట్టించుకోవడం లేదని తరచూ అంటుండేవారు అని యిదంతా గ్రంథస్తం చేసిన ఉపేంద్ర రాశారు.

1989 పార్లమెంటు ఎన్నికలతో బాటు ఎపి అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపిస్తే మంచిదని ఎన్టీయార్‌కు తోచింది. మూడు నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించారు. ఘోరమైన ఓటమి ఎదురైంది. ఎన్టీయార్‌ స్వయంగా కల్వకుర్తి నియోజకవర్గంలో ఓడిపోయారు. హిందుపురంలో మాత్రమే నెగ్గారు. టిడిపి 71 స్థానాల్లో గెలిస్తే, కాంగ్రెసు 180 స్థానాల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పరచింది. ఇక పార్లమెంటుకి వస్తే 42 స్థానాలకు గాను కాంగ్రెసు 39టిలో, టిడిపి 2టిలో (బొబ్బిలి, నరసాపురం), మజ్లిస్ 1దానిలో గెలిచాయి. కాంగ్రెసు ఎపిలో గెలిచినా దేశం మొత్తం మీద 192 మాత్రమే గెలిచింది. మెజారిటీకై యింకో 80 అవసరం కాబట్టి మేం ప్రతిపక్షంలోనే కూర్చుంటాం అని రాజీవ్ ప్రకటించారు. బిజెపి 2 స్థానాల నుంచి 86కి ఎగిసింది. వామపక్షాలకు 52 దక్కాయి. నేషనల్ ఫ్రంట్ 146 సీట్లు గెలిచింది. తమిళనాడులో డిఎంకె, కర్ణాటకలో జనతాదళ్, ఎపిలో టిడిపి, మూడూ ఘోరంగా ఓడిపోయి ఫ్రంట్‌ను దెబ్బ తీశాయి.

కాంగ్రెసును ఎలాగైనా అధికారంలోకి రానీయకూడదనే లక్ష్యంతో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి బిజెపి, లెఫ్ట్ బయట నుంచి మద్దతిస్తానన్నాయి. ఫ్రంట్‌కి పేరుకి నేషనల్ అయినా, ఉత్తరాదిలోనే దాని విజయమంతా! అందువలన చంద్రశేఖర్, విపి సింగ్ ప్రధాని పదవికి పోటీపడ్డారు. మరి నేషనల్ ఫ్రంట్‌కు సూత్రధారిత్వం వహించిన ఎన్టీయార్‌ మాటేమిటి? నేషనల్‍ ఫ్రంట్‍ అధికారంలోకి వస్తే రామారావు ఉపప్రధాని అవుతారని దేవీలాల్‍ కొన్ని సభల్లో మాట్లాడారట. ప్రభుత్వానికి బయట నుండి మద్దతు ఇచ్చిన బిజెపి నాయకుడు వాజ్‍పాయి దక్షిణాది నాయకుడే ప్రధానమంత్రి అవుతారని ఎన్నికల జోస్యం కూడా చెప్పారుట. వీటివల్ల ఎన్టీయార్‌కి కనీసం ఉపప్రధాని అయినా కావాలని ఆశ వుండేదని పలువురు అనుకున్నారు. ఆ పదవిమీద ఆశ లేకపోయినా అది తనకు ఆఫర్‍ చేస్తే వద్దని చెప్పి పేరు తెచ్చుకోవాలనే తాపత్రయం ఎన్టీయార్‌ కుందని సన్నిహితులంటారు.

ఉపేంద్ర మాటల్లో చెప్పాలంటే - ‘‘ఉపప్రధాని పదవి గురించి నేను కదిలించినప్పుడు ‘‘మనకొద్దు బ్రదర్‍! మన రాష్ట్రంలోనే వుండి పార్టీని పటిష్టం చేసుకోవాలి. నేనిక్కడకు వస్తే పార్టీ పూర్తిగా నాశనమవుతుంది. అదీకాక రెండోస్థానం మనిషిగా వుండడం నాకు ససేమిరా ఇష్టం లేదు. అయితే ప్రథములమే కావాలి’’ అంటూ నిష్కర్షగా చెప్పారు రామారావు. చంద్రబాబుని కలిసి మాట్లాడినప్పుడు ‘‘మనం తప్పకుండా ప్రయత్నించాలి. ఉపప్రధాని పదవి రామారావు గారికి వచ్చేటట్లు చూడాలి’’ అంటూ తాపత్రయం కనబరిచారు.’’ ఎన్టీయార్‌ జాతీయ రాజకీయాలకు వెళితే రాష్ట్రంలో తను చక్రం తిప్పవచ్చని బాబు ఐడియా అయి వుండవచ్చు.

అయితే విపి సింగ్‍ కుట్ర పన్నారు. ఉపప్రధాని పోస్టు లేదు అని ముందుగా అందరికీ చెప్పారు.  ఆ తర్వాత చంద్రశేఖర్ వద్దకు వెళ్లి ‘ప్రధాని పదవి నీకూ వద్దు, నాకూ వద్దు, వయోధికుడైన దేవీలాల్‌కు యిద్దాం.’ అని చెప్పారు. చంద్రశేఖర్ సరే అన్నారు. కానీ విపి, దేవీలాల్‍ల మధ్య అప్పటికే లోపాయికారీ ఒప్పందం కుదిరింది. ఇద్దరూ కలిసి ఆ రోజు నాటకం ఆడారు. జనతా దళ్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో విపి, దేవీలాల్ పేరుని ప్రధాని పదవికి ప్రతిపాదించారు. చంద్రశేఖర్ బలపరిచారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యాక దేవీలాల్, మైక్ అందుకుని నా కంటె ప్రధాని పదవికి విపి సింగే అర్హుడు అని ప్రకటించారు. చంద్రశేఖర్ హతాశుడయ్యారు.

ప్రమాణ స్వీకారం రోజున ముందుగా విపి సింగ్‍ ప్రధానమంత్రిగా అయ్యారు. ఆయన పదవి స్వీకరిస్తూనే దేవీలాల్‍ పేరుని ఉపప్రధానిగా ప్రతిపాదించారు. వెంటనే దేవీలాల్ వచ్చి ఉపప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఇది నేషనల్ ఫ్రంట్ భాగస్వాములెవ్వరికీ ముందుగా తెలియదు. చైర్మన్ ఎన్టీయార్‌కు కూడా! ఇద్దరూ కలిసి చేసిన దగా! దీనికి భగ్గుమన్న చంద్రశేఖర్ ప్రతీకారం తీర్చుకున్నారు. రాజీవ్ గాంధీతో కలిసి కుట్ర పన్ని విపి ప్రభుత్వాన్ని కూలదోసి తాను ప్రధాని అయ్యారు. మరి కొన్ని నెలలకు రాజీవ్ చంద్రశేఖర్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి, ఆయన ప్రభుత్వాన్నీ కూలదోశారు. దెబ్బకి రెండేళ్ల వ్యవధిలోనే 1991లో ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెసేతర ప్రభుత్వాలు యిలా కుప్పకూలడంతో ప్రజలకు వారిపై నమ్మకం సన్నగిల్లింది. 1991లో రాజీవ్ హత్య జరగడంతో సానుభూతి కూడా కలిసి వచ్చింది. దాంతో పివి నరసింహారావు నేతృత్వంలో మైనారిటీదే అయినా కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

ఇక విపి సింగ్‍ విషయానికి వస్తే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగానే సంప్రదాయం ప్రకారం మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీతో కరచాలనం చేసారు. అది నేషనల్‍ ఫ్రంట్‍ ఛైర్మన్‍ అయిన తనను కించపరచడంగా ఎన్టీయార్‌కి తోచింది. పైగా ఆ ఉత్సవంలో ఆయన్ను మూడో వరుసలో కూర్చోబెట్టారు. ఆ వెంటనే దేవీలాల్ ఉపప్రధానిగా ప్రమాణస్వీకారం చేయగానే ఎన్టీయార్‌కి మండిపోయింది. సీట్లోంచి లేచి, కోపంగా ‘‘ఏమిటిది?’’ అంటూ బయటకు వెళ్లిపోయారు. ఆ సాయంత్రమే హైదరాబాదుకి తిరుగుప్రయాణం. ఎందుకంటే ఆ ఫంక్షన్‌లో కొందరు ఆయన వెనకే ఆయనకు వినబడేట్టుగా, ‘ఈయన యిక్కడేం చేస్తున్నాడు? చేతిలో వున్నది యిద్దరు ఎంపీలు. వెళ్లి రాష్ట్రం చూసుకోమను.’ అని వెక్కిరించారు.

పరిస్థితి చక్కదిద్దాలని, ఎన్టీయార్‌కి కనీసం మరో ఉపప్రధాని పదవి ఆఫర్ చేయించాలని ఉపేంద్ర విపిని కలవగా ‘‘ఉపప్రధాని పదవికి ఆయన ఒప్పుకుంటారా? మేం అంతకంటే పెద్ద పదవి ఇవ్వాలనుకుంటున్నాం. రామారావు గారి సేవలను తప్పకుండా గుర్తించి వినియోగించుకుంటాం. అయితే మరో ఉపప్రధాని పదవి అంటే కొన్ని చిక్కులొచ్చే ప్రమాదముంది. రామకృష్ణ హెగ్డే గారికి, బిజూ పట్నాయక్‍ గారికి కూడా ఆ పదవి మీద దృష్టి వుంది. నేను రామారావు గారితో మాట్లాడతాను’.’ అని నచ్చచెప్పి పంపించారు. తర్వాత డిసెంబర్‍ 5వ తారీకు వరకు ఫోన్‍ కాల్‍ కోసం ఎన్టీయార్‌ ఎదురుచూసినా రానే లేదు. చిట్టచివరికి వచ్చింది. విషయం ఉపప్రధాని పదవి గురించి కాదు. ఉపేంద్రను కాబినెట్‍లో తీసుకుంటున్నామని చెప్పడానికి!

ఇదీ కింగ్‍మేకర్‍కి దక్కిన మర్యాద! చివరికి 1991లో ఉపేంద్రతో ఎన్టీయార్‌ స్పష్టంగా చెప్పారట. విపి సింగ్‍ ఉపప్రధానమంత్రి పదవిని ఇస్తామని మర్యాదకైనా ప్రతిపాదించకపోవడం, మండల్‍ కమిషన్‍ నివేదిక అమలు గురించి ముందుగా చెప్పకపోవడం, రైతుల రుణమాఫీ ప్రకటన తన చేత చేయించకపోవడం వంటి అంశాల వల్ల తన మనసు గాయపడిందని. నేషనల్‍ ఫ్రంట్‍ తన ఛైర్మన్‍ రామారావుతో ఎలా వ్యవహరించిందో 1992లో జరిగిన రాష్ట్రపతి ఎన్నిక చాటి చెప్పింది. ప్రధానమంత్రి పివి ఆ పదవికి డాక్టర్‍ శంకర్‍దయాళ్‍ శర్మ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే రామారావు దానికి స్వాగతం పలుకుతూ ప్రకటన చేసారు. దిల్లీ రాగానే ప్రతిపక్షాల తరఫున ఆ పదవికి ప్రొఫెసర్‍ జి.జి.స్వెల్‍ను సమర్థించాలని విపి సింగ్‍ రామారావుని ఒప్పించారు. నాదెండ్ల విషయంలో శర్మ తనకు చేసిన ఉపకారాన్ని కూడా పక్కకు నెట్టి రామారావు స్వెల్‍ని బలపరుస్తూ ప్రకటన చేసారు.

కానీ ఫ్రంట్‍లో ప్రధాన పార్టీ అయిన జనతాదళ్‍లో స్వెల్‍కి వ్యతిరేకంగా అసమ్మతి ధ్వనులు వినబడిన కారణంగా బొమ్మయ్‍ ఇంట్లో జరిగిన సమావేశంలో స్వెల్‍ని మానేసి శర్మను సమర్థిద్దామని విపి ప్రతిపాదించారు. దాంతో రామారావు ఆయనపై విరుచుకుపడ్డారు. ‘‘నేను శర్మగారిని సమర్థించి కూడా మీకోసం స్వెల్‍ అభ్యర్థిత్వాన్ని ప్రకటించాను. ఈ స్వెల్‍ ఎవరో నేనెన్నడైనా చూశానా? విన్నానా? మధ్యలో నన్ను ఫూల్‍ చేస్తున్నారు. నేను నేషనల్‍ ఫ్రంట్‍ చైర్మన్‍ పదవికి రాజీనామా చేస్తాను. తెలుగుదేశం నేషనల్‍ ఫ్రంట్‍ నుండి బయటకు వెళ్తుంది’’ అని కోపంగా మాట్లాడి ఆ రాత్రే హైదరాబాద్‍కు వెళ్లిపోయారు. తరువాత నేషనల్ ఫ్రంట్ స్వెల్‍నే సమర్థించిందనుకోండి. ఇలా జాతీయ రాజకీయాలలో ఎన్టీయార్‌ బావుకున్నది సున్న. దాని కోసం ఆయన పడిన శ్రమ, సమయం, ధనం అంతా వృథా. (సమాప్తం) (ఫోటో – దేవీలాల్, విపి సింగ్, ఎన్టీయార్, కరుణానిధి)

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2021)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?