cloudfront

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: రాకుమారి కృష్ణకుమారి - 1/3

ఎమ్బీయస్‌: రాకుమారి కృష్ణకుమారి - 1/3

అందం, అభినయం కలబోసిన నటీమణి కృష్ణకుమారి యిక లేరు. ఆవిడ గురించి రాసిన వ్యాసాలు చాలా తక్కువే కనబడతాయి. మనలో ఒక వింత పద్ధతి ఉంది. ఎవరో ఒకరిని విపరీతంగా పైకెత్తేస్తాం. ఆ క్రమంలో తక్కినవారిని పక్కన పెట్టేస్తాం. ఘంటసాల అమరగాయకుడు, నిజమే. ఆయనతో పాటు అనేకమంది యితర గాయకులు మహానుభావులున్నారు. వాళ్ల గురించి పదేపదే చెప్పం. అలాగే ఎయన్నార్‌, ఎన్టీయార్‌. వాళ్లతో పాటు అనేకమంది చక్కటి నటులున్నారు. వీళ్లకిచ్చినంత ప్రాధాన్యంలో పదోవంతు కూడా వాళ్లకు యివ్వం. నటీమణుల విషయానికి వస్తే సావిత్రిని కీర్తించినట్లుగా తక్కినవారి గురించి తలవం.

కనీసం పదిమంది ప్రతిభావంతులైన కథానాయికలు మనకున్నారు. వాళ్ల గురించి పెద్దగా ఎవరూ రాయరు. అందువలన తర్వాతి తరానికి వాళ్ల గురించి పెద్దగా ఏమీ తెలియదు. అలాటి వాళ్లల్లో కృష్ణకుమారి ఒకరు. 1970ల తర్వాత ఆవిడ సినిమాల నుంచి తప్పుకోవడంతో, తెలుగు నేలకు దూరంగా నివసించడంతో, ఫంక్షన్లలో పెద్దగా పాల్గొనకపోవడంతో ప్రజలు ఆవిడ గురించి మర్చిపోయారు. నేను వ(ర)ల్డ్‌స్పేస్‌లో రేడియో జాకీగా చేసేటప్పుడు ఆవిడ గురించి ప్రసంగిద్దామని వెతికితే, 1960లలో రాసిన ఒక చిన్న పుస్తకం  దొరికింది. పత్రికల్లో వ్యాసాలు కూడా పెద్దగా లేవు. దొరికినవాటితోనే ప్రసంగం తయారుచేసుకున్నాను.

తర్వాత యింకో ముగ్గురు నటీమణులపై వ్యాసాలతో కలిపి చిన్న పుస్తకంగా వేశాను. దాన్ని మిత్రులు ఎస్‌.వి.రామారావుగారు కృష్ణకుమారి గారికి యిచ్చారు. ఆవిడ నాకు ఫోన్‌ చేశారు. 'నేనండీ, కృష్ణకుమారిని' అంటే పోల్చుకోలేక పోయాను. ఏ కృష్ణకుమారి? అని అడిగాను. ఆవిడ తడబడింది. 'నేనండి, యాక్టర్‌ కృష్ణకుమారిని' అంది. 'అయ్యో, మీరా! మీరే స్వయంగా చేస్తారని ఊహించలేకపోయాను' అని చెప్పుకున్నాను. ఆవిడ 'బాగా రాశారండీ' అని మెచ్చుకుంది. 'మీకు రావలసినంత పబ్లిసిటీ రాలేదండి' అంటే నవ్వింది. ఇది పుష్కరం కింది మాట. ఇటీవల ఆవిడ మీద వాళ్లమ్మాయి ఇంగ్లీషులో ఒక కాఫీ టేబుల్‌ పుస్తకం వేసింది.

దాన్లో ఆవిడ వంటల గురించి ఎక్కువ, సినీజీవితం గురించి తక్కువా ఉంది. ఫ్యామిలీ ఫోటోలు కొన్ని ఉన్నాయి. ఆ అమ్మాయికి తెలుగు రాదనుకుంటా, తెలుగు సినిమాల్లో ఆవిడ అభినయం గురించి విశ్లేషణ ఏమీ లేదు. కృష్ణకుమారి, జానకి, అంజలి, సరోజాదేవి, దేవిక, రాజసులోచన, భారతి,... యిలా అనేకమంది తారల గురించి విస్తృత రచనలు వస్తే బాగుంటుంది అనుకుంటూ ఆనాటి నా ప్రసంగవ్యాసాన్ని కింద యిస్తున్నాను. చాలా ఏళ్ల క్రితం (అప్పటి కింకా ఎమ్బీయస్‌ కబుర్లు అనే కాలమ్‌ ప్రారంభించలేదు) యీ వెబ్‌సైట్‌లో యిచ్చాను కానీ యిప్పటి పాఠకుల్లో చాలామంది దాన్ని చదివి ఉండకపోవచ్చు.

'తక్కిన తారలతో అందం, అభినయం విషయంలో కృష్ణకుమారిని పోల్చి చూస్తే  - భానుమతిగారి అందం మల్లీశ్వరి తర్వాత పెద్దగా పరిగణనలోకి రాలేదు. ఫోకస్‌ ఎంతసేపూ ఆవిడ పాట, యాక్షన్‌ మీదే! అలాగే సావిత్రి కూడా అందం ఓ పదేళ్ల పాటేమో! తర్వాత ఫోకస్‌ అంతా అభినయం మీదనే! కెమెరా ఎప్పుడూ మొహం మీదనేే తారట్లాడేది. కళ్లతోనే ఆవిడ కథ నడిపించేశారు. జమున విషయానికొస్తే అందం, అభినయం రెండూ వున్నాయి.

యాక్షన్‌, గ్లామర్‌ రెండూ కలబోసిన తార. కృష్ణకుమారి కూడా ఆ కోవకు చెందిన తారే! ఫిజిక్కూ బాగుంటుంది. అభినయమూ బాగుంటుంది. గ్లామర్‌కి గ్లామరూ వుంది. యాక్షన్‌కి యాక్షనూ వుంది. గ్లామర్‌ పేరు చెప్పి ఎక్స్‌పోజర్‌ లేదు. డిగ్నిఫైడ్‌ బ్యూటీ! సావిత్రి పాత్రలు అన్నీ సబ్మిసివ్‌ పాత్రలు. భానుమతి పాత్రలు ఎగ్రెసివ్‌. జమున పాత్రలు ఎసెర్టివ్‌. కృష్ణకుమారి పాత్రలూ ఎసెర్టివే! కష్టాల నెదిరించైనా డిగ్నిటీ కాపాడుకునే పాత్రలు. జమునవైనా కొన్ని శోకపాత్రలు వున్నాయి కానీ కృష్ణకుమారివి పెద్దగా వున్నట్టు లేవు.

నిజానికి కెరియర్‌ పరంగా జమునకూ, కృష్ణకుమారికీ లింక్‌ వుంది. ఎయన్నార్‌కీ, ఎన్టీయార్‌కీ జమునతో గొడవ వచ్చి ఆవిడను మూడేళ్లపాటు పక్కకు పెట్టారు. ఆ టైములో అటువంటి పాత్రలు వచ్చినపుడు కృష్ణకుమారిని తీసుకున్నారు. 'ఇల్లరికం' సినిమా వుంది. నాగేశ్వరరావు, జమున హీరో హీరోయిన్లు. హిట్‌ అయింది. ప్రసాద్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌ వారి తర్వాతి సినిమా 'భార్యాభర్తలు'. హీరో తిరుగుబోతు. వాళ్లింటికి ట్యూషన్‌ చెప్పడానికి వచ్చే ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి ఇతన్ని అసహ్యించుకుంటుంది. ఒక సంకట పరిస్థితిని సృష్టించి, ఆ అమ్మాయికి గత్యంతరంలేని సందర్భం కల్పించి, పెళ్లి చేసుకుని మీసం మెలేస్తాడు హీరో.

కానీ ఆమె లొంగదు. హీరోను అసహ్యించుకుంటుంది. మీద చెయ్యివేస్తే ఊరుకోదు. 'ఏమని పాడుదునో ఈ వేళ' పాట వింటే నేను చెప్పిన కథంతా వచ్చేస్తుంది. తరువాత హీరో మారాడని నమ్మకం కుదిరాక అప్పుడు చేరువౌవుతుంది. అతన్ని రక్షించడానికి తన వంతు కృషి తను చేస్తుంది. అటువంటి కారెక్టరు వేయడానికి మామూలుగా ఐతే జమున వుండేది. గొడవలు వచ్చాయి కాబట్టి చక్కటి ప్రత్యామ్నాయంగా కృష్ణకుమారి వచ్చింది.

అలాగే 'వాగ్దానం' సినిమా కూడా. ఆస్తి స్వయంగా మేనేజ్‌ చేసుకోవలసి వచ్చిన జమీందారిణి పాత్ర. అదీ నాగేశ్వరరావు పక్కన, అలాగే 'కలిమిలేములు', 'కులగోత్రాలు'. ఇది మళ్లీ ప్రసాద్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌ వాళ్ల సినిమా. కులం, గోత్రం తెలియకపోయినా బేలగా వుండదు. 'చదువుకున్న అమ్మాయిలు'లో మధ్యతరగతికి చెందిన ఆత్మాభిమానం గల అమ్మాయి. సావిత్రి పంచన ఉండవలసి వచ్చినా ఉద్యోగం చేసి బతుకుదామనే లక్ష్యం గల స్వాభిమాని. ఇంకో పక్క ఎన్టీయార్‌తో కూడా వేసింది. దేవాంతకుడు, ఇరుగు పొరుగు సినిమాల్లో హుషారైన కారెక్టర్లు. ఇక 'బందిపోటు' అయితే చెప్పనక్కరలేదు.

కృష్ణకుమారికోసం సృష్టించిన పాత్రలా వుంటుంది. కృష్ణకుమారి పేరు చెప్పగానే ఛట్టున గుర్తుకు వచ్చేది అహంభావి ఐన రాకుమారి, 'వగలరాణివి నీవే' పాటా! టక్కుటక్కుమని గుర్రం వెళుతూంటే దానిమీద స్టిఫ్‌గా కూచుని దొంగను పట్టేద్దామని వెళ్లే రాకుమార్తె. ఆ సినిమా రిలీజయిన 1963లో ఎన్టీయార్‌తో మూడు సినిమాలు - బందిపోటు, లక్షాధికారి, తిరుపతమ్మకథ. మూడూ హిట్సే! ఆ తర్వాతి సంవత్సరం గుడిగంటలు. అందులో కూడా మధ్య తరగతి అమ్మాయే కానీ చాలా హుందా అయిన పాత్ర. జగ్గయ్యను ప్రేమిస్తుంది. కానీ కుటుంబానికి సహాయం చేశాడు కదాని ఎన్టీయార్‌కు సేవ చేస్తూ వుంటుంది.

ఇలాగ సేవ చేసే కారెక్టరు 'పునర్జన్మ'లో కూడా చేసింది కృష్ణకుమారి. ఎయన్నార్‌ పక్కన వేసింది. అతనికి పిచ్చి ఎక్కుతుంది. ఆయాగా పని చేయడానికి ఎవరూ సిద్ధ పడకపోతే అతని తండ్రి వేశ్యావాటిక నుండి కృష్ణకుమారిని తెస్తాడు. ఆమె ఎంతో కష్టపడి అతన్ని మామూలు మనిషిని చేస్తుంది. తన గౌరవం ఎక్కడా చెడకుండా అతన్ని హేండిల్‌ చేస్తుంది. చివరకు అతను మామూలు మనిషయ్యాక ఇంట్లోవాళ్లు వెళ్లిపొమ్మంటే సరేనని వెళ్లిపోతుంది. పాత్రను సృష్టించేది రచయితే కావచ్చు.

కానీ దాన్ని కన్విన్సింగ్‌గా పోర్ట్రే చేయడానికి ఆర్టిస్టుకి అంగసౌష్టవం, అభినయ కౌశలం వుండాలి. అవి కృష్ణకుమారికి పుష్కలంగా వున్నాయి. అవి ఎలాగూ వున్నాయి కాబట్టి జమున లేకపోవడం వల్ల వచ్చిన వాక్యూమ్‌ ఎలాగూ వుంది కాబట్టి కృష్ణకుమారి హ్యేపీగా సినిమాల్లోకి ఎర్ర తివాచీమీద నడుచుకుంటూ వచ్చేసిందనుకుంటే పొరబాటే!  

యువత గుర్తించవలసినది ఒకటి వుంది. ఘంటసాల కావచ్చు, బాలూ కావచ్చు, తారలు కావచ్చు - ప్రతీ వారికీ స్ట్రగుల్‌ వుంది. ఏదీ కేక్‌వాక్‌ కాదు. ఎన్నో, ఎన్నో ఎదురు దెబ్బలు తింటే తప్ప విజయం సిద్ధించలేదు. మిఠాయిపొట్లం ఎప్పుడూ చిటారు కొమ్మనే వుంటుంది. కష్టపడి చెట్టెక్కాలి. పట్టు దొరక్క జారితే జారాలి. చీమలు కుడితే కుట్టించుకోవాలి. కొమ్మ గట్టిగా వుందని పట్టుకున్నదాకా వుండి అది ఫెళ్లున విరిగితే కింద పడాలి. మళ్లీ ఒళ్లు దులుపుకుని పైకెక్కాలి. ఇప్పటి పిల్లల్లా డిప్రెషన్‌ అంటూ వాస్తవాలనుండి పారిపోతే ఏమీ దక్కదు.

సావిత్రి విషయం చూడండి - సెకండ్‌ హీరోయిన్‌గా బుక్కయ్యి చివరకి 'సంసారం' సినిమాలో ఎక్‌స్ట్రాగా వేషం వేసింది. ఎల్వీ ప్రసాద్‌గారు తిట్టారు కదాని ఆత్మహత్యకు సిద్ధపడలేదు. ఆయన చేతనే భేష్‌ అనిపించుకుంది. అలాగే విజయావారి 'పాతాళభైరవి' సినిమాలో  చిన్న డాన్సరుగా వేసి తర్వాత 'మాయాబజారు'కు వచ్చేసరికి సినిమాను నిలబెట్టే స్థాయికి వచ్చేసింది. జమున విషయం తీసుకుంటే మొదటి సినిమా ఆగిపోయింది, రెండోది వారం కూడా ఆడలేదు. మూడో సినిమా పెద్ద బ్యానర్‌లో తయారయినా ఫెయిలయి పోయింది. కృష్ణకుమారి కథా అంతే!

అప్పట్లో ఐరన్‌ లెగ్‌ అనే మాట లేదు కాబట్టి కృష్ణకుమారిని 'అన్‌లక్కీ స్టార్‌' అన్నారు. లేకపోతే ఐరన్‌ లెగ్‌ కాదు, స్టీలు లెగ్‌ అనేవారు. ఒకటా రెండా మొదటి పన్నెండు, పదిహేను సినిమాలు ఫ్లాప్సే! మంచి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో పెద్ద ఫ్లాష్‌తో బిగినయి, 'ఎండెడ్‌ విత్‌ ఎ వింపర్‌' అంటారు చూశారూ, అలాగయింది అప్పటి ఆవిడ కెరియర్‌. ఎంత పెద్ద బ్యానర్‌ వాళ్ల సినిమా అయినా కానీయండి, ఈవిడ వేసిందంటే చాలు, సినిమా మటాష్‌! అటువంటి పరిస్థితిలో సినిమాలో ఆవిడ వేసే పాత్రల్లాగానే ఆవిడా ధైర్యం, స్థయిర్యం కోల్పోకుండా నిలబడి సక్సెస్‌ఫుల్‌ అయినందుకు జోహార్‌. ఆ టైములో చూపిన టెనాసిటీకి, పెర్‌వసెన్స్‌కు, కార్యసాధనకు సలాం. సెంటిమెంట్స్‌ రాజ్యం చేసే సినీసీమలో ఆవిడ సత్తాపై నమ్మకం వుంచి, ఆవిడలో ధైర్యం నింపి, అండగా నిలిచిన ఎల్వీ ప్రసాద్‌గారికి డబుల్‌ సలాం.

కాస్త కన్‌ఫ్యూజింగ్‌గా వుందా? మొదట్నుంచీ చెప్పుకువస్తే తప్ప అర్థం కాదు లెండి. కృష్ణకుమారిగారి కథ వాళ్ల నాన్నగారి దగ్గర్నుండి మొదలెడదాం. ఆయన పేరు వెంకాజీరావు గారు. పెద్ద ఇంజనీర్‌. అప్పట్లోనే, అంటే  1930లలోనే పేపరు టెక్నాలజీలో పేరెన్నిక గన్న నిపుణుడు. కృష్ణకుమారి తాతగారు, అంటే మాతామహుడు కలక్టర్‌. ముత్తాతగారు గాంధేయవాది. వెంకాజీ ముందుచూపు గలవారు.

అందరూ గుమాస్తా ఉద్యోగాలతో సరిపెట్టుకునే ఆ రోజుల్లో ఆయన పేపర్‌ పరిశ్రమను ఎంచుకుని దానిలో ప్రావీణ్యత సంపాదించాడు. అందువల్ల ఎప్పుడూ డిమాండులోనే ఉన్నాడు. ఈయన అభిరుచి చూసి ప్రభుత్వం దెహరాదూన్‌ పంపింది. అక్కడ తర్ఫీదు అయి వచ్చారు. ఆ తర్వాత పై స్థాయి తర్ఫీదు కోసం ఇంగ్లండ్‌ పంపింది. ఈయన వెళ్లాడు. వెళ్లాడు అని నొక్కి ఎందుకు చెప్పాలంటే అది 1927. సాంప్రదాయ కుటుంబాలలో విదేశీ ప్రయాణం నిషిద్ధం. సముద్రం దాటి వెళితే కులంలోంచి వెలి వేసే రోజులు. అయినా ఈయన పట్టించుకోలేదు. వెళ్లి మూడేళ్లపాటు తర్ఫీదు పొంది వచ్చాడు.

1930లో రాజమండ్రిలో గవర్నమెంటు పేపరు మిల్లు పెట్టారు. దాని నిర్వహణకు పేపర్‌ ఎక్స్‌పర్ట్‌గా ఈయన్ను వేశారు. ఇంకో మూడేళ్ల తర్వాత బెంగాల్‌లో నైహతి దగ్గర ఓ ఇంగ్లీషాయన పేపరు మిల్లు పెడుతూ ఈయన్ని రమ్మన్నాడు. ఈయన వెళ్లాడు. అక్కడ వుండగానే మన కథానాయకి 1936 మార్చిలో పుట్టింది. తరువాతి సంవత్సరం, రాజమండ్రి పేపరు మిల్లుని గవర్నమెంటు నుండి ఓ మార్వాడీ ఆయన కొని వెంకాజీగార్ని మళ్లీ రాజమండ్రి రప్పించారు.

వెంకాజీగారు ఆ తర్వాత బిహార్‌లోని దాల్మియా పేపర్‌ మిల్స్‌లో కొంతకాలం పనిచేశారు. ఇంత ప్రతిభావంతుడు ప్రైవేట్‌ సెక్టార్‌కి వెళ్లిపోవడం గవర్నమెంటుకు నచ్చలేదు. డైరక్టర్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌గా మద్రాసులో పోస్టు చేసింది. అక్కడుండగానే అసాం నుంచి పిలుపు వచ్చింది. కాపురం షిల్లాంగ్‌కు షిఫ్ట్‌ చేశారు. అక్కడ తరచుగా భూకంపాలు వస్తూ వుండేవి. అప్పుడు ఆయన కుటుంబాన్ని మద్రాసుకు పంపించేసి ఆయన మాత్రం అక్కడుండి పనిచేసేవారు. ఇదంతా 1949లో. ఆ తర్వాత ఆయన వస్తూ పోతూ వుండేవారు. చివరకి అస్సాంలోనే పోయారు. కుటుంబం మాత్రం మద్రాసులోనే స్థిరపడిపోయింది. (సశేషం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com