cloudfront

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: రాకుమారి కృష్ణకుమారి - 3/3

ఎమ్బీయస్‌: రాకుమారి కృష్ణకుమారి - 3/3

ఎల్వీ ప్రసాద్‌ గారు తన పేరు కలిసి వచ్చేట్లు లక్ష్మీ ప్రొడక్షన్స్‌ అనే సంస్థ ప్రారంభించారు. ఆ సంస్థ ఆఫీసును ఆయన కృష్ణకుమారి చేత ప్రారంభోత్సవం చేయించారు. ఆ సంస్థ ద్వారా తీసిన తొలి సినిమానే - 'ఇలవేలుపు'. సూపర్‌ హిట్‌! నష్టజాతకురాలిగా ముద్రపడ్డ వ్యక్తి చేత కొత్త ప్రొడక్షన్‌ ఆఫీసు ప్రారంభోత్సవం చేయించిన గట్స్‌ ఆయనవి. అలా చేయించడం ద్వారా ఇండస్ట్రీకి ఒక సందేశం యిచ్చారు - పరిశ్రమను నడిపించేది కఠోరశ్రమే తప్ప, సెంటిమెంటు కాదని.

ఇలవేలుపు షూటింగు నడుస్తున్నంతకాలం ప్రతీ నెలా ఆమె శాలరీ చెక్‌ కోసం ఆమె కంటె ఎక్కువగా ఎదురుచూసినవారు ఇన్‌కమ్‌టాక్స్‌వారు. వచ్చిన జీతంలో సగం ఇన్‌కమ్‌టాక్స్‌ బకాయిల కింద కట్టి మిగతాసగంతో ఇల్లు గడుపుకునేది కృష్ణకుమారి. ఇప్పుడు ముందున్న దిలాసా లేదు. అందువల్ల కాల్‌షీటు,్ల అడ్వాన్సులు, ఇంటి సరుకూ, సరంజామా అంతే తనే చూసుకోవడం మొదలెట్టింది. వాళ్లదసలే పెద్ద కుటుంబం. పోయినవాళ్లు పోగా ఆరుగురు మిగిలేరు. అక్కగారు జానకి జీవితం వేరే. ఆవిడ ఆదాయంతోటీ, ఖర్చుతోటీ వీళ్లకు సంబంధం లేదు. ఇక తక్కినవాళ్లందరూ కృష్ణకుమారితో ఉండేవాళ్లే!

సినిమా సక్సెసయింది. శతదినోత్సవ సభల్లో రేలంగి తను అన్న ఏనుగూ-ఎలకా సామెత చెప్పుకుని 'నా అబ్జర్వేషన్‌ తప్పు. కృష్ణకుమారి నష్టజాతకురాలుకాదు' అని ప్రకటించారు. ఎల్వీ ప్రసాద్‌గారి లాగే సాహసాలకు వెరువని వారు విఠలాచార్య.  ప్రసాద్‌గారు హాస్య పాత్ర యిచ్చి సరిపెడితే ఆయన కృష్ణకుమారికి ఏకంగా హీరోయిన్‌ వేషం యిచ్చేశారు, హీరో చలం. సినిమా పేరు 'వద్దంటే పెళ్లి'. సినిమా బాగా ఆడడంతో అప్పట్నుంచి విఠల్‌ ప్రొడక్షన్స్‌ ఆమెకు మాతృసంస్థ అయిపోయింది. మీకు తెలుసా - కృష్ణకుమారి ఎక్కువ సినిమాలు ఎవరి పక్కన వేసిందో? బాక్సాఫీసు జంటగా పేరుబడ్డ రామారావుగారితో వేసిన సినిమాలు పాతికే! కానీ కాంతారావుగారితో 28 సినిమాలు వేశారు.

వాటిలో ఎక్కువభాగం జానపద సినిమాలే! అందుకే రాజకుమారి అనగానే కృష్ణకుమారి గుర్తుకు వస్తుంది. జానపద సినిమాలు అనగానే విఠలాచార్య గుర్తుకు వస్తారు కదా. ఆయన ముందులో సాంఘికాలు తీశాడు కానీ జానపదాల వైపు మొగ్గు చూపిన తర్వాతనే సక్సెస్‌ కళ్ల జూశాడు.'జయవిజయ'లో కూడా  కృష్ణకుమారియే హీరోయిన్‌. 'కనకదుర్గ పూజా మహిమ' వరలక్ష్మీ వ్రతం, గురువును మించిన శిష్యుడు, అగ్గిపిడుగు, యివన్నీ విఠలాచార్యగారి స్వంత సినిమాలు. 'బందిపోటు' నిర్మాతలు వేరైనా విఠలాచార్య డైరక్టు చేసిన సినిమా. వీటన్నిటిలోనూ హీరోయిన్‌ కృష్ణకుమారియే!

ఇలవేలుపు తర్వాత 1957లో కృష్ణకుమారి వేసిన సినిమాలు - 'రేపు నీదే, వీరకంకణం, వినాయక చవితి, అక్కా చెల్లెళ్లు, ఆమె క్రమంగా బిజీ స్టార్‌ అయిపోయింది. డిసిప్లిన్‌డ్‌ గా వుండడం, కాల్‌షీటు టైముకి హాజరుకావడం, సాటి ఆర్టిస్టులతో, టెక్నీషియన్లతో ఏ పేచీలు రాకపోవడం - యివన్నీ ఆమె ఎసెట్స్‌. తమిళం, కన్నడం సినిమాల్లో కూడా బుక్‌ అయింది. 1960లో ఆమె నటించిన 12 సినిమాలు రిలీజయ్యాయి. అన్నిట్లోనూ హీరోయిన్‌ కాదనుకోండి. పెళ్లి కానుక సినిమాలో ఆమె సెకండ్‌ హీరోయిన్‌. సరోజాదేవి అక్కగా వేసింది.

నాగేశ్వరరావు ఆమెను ప్రేమించి ఈమెను పెళ్లాడతాడు. నాగేశ్వరరావుగారి పక్కన వేసే అవకాశం దక్కిందనుకుని సంతోషించినా కొంచెం ఏడుపుగొట్టు పాత్ర! అదే ఏడాది రిలీజయిన దేవాంతకుడులో మాత్రం మాంచి హుషారైన పాత్ర. అదీ ఎన్టీయార్‌ పక్కన. ఇలా ఆమె కెరియర్‌ పుంజుకుంటూన్న టైములోనే వాళ్ల ఫాదర్‌ హఠాత్తుగా పోయారు. మరీ వర్రీ కావడానికి టైము కూడా లేదు. 1960 సం||రంలో 'కనకదాసర్‌' అనే కన్నడ సినిమాలో ఆమె నటనకు గాను ఉత్తమనటి ఎవార్డు వచ్చింది.

ఆ టైములోనే బొంబాయి ఫీల్డుకి చెందిన జూపిటర్‌ పిక్చర్స్‌ దీక్షిత్‌గారు కృష్ణకుమారిని కలిశారు. 'కభీ అంధేరా - కభీ ఉజాలా' అనే సినిమాలో ఓ నాట్యతార రోల్‌ యిప్పించారు. వాళ్లు ప్రెస్‌ రిలీజ్‌లో ఈమె పేరు 'రతి' అని మార్చేశారు. అదేమిటయ్యా అంటే 'కృష్ణకుమారి పేరుతో ఆల్‌రెడీ ఇంకో ఆర్టిస్టు వుంది. చిన్న చిన్న వేషాలవీ వేస్తుంది. అసలు పేరు వేస్తే ఆవిడేమో ననుకుంటారు. అందువల్ల న్యూమరాలజిస్టు సలహా మేరకు రతి అని పెట్టాం' అన్నారు వాళ్లు. 'ఆ  మాట ముందు మాకు చెప్పకుండా ప్రెస్‌కి యిచ్చేసేరేమిటి?' అంటే  దానికి సమాధానం లేదు.

బొంబాయివాళ్ల తీరు చూసి కృష్ణకుమారి, తల్లీ బెంబేలెత్తిపోయారు. ఎగ్రిమెంటు సైన్‌ చేశారు కాబట్టి ఆ సినిమా చేసేశారు. ఆ సినిమాలో కృష్ణకుమారి మీద ఆరు నిమిషాల పాట వుంది - 'సుర్మా మెరా నిరాలీ' అని. రకరకాల దుస్తుల్లో కనబడుతుంది. అది చూసి 'గూంజ్‌ ఉఠీ షెహనాయ్‌' లో హీరోయిన్‌గా ఆఫర్‌ వచ్చింది. తక్కిన ఆఫర్లు కూడా వచ్చాయి. ఏం వచ్చినా అన్నీ నో, నో అనడమే పని. బొంబాయిలో వుంటే అక్కడివాళ్లు సినిమా తీసేందుకు ఏళ్లూ, పూళ్లూ పడతాయి. అంతకన్నా మద్రాసులో వుండి తెలుగు, తమిళం, కన్నడంలలో వేషాలు వేసుకుంటే బెటరు అనుకున్నారు.

ఈ దశలోనే 'భార్యాభర్తలు' సినిమా ఆఫర్‌ వచ్చింది. ఇందాకా చెప్పానుగా. విలనిక్‌ హీరోని ఎదిరించి నిలిచిన పాత్ర. చాలా బాగా నప్పింది కృష్ణకుమారికి. సినిమా రాష్ట్రపతి రజితపతకానికి ఎంపికయింది. 1961 వ సం||పు ఉత్తమ తెలుగునటిగా కృష్ణకుమారికి బహుమతి లభించింది. అవార్డు తీసుకోవడానికి ఈమె ఢిల్లీ వెళ్లింది. అక్కడ సభలో దుర్గాబాయమ్మ వున్నారు. కృష్ణకుమారిని చూడగానే ''ఏమిటీ, మన మూగమ్మాయే ఇంతటిదయిందా?'' అని ఆశ్చర్యపడిపోతూ ఆశీర్వదించారు. ఇక అక్కణ్నుంచి పదేళ్లపాటు ఎదురులేకుండా సాగింది. ఇక కెరియర్‌లో పైపైకి వెళ్లడమే తప్ప కిందకు జారడాలు లేవు. భార్యాభర్తలు తీసిన ప్రసాద్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌వారే తీసిన కులగోత్రాలు, పునర్జన్మలలో ఆమెయే హీరోయిన్‌.

రామారావు గారితో దేవాంతకుడు తర్వాత ఇంకో హాస్య చిత్రం వచ్చింది, ఇరుగుపొరుగు. వాళ్ల జోడీలో వచ్చిన 'బందిపోటు' గురించి చెప్పనే అక్కరలేదు. రాబిన్‌హుడ్‌ టైప్‌ హీరో. అతన్ని నేనే పట్టుకుంటానని బయలుదేరిన గర్విష్టి హీరోయిన్‌. 'వగలరాణివి నీవే' పాట షూటింగులో గుఱ్ఱపుస్వారీ చేస్తూండగా గుఱ్ఱం అదుపు తప్పింది. రామారావుగారే కాపాడారు. గుఱ్ఱం బెదరడం కృష్ణకుమారికి కొత్త కాదు. 'వరలక్ష్మీవ్రతం' షూటింగప్పుడు యేర్కాడు కొండల్లో కూడా ఇలాగే జరిగింది. అప్పుడు కాపాడినది కాంతారావుగారు! జానపద సినిమాల్లో హీరోయిన్‌ అంటే యిలాటి కష్టాలు తప్పవుకదా మరి!

బందిపోటు 1963లో వచ్చింది. అదే సంవత్సరం ఎన్టీయార్‌తో లక్షాధికారి, తిరుపతమ్మకథ కూడా వచ్చాయి. 1964లో గుడిగంటలు, మర్మయోగి, కలవారి కోడలు, అగ్గిపిడుగు, శభాష్‌సూరి, సత్యనారాయణ వ్రత మహాత్మ్యం - చూశారుగా అన్నీ హిట్‌ సినిమాలే! లేకపోతే ఎబౌ ఏవరేజ్‌. ఫెయిల్యూర్లు లేవు. తర్వాత వచ్చిన సినిమాల్లో కూడా ఎన్నదగినవి - విశాల హృదయాలు, భువనసుందరి కథ, ఉమ్మడి కుటుంబం, స్త్రీ జన్మ, తిక్కశంకరయ్య, వరకట్నం.. యిలా చాలా వున్నాయి. వరకట్నం సినిమాతో వాళ్ల మధ్య స్నేహం వైవాహిక బంధంగా మారబోయిందన్న వార్తలు వచ్చాయి.

రామారావు కృష్ణకుమారిని పెళ్లి చేసుకుందామనుకున్నారని, కానీ ఓ పక్క పౌరాణిక పాత్రలు వేస్తూ మరోపక్క పర్శనల్‌ లైఫ్‌లో ద్వితీయ వివాహం చేసుకోవడం మంచిది కాదని సన్నిహితులు అనడంతో ఆఖరినిమిషంలో - ముహూర్తం కూడా నిశ్చయించాక - మనసు మార్చుకున్నారని అంటారు. దాంతో కృష్ణకుమారి చాలా హర్ట్‌ అయ్యారట. ఇమ్మీడియట్‌గా వేరేవారిని పెళ్లి చేసుకుని సినిమా పరిశ్రమ నుండి విరమించుకోవాలని నిశ్చయించుకున్నారట.

అజయ్‌ మోహన్‌ ఖైతాన్‌ అని ఓ మార్వాడీ బాల్యమిత్రుడు ఉన్నాడు కృష్ణకుమారికి. ఫ్యామిలీ ఫ్రెండ్‌. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుని బ్రహ్మచారిగానే ఉన్నాడు. కృష్ణకుమారి పరిస్థితి గమనించి స్నేహహస్తం చాచాడు. ఈమె అందుకుంది. వెంటనే అడావుడిగా పెళ్లయిపోయింది. బంధువులు మాత్రమే హాజరయ్యారు. వాళ్ల అక్క జానకి కూడా రాలేకపోయింది. షూటింగులో వుండిపోయింది. వరకట్నం సినిమా 1969 జనవరిలో రిలీజయింది. రెండునెలలు తిరక్కుండా కృష్ణకుమారి పెళ్లి అయిపోయింది. పెళ్లినాటికి ఆమెకు 33 సంవత్సరాలు.

అప్పటిదాకా ఆమెకోసం వెయిట్‌ చేసిన ప్రేమికుడు వుండడం ఆమె అదృష్టం. నర్గీస్‌ రాజ్‌ కపూర్‌ వ్యవహారం చూడండి. రాజ్‌ కపూర్‌ నర్గీస్‌ని ప్రియురాలిగానే చూశాడు కానీ భార్యగా స్వీకరించడానికి యిష్టపడలేదు. ఆ విషయం పూర్తిగా గ్రహింపుకు రాగానే నర్గీస్‌ రాజ్‌ నుండి దూరంగా తొలగిపోయింది. అన్నీ తెలిసీ సునీల్‌ దత్‌ ఆమెను స్వీకరించడం ఆమె అదృష్టం. పెళ్లయిన తర్వాత నర్గీస్‌ ప్రజాసేవ చేశారు. పిల్లలను సినిమారంగంలోకి పెట్టారు. కృష్ణకుమారి మాత్రం అటువంటివేమీ పెట్టుకోలేదు. కుటుంబానికే పరిమితమైంది.

పెళ్లయ్యాక పూర్వపు కమిట్‌మెంట్స్‌ వుంటాయి కదా కొన్నాళ్లు సినిమాల్లో వేసింది. 1971లో రిలీజయిన 'ఆనంద నిలయం' హీరోయిన్‌గా ఆవిడ ఆఖరి సినిమా. ఆ తర్వాత కూడా భార్యాబిడ్డలు వంటి సినిమాల్లో కొన్ని కారెక్టర్‌ రోల్స్‌ వేశారు. ఏకలవ్యలో కూడా వేశారు. దాసరి బలవంతం మీద ఫూల్స్‌ సినిమాలో వేశారు. అదే ఆఖరి సినిమా. ఆ మధ్య చదివాను - విశ్వనాథ సత్యనారాయణ గారి 'చెలియలి కట్ట' నవలను సినిమాగా తీద్దామనుకున్నారుట. అందులో ముసలిమొగుడుగా రేలంగి, పడుచుభార్యగా కృష్ణకుమారి, ఆమె ప్రియుడుగా ఎన్టీయార్‌ అనుకున్నారట.

అరిపిరాల విశ్వం గారితో సంభాషణలు రాయించారట. చివరకి ఎన్టీయార్‌ కాకుండా హరనాధ్‌తో అనుకున్నారట. ముహూర్తం షాట్‌ కూడా తీశారు. కానీ విశ్వనాథగారి మరో నవల 'ఏకవీర' ఆధారంగా తీసిన ఫెయిలవడం వల్ల కాబోలు ఈ సినిమా ఐడియా డ్రాప్‌ చేసేశారు. నవల చాలా బాగుంటుంది. సినిమా తయారయివుంటే  కృష్ణకుమారి మరో మంచి పాత్ర చేసి వుండేవారు.

కృష్ణకుమారి నట జీవితంలో తెలుగు సినిమాలే కాదు, 15 కన్నడ సినిమాలు, 15 తమిళ సినిమాలూ కనబడతాయి. కన్నడంలో టాప్‌ హీరో రాజ్‌కుమార్‌ పక్కన వేశారు. తెలుగులో అన్ని రకాల సినిమాలూ వేశారు. సాంఘికం, జానపదం, పౌరాణికం - అన్నీ. మొత్తం మీద 150 సినిమాలుంటాయి. అన్నిటికీ ఆవిడ సూటయింది. ఫిజిక్‌ కూడా త్రూ ఔట్‌ బాగా మేన్‌టేన్‌ చేశారు. స్త్రీ సౌందర్యాన్ని వర్ణించే మంచిపాటలు చాలా ఆవిడపై చిత్రీకరించబడ్డాయి.

వరకట్నంలోని 'మెరుపు తీగవోలె' పాట గుర్తుందనుకుంటాను. కృష్ణకుమారి పక్కన చాలామంది హీరోలు వేశారు. ముందులో రామశర్మ వేసేవారు. తర్వాత జగ్గయ్య, రమణమూర్తి, చలం, - యిలా బజెట్‌ సినిమాల్లో కృష్ణకుమారి పేరు ఫస్టు తలచుకునేవారు. భార్యాభర్తలు సినిమాతో టాప్‌ బ్రాకెట్‌లోకి వెళ్లిన తర్వాత అగ్రనటుల సరసన వేశారామె. కానీ వాళ్లతోనే వేస్తాను అని భీష్మించుకుని కూచోలేదు.

ఆమె భర్త బిజినెస్‌ ఆపరేషన్స్‌ మద్రాసునుండి బెంగుళూరుకి షిఫ్ట్‌ అయ్యాయి. బోర్‌వెల్స్‌ కాంట్రాక్టులు తీసుకుంటారు. బిజినెస్‌ బాగా నడిచింది. బెంగుళూరు ఔట్‌స్కర్ట్‌స్‌లో ఓ ఫామ్‌ హౌస్‌ అవీ వున్నాయి. వాళ్లకు ఒకే కూతురు. దీపిక అని. ఎంటీఆర్‌ గ్రూపు నడిపే కుటుంబానికి పిల్లనిచ్చారు. తెరమీదా, బయటా హుందాతనం మూర్తీభవించిన తార కృష్ణకుమారి అని. జీవితంలో వచ్చిన ఒడిదుడుకులను తను వేసిన రాకుమారి పాత్రల్లాగానే ఆవిడ ధైర్యంగా ఫేస్‌ చేసి, జీవితాన్ని చక్కదిద్దుకుంది. సాఫ్ట్‌గా ఉంటూనే బోల్డ్‌ డెసిషన్స్‌ తీసుకుంది.'

ఆ మధ్య ఆమె భర్త పోయారు. ఇప్పుడు యీమె...! ఆమెకు నా శ్రద్ధాంజలి. (సమాప్తం)

ఎమ్బీయస్‌: రాకుమారి కృష్ణకుమారి - 1/3

ఎమ్బీయస్‌: రాకుమారి కృష్ణకుమారి - 2/3

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com