Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: అమూల్యమైన సందేశం – అమూల్!

ఎమ్బీయస్: అమూల్యమైన సందేశం – అమూల్!

కరోనా సమయంలో అందరికీ ఆదాయాలు పడిపోయి అలో లక్ష్మణా అంటూంటే, చైనా ఆస్తులు, అంబానీ, అదానీ ఆస్తులు పెరగడం వలననే సమాజంలో అశాంతి రగులుతుంది. తారతమ్యాలు పోవాలంటే సాయధవిప్లవాలు రావలసిన పని లేదని, సహకారోద్యమం ద్వారా అందర్నీ కూడగలుపుకుని వెళితే సంపద పంపిణీ అవుతుందని సామ్యవాదులు అంటారు. ‘అందరి కోసం ఒక్కడూ నిలచి, ఒక్కడి కోసం అందరూ నిలచి, సహకారమే మన వైఖరిగా, ఉపకారమే మన వూపిరిగా బతికే రోజు వస్తుంద’ని మహాకవి అన్నాడు.

స్వాతంత్ర్యానికి పూర్వమే సహకారోద్యమం ప్రారంభమైంది. ఇప్పటికీ అనేక సహకార సంస్థలు వర్ధిల్లుతున్నాయి. సహకారోద్యమం మహారాష్ట్ర, గుజరాత్‍లలో విజయవంతమైంది. అయితే అనేక ప్రాంతాల్లో రాజకీయనాయకులు చొరబడి, వాటిని నాశనం చేయడంతో ‘సహకార సమితులు అంటే ‘ఉమ్మడి గేదె పుచ్చి చచ్చిందన్న’ తెలుగు సామెతను నిజం చేసే సమితులు అనిపించారు. సరిగ్గా నడిచిన సహకార సంస్థ అనగానే అమూల్ అందరికీ గుర్తుకు వస్తుంది. అమూల్ అనగానే వర్గీస్ కురియన్ గుర్తుకు వస్తారు. ఆయన ఆత్మకథ ‘‘ఐ టూ హేడ్ ఏ డ్రీమ్’’ (తెలుగులో ‘‘నాకూ వుంది ఒక కల’’ – అలకనంద ప్రచురణ) అందరూ చదవవలసిన పుస్తకం. ప్రయివేటు సంస్థలను, ప్రభుత్వ అధికారగణాన్ని, అందర్నీ ఎండగడుతూ రాసినా, నాయకులందరూ చెడ్డవాళ్లు కాదనే ఊరట కలిగిస్తుంది మనకు.

పాడి రైతులే కాదు, పంట రైతులే కాదు, ఎవరైనా ఉత్పత్తిదారులు తమంతట తాము విడివిడిగా ప్రభుత్వ లేదా ప్రయివేటు సంస్థలతో వేగలేరని వారు సమాఖ్యగా ఏర్పడి మార్కెటింగ్ నిపుణులను ఉద్యోగులుగా పెట్టుకుని తమ ఉత్పాదనను మార్కెట్ చేసుకోగలిగితేనే వాళ్లు వృద్ధి చెందుతారని యీ పుస్తకం పదేపదే చెప్తుంది. ప్రస్తుత సాగు చట్టాల నేపథ్యంలో యీ పుస్తకం అందరూ చదివితే, కార్పోరేట్లు చేయగల మోసాల గురించి అవగాహన ఏర్పడుతుంది. దానికి గాను రైతులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా అభిప్రాయం ఏర్పడుతుంది. ఇది కురియన్ శతజయంతి సంవత్సరం కాబట్టి (ఆయన 1921 నవంబరులో పుట్టారు) ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడమే ఆయనకు మనం యిచ్చే ఘననివాళి.

ఆయన కైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘానికి (దీన్ని అమూల్ అంటారు) 1950-73 మధ్య మేనేజరుగా, జనరల్ మేనేజర్‌గా వున్నారు. 1973-1983లో గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్యకి సిఎండిగా వున్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డిడిబి)కి చైర్మన్‌గా 1965-98 వరకు ఉన్నారు. అమూల్ విజయగాథలో తానొక్కడే కథానాయకుణ్ని కాదంటారు కురియన్‍. ఎందరో చేతులేసి రథాన్ని నడిపించారని వారందరి పేర్లూ చెప్పారు. ఎంఎన్‍సీలతో, ఆనాటి ప్రజల మైండ్‍సెట్‍తో, సాటి వ్యాపారస్తులతో, బ్యూరాక్రసీతో, నాయకులతో - వేయేల, కనబడిన వారందరితోనూ పోరాడారు. కానీ అప్పటికీ, యిప్పటికీ తేడా ఏమిటంటే భారతస్వాతంత్య్రం కొత్తగా వచ్చిన వేళ కాబట్టి చిత్తశుద్ధి గల నాయకులెందరో వుండేవారు. వారు కురియన్‍కు అండగా నిలిచారు. వారి గురించి మరో వ్యాసంలో చెప్తాను.

కురియన్‍ మెటలర్జీ యింజనీరింగ్‍ నుండి డైరీ యిండస్ట్రీకి వచ్చారు - తన యిష్టానికి వ్యతిరేకంగా! ఆయన 1921లో కాలికట్‌లో విద్యావంతుల కుటుంబంలో పుట్టారు. తండ్రి సివిల్ సర్జన్. మేనమామ జాన్ మత్తయ్ ఆర్థికవేత్త. మద్రాసు లయోలా కాలేజీలో బియస్సీ ఫిజిక్స్ చదివి, గిండీ ఇంజనీరింగ్‍ కాలేజీలో యింజనీర్ అయి 1944కి చదువు పూర్తి చేశారు. అంతలో తండ్రి పోయారు. టాటా వారి టిస్కోలో డైరక్టర్‍గా వున్న జాన్ మత్తయ్ (దరిమిలా భారతదేశ తొలి ఆర్థికమంత్రి అయ్యారు) చెప్పడంతో టిస్కోలో అప్రెంటిస్‌గా చేరారు. ఓసారి మేనమామ యీయన ఉన్న హాస్టల్‌కు వచ్చి పలకరించడంతో అంతా ‘డైరక్టరు గారి మేనల్లుడు కాబట్టి ప్రమోషన్స్ త్వరగా వస్తాయి’ అనసాగారు. అది యీయనకు నచ్చక మేనమామ వారిస్తున్నా వినక రాజీనామా చేసేశాడు.

మెటలర్జీ, న్యూక్లియార్‍ ఫిజిక్స్‌లో పై చదువులకు ప్రభుత్వ స్కాలర్‍షిప్‍కై అప్లయి చేశాడు. అయితే డైరీ యింజనీరింగ్‍లో సీటిచ్చారు. కాదంటే విదేశీ చదువుల ఛాన్సు పోతుందని యియన ఒప్పుకున్నాడు. 1946లో అమెరికాలోని మిచిగాన్‍ యూనివర్శిటీకి వెళ్లి తను అనుకున్నవే చదివాడు. మాస్టర్స్ డిగ్రీ సంపాదించాడు. డైరీ యింజనీరింగ్‍లో చిన్న చిన్న కోర్సులు మాత్రం చేశాడు. ఇండియాకు తిరిగి వచ్చాక యూనియన్ కార్బయిడ్‌లో వెయ్యి రూపాయల జీతం మీద చేరబోతే, 5 ఏళ్ల పాటు డైరీ డిపార్టుమెంటులో పనిచేయకపోతే యిచ్చిన 30 వేల స్కాలర్‍షిప్‍ తిరిగి యివ్వాలని ప్రభుత్వ సెక్రటరీ హెచ్చరించి, బొంబాయి రాష్ట్రంలో గుజరాత్ ప్రాంతంలోని ఖైరా జిల్లాలో వున్న ఆనంద్‌లో వున్న పాలపొడి తయారు చేసే ప్రభుత్వ క్రీమరీలో రూ. 500 జీతానికి పనిచేయమని పంపారు. ఇలా 1949లో ఆనంద్‍కి వచ్చారు. జీవితాంతం అక్కడే వుండాల్సి వచ్చింది.

28 ఏళ్ల కురియన్‍కు ఆనంద్‍ ఏమాత్రం నచ్చలేదు. న్యూయార్క్ నుండి తిరిగి వచ్చిన యింజనీరింగ్‍ పోస్ట్ గ్రాజువేట్‍కి పదివేల జనాభా వున్న పల్లెటూరు ఎలా నచ్చుతుంది? పైగా ఈయన బ్రహ్మచారి, మాంసాహారి కావడం వలన ఎవరూ యిల్లు యివ్వలేదు. ఓ కారు షెడ్‍లో కాపురం వుండేవాడు. ప్రభుత్వం ఫ్యాక్టరీలో అందరూ సోమరులుగా కూచోడం నచ్చక తను ఉద్యోగం మానేస్తానని ప్రతీ నెలా ఉత్తరాలు రాసేవాడు. చివరకు ఇతని గోల భరించలేక 8 నెలల తర్వాత రిలీవ్‍ చేసేసారు. ఇక ఆనంద్‍నుండి పెట్టే బేడా సర్దుకుని వెళ్లిపోదామనుకుంటూండగా ఆయన్ని ఆపేసిన వ్యక్తి -  కైరా కోపరేటివ్‍ డైరీ అధ్యక్షుడు త్రిభువన్‍దాస్‍. (ఈయన గురించి, యీయనకు దన్నుగా నిలిచిన నాయకుల గురించి తర్వాతి వ్యాసాల్లో రాస్తాను)

కోఆపరేటివ్‍ డైరీ తరఫున ప్రభుత్వంనుండి తీసుకున్న డైరీని ఎలా నడపాలో తెలియక ఆ యంత్రాలతో కుస్తీ పడుతున్నాడు త్రిభువన్ దాస్. ఓ సారి వచ్చి కురియన్‍ను సలహా అడిగితే ఆయన ఫలానావి కొనండి అని సలహా చెప్పి కొనిపించాడు. అవి యివాళో రేపో వచ్చేట్టున్నాయి. ‘నీకింకా వుద్యోగం ఏదీ రాలేదు కదా, రెండునెలలుండి ఆ మెషీన్లను యిన్‍స్టాల్‍ చేయించి వెళ్లు. రెండునెలల జీతం యిస్తాను.’ అన్నాడాయన. ఆయన మీద గౌరవంతో కురియన్‍ ఒప్పుకున్నాడు. నిజానికి భారతీయ ప్రజలకి ఎంతో శక్తియుక్తులున్నాయి. యూరోపంత మార్కెట్‍ వుంది. కానీ మనకు కావలసినది మనల్ని నడిపించే వృత్తి నిపుణులు. అటువంటి ప్రజను, నిపుణులను కలిపే దార్శనికత ఆరోజు త్రిభువన్‍దాస్‍ అనే ప్రజానాయకుడు కనబరిచారు కాబట్టే మనకు కురియన్‍ దక్కారు.

రెండు నెలలకోసం అక్కడ నిలిచిపోయిన కురియన్‍ తన జీవితమంతా అక్కడే గడిపేశారు. తన స్నేహితులను తీసుకుని వచ్చారు. రకరకాల ప్రయోగాలు చేశారు. తమ ఉత్పాదనను ఎలా కమ్మర్షియలైజ్‍ చేయాలో రైతులకు నేర్పారు. తనకోసం పనిచేసినప్పుడు కలిగే ఆనందం తాత్కాలికమని, యితరులకోసం చేస్తే కలిగే ఆనందం శాశ్వతమనీ స్వయంగా తెలుసుకుని అందరికీ నేర్పారు. 90 ఏళ్లు జీవించి జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. ‘‘పద్మవిభూషణ్’’తో సహా అనేక అవార్డులు గెల్చుకున్నారు. ఇదీ స్థూలంగా కురియన్‍ విజయగాథ.

ఆనంద్‍ తరహా ప్రాజెక్టులు దేశమంతా పెట్టాలని ప్రభుత్వం కోరినప్పుడు యియన అనేక రాష్ట్రాలకు వెళ్లాడు. మీ కోపరేటివ్‍ వస్తే మా మిల్క్ కమిషన్‍ మూసేయాల్సి వస్తుంది. మాకు బదిలీలు అవుతాయి. అలాటప్పుడు మేమూ మీకెందుకు మద్దతిస్తాం? అని అధికారులు నేరుగా అడిగేసేవారు. ఇలా అడ్డుకొట్టే అధికారులు, వాళ్లకు వత్తాసు యిచ్చే రాజకీయ నాయకులు ఎప్పుడూ వుంటారు. వాళ్లు అధికారాన్ని తమ చేతిలోంచి జారిపోనివ్వరు. ఆయన బ్యూరాక్రసీని ఘాటుగా విమర్శించాడు. డెమాక్రసీ అంటే ఫర్‍ ది బ్యూరాక్రసీ, బై ది బ్యూరాక్రసీ అండ్‍ ఆఫ్‍ ది బ్యూరాక్రసీ అన్నాడు. ఏ సంస్థయినా సమర్థవంతంగా పనిచేయాలంటే ప్రభుత్వం కలగజేసుకోకూడదన్నాడు. ఆయన ప్రభుత్వోద్యోగిగా వుండడానికి యిష్టపడలేదు. తను రైతుల ఉద్యోగిననే చెప్పుకున్నాడు.

1960లో యూరోప్‍లో పాల ఉత్పత్తులు- పాలపొడి, బటర్‍ ఆయిలూ - పెరిగిపోయి మేట వేసుకుపోయాయి. వాటిని వదుల్చుకోవాలని మనలాటి దేశాల ప్రజలకు ఊరికే యిద్దామనుకున్నారు వాళ్లు.  అలా ఊరికే యిస్తే దేశీయంగా వుండే పరిశ్రమలు దెబ్బ తింటాయనీ, తర్వాత ఆ యూరోపియన్‍ కంపెనీలు ఎక్కువ ధరకు తన సరుకు అమ్ముకుని యిదంతా రాబట్టుకుంటాయని కురియన్‍ వాదించాడు. దానికి బదులు వాళ్లు వుచితంగా యిచ్చినది ఎన్‍డిడిబి తీసుకుని, దాన్ని మార్కెట్‍లో అమ్మి, ఆ డబ్బుతో ఆపరేషన్‍ ఫ్లడ్‍ నిర్వహించాలని ప్రతిపాదన తెచ్చాడు. ఆ విధంగా ఆ ఆఫర్‍ను దేశ స్వయంసమృద్ధిని నాశనం చేసేదానిగా కాకుండా, దానికి దోహదపడేదానిగా మలచుకోవాలని ఆయన ఊహ. అదే ఆయన ఆపరేషన్‍ ఫ్లడ్‍. ‘మేక్ ఇన్ ఇండియా’కు, ‘మేడ్ ఇన్ ఇండియా’కు తేడా యిదే!

అయితే ఆపరేషన్‍ ఫ్లడ్‍ మొదటిదశ ఐదేళ్లనుకుంటే పదేళ్లు పట్టి 1970లో పూర్తయింది. ఇంతకాలం పట్టడానికి కారణం ఆటోమెటిక్‍ మిల్క్ వెండింగ్‍ మెషిన్లపై బ్యూరాక్రసీ విముఖత. కాయిన్‍ వేసే పబ్లిక్‍ టెలిఫోన్‍ బూత్‍లు పనిచేయటం లేదు కదా, యివి మాత్రం ఎందుకు పనిచేస్తాయి? అని వారి వాదన. పాలసీసాల బెడద తప్పిస్తే తప్ప మూందుకు సాగలేమని కురియన్‍  పట్టు. 200 మెషిన్లను దిగుమతి చేసుకుంటానంటే వీళ్లు పడనివ్వలేదు. చివరకు అవి లోకల్‍గా తయారు చేయించాడాయన. దానికి నాలుగేళ్లు పట్టింది.  చివరకు స్కీమూ సక్సెసయింది. పాల రేషన్‍ తొలగిపోయింది.

అమూల్‍ బేబీ ఫుడ్‍ ప్రవేశపెట్టినపుడు గ్లాక్సోవాళ్లకు దెబ్బ తగిలింది. మా బేబీ ఫుడ్‍ కన్నా తల్లిపాలే శ్రేష్ఠమని చెపుతూ అమూల్‍వాళ్లు పుస్తకాలు ప్రచురించి పంచిపెట్టారు. పిల్లలకు పాలు ఎలా యివ్వాలో కొత్తగా తల్లులైన వారికి పాఠాలు చెప్పించారు. అయినా కొంతమంది యాక్టివిస్టులు అమూల్‍కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్లాక్సో వారి వెనకాల వుండి వుండవచ్చు. చివరకు అమూల్‍ను ఎదుర్కోలేక ‘మా బేబీఫుడ్‍ తయారుచేసే కాంట్రాక్టు మీకిస్తాం‘ అన్నారు గ్లాక్సోవాళ్లు. ఆ టిన్నుల మీద అమూల్‍ బ్రాండ్‍ వేస్తామని కురియన్‍ అన్నాడు. దాంతో గ్లాక్సో అధిపతికి ఒళ్లు మండిపోయింది. ‘వీళ్లు అమ్ముకోలేక పోతారు చూడండి. అమ్ముడుపోక అదంతా అరేబియా సముద్రంలో పారబోసుకోవాలి’ అని  శాపనార్థాలు పెట్టాడు. పిల్లి శాపాలు ఫలించలేదు. చివరకు అమూల్‍ నిలబడింది.

కురియన్‍లో జీవితగాథలో మేనేజ్‍మెంట్‍ పాఠాలు ఎన్నో వున్నాయి. అనేక సందర్భాల్లో ఆయన రాత్రికి రాత్రే పెనుమార్పులు తెచ్చాడు. ‘ఇలాటి మార్పులు అలాగే చేయాలి. నెమ్మది నెమ్మదిగా ఒకదాని తర్వాత మరొకటి చేయకూడదు. అలా చేస్తే స్వార్థపశక్తులన్నీ ఏకమై పోయి సమస్యలు సృష్టించడానికి చాలినంత సమయం యిచ్చినట్టవుతుంది’ అంటారాయన. మార్కెటింగ్‍ను, సేకరణనూ కలపకూడదంటాడు. మార్కెట్‍ పక్కనే సేకరణ కేంద్రం పెడితే లాభించదంటాడు. బొంబాయికి, ఆనంద్‍కి 350 కి.మీ. దూరం వుంది కాబట్టే అమూల్‍ నిలబడిందంటాడు.  ఢిల్లీలో సిటీ శివార్లలోనే పెట్టిన డైరీ, సైకిలుమీద వచ్చి పాలుపోసే వాడితో పోటీ పడలేక మంచాన పడిందంటాడు.

పాలపొడి తయారు చేయడం ఓ యెత్తు, దాన్ని మార్కెటింగ్‍ చేయడం రెండు యెత్తులు. అమూల్‍ అనే బ్రాండ్‍ రిజిస్టర్‍ చేయడంతో ఆగలేదు, రూ. 2 లక్షలతో పబ్లిసిటీకి ప్లాను చేశాడు. అంత డబ్బు ఖర్చు పెట్టడానికి త్రిభువన్‍దాస్‍ అంగీకరించకపోతే గట్టిగా వాదించి ఒప్పించాడు. 1966లో అమూల్‍ బేబీ మాస్కట్‍ను తయారుచేయించాడు. వారం వారం ఆకర్షణీయమైన స్లోగన్లు రాయించేవాడు. శ్యామ్‍ బెనగల్‍ చేత ఆనంద్ ప్రయోగంపై ‘మంథన్‍’ సినిమా తీయించాడు. పెట్టుబడి కావలసి వస్తే రైతులను తలో రూపాయి వేసుకోమన్నాడు. అలా సినిమాకు కావలసిన 10 లక్షలు సమకూరింది.

ప్రజలకు ఏదైనా వుచితంగా యిస్తే దాని మార్కెట్‍ను కూల్చేసినట్లే అనే భావన ఆయనది. సబ్సిడీలు వద్దంటాడు. అంతకంటె రైతుల ఉత్పాదనను మార్కెట్‍ధరకే అమ్మి ఆ లాభాన్ని రైతుకే యిస్తే రైతుకి ఉత్సాహం రగులుతుంది అంటాడు. అన్నీ వుచితంగా యిస్తామని హామీ లిచ్చే మన నాయకులు యిది గుర్తించాలి. కోఆపరేటివ్‍ రంగం వ్యాపార సరళిలోనే వుండాలని నమ్మి దాన్ని అమలు చేశాడు. అయితే ప్రయివేటు కంపెనీ లాగ డివిడెండు కోసం పాల రేట్లు పెంచలేదు. ప్రతీ సంవత్సరం సేకరించిన పాలకు ఎక్కువ ధర యిచ్చి రైతులను ఉత్సాహ పరిచేవాడు.

ట్రేడింగ్‍ చేసే వ్యాపారస్తుడి గురించి కురియన్‍ ఓ మాట అంటారు - మార్కెట్‍ డిమాండ్‍ కంటె 5% ఎక్కువ ఉత్పాదన జరిగిందనుకోండి. ట్రేడర్‍ ధరను 50% తగ్గించేసి రైతును నష్టపరుస్తాడు. 5% తక్కువ ఉత్పాదన జరిగిందనుకోండి అప్పుడు 50% ధర పెంచేసి కన్స్యూమర్‍ను నష్టపరుస్తాడు. అంతేగానీ తను ఎట్టిపరిస్థితిలోనూ నష్టపోడు. ఓ సారి ఇందిరా గాంధీ గారే  కురియన్‍ను అడిగిందట - మా ఫామ్‍హౌస్‍లో కూరలమ్మితే కేజీకి ఒక రూపాయి వస్తోంది. ఇక్కడ ఢిల్లీలో కేజీ 6 రూ.లకు కొంటున్నాను. ఈ 5 రూ.లు ఎక్కడికి పోతున్నాయ్‍? అని. ‘అదే కదమ్మా నేను చెప్పే దళారీ వ్యవస్థ’ అన్నాట్ట ఈయన. ఇటువంటి పరిస్థితుల్లో ఉత్పాదన పెంచాలని రైతు అనుకోడు. దేశం నష్టపోతుంది. అది నివారించాలంటే రైతులు గోడౌన్సు ఎక్కువగా పెట్టుకుని మార్కెటింగ్‍ తమ చేతుల్లోనే వుంచుకోవాలంటారు.

కురియన్‍ మల్టీనేషనల్స్ చేసే దుర్మార్గాలను ఎండగట్టాడు. సరళీకరణ పేరుతో జరిగే మోసాల్ని అసహ్యించుకున్నాడు. దేశంలోని వనరులు ప్రభుత్వానివి అనే భావనే పోవాలన్నాడు. మన దేశానికి వనరులు మన మనుషులే. వారిని సంఘటితపరిస్తే వారే వృత్తినిపుణులను జీతాలిచ్చి నియమించుకుంటారు. ఆ నిపుణులు వ్యాపారపరంగా సంస్థలను నిర్వహిస్తారు. ఇదీ ఆయన థియరీ. చిన్న చిన్న విషయాల నుంచి కూడా నేర్చుకోవాలంటాడు. ఓ సారి ఆయన ఉదయం రౌండ్స్ కొడుతూవుంటే ఓ కార్మికుడు మీగడ తాగుతూ పట్టుబడ్డాడు. వెంటనే ఈయనకి తట్టింది - వాళ్ల ఎదురుగా బోల్డు పాలుంటాయి. వాళ్లేమో ఆకలితో వుంటారు, తాగకుండా వుంటారా అని. అప్పటినుండీ రోజూ ఉదయాన్నే అరలీటరు పాలు కార్మికులందరికీ ఉచితంగా యిమ్మనమని ఆర్డరేశాడు. (సశేషం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2021)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?