Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: అమూల్ పోరాటాల కథలు

ఎమ్బీయస్: అమూల్ పోరాటాల కథలు

కురియన్ ఆత్మకథలో చాలా అంశాలున్నాయి. క్లుప్తంగానైనా అన్నీ చెప్పడం కష్టం. కొన్ని రసవత్తరమైన ఘట్టాలు మాత్రం చెప్పి వూరుకుంటాను. అమూల్‌కు పోటీగా నిలిచిన, (ఆ మాట కొస్తే దానికే అమూల్ పోటీగా ఎదిగింది) పోల్సన్ అనే బ్రాండ్‌తో వెన్న అమ్మే పెస్తోంజీ అనే వ్యక్తితో కురియన్‌కు కలిగిన అనుభవాల గురించిన కథను దీనిలో చెప్తాను. మన దేశాన్ని బ్రిటిషు వాళ్లు పాలించే రోజులవి. 1942-43లో బొంబాయిలో వున్న యింగ్లీషువారిలో చాలామంది జబ్బు పడితే, విచారించగా ప్రయివేటు రంగంలో లభ్యమౌతున్న పాల కారణంగా అని తెలిసింది. బ్రిటన్ పంపి పరీక్ష చేయిస్తే ‘లండన్‌లోని మురికి నీరు కన్నా బొంబాయిలో పాలు అధ్వాన్నంగా వున్నాయి’ అని వాళ్లు తేల్చారు. దాంతో ప్రభుత్వం పాల డిపార్టుమెంటు ఏర్పరచి, దానికి కమీషనర్‌గా ఓ బ్రిటిషర్‌ని నియమించి, పాల సేకరణ, శుద్ధీకరణ సంగతి చూడమంది. ఏ వ్యవస్థనైనా సరే, పూర్తిగా ప్రయివేటు రంగానికే అప్పగించేస్తే యిలాగే కంగాళీ అయిపోతుంది. ప్రభుత్వం చొరబడి, సరిదిద్దాల్సి వుంటుంది.

బొంబాయి దగ్గర్లో నాణ్యత గల పాలు ఎక్కడ దొరుకుతాయా అని బ్రిటిషు ప్రభుత్వం అన్వేషించింది. (ఇప్పటి గుజరాత్‌లోని) బరోడాకు దగ్గర్లో  పాడి పరిశ్రమకు పేరుబడిన కైరా జిల్లాపై, ముఖ్యంగా ఆనంద్‍పై వారి దృష్టి పడింది. 1895 ప్రాంతాల్లోనే ఆనంద్ దగ్గర్లో ఓ ఆంగ్లేయుడు వెన్న ఫ్యాక్టరీ ఆరంభిస్తే, ఓ జర్మన్ పాలకి, జున్నుకి అవసరమైనవి తయారుచేసే ఫ్యాక్టరీ పెట్టాడు. ఇది చూసి పెస్తోంజీ ఎదుల్జీ అనే పార్శీ 1926లో ఓ వెన్న ఫ్యాక్టరీ పెట్టి, మేనేజర్‌గా ఓ న్యూజిలాండ్ దేశస్తుణ్ని పెట్టి, దాన్ని ‘పోల్సన్’ బ్రాండ్ పేర అమ్మసాగాడు. పేరు చూసి ఫారిన్ బ్రాండ్ అనుకునేవారు. పెస్తోంజీ చదువుకోలేదు కానీ చాలా తెలివైనవాడు. కష్టపడి పైకి వచ్చాడు. ఈ ఫ్యాక్టరీల కారణంగా కైరా జిల్లా పాడి పరిశ్రమ వర్ధిల్లింది.

బ్రిటిషు ప్రభుత్వం పెస్తోంజీని ‘350 కి.మీ. దూరంలో వున్న ఆనంద్‌లో పాలు సేకరించి, అక్కణ్నుంచి బొంబాయికి రోజూ పంపగలవా?’ అని అడిగింది. అతను పాలను బాగా మరిగించి, క్యానుల్లో పోసి, వాటిని తడిపిన గోనెసంచుల్లో చుట్టి పంపేవాడు. బొంబాయిలోని ఇంగ్లీషు వాళ్ల ధర్మమాని అందరికీ మంచి పాలు దొరకసాగాయి. కొన్నాళ్లు పోయాక పెస్తోంజీ పాల ఖరీదుతో బాటు ప్రాసెసింగ్ ఖర్చులు కూడా యిమ్మన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు సరఫరాకు అదనపు సామగ్రి కొనాలి, డబ్బివ్వండి అన్నాడు, ఆ తర్వాత కైరా జిల్లాలో తనకు గుత్తాధిపత్యం యిచ్చి, తను తప్ప వేరెవ్వరూ పాలు సేకరించకుండా చట్టం చేయమని అడిగాడు. అన్నిటికీ ప్రభుత్వం సరేనంది. చట్టమూ చేసింది. పోల్సన్ కంపెనీ, పాల కాంట్రాక్టర్లు అందరూ సంతోషంగానే వున్నారు కానీ డెయిరీకి పాలు పోసే రైతులు మాత్రం పాత ధర పెరగక అసంతృప్తిగా వున్నారు. వాళ్లు తమ జిల్లాకే చెందిన సర్దార్ పటేల్ వద్దకు వెళ్లి మొర పెట్టుకున్నారు.

ఆయన తన శిష్యుడు మొరార్జీ దేశాయితో ‘వీళ్లందరినీ సంఘటిత పరిచి, ఊరూరా పాల సహకార సంఘాలను ఏర్పాటు చేయించు. అప్పుడే వీళ్లు పోల్సన్ నుంచి గిట్టుబాటు ధరను డిమాండ్ చేయగలరు.’ అన్నారు. ఈ సంఘాలకు అధ్యక్షుడిగా ఎవర్ని నియమిద్దామా అని మొరార్జీ ఆలోచించి, కైరా జిల్లా కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంటుగా వున్న త్రిభువనదాస్ అనే యువకుడికి ఆ పని అప్పగించారు. ఆయన అన్ని విధాలా అద్భుతమైన వ్యక్తి. ఆయన లేకపోతే కురియన్ లేడు, అమూల్ లేదు, క్షీరవిప్లవమూ లేదు. 1966లో ఆయనకు పద్మభూషణ్ యిచ్చారు. సహకార సంఘాలు ఏర్పడడం పోల్సన్‌కు యిష్టం లేదు. వాటిని విచ్ఛిన్నం చేయడానికి పాలల్లో యీగలు పడ్డాయనేవారు, తాజా వాసన రావటం లేదనేవారు, తగినంత కొవ్వు లేదనేవారు. పాలు దాచి వుంచే పదార్థం కాదు కాబట్టి రైతులు ఏమీ చేయలేక, అన్యాయాన్ని భరించలేక, పటేల్‍ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. ‘మధ్యలో దళారిగా వున్న పోల్సన్‌ను తీసేస్తే తప్ప మీకు మోక్షం లేదు’ అన్నారు పటేల్.

అప్పుడు గుజరాత్ ప్రొవెన్షియల్ కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా వున్న మొరార్జీ దేశాయ్‍ వచ్చి ‘ఇకపై పోల్సన్‌కు పాలు అమ్మరాదు, కైరా జిల్లాలో ప్రతి గ్రామంలో ఒక సహకార సంఘం పెట్టి, ఆనంద్‌లో వున్న సహకార సంఘాల యూనియన్ ప్రాసెసింగ్‌ను నిర్వహించి బాంబే మిల్క్ స్కీముకి డైరక్టుగా సరఫరా చేయాలి.’ అని చెప్పారు. సరేనని రైతులు 15 రోజుల పాటు సమ్మె చేశారు. పోల్సన్‌కు ఒక్క చుక్క పాలు పోయకుండా వీధుల్లో పారబోశారు. బొంబాయిలో పాలు దొరక్క, ప్రభుత్వం దిగి వచ్చింది. బ్రిటిష్ వాడైన పాల కమిషనర్, అతనికి సహాయకుడిగా వున్న దారా ఖురోడి అనే పార్శీ ఆనంద్ వచ్చి చూశారు. ఖురోడీ సమర్థుడే కానీ అహంభావి. సహకార ఉద్యమంపై చిన్నచూపు కలవాడు. చాలా ఏళ్లపాటు కురియన్‌తో తలపడి, చివరకు స్నేహితుడైనవాడు. ఆరే మిల్క్ కాలనీ అని పెట్టి విజయం సాధించడంతో 1964లో అతనికి పద్మభూషణ్ యిచ్చారు.

అతను ఆంగ్లేయుడైన పాల కమిషనర్‌తో ‘పాలవ్యాపారం సాంకేతికమైన వ్యవహారం. ఇంగ్లీషు రాని ఈ గాంధీటోపీ గాళ్లకు ఏం తెలుస్తుంది? వాళ్లను స్వయంగా వ్యాపారం నడిపి చూడమనండి. ఎలాగూ ఫెయిలవుతారు’ అని సలహా యిచ్చాడు. ఆ ధీమాతో కమిషనర్ రైతుల డిమాండ్లకు సరేనన్నాడు. ఇక  త్రిభువన్‍దాస్‍ ఊరూరా తిరిగి గ్రామ సహకార సంస్థలు అయిదింటిని ప్రారంభించగలిగాడు. 1946 డిసెంబరులో కైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్ అనే సంస్థను రిజిస్టర్ చేశాడు. 1947లో స్వాతంత్ర్యం వచ్చి, పటేల్ ఉపప్రధాని కావడంతో ఆయన యీ సంస్థకు అదే వూళ్లో వున్న ప్రభుత్వ పరిశోధనా క్రీమరీ నుంచి కొన్ని పాత మెషిన్లను అద్దెకు యిప్పించారు. మిగతా మెషిన్లు నేషనల్ డెయిరీ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ అధీనంలో వుండేవి. 1949లో కురియన్‍ ప్రభుత్వ క్రీమరీలో పనిచేయడానికి ఆనంద్‍ వచ్చేసరికి మూడేళ్లగా త్రిభువన్ ప్రభుత్వం నుంచి అద్దెకు తీసుకున్న పాత మెషిన్లతో కుస్తీ పడుతున్నాడు. కురియన్ సలహాపై కొత్త మెషిన్లు కొన్నాడు. ఆయన ఆనంద్ విడిచి వెళ్లిపోతానన్నపుడు రెండు నెలలుండి యంత్రాలు బిగించి వెళ్లమని కోరాడు. అంతే, త్రిభువన్ వ్యక్తిత్వం నచ్చిన కురియన్ ఆ ప్లాంటుకి తన జీవితాన్ని అంకితం చేశాడు.

1948లో రోజుకి 200 లీటర్లతో ప్రారంభమైన పాల సేకరణ 1952కి 20 వేల స్థాయికి చేరింది. పాశ్చరైజ్ చేసిన పాలకు బొంబాయిలో డిమాండ్ పెరగడంతో మరిన్ని పాలు సేకరించవలసిన అవసరం పడింది. కొత్త డెయిరీలు ప్రారంభించాల్సి వచ్చింది. కురియన్‌ను కేంద్ర ప్రభుత్వం న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు పంపించి డెయిరీ పరిశ్రమలో శిక్షణ పొంది రమ్మనమంది. దాంతో ఆయన మరింత రాటు దేలాడు. ఇదిలా పెరుగుతూంటే అవతల పోల్సన్‌కి దెబ్బ పడుతోంది. వెళ్లి ఖురోడీతో మొరపెట్టుకుంటే ఆయన కైరా జిల్లాను రెండుగా చీల్చి, ఎవరి భాగంలో వారిని పాల సేకరణ చేసుకోమన్నాడు. క్రమేపీ అమూల్ వెన్న కూడా తయారు చేసి పోల్సన్ వారితో పోటీ పడింది. అక్కడ వారికి ఓ చిక్కు వచ్చింది.

పోల్సన్ వాళ్లు నిలవ వుంచిన మీగడతో వెన్న తయారుచేసేవారు. దానికి కారణంగా కలుషితమై, చెడువాసన వచ్చేది. వాక్రియేటర్ అనే యంత్రం ద్వారా ఆ చెడువాసనను తొలగించేవారు. అయినా కొంత కాలుష్యం మిగిలిపోయేది. అమూల్ వాళ్లు వెన్నను తాజా మీగడతో తయారుచేసేవారు. పోల్సన్ కాలుష్యపు వెన్న రుచికి అలవాటు పడిన కన్స్యూమర్లు అమూల్ వెన్న చూసి ‘ఇదేం వెన్న? రుచీపచీ లేదు. చప్పగా వుంది.’ అనసాగారు. బొంబాయిలో పెస్తోంజీకి స్నేహితులైన పార్శీ వాళ్లు నడిపే ఇరానీ హోటళ్లలో అయితే యీ వెన్నను ముట్టనే లేదు. చివరకు అమూల్ వాళ్లు డయాసెటిల్ అనే రసాయనాన్ని కలిపి ఆ పోల్సన్ రుచిని తెప్పించారు. దాంతో అమ్మకాలు పెరిగాయి. దానికి ప్రధాన కారణం 1966లో అమూల్‌కి మాస్కట్‌గా యుస్టేస్ ఫెర్నాండెజ్ సృష్టించిన అల్లరిపిల్ల, ‘అట్టర్లీ బట్టర్లీ డెలీషియస్’ అనే కాప్షన్, వారంవారం సమకాలీన అంశాలపై ఆకర్షణీయమైన వ్యాఖ్యలతో హోర్డింగులు!

ఇలా అమూల్ వెన్న ఎదగడం పెస్తోంజీని కలవర పరిచింది. అతను పాతకాలపు మనిషి. తన యంత్రాల మీద తయారీ స్టిక్కర్లు తీయించేశాడు. అవి చూసి అమూల్ కూడా అవే రకం యంత్రాలు కొని తనకు పోటీ రాకుండా చేశానని అనుకున్నాడు. అంతేకాదు, అతను ఏ రోజు కా రోజు వెన్న ధరను నిర్ణయించేవాడు. తన బొంబాయి ఆఫీసులో కూర్చుని, ఆ రోజు గుజరాత్, మహారాష్ట్రల నుంచి మీగడ ఎన్ని కాన్‌లు వచ్చాయో లెక్క వేసి, డిమాండ్ ఎంత వుంటుందో చూసుకుని వెన్న ధరను నిర్ణయించేవాడు. అమూల్ అలా మార్చకుండా ప్రతీ రోజూ స్థిరమైన ధరకు వెన్న అమ్మడం చూసి కంగారు పడి, కురియన్‌ను తన ఆఫీసుకి రప్పించి ‘వ్యాపారం చేసే పద్ధతి యిది కాదు. బొంబాయిలో మా యింట్లో కొన్నాళ్లు వుండి, వ్యాపారంలో మెళకువలు నేర్చుకో.’ అని హితబోధ చేశాడు. పెస్తోంజీ ఒక రకంగా చాలా మంచివాడు. అక్రమపద్ధతుల్లో వ్యాపారం చేయలేదు. అమూల్‌తో ఆరోగ్యకరమైన పోటీనే కొనసాగించాడు. ఎవరి వ్యాపారం వాళ్లు చేసుకున్నారు. ఒకసారి అమూల్ ఫ్యాక్టరీ చూడడానికి వచ్చి, చాలా సంతోషించి, కురియన్‌తో ‘‘ఇక్కడ నువ్వు సాధించిన దానికి భగవంతుడు నిన్ను దీవించుగాక’’ అని మనస్ఫూర్తిగా అన్నాడు.

1962లో అతను చనిపోతూ అల్లుడు లెఫ్టినెంట్ కల్నల్ కొతవాలాకు ఆనంద్ ఫ్యాక్టరీ నిర్వహణ, కొడుకు మినూకి పట్నాలో వున్న ఫ్యాక్టరీ నిర్వహణ అప్పగించాడు. మినూ ధూర్తుడు. కురియన్ దగ్గరకు వచ్చి ‘‘మీరు మా కంపెనీని నాశనం చేయదలచుకుంటే ఆనంద్ డెయిరీని చేయండి. నాది కాబట్టి పట్నా డెయిరీ జోలికి రాకండి.’’ అని చెప్పాడు. పెస్తోంజీ పోయిన తర్వాత అమూల్‌తో పోటీ తట్టుకోలేక పోల్సన్ బ్రాండ్ వెనకబడింది. మూత పడే స్థితికి వచ్చింది. మినూ ఓ రోజు కురియన్ వద్దకు వచ్చి ‘ఆనంద్ యూనిట్‌ను అమ్మేయడానికి మా బోర్డు సభ్యులను ఒప్పించాను. కొనడానికి మీ బోర్డు సభ్యులను ఒప్పిస్తారా?’ అని అడిగాడు. ఈయన సరేనని వాళ్లను ఒప్పించిందాకా వుండి అమ్మనన్నాడు. ఇలా మూడు సార్లు జరిగాక, మళ్లీ ఆఫర్‌తో వస్తే ‘నీ మాట నమ్మలేను. మీ బోర్డు సభ్యులందరినీ వెంటపెట్టుకుని వచ్చి, మా బోర్డు సభ్యులందరితో మాట్లాడి ఒప్పించమను’ అని కురియన్ చెప్పారు. అందరూ కూర్చుని చర్చించి రూ. 17 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు.

అయితే ఆ మర్నాడే మినూ ఓ మార్వాడీకి రూ.17 లక్షలకు అమ్మేశాడు. దొంగచాటుగా తను కొంత తీసుకున్నాడని వినికిడి. పోల్సన్ డైరక్టర్లు నిర్ఘాంతపోయి, కురియన్‌కు క్షమాపణ చెప్పారు. మినూ నుంచి కొన్న మార్వాడీ డెయిరీ నడపడానికి కొనలేదు. రియల్ ఎస్టేట్ వెంచర్ గానే దాన్ని చూశాడు. (వైజాగ్ జింక్ ఫ్యాక్టరీ కథా యిదేగా, రేపు వైజాగ్ స్టీల్ గతీ యింతే కావచ్చు). స్థలం స్వాధీనం చేసుకోగానే చేసిన మొదటి పని, గేటు దగ్గర వున్న పెస్తోంజీ శిలా విగ్రహాన్ని తీసి అవతల పారేయడం! ఈ వార్త విని పెస్తోంజీ అల్లుడు కురియన్‌కు చెపితే, ఆయన వెంటనే ఆ విగ్రహాన్ని తెప్పించి, ఎన్‌డిడిబి లైబ్రరీలో పెట్టించాడు. తర్వాత కొన్నాళ్లకు మినూ డబ్బంతా పోగొట్టుకున్నాడు. అలా పోల్సన్ కథ విషాదంగా ముగిసింది.

ఇదీ పోల్సన్ కథ. దీనికి తోడుగా యింకా కొన్ని కథలు చెప్పుకోవచ్చు. దీనిలో పరిచయమైన ఖురోడీ గురించి కాస్త చెప్పుకోవచ్చు. కురియన్ అప్పటికి బొంబాయి పాల కమీషనర్‍గా ఉన్న అతని దగ్గరకు వెళ్లి ‘మన గేదెలు చలికాలంలో రెట్టింపు పాలిస్తాయి. ఆ కాలంలో అదనంగా వచ్చిన పాలను ఎలా అమ్మాలాని చూస్తున్నాను. మీరు తీసుకుంటారా?’ అని అడిగారు. అతను ‘నాకు ఏడాది పొడుగునా డిమాండ్‍ ఒకేలా వుంటుంది. జనాలు చలికాలంలో ఎక్కువ పాలు తాగరు. నాకు అక్కరలేదు’ అన్నాడు. నిజానికి అతను చలికాలం కాక తక్కిన కాలాల్లో న్యూజిలాండ్‍ నుండి పాలపొడిని దిగుమతి చేసుకుని పాలగా మార్చి డిమాండ్‍ తట్టుకుంటున్నాడు. కనీసం చలికాలంలోనైనా దిగుమతి మానేసి, రైతుల నుండి పాలు తీసుకోవచ్చు కదా అంటే వినలేదు. ఇలా దిగుమతి చేసుకుంటూండడం వలన, న్యూజిలాండ్ ఎగుమతి దారుల నుంచి విదేశీ పర్యటనలు, కమిషన్లు వంటి లాభాలు దక్కేవి. ప్రభుత్వాధికారుల్లో చాలామంది పద్ధతి యిది.

అతని లాగానే కింది స్థాయి అధికారులు కూడా ప్రవర్తించారు. అమూల్ వంటి సహకార సంస్థను కూల్చి, ప్రయివేటు సంస్థలను ప్రోత్సహించడానికి సాబటేజ్‍ ప్రయత్నాలు కూడా చేశారు. కైరా రైతులు సప్లయి చేసిన పాలల్లో చచ్చిన యీగలు పడేసి యాగీ చేసేవారు. ‘ఆ యీగ యిలా యివ్వండి, దాని ఊపిరితిత్తుల్లో పాలు వెళ్లాయో లేదో చూస్తాను. బతికున్న యీగ తనంతట తాను పడిందో లేదో తేల్చేద్దాం.’ అనేవాడు కురియన్. వాళ్లు సమాధానం చెప్పకుండా తప్పించుకునేవారు. ఇంకోసారి వాళ్ల కెమిస్టులు ఎంత దారుణంగా చేశారంటే - ఫార్మాలిన్‍ అనే విషపదార్థాన్ని అమాయకులైన రైతుల కిచ్చి రహస్యంగా పాలల్లో కలిపించి, మళ్లీ వాళ్లే ఆ పాల గురించి ఫిర్యాదు చేసి దానిపై అల్లరి చేశారు. చలికాలంలో మిగిలిపోతున్న పాలు వృథా కాకుండా వుండాలంటే దాన్ని పాలపొడిగా మార్చి అమ్మాలి. అయితే గేదె పాలతో పాలపొడి చేయడం కష్టం. ఎలాగాని ఆలోచిస్తూ వుంటే 1956లో యూనిసెఫ్‍ ప్రతినిథి వచ్చి ‘మీరు ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి మేం ఋణసాయం చేస్తాం. వడ్డీతో కలిపి, ఒకటిన్నర రెట్లు ఐదేళ్లలో తీర్చేయాలి. పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి ఉచితంగా పాలు సరఫరా చేయాలి.’ అని ప్రతిపాదించాడు.

అప్పటి బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రి జీవరాజ్ మెహతా కురియన్‌తో యీ ప్రతిపాదన ఒప్పుకో అన్నారు. కానీ ఖురోడీ ఆమోదం వుంటే కానీ యునిసెఫ్ ఒప్పుకోదు. మీటింగులో అనుకున్నట్లుగానే ఖురోడీ అడ్డుపడి గేదెపాలనుండి తయారుచేయడం అసాధ్యమని విదేశీ నిపుణులు రాసిచ్చారని ఉత్తరాలు చూపించి ఆ ఆఫర్‍ను చెడగొట్టబోయాడు. అప్పుడు కురియన్‍ సహచరుడు, స్నేహితుడు, డెయిరీలో నిష్ణాతుడు, యీ యజ్ఞంలో భాగస్వామి అయిన హరిదాస్‍ దాలయ ‘నేను చేసి చూపిస్తాను’ అని ఛాలెంజ్ చేసి, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. విదేశీ సంస్థలేవైనా సరే, సాయం చేశాయంటే టెక్నాలజీకోసం మనను వాళ్లపై ఎల్లకాలం ఆధారపడేట్లుగా  చేసుకుంటాయి. యునిసెఫ్ వాళ్లు ‘మీ పాలపొడి తయారు చేసే ఫ్యాక్టరీని మేం డచ్ దేశపు ఓల్మా కంపెనీని విరాళంగా సేకరించి యిస్తాం. మీరు అదే వాడుకోవాలి.’ అని షరతు పెట్టారు.

డచ్ వాళ్లకు ఇండియాలో సర్వీసింగ్ యూనిట్ లేదు. రేపు ఆ యంత్రాలలో ఏదైనా యిబ్బంది వస్తే, డచ్ వాళ్లు వచ్చి రిపేరు చేసేదాకా వీళ్లు చేతులు ముడుచుకుని కూర్చోవాలి. అందుకని ‘ఇక్కడ ఎల్ అండ్ టి వాళ్ల ఫ్యాక్టరీ వుంది. దాన్ని మాకు అనువుగా మార్చి వాడుకుంటాం. అది యిప్పించండి.’ అని కురియన్ యునిసెఫ్‌కు చెప్పారు. ‘మేం చెప్పినట్లు చేయకపోతే మీకు మా సహాయం అందదు.’ అంది యునిసెఫ్. అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ సెక్రటరీగా వున్న ఎచ్ ఎం పటేల్ (జనతా పార్టీ హయాంలో ఆర్థికమంత్రిగా చేశారు) కురియన్‌కు దన్నుగా నిలబడడంతో చివరకు యునిసెఫ్ లొంగివచ్చింది. 1954 నవంబరులో రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ఆ ఫ్యాక్టరీకి భూమి పూజ చేశారు. 1955 అక్టోబరు 31, పటేల్ పుట్టినరోజు నాడు ప్రధాని నెహ్రూ చేత ఫ్యాక్టరీ ప్రారంభింప చేయాలని కురియన్ సంకల్పించారు.

దాని కోసం శరవేగంగా పనిచేయాల్సి వచ్చింది. అప్పటికి బొంబాయి ముఖ్యమంత్రి అయిన మొరార్జీ దేశాయ్‍ తీసుకున్న శ్రద్ధ అంతా యింతా కాదు. 1955లో జవహర్‍లాల్‍ నెహ్రూ చేత ప్రారంభోత్సవం చేయించడానికి ఎంతో సాయం చేశారు. వీళ్లు దిగుమతి చేసుకున్న మెషినరీకై బాంబే పోర్టులో బెర్తులు లేకపోతే  వాళ్లతో మాట్లాడి బెర్తులు ఖాళీ చేయించారు. ప్రారంభోత్సవ సమయంలో ఖురోడీ అవాకులు, చెవాకులు మాట్లాడబోతే అతన్ని చొక్కా పట్టుకుని వెనక్కి లాగారు. అంతేకాదు, కురియన్‍ నిజాయితీని, సామర్థ్యాన్ని తొలి ప్రధాని జవహర్‍లాల్‍ దృష్టికి తీసుకెళ్లారు. కురియన్‍ను తీసుకెళ్లి ‘ప్రపంచంలోనే గేదె పాలనుండి పాలపొడి తయారుచేసే మొదటి ఫ్యాక్టరీగా చేయడం యితని వల్లనే జరిగిందని చెప్పి గుర్తింపు లభించేట్లు చేశాడు. జవహర్‍లాల్‍ కురియన్‍ను కౌగలించుకుని  ‘నీలాటివాళ్లు ముందుకు దూసుకెళ్లి అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేస్తారు’ అన్నారు.

కురియన్‍ విదేశీయులను ఛాలెంజ్‍ చేసిన మరో సంఘటన వుంది. నెస్లే వాళ్లు కండెన్స్‌డ్ పాలు తయారు చేస్తామనే నెపంతో ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టి పాలే కాకుండా, పంచదార, టిన్‍కి కావల్సిన రేకులు సమస్తం దిగుమతి చేసుకునేవారు. దాని కారణంగా విలువైన ఫారిన్‍ ఎక్స్ఛేంజ్‍ నష్టపోయేవాళ్లం. అప్పటి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి మనూభాయ్‍ షా, కురియన్‍ను పిలిచి ’నువ్వు స్విజర్లండ్‍ వెళ్లి వాళ్లతో మాట్లాడిరా‘ అని పంపించాడు. అక్కడ నెస్లే వాళ్లతో చాలా సేపు చర్చించి ’మీ నిపుణులతో ఫ్యాక్టరీ పెట్టండి. కానీ ఐదేళ్లలో స్థానికులకు నేర్పి వెళ్లిపోండి‘ అన్నాడు కురియన్‍. ’ఇది చాలా డెలికేట్‍ ప్రాసెస్‍. స్థానికులు ఎప్పటికీ నేర్చుకోలేరు’ అన్నాడు నెస్లే మేనేజింగ్‍ డైరక్టర్‍. కురియన్‍ వెంటనే బల్ల గుద్ది ఛాలెంజ్‍ చేసి వచ్చేశాడు. రెండేళ్లు తిరక్కుండా ఇక్కడే కండెన్‍స్‍డ్‍ పాలు తయారు చేసి చూపించాడు. వెంటనే మనూభాయ్‍ షా వాటి దిగుమతిని నిలిపివేశాడు. దెబ్బకి నెస్లే వాళ్లు దిగివచ్చి క్షమాపణ చెపుతూ మంత్రి వద్దకు వచ్చారు. ‘కురియన్‍ అనుమతిస్తేనే మీకు అపాయింట్‍మెంట్‍ యిస్తానన్నాడు’ మనూభాయ్‍ షా! ఈరోజుల్లో యిలాటి మంత్రులున్నారంటారా!?

అలాగే ఆర్థికమంత్రి టిటి కృష్ణమాచారి గురించి చెప్పుకోవాలి. ఆయనకు అమూల్‍ ప్రాజెక్టు బాగా నచ్చింది. అమూల్‍ వెన్న ఇంపోర్టెడ్‍ వెన్నతో పోటీ పడలేక పోతుంటే కురియన్‍ కోరిక మేరకు వెన్న దిగుమతులపై 25% కోత విధిస్తూ ఆదేశాలిచ్చాడు. వీళ్ల వెన్న పెరుగుతున్న కొద్దీ ఆయన దిగుమతులకు మరింత కోత పెడుతూ వచ్చాడు. చివరకు ఏడాది తర్వాత మొత్తం దిగుమతులను నిషేధిస్తూ ఆర్డరేసి కురియన్‍తో దేశంలో వెన్నకు కొరత రాకుండా చూసుకోండి మరి అని చెప్పారు. చైనా దిగుమతులను యిష్టం వచ్చినట్టు అనుమతిస్తున్న యీ ప్రభుత్వాలకు, ఆ ప్రభుత్వాలకు పోలిక వుందంటారా? టిటికెకు వ్యాపారాలున్నాయి కాబట్టి అమూల్‍కు ఇలా ఫేవర్‍ చేశాడనుకోకండి. ఆయనకు తెలియకుండా ఆయన కంపెనీని అమూల్‍కు డిస్ట్రిబ్యూటర్‍గా కురియన్‍ నియమిస్తే 24 గంటల్లో డిస్ట్రిబ్యూషన్‍ కాన్సిల్‍ చేయించాడాయన!

టిటికె లాగానే చెప్పుకోవలసిన యింకో మంత్రి సి. సుబ్రహ్మణ్యం. అప్పట్లో అంటే 1964లో ఆయన కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి. ఢిల్లీలో పాలు సరఫరా చేసే డిఎంయస్‍ నానారకాలుగా భ్రష్టు పట్టిపోతే దాన్ని సరిచేయడానికి కురియన్‍ను పిలిచాడు. ‘ఏడుగురు సహచరులతో కలిసి ఆరువారాల్లో సరిచేస్తాను, కానీ మీరు నాకివ్వగలిగే అధికారాలు ఏమిటి?’ అని అడిగాడు కురియన్‍. ‘ఇద్దరు మంత్రుల అధికారాలు మీకిస్తున్నాను. ఒకటి నాదీ, రెండోది ఆర్థికమంత్రిదీ’ అన్నాడు సుబ్రహ్మణ్యం తొణక్కుండా. అలాగే యిచ్చాడు. కురియన్‍ అన్నంత పనీ చేసి చూపాడు. అలాటి నిర్ణయాలు తీసుకోగలిగే మంత్రులు యిప్పుడున్నారా? ఉంటే ఎంటప్రెనార్‍ల బతుకు యింత దారుణంగా వుండేది కాదు.

వైబి చవాన్‍ మహారాష్ట్ర డిప్యూటీ మంత్రిగా వుండే రోజుల్లో ఆయన ఆనంద్‍కి వచ్చి చూశాడు. కురియన్‍ను ఉత్సాహపరచి వెళ్లిపోయాడు. తర్వాత ముఖ్యమంత్రి అయిన వెంటనే గుర్తు పెట్టుకుని కురియన్‍ను పిలిచి ’ఇప్పుడు చెప్పు, ఏం చేయాలో‘ అని అడిగాడు. ఇప్పుడు మన మంత్రులను సహాయం అడిగితే ‘అంతా పెద్దాయనే (సిఎం) చూసుకుంటున్నారు సార్‍, మనదేం లేదు’ అని తప్పించుకుంటారు తప్ప ఈ రోజు విషయమేమిటో తెలుసుకుంటే భవిష్యత్తులోనైనా సహాయం చేయగలమేమో అనుకోరు. అమూల్ ఉద్యమానికి యిలా మద్దతిచ్చిన మరి కొందరు నాయకుల గురించి మరోసారి చెప్తాను. ముఖ్యంగా లాల్ బహదూర్ శాస్త్రి గురించి తెలుసుకుని తీరాలి. (సశేషం)

ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2021) 

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?