cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: కురియన్‌కు సాయపడిన నాయకులు

ఎమ్బీయస్: కురియన్‌కు సాయపడిన నాయకులు

కురియన్‌పై యిది చివరి ఆర్టికల్. విషయంలోకి వెళ్లేముందు ఒక డిస్‌క్లయిమర్ యివ్వాలి. ప్రస్తుతం ఆంధ్ర ప్రభుత్వం అమూల్‌తో ‘కుమ్మక్కు’ అవుతున్న సందర్భానికి, యీ వ్యాసపరంపరకు సంబంధం లేదు. పాఠకులు చాలామంది నాకు మెయిల్స్ రాస్తారు. మంచి పుస్తకాల జాబితా పంపండి. కొని చదువుతాం, మా పిల్లల చేత చదివిస్తాం అని. వాళ్ల టేస్టు ఏమిటో తెలియకుండా సూచించలేం కదా, అదీకాక ప్రతీవాళ్లకు జాబితా పంపడం నా తరమా? అందుకని గత ఏడాదిగా పాఠకుల చేత పుస్తకాలు కొనిపించాలనే ఉద్దేశంతో, కొన్ని అంశాలను పరిచయం చేసి, యిది ఫలానా పుస్తకంలోంచి తీసుకున్నాను అని రాస్తున్నాను. ఆసక్తి కలిగిస్తే కొని చదువుతారని ఆశ. జీవితగాథలను పరిచయం చేస్తే యువతలో, మధ్యవయస్కులలో నిరాశ తొలగుతుంది కదాన్న ఉద్దేశం కూడా వుంది. కురియన్ ఆత్మకథను పరిచయం చేయాలని మూణ్నెళ్లగా అనుకుంటూ వచ్చాను.

ఇది కురియన్ శతజయంతి కావడం కూడా కలిసివచ్చింది. నిజానికి శతజయంతి వ్యాసాలు రాయవలసిన మహానుభావులు చాలామందే వున్నారు. సాహిర్ లుధియాన్వీ, సత్యజిత్ రాయ్, పివి, ఆర్ కె లక్ష్మణ్.. యిలాటి లిస్టు పెట్టుకున్నాను. అందుకని యీ ఆత్మకథ పరిచయం మొదలుపెట్టాను. సరిగ్గా ఆంధ్రలో డెయిరీ వివాదం వచ్చింది. సంగం డెయిరీ నిర్వహణలో తప్పొప్పుల గురించి నాకు తెలియదు. కానీ దాన్ని స్వాధీనం చేసుకునే విధానంలో మాత్రం దురుద్దేశం కనబడుతోంది. స్కాము జరిగివుంటే, విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలి. కెసియార్ ఈటల విషయంలో చేసినట్లు హడావుడిగా చేయడంలో కుట్ర కనబడుతోంది. పైగా కంపెనీ యాక్టు కింద రిజిస్టర్ అయినదాన్ని ప్రభుత్వం ఎలా హస్తగతం చేసుకోగలదో నాకు అర్థం కాలేదు. ఆ కోపరేటివ్ సంస్థను కంపెనీగా మార్చగలడం, దాన్ని ప్రభుత్వం తీసేసుకోవడం వగైరా చట్టాల గురించి, సంగంపై ఆరోపణల గురించి విస్తారంగా చదివితే తప్ప ఏ నిర్ణయానికీ రాలేను.

నిన్ననే మరో న్యూస్ – ఎపి డెయిరీని అమూల్‌కు కారుచౌకగా లీజుకి యిచ్చేస్తున్నారని! ఎందుకు? వైజాగ్ స్టీలు ప్లాంటును కారుచౌకగా కేంద్రం అమ్మేస్తోందని గగ్గోలు పెట్టేవాళ్లు మరి యిదెలా చేయగలుగుతారు? దీనికి ప్రభుత్వం యిచ్చే వివరణ ఏమిటి? టెండర్లు పిలిచారా? అమూల్‌కే ఎందుకు యివ్వాలి? ఇంకా నయం అదానీకి యివ్వలేదు, ఏదో ఒక సహకారసంస్థకే యిచ్చారు. కానీ యితర రాష్ట్రాల కంటె చాలా తక్కువ ధరకి యిస్తున్నారట. వచ్చిన చిక్కేమిటంటే యిరుపక్షాల నుంచి వింటే తప్ప మనకు పూర్తి అవగాహన రాదు. నేను యిది రాస్తున్నది, కురియన్ గురించి, ఆయనకు తోడ్పడిన మహానుభావుల గురించి తెలియపరచడానికే. అమూల్‌ను కాన్వాస్ చేయడానికి కాదు. ప్రస్తుతం అమూల్ నిర్వహణ ఎలా వుందో నాకు తెలియదు. ఆంధ్రలో డెయిరీల నిర్వహణ గురించి, పశువులు, పాడి గురించీ తెలియదు. కురియన్ ఎడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్, ధైర్యం యివే నన్ను మెప్పించాయి. వాటి గురించే మాట్లాడుతున్నాను. ఆయన నిజాయితీని చూసి, దన్నుగా నిలిచిన నాయకులను స్మరిస్తున్నాను.

నెహ్రూ తర్వాత లాల్‍ బహాదూర్‍ శాస్త్రి ప్రధాని అయ్యారు. ఆక్స్‌ఫాం వాళ్ల సహాయంతో కైరా యూనియన్ కొత్తగా కట్టిన పశువుల దాణా ఫ్యాక్టరీని 1964 అక్టోబరు 31న ప్రారంభించడానికి ఆయన ఆనంద్ వస్తానన్నారు. అయితే ఒక రోజు ముందే వస్తానని, ఆ రాత్రి ఏదైనా గ్రామంలో రైతు యింట్లో అతిథిగా వుంటానని ముఖ్యమంత్రి బలవంతరాయ్ మెహతాకు చెప్పారు. అలా వుంటే సెక్యూరిటీ సమస్య వస్తుందని వీళ్లందరి భయం. చివరకు ఎవరికీ ముందుగా చెప్పకుండా (ఆతిథ్యమిస్తున్న రైతుకి ఎవరో విదేశీయులు వస్తున్నారని చెప్పారు) చీకటి పడే వేళకి ఆయనను ఓ కుగ్రామంలో ఓ రైతు యింటికి తీసుకుపోయారు. శాస్త్రిగారని ఆఖరి క్షణంలో తెలిసి ఆ రైతు నిర్ఘాంతపోయాడు. ‘విదేశీయులు మన తిండి తినరు కదాని ఏమీ వండించలేదు. ఇప్పుడెలా?’ అని మథన పడిపోయాడు. కానీ శాస్త్రిగారు అతని కుటుంబసభ్యులతో కలిసి సాధారణమైన భోజనమే చేశారు.

ఆ తర్వాత గ్రామమంతా కాలినడకన తిరిగారు. గ్రామస్తుల యిళ్లలోకి వెళ్లి, వివరంగా మాట్లాడారు. స్త్రీలు ఏం చేస్తూంటారు, సొంత గేదెలు వున్నాయా, డబ్బెంత వస్తోంది, కోపరేటివ్‌లో ఎందుకు చేరారు, ఉత్పత్తి పెంచడం గురించి ఎవరైనా సలహాలిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. తర్వాత హరిజనవాడకు వెళ్లి వాకబు చేశారు. తెల్లవారుఝామున 2 గంటల వరకు మాట్లాడుతూ వుండి, పొద్దున్నే లేచి మర్నాటి ఆవిష్కరణ కార్యక్రమం హాజరయ్యారు. తర్వాత కురియన్ ఇంటికి వచ్చి ‘‘రెండవ, మూడన పంచవర్ష ప్రణాళికల్లో మనం ప్రభుత్వరంగంలో చాలా డెయిరీలను నిర్మించాం. కానీ అవి ధ్వంసమయ్యాయి. మీ అమూల్ మాత్రం విజయం సాధిస్తోంది. దీని కిటుకేమిటో తెలుసుకుందామని నిన్న రాత్రి ప్రయత్నించాను. ఇక్కడి నేల మా గంగాతీర ప్రాంతాల కన్నా గొప్పదేం కాదు, వాతావరణంలో కానీ, వర్షాపాతంలో కానీ, పచ్చదనంలో కానీ ఏ ప్రత్యేకతా లేదు. మీ గేదెలు, మా ఉత్తరప్రదేశ్ గేదెలంత బాగా లేవు. మావి పాలు ఎక్కువిస్తాయి కూడా. మీ రైతులు పంజాబ్ రైతులంత కష్టజీవులు కాదు. మరి మీ విజయరహస్యం ఏమిటి?’ అని అడిగారు.

‘ఒకటే తేడా. అమూల్ డెయిరీ రైతుల సొంతం. రైతుల ప్రతినిథులే దాన్ని నిర్వహిస్తున్నారు. వృత్తి నైపుణ్యం వున్న నన్ను మేనేజరుగా పెట్టుకున్నారు. అభివృద్ధి చెందిన దేశాలన్నిటిలోనూ డెయిరీలు రైతుల సొంతం. పెట్టుబడిదారీ విధానానికి రాజధాని అయిన అమెరికాలో 85శాతం పాడి పరిశ్రమ సహకార రంగంగానే వుంది. పశ్చిమ జర్మనీలో 95శాతం న్యూజిలాండ్, డెన్మార్క్, హాలండ్ దేశాల్లో అయితే నూటికి నూరు శాతం సహకారరంగంలోనే వుంది. వాళ్లకు సాధ్యమైనది ఇండియాలో కూడా సాధ్యమౌతుంది అని అమూల్ ద్వారా చేసి చూపించాం.’ అని చెప్పారు. దానికి శాస్త్రీజీ ‘నాకు అర్థమైనదేమిటంటే గుజరాత్‌లో మాత్రమే ఆనంద్ వుండటానికి ప్రత్యేక కారణాలు లేవు. దేశంలో చాలా ఆనంద్‌లు వుండవచ్చు. దేశమంతా పెట్టండి. మీరే దానికి అధిపతిగా వుండాలి. ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుంది.’ అన్నారు.

కురియన్ ‘జాతీయ సంస్థ పెట్టినా దాని హెడాఫీసు దిల్లీలో వుంటే ఒప్పుకోను. ఆనంద్‌లోనే పెడితేనే నేను యీ ఆఫర్‌కి ఒప్పుకుంటాను. నేను ప్రభుత్వోద్యోగిగా వుండను. రైతుల ఉద్యోగిగానే వుంటాను.’ అని షరతులు పెట్టారు. శాస్త్రీజీ ఒప్పుకున్నారు. దాని ఫలితమే నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డిడిబి) ఆవిర్భావం. ప్రభుత్వంలోని వ్యవసాయ శాఖలోని డెయిరీ విభాగం దీని ఏర్పాటును ఎంతగా వ్యతిరేకించిందో అది వేరే కథ. కానీ శాస్త్రీజీ ఉదంతం చదివినప్పుడు నాకు కళ్లలో నీళ్లు వచ్చాయి. ఒక ప్రధాని అంత సింపుల్‌గా గ్రామీణులతో కలిసిపోయి తిరగడం, లోతుగా అధ్యయనం చేయడం, దేశమంతటా అలాటి ప్రయోగం జరగాలని తపించడం – యివన్నీ కదిలించాయి. ఇప్పటి నాయకులూ గ్రామాల్లో తిరుగుతారు, వాళ్లిళ్లలో భోజనాలు చేస్తారు. అంతా ఎన్నికల ప్రచారంలో భాగంగానే జరుగుతుంది. పబ్లిసిటీ కోసం మీడియాను వెంటపెట్టుకుని వెళతారు. అధికారంలోకి వచ్చాక అటు చూడరు.

శాస్త్రీజీ తర్వాత ప్రధాని ఐన ఇందిరాగాంధీ గురించి – 1970లో వ్యవసాయ మంత్రిగా వున్న జగ్‍జీవన్‍రామ్‍ కురియన్‍ను పిలిచి తన నియోజకవర్గంలో ఓ ప్రైవేటు డెయిరీని పెట్టాలని రిక్వెస్టు చేశాడు. కోపరేటివ్‍ డెయిరీ కాకపోతే ముట్టనని ఈయన అతి బ్లంట్‍గా చెప్పాడు. దాంతో కసి పెట్టుకుని జగ్‍జీవన్‍రామ్‍ కొన్నాళ్ల తర్వాత ఈయన్ని ఐడిసి చైర్మన్‍ పదవిలోంచి తప్పించడానికి నోట్‍ పెట్టాడు. ఈయన ఇందిరాగాంధీ దృష్టికి తెచ్చాడు. ఆవిడ వెంటనే ‘కురియన్‍ జోలికి పోవద్దు’ అని జగ్‍జీవన్‍కి మెసేజ్‍ పంపింది. 1983లో వ్యవసాయ మంత్రి రావు బీరేంద్రసింగ్‍ని ఎన్‍డిడిబి వ్యవహారాల్లో తలదూర్చి యిబ్బంది పెడుతూంటే, కురియన్‌ వెళ్లి ఇందిరతో ఫిర్యాదు చేశారు. వెంటనే ఇందిర ఫోన్ తీసి మంత్రితో ‘‘కురియన్‌ను ఆయన మానాన ఆయన్ని వదిలేయండి.’’అని చెప్పింది. కానీ ఆయన వినకుండా వేధిస్తూండడంతో కురియన్ మళ్లీ వెళ్లి ఇందిరను కలిశారు. ఈయన చెప్పినదంతా ఆవిడ విని ‘‘అయితే ఆయన్ని తీసేస్తాను.’’ అంది. అతన్ని మంత్రి పదవి నుండి తొలగించి కురియన్‍ మార్గం సుగమం చేసింది కూడా!

ఆ తర్వాత వచ్చిన మొరార్జీ దేశాయ్‍ ఈయనకు మొదటినుండీ శ్రేయోభిలాషే. ఆపరేషన్‍ ఫ్లడ్‍ రెండవ దశ ప్రారంభించడానికి ప్రభుత్వం నుండి అనుమతులు రాలేదు. కురియన్‍ రాశారు - ‘నేను ఫైలు తీసుకుని ఓ సెక్రటరీతో డిస్కస్‍ చేశాక అతను ప్రభుత్వం యి విషయం చూస్తుంది అంటాడు. ప్రభుత్వం అంటే ఎవరు? అంటే మంత్రి అంటాడు. మంత్రి వద్దకు వెళితే ఆయన ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి అంటాడు. ప్రధానమంత్రిని అడిగితే ప్రభుత్వం అంటే కాబినెట్‍ అంటాడు. దీని బట్టి తెలిసేదేమిటంటే ప్రభుత్వం చూస్తుంది అంటే దాని అర్థం ఎవరూ చూడరు అని. ఎవరూ నిర్ణయం తీసుకోరు, అందరూ ఫైలుని పక్క టేబుల్‍కు తోసేవారే.’ అని. ఇలా ఏడాది గడిచాక ఈ దశలో కురియన్‍ అప్పటి ప్రధాని మొరార్జీదేశాయ్‍ను కలిశారు. ఆయన వెంటనే ఎన్‍డిడిబి వ్యవహారాలు చూడడానికి సెక్రటరీల కమిటీ ఏర్పాటు చేసి  సమస్య పరిష్కరించారు. దానివల్ల ఆపరేషన్‍ ఫ్లడ్‍ రెండో దశ 1981లో ప్రారంభమై 1985లో పూర్తయింది.

మొరార్జీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వున్న ఎచ్. ఎం. పటేల్ కూడా అమూల్‌కు హితుడే. వెజిటబుల్ ఆయిల్ విపరీతంగా దిగుమతి చేసుకోవడం వలన విలువైన విదేశీ మారకద్రవ్యం వృథా అవుతోంది కాబట్టి అమూల్‍ ప్రయోగం వంటనూనెల విషయంలో కూడా చేయమని కురియన్‌ను అడిగారు. కురియన్‍ దానిపై కూడా దృష్టి సారించి 1979లో ‘ధారా’ బ్రాండ్‍ను సృష్టించారు. కానీ అది అమూల్‍ అంత సక్సెస్‍ కాకపోవడానికి కారణం దళారీల చాకచక్యమే అంటారు కురియన్. ఉత్పాదన చేయడం కంటె దిగుమతి, అమ్మకం వ్యాపారంలో ఎక్కువ లాభాలు గడించడానికి అలవాటు పడ్డారు వాళ్లు. కావాలంటే వాళ్లు సరుకుని ఎన్నాళ్లయినా దాచి వుంచగలరు. కానీ పాల విషయంలో అలా దాచితే పాలు పాడయిపోతాయి. అందువల్ల అమూల్‍ విషయంలో వాళ్ల ఆటలు సాగలేదు, ‘ధారా’ విషయంలో సాగాయి. ధారా ఉద్యోగులపై నూనె లాబీ వాళ్లు దాడులు చేశారు. భావనగర్‌లోని వాళ్ల నూనె మిల్లుని ఏడు సందర్భాల్లో దగ్ధం చేశారు.

తర్వాతి ప్రధాని రాజీవ్‍ గాంధీ గురించి కురియన్‍ రాస్తూ ‘ఆయన మంచివాడే కానీ చుట్టూ అవినీతి పరులైన మంత్రులున్నారు’ అని అంటారు. అలాటివాళ్లలో అప్పటి పౌరసరఫరాల మంత్రి ఒకడు. దిగుమతి చేసుకున్న 27 వేల టన్నుల వంటనూనెను ప్రవేటు వ్యాపారస్తులకు సగం ధరకే అమ్మేద్దామని చూస్తున్నాడతను. ఆ విషయం తెలిసి కురియన్‍ రాజీవ్‍ గాంధీకి చెప్పారు. మా ‘ధారా’ వాళ్లం పూర్తి ధరకే కొంటాం అన్నాడు. రాజీవ్‍ గాంధీ ఈయన ఎదుటే మంత్రిని మందలించారు. తర్వాత కొన్నాళ్లకి ‘నేను నా నియోజకవర్గ ప్రజలకు సాయపడాలని ఓ పారిశ్రామిక వేత్త చేత రూ. 100 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ పెట్టిస్తే దానిలోని 2 వేల ఉద్యోగాల్లో 1980 ఉద్యోగాలు బయటివాళ్లకు వెళ్లాయి. మా వాళ్లకి చదువు తక్కువగా వుండడంతో స్వీపర్ ఉద్యోగాలే దక్కాయి. మీరు మరో ఆనంద్ అక్కడ పెడితే వాళ్లు బాగుపడతారు. దానికి చదువుతో సంబంధం లేదు కదా!’ అన్నారు. పాలసహకార సంఘాలు పెట్టి వాటిని నిర్మిస్తూ వస్తే తప్ప రాత్రికి రాత్రి ఆనంద్ తయారవ్వదని కురియన్ చెపితే రాజీవ్ మీ యిష్టం వచ్చినట్లు చేయండి అని కోరారు. రాయబరేలీలో సహకార ‌డెయిరీ మొదలుపెట్టినపుడు రాజీవ్ హత్యకు గురయ్యారు. తర్వాత అది పూర్తి కావడానికి సోనియా సహకరించారు.

పివి నరసింహారావు ప్రధానిగా వుండగా కురియన్‌ను పిలిచి ‘శ్రీలంక ప్రభుత్వం, 51 శాతం వాటాతో ఎన్‌డిడిబి కలిసి కిరియా పాలప్రాజెక్టు పెట్టండి’ అని అడిగారు. అప్పటిదాకా అక్కడ మోనోపలీ సాగిస్తున్న నెస్లే శ్రీలంక మంత్రుల ద్వారా దీనికి అడ్డుపడడంతో కిరియా ప్రాజెక్టు నడవలేదు. న్యూజిలాండ్‌కు అమూల్ తన ఉత్పత్తులను ఎగుమతి ప్రారంభించినప్పుడు ఆ దేశానికి కోపం వచ్చింది. ‘మేం ఎగుమతి చేస్తున్న దేశాల్లో మీరు పోటీ పడడమే కాక, మా దేశానికి కూడా వస్తారా?’ అంటూ న్యూజిలాండ్ హై కమిషనర్ కురియన్‌ను తిట్టింది. దానికి కురియన్ దీటుగా సమాధానమిచ్చారు. ఇలా కురియన్‍ చివరివరకూ తన పోరాటాన్ని సాగిస్తూనే వున్నాడు. పద్మశ్రీ మొదలుకుని పద్మవిభూషణ్‍ వరకు అన్నీ యిచ్చినా తన ధోరణి మార్చుకోలేదు. ఐఐఎంల్లో వాళ్లు విదేశీ కంపెనీలకు అనుకూలంగా వుంటున్నారంటూ గ్రామీణ ప్రాంతాలపై అవగాహన పెంచే రూరల్‍ మేనేజ్‍మెంట్‍ ఇన్‍స్టిట్యూట్‍ ఆనంద్‍లో పెట్టించాడు.

కురియన్‍ సేవలు పక్కదేశాల వాళ్లుకూడా వినియోగించుకోవాలని చూశారు. కానీ పాకిస్తాన్‍, శ్రీలంక ఎక్కడ చూసినా బహుళజాతి కంపెనీలు స్థానిక రాజకీయ నాయకులను డబ్బుతో కొనేసాయంటాడాయన. రష్యాలో పరిస్థితులు ఆనంద్‍ కంటె మెరుగ్గా లేవంటాడు. తనింతటివాడు కావడానికి త్రిభువన్‍ దాస్‍ వంటి నిజాయితీ పరుడైన ప్రజానాయకుడే కారణమంటాడు. అలాటి నాయకులు కావాలని ఆశిస్తాడు. సాంకేతిక విషయాలను అర్థం చేసుకునే నాయకులు కావాలని, ప్రజలను కలుపుకుని పోగల అడ్మినిస్ట్రేషన్‍ వుండాలని కల గంటాం మనందరం. ఈ పుస్తకంలో సహకరించిన అధికారుల గురించి, అవరోధాలు సృష్టించిన అధికారుల గురించి కూడా రాశారాయన.

కురియన్‍ విజయం వెనుక సహకార వ్యవస్థపై నమ్మకంతో దాన్ని విజయపథంలో నడిపాడు. అమూల్‍ అనే పాలచుక్కను పాల వెల్లువ చేశాడు. ఆ సూత్రాన్ని యితర రంగాలకు విస్తరించాడు. దేశానికి సంపద సృష్టించి, ఆ సంపదను పదిమందికీ పంచి, వ్యక్తిగతంగా సంపదను పోగేసుకోవడం హీనం అన్నాడు.

కురియన్‍ చేసిందేమిటి, గొప్ప? కొంతమంది రైతులనుండి పాలు సేకరించి దాన్ని తెలివిగా మార్కెట్‍ చేయడం మాత్రమే అనుకుంటే పొరబాటు. ఆనంద్‍ జిల్లాలో పాలసహకారోద్యమం బలపడిన కొద్దీ మల్టిప్లయర్‍ ఎఫెక్టు ద్వారా సాంఘికపరమైన ఎన్నో మార్పులు వచ్చాయి. పాలసేకరణ కేంద్రంలో ఎటువంటి జాతి, కుల, లింగ వివక్షత లేకుండా అందర్నీ క్యూలో నిలబెట్టడం ద్వారా మనమంతా ఒకటే అనే స్పృహ కలిగింది వారికి. ఆదాయం పెరిగే క్రమంలో పాడియావుల పెంపకం స్త్రీలపరమై ఆమె భర్తతో సమానంగా సంపాదించి ఒకపాటి సమానతను సాధించింది. అమూల్‍ ఫ్యాక్టరీలో పశువులను సందర్శించిన స్త్రీలకు గర్భధారణ పట్ల, అప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల పట్ల అవగాహన పెరిగింది. తమ గ్రామంలో వున్న పాలసేకరణ కేంద్రంలోని శుచిశుభ్రతలు వారిని ఆరోగ్యం పట్ల ఆలోచించేట్లా చేశాయి. అమూల్‍ నియమించిన పశువైద్యుల అంకితభావాన్ని చూసిన గ్రామీణులు తమకు కూడా అటువంటి వైద్యసదుపాయాలు కావాలని డిమాండ్‍ చేశారు. దాంతో అమూల్‍ వాళ్లు త్రిభువన్‍దాస్‍ ఫౌండేషన్‍ స్థాపించ వలసి వచ్చింది.

ఈ పుస్తకానికి కురియన్‍ పెట్టిన పేరు ‘నాకూ వుంది ఒక కల’. ఇది నిద్రపోతే వచ్చే కల కాదు. నిద్రపట్టనివ్వని కల. చదివినంతసేపూ ఒక ఉద్వేగానికి లోనవుతాం. ఆయన జీవితం ఉత్తేజభరితమే కాదు, చెప్పిన తీరు కూడా ఉత్సాహభరితమే. అనువాదం అని ఏ కోశానా అనిపించదు. అత్తలూరి నరసింహారావుగారు స్వయానా రచయిత కావడం వలన యిది స్వతంత్ర రచన అనిపించేట్లు రాశారు. వారితో బాటు వారి సహఅనువాదకులు తుమ్మల పద్మినిగారు కూడా! 

ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం. చదివి వూరుకోకూడదు. ఏదో ఒకటి చేయాలి. దేశం కోసం, సాటి మనిషి కోసం, మన కోసం. సహకార వ్యవస్థలోనే సామరస్యం వుందని, గ్లోబలైజేషన్‍ను ఎదుర్కొనే మహత్తర ఆయుధం అదేననీ మనం గ్రహించడానికైనా చదవాలి. (సమాప్తం) (ఫోటో లాల్ బహదూర్ శాస్త్రితో కురియన్)

ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2021) 

లవ్ స్టొరీ లకు ఇక గుడ్ బై

వైఎస్సార్ కారు నడిపాను

 


×