Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: లక్క ఇల్లు – కథ, సినిమా

ఎమ్బీయస్: లక్క ఇల్లు – కథ, సినిమా

మనం మన పురాణాల గురించి గొప్పగా చెప్పుకుంటాం కానీ చదవం. కామిక్స్ చదివేసి, పౌరాణిక నాటకాలు, సినిమాలు చూసేసి, ఒక అభిప్రాయం ఏర్పరచుకుని, అదే నిజమనుకుంటాం తప్ప ఒరిజినల్‌గా వాల్మీకి ఏం రాశాడు, వ్యాసుడు ఏం రాశాడు, వాటి ఆంధ్రానువాదాల్లో ఎలాటి మార్పులు జరిగేయి అనేది తరచి చూడం. ఈ లోటును సరిదిద్దడానికి ప్రసిద్ధ ప్రవచనకర్త సామవేదం షణ్ముఖశర్మగారు 2015లో 18 రోజుల పాటు ‘మహాభారత ప్రవచనం’ చేశారు. 

దానికి ప్రముఖ జర్నలిస్టు, అనువాదకుడు (రాజీవ్ హత్యపై కార్తికేయన్ పుస్తకాన్ని అనువదించినది యీయనే) శ్రీ గుండు వల్లీశ్వర్ గారు అక్షరరూపాన్నివ్వగా ఋషిపీఠం ప్రచురణలు ‘ఇదీ యథార్థ మహాభారతం’ పేర 2020 ఆగస్టులో పుస్తకంగా (వెల రూ.400) వెలువరించారు. నెలకే పునర్ముద్రణకు వచ్చింది. దానిలో లక్క ఇల్లు ఉదంతం గురించి చదివితే ‘‘శ్రీకృష్ణపాండవీయం’’ సినిమాలో ఎంతలా మార్చేశారో తెలుస్తుంది.

ధృతరాష్ట్రుడు పాండవులను ఎందుకు చంపిద్దామనుకున్నాడో తెలుసుకోవాలంటే కాస్త నేపథ్యం తెలియాలి. అక్కడక్కడ ఏవైనా సందేహాలున్నాయేమోనని కథ చెప్పేస్తున్నా. శంతనరాజుకి గంగ వలన భీష్ముడు (అసలు పేరు దేవవ్రతుడు) కలిగాడు. గంగ వెళ్లిపోయాక అతను సత్యవతిని పెళ్లాడతానంటే ఆమె తండ్రి దాశరాజు ‘మా అమ్మాయికి పుట్టిన వాడే రాజు కావాలి.’ అనే షరతు పెట్టాడు. ‘నేను యువరాజునే అయినా, ఆమెకు పుట్టినవాడే రాజవుతాడు’ అని భీష్ముడు మాట యిచ్చినా ‘మరి నీ సంతానమో..’ అని దాశరాజు సంశయిస్తే ‘అయితే నేను బ్రహ్మచర్యం అవలంబిస్తాను.’ అన్నాడు భీష్ముడు. అప్పణ్నుంచే అతని కా పేరు వచ్చింది. 

సత్యవతికి శంతనుని చేత విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు అనే యిద్దరు కొడుకులు కలిగారు. చిత్రాంగదుడు అదే పేరు కలిగిన గంధర్వుడి చేతిలో మరణించాడు. విచిత్రవీర్యుడికి అంబిక, అంబాలికలతో పెళ్లయింది. పిల్లలు పుట్టే ముందే క్షయ వ్యాధితో మరణించాడు.

వారసుడు లేకపోతే అరాచకం కలుగుతుంది కాబట్టి వంశం నిలపడానికి సత్యవతి, భీష్ముడు ఒక ఆలోచన చేశారు. గుణవంతుడైన బ్రాహ్మణుడి ద్వారా విచిత్రవీర్యుని క్షేత్రంలో (అంటే అతని భార్యలలో) సంతానాన్ని పొందితే, వాళ్లు విచిత్రవీర్యుడి సంతానమే అవుతారు. ఇక్కడే శర్మగారు మనుస్మృతిలో చెప్పిన దేవరోత్పత్తిని ప్రస్తావించారు. సంతానక్షయం ఏర్పడితే, దేవరుని ద్వారా లేదా సపిండుని ద్వారా సంతానాన్ని పొందవచ్చు. ఈ నియోగధర్మం కేవలం సంతానార్థమే తప్ప భోగార్థం కాదు. 

తేజస్సు స్వీకరించాక స్త్రీ అతన్ని గురువుగానో, తండ్రిగానో భావించాలి తప్ప అతని పట్ల ఎలాంటి కాముకభావన కలిగి వుండరాదు. సత్యవతి తనకు పరాశరుడి ద్వారా కలిగిన వ్యాసుణ్ని స్మరించింది. ఆయన తల్లి ఆదేశాన్ని విని ‘‘తప్పకుండా చేస్తాను. కానీ యథాతథంగా నా నిజమైన తేజస్సుని భరించగల శక్తి వాళ్లకు కలగాలంటే ఒక ఏడాదిపాటు వ్రతం చేయాల్సి వుంటుంది.’ అని చెప్పాడు.

‘ఏడాది ఆగితే దేశంలో అరాచకం ప్రబలుతుంది. వెంటనే సంతానప్రాప్తి కావాలి.’ అంది సత్యవతి. ‘నా వికృతరూపాన్ని భరించగలిగితేనే అది సాధ్యపడుతుంది’ అన్నాడు వ్యాసుడు. పెద్ద కోడలు అంబిక వ్యాసుణ్ని చూసి భయపడి కళ్లు మూసుకుంది. అందువలన ధృతరాష్ట్రుడు పదివేల ఏనుగుల బలం కలవాడు, విద్వాంసుడు అయినా గుడ్డివాడుగా పుట్టాడు. రెండో కోడలు అంబాలిక వ్యాసుణ్ని చూసి పాలిపోవడంతో పాండురాజు పాండువర్ణంతో (పాండురోగంతో కాదు) పుట్టాడు. మూడో రోజు అంబికను మళ్లీ వెళ్లమంటే, ఆమె తన దాసిని పంపింది. ఆమె శుశ్రూషలు చేసి మెప్పించడంతో విదురుడు పుట్టాడు.

యుక్తవయసు వచ్చాక పాండురాజు పట్టాభిషిక్తుడయ్యాడు. అతన్ని పాంచాల దేశంలోని ఒక స్వయంవరంలో కుంతీదేవి వరించింది. కృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఆమె చెల్లెలవుతుంది. శూరసేనుడనే రాజు కుమార్తె. శూరసేనుడి మేనమామ కుంతిభోజుడికి దత్తత వెళ్లడంతో ఆమె పేరు పృథ నుంచి కుంతిగా మారింది. పాండురాజు మాద్రిరాజు కుమార్తె మాద్రిని కన్యాశుల్కం చెల్లించి పెళ్లి చేసుకున్నాడు. 

ఇక ధృతరాష్ట్రుడికి సుభానుడు అనే రాజు కుమార్తె గాంధారితో భీష్ముడు పెళ్లి కుదిర్చాడు. తండ్రి నీకు కాబోయే భర్త ఫలానా అని చెప్పగానే ‘నా భర్తలో వున్న లోపాన్ని నేను చూడకూడదు’ అనుకుని ఆమె ఒక బట్టను తెప్పించుకుని కళ్లకు కట్టుకుంది. ఇక విదురుడి పెళ్లి – దేవక మహారాజు దగ్గర వున్న ఒక పారశీక కన్యతో వివాహం జరిపించాడు భీష్ముడు.

పాండురాజు దిగ్విజయయాత్ర చేసి, రాజ్యాన్ని విస్తరింపచేసి, గెల్చుకుని వచ్చిన సంపదను ధృతరాష్ట్రుడి చేతికిచ్చి, ఆయన అనుమతితో ఆ సంపదను సత్యవతికి, భీష్ముడికి కానుకగా యిచ్చాడు. అశ్వమేధయాగం చేశాడు. ఒకసారి వేటకు వెళ్లి శృంగారక్రీడలో వున్న జింకల జంటపై బాణం వేశాడు. మగ జింక ‘నేను ఒక ఋషిని. ఈ రూపంలో నా భార్యతో క్రీడిస్తున్నాను. నువ్వు వేటాడడం తప్పుకాదు. 

ఇంద్రియసుఖాలను అనుభవిస్తూన్న ఏ ప్రాణినయినా సంహరించడం పాపమే. దీని ఫలితంగా నీ భార్యలతో సుఖించాలని కోరుకుంటే మరణిస్తావ్.’ అని శపించింది. ‘గృహస్థాశ్రమానికి పనికిరాకపోతే యింకెందుకు యీ జీవితం? సన్యాసాశ్రమం స్వీకరిస్తాను.’ అన్నాడు పాండురాజు. అప్పుడు అతని భార్యలు ‘దానికి బదులు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించవచ్చు కదా’ అన్నారు. సరేనని రాజ్యాన్ని వదిలి, సంపదలను దానమిచ్చేసి, పాండురాజు హిమవత్పర్వప్రాంతానికి వెళ్లి తపస్సుకి ఉపక్రమించాడు.

సంతానం లేకపోతే పితృఋణం తీర్చుకోలేనని కుంతిని నియోగవిధానంలో పిల్లల్ని కనమని పాండురాజు అడిగాడు. అప్పుడు కుంతికి యమధర్మరాజు (భారతంలో ధర్ముడు అని రాశారు) అంశతో ధర్మరాజు (ధర్మానికి ప్రతీక), వాయుదేవుడి అంశతో భీముడు (బలానికి..), ఇంద్రుడి అంశతో అర్జునుడు (పరాక్రమం) పుట్టారు. ఆ తర్వాత మాద్రి అశ్వినీదేవతల అంశతో నకుల (నీతిశాస్త్రం), సహదేవుల (యుద్ధవిద్యాప్రావీణ్యం) ను కన్నది. గాంధారి గర్భంతో రెండు సంవత్సరాలున్నా ప్రసవం కావటం లేదు. ఈలోగా కుంతికి ధర్మరాజు పుట్టాడని తెలియగానే అసూయతో గాంధారి కడుపు మీద కొట్టుకోవడంతో ప్రసవమై ఒక మాంసపిండం బయటపడింది. 

వ్యాసుడు దాన్ని వంద భాగాలు చేసి, శిశుజననానికి ఉపయుక్తమైన వంద ఆధారపాత్రల్లో తన మంత్రశక్తితో కొన్ని ద్రావణాల మధ్య నిక్షిప్తం చేసి కొంతకాలం పాటు వాటిని నిత్యం తడుపుతూండమన్నాడు. అలా చేసేటప్పుడు గాంధారి నాకు ఒక కుమార్తెని కూడా అనుగ్రహించమని అడిగితే ఆ మాంసపిండాల్లోంచి ఒక భాగాన్ని వేరొక పాత్రలో నిక్షిప్తం చేశాడు. ఆమె దుశ్శల. సైంధవుడి భార్య. తక్కినవాళ్లు దుర్యోధనాదులు. గాంధారి గర్భం ధరించి ప్రసవం కాని సమయంలో ధృతరాష్ట్రుడికి సేవ చేస్తున్న ఒక వైశ్యయువతి ద్వారా కలిగిన కొడుకు యుయుత్సుడు.

కొంతకాలానికి పాండురాజు మనసు చలించి, మాద్రితో సంగమించే ప్రయత్నం చేయడంతో అప్పటికప్పుడు మరణించాడు. మాద్రి సతీసహగమనం చేయగా, కుంతి పాండవులను వెంటపెట్టుకుని హస్తినకు వచ్చింది. పాండురాజు అడవులకు వెళ్లిన దగ్గర్నుంచి రాజ్యం చేస్తున్న ధృతరాష్ట్రుడు పాండవులను దగ్గరకు తీసుకున్నాడు. వ్యాసుడి సలహాపై సత్యవతి, అంబిక, అంబాలిక తపోవనాల్లో తపస్సుకై వెళ్లిపోయారు. 

పిల్లలు పెరుగుతున్న కొద్దీ దుర్యోధనుడికి భయం పట్టుకుంది. పిల్లలందరిలో అగ్రజుడు ధర్మరాజు కనుక, రాజ్యాధికారం అతనికే లభిస్తుంది. అతనికి సహాయంగా భీమార్జునులు వుంటే ప్రమాదం. అందుకని భీముణ్ని మట్టుపెట్టాలి అనుకుని ఒకసారి విషాహారం పెట్టించి, నీటిలో తోయించేశాడు. అక్కడ భావనవిషం ఉన్న సర్పాలు కాటేశాయి. అది కడుపులో వున్న జంగమ విషాన్ని విరిచేశాయి. భీముడికి మెలకువ వచ్చి, పాములను విసిరి కొట్టసాగాడు.

నివారించడానికి వచ్చిన సర్పప్రముఖుల్లో ఆర్యకుడు శూరసేనుడికి మాతామహుడు. భీముణ్ని చూసి ‘ఇతను మా మనుమడికి మనుమడు’ అనుకుని నాగలోకానికి తీసుకెళ్లి మర్యాదలు చేశాడు. వెయ్యి ఏనుగుల బలం వచ్చే రసాయనాన్ని బహూకరించాడు. భీముడు యింటికి తిరిగి వచ్చాక, ధర్మరాజు యీ విషయం ఎవరితో చెప్పకు అన్నాడు. పిల్లలందరికీ విద్య నేర్పడానికి కృపాచార్యులను నియమించారు. శరద్వంతుడనే ఋషి తపస్సు చేసుకుంటూ వుంటే ఆయన తేజస్సు బయటకు వచ్చి ఆడశిశువుగా, మగశిశువుగా రెండు రూపాలు ధరించింది. వేటకు వెళ్లిన శంతనుడు వారిని చూసి నగరానికి తెచ్చి పెంచాడు. మగపిల్లవాడికి కృప, ఆడపిల్లకు కృపి అని పేర్లు పెట్టాడు. కొంతకాలానికి శరద్వంతుడు యోగమార్గంలో వెళ్లి పిల్లల్ని కలుసుకుని, కొడుక్కి దివ్యమైన అస్త్రాలన్నీ నేర్పాడు. కృపుడు తన సాధనతో వాటిని మరింత మెరుగు పరుచుకున్నాడు.

కృపిని ఆమె తండ్రి శరద్వంతుడు ద్రోణుడికి యిచ్చి పెళ్లి చేశాడు. భరద్వాజ మహర్షి తేజస్సు ఒక కుండలో ఆవిర్భవించడంతో ద్రోణుడు పుట్టాడు. భరద్వాజ మహర్షి ద్వారా, అగ్నివేశుడు అనే ఆయన దగ్గర దివ్యాస్త్రాలను నేర్చుకున్నాడు. ద్రోణుడికి కొడుకు పుట్టగానే వాడు అశ్వంలాగ సకిలించాడు. అందుకని అశ్వత్థామ అని పేరు పెట్టారు. బావిలో పడిన బంతిని తన అస్త్రాలతో బయటకు తీసి చూపడంతో ద్రోణుణ్ని భీష్ముడు పిల్లలకు గురువుగా నియమించాడు. కౌరవులు, పాండవులు కౌమారదశ దాటారు. ధర్మరాజుకి 30 ఏళ్లు నిండగానే, తప్పనిసరి పరిస్థితి కాబట్టి ధృతరాష్ట్రుడు ధర్మరాజుకి యువరాజ పట్టాభిషేకం చేశాడు. ఈ పట్టాభిషేకం జరిగాక పాండవులు శత్రురాజ్యాల్ని జయించసాగారు. ప్రజలు, సామంత రాజులు ధర్మరాజే రాజన్నంత యిదిగా గౌరవించసాగారు.

దుర్యోధనుడు అభిమానధనుడు కాదు, దురభిమానధనుడు. ఈర్ష, అసూయలతో రగిలిపోయేవాడు. తండ్రి దగ్గరకు వెళ్లి ‘ఏదో ఒక రోజు ధర్మరాజు నిన్ను దింపేసి రాజయిపోతాడు. మేం వాళ్లకి ఊడిగం చేస్తూనే వుంటాం.’ అని వాపోయాడు. ‘పాండురాజు లాగానే ధర్మరాజు కూడా ప్రతీదీ నాకు చెప్పే చేస్తున్నాడు. తప్పు పట్టి పదవిలోంచి తీసేద్దామంటే ఏ తప్పూ చేయటం లేదు. ఎలా తీసేయను చెప్పు?’ అని ధృతరాష్ట్రుడూ బాధపడ్డాడు. ‘నిజమే, మనం ఏదైనా చేస్తే ప్రజలకు విరోధులమై పోతాం. మంత్రులు, సైన్యం వారి వైపే వున్నారు. వీరిని వేరే ఎక్కడికైనా పంపేసి, ఆ సమయంలో ధనం యిచ్చి అధికారులను లోబరుచుకుందాం. పాండురాజు గతంలో మనకిచ్చిన డబ్బు చాలా వుంది కదా’ అన్నాడు దుర్యోధనుడు. నిజానికి అప్పటికే ధృతరాష్ట్రుడు కణికుడనే మంత్రిని సంప్రదించి ప్లాను వేసుకుని వున్నాడు.

దుర్యోధనుడికి చెప్పి పురోచనుడు అనే శిల్పిని వారణావతంకు పంపించి పాండవుల కోసం ఒక యిల్లు కట్టించాడు. క్షణాల్లో అగ్నికి దహనమయ్యే జనుము, మద్దిచెట్టు జిగురు, ఎండుగడ్డి, నూనె పులిమిన లక్క మొదలైన పదార్థాలతో కట్టించి శివం అని పేరు పెట్టాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు ఓ రోజు సభలో ధర్మరాజుతో ‘వారణావతం ఈశ్వరుని సన్నిధానం. అక్కడేదో ఉత్సవం జరగబోతోంది. మీ సోదరులు కుంతిని తీసుకుని అక్కడకు వెళ్లి రండి.’ అన్నాడు. సరే అన్నాడు ధర్మరాజు. తర్వాత విదురుడు వచ్చి అన్యాపదేశంగా కొన్ని సూక్తులు చెప్పాడు. ‘రాజన్నవాడికి ఏమరుపాటు కూడదు, ప్రమాదాలు అగ్ని వల్లా రావచ్చు, వాయువు వల్లా రావచ్చు. అగ్ని అడవినంతా దహించి వేయగలదు కానీ కలుగులో ఉన్న ఎలుకనేమీ చేయలేదు...’ అని.

ధర్మరాజు సంకేతాన్ని గ్రహించాడు. వారణావతం చేరాక తనను ఆహ్వానించిన వాళ్లందరి యిళ్లలో పది రోజులు వుండి, పదకొండో రోజున శివంలో దిగాడు. ఇంటి తీరు చూస్తూనే ‘ఇక్కడ లక్క, కొవ్వు వాసన వస్తోంది. అతి త్వరగా తగలబడగలదు.’ అన్నాడు. ‘అయితే వేరే యింటికి వెళ్లిపోదాం.’ అన్నాడు భీముడు. ‘వేరే యింటికి వెళితే మనకి తెలిసిపోయిందని వాళ్లకు అనుమానం వస్తుంది. ఏదో విధంగా వెంటాడతారు. ఇక్కడే వుండి ఏదో ప్రణాళిక వేద్దాం.’ అన్నాడు ధర్మరాజు. ఇంతలో విదురుడు పంపిన కనకుడు అనేవాడు వచ్చి యింటి నుంచి బయటకు ఒక సొరంగ మార్గాన్ని తవ్వి వెళ్లిపోయాడు. ఉత్సవ సందర్భంగా తమ భవంతిలో పాండవులు విందు యిచ్చారు. పానీయాలు తాగి మత్తెక్కి పడిపోయినవారిలో పురోచనుడు కూడా వున్నాడు.

పాండవులంతా సొరంగ మార్గాన ప్రవేశించగానే భీముడు యింటికి నిప్పు పెట్టేశాడు. ఇంట్లో చాలామంది కాలిపోయారు. వారిలో ఒక బోయ స్త్రీ, ఆమె కుటుంబంలోని అయిదుగురు పురుషుల కుటుంబాలు కూడా వున్నాయి. వాటిని చూసి దుర్యోధనుడి గూఢచారులు కుంతి, పాండవులు అనుకున్నారు. ధృతరాష్ట్రుడు దుఃఖం నటిస్తూ పిండప్రదానాలు చేశాడు. భీష్ముడు తర్పణానికి సిద్ధపడుతూ వుంటే విదురుడు పక్కకు లాగి ‘పాండవులు క్షేమంగా వున్నారు.’ అని చెప్పాడు. ఇదీ సంస్కృత భారతంలో వున్న కథ. ‘‘శ్రీకృష్ణపాండవీయం’’ తీసినప్పుడు దీన్ని కాస్త మార్చారు. లక్క యింట్లో భీముడు కాపలాగా వుండి, కునుకుతూంటే కృష్ణుడు వచ్చి అతన్ని లేపి, ‘ఇది లక్క యిల్లు సుమా’ అని హెచ్చరించినట్లు, సొరంగం తవ్వమని సలహా యిచ్చినట్లు, భీముడే తవ్వినట్లు చూపించారు.

నిజానికి శ్రీకృష్ణుడు పాండవులను కలిసినది ద్రౌపదీ స్వయంవర ఘట్టంలోనే! మత్స్యయంత్రాన్ని కొట్టినవారే తన చెల్లెలు కృష్ణ (ద్రౌపది పేరు)ను చేపట్టగలదని ధృష్టద్యుమ్నుడు ప్రకటన చేయడానికి ముందు జరిగిన క్రతువు కోసం వచ్చి, అది అయిపోయిన తర్వాత స్వయంవరం చూద్దామని వుండిపోయిన యాదవబృందంలో వున్నాడు. తన అన్నగారు బలరాముడితో ‘అదిగో అటు బ్రాహ్మణుల వరసలో ఐదుగురు కూర్చున్నారు చూశావా, వాళ్లే పాండవులు.’ అని చెప్పాడు.

అర్జునుడు విప్రరూపంలో మత్స్యయంత్రాన్ని ఛేదించాక ‘ఒక బ్రాహ్మణుడు క్షత్రియకన్యను చేపడతాడా?’ అంటూ దుర్యోధన, శల్య, కర్ణులు యుద్ధానికి వస్తే భీమార్జునులు వారిని ఎదిరించారు. అప్పుడు కృష్ణుడు ‘ద్రుపదుడు ప్రకటించిన విధంగా ఉత్తమ కులస్థుడు, శక్తిమంతుడు మత్స్యయంత్రాన్ని ఛేదించాడు. ద్రౌపది అతన్ని వరించింది. ఇంకెందుకు యుద్ధం?’ అని వారించాడు. దాంతో కౌరవులు వెనక్కి తగ్గారు.

ద్రౌపది తాను వరించిన బ్రాహ్మణ యువకుడి వెంట వెళ్లింది. వాళ్లు ఒక కుమ్మరి యింట్లో వుంటూ భిక్షాటన చేసుకునేవారు. ఇంటిలోపల కుంతి వుంది. బయట నుంచి భీమార్జునులు ‘‘అమ్మా, భిక్ష తీసుకువచ్చాం.’’ అన్నారు. ‘‘అయితే అందరూ సమంగా పంచుకోండి.’’ అంటూ బయటకు వచ్చి కుంతి ద్రౌపదిని చూసి విలవిల్లాడిపోయింది. ‘ధర్మరాజా! ఏం చేయాలి?’ అని అడిగింది. ధర్మరాజు ‘తల్లీ, సనాతన ధర్మనియమా లనుసరించి, యీమెను అయిదుగురమూ వివాహమాడవచ్చు.’ అన్నాడు. అప్పుడే కృష్ణుడు బలరాముడితో సహా అక్కడకి వచ్చి తన కంటె పెద్దవాడైన ధర్మరాజు పాదాలకు నమస్కారం చేసి, ‘‘నన్ను కృష్ణుడంటారు.’’ అంటూ కుంతీదేవికి నమస్కరించాడు. ధర్మరాజు ఆశ్చర్యంగా ‘‘మమ్మల్ని సభాస్థలిలో ఎలా గుర్తించావు కృష్ణా?’’ అని అడిగాడు.

‘‘మీరెవరో తెలుసుకోలేనా? అగ్నిని దాచగలవా రాజా’’ అన్నాడు కృష్ణుడు. అలా వాళ్లని పలకరించి వెళ్లిపోయాడు కృష్ణుడు. తర్వాత ద్రౌపది వివాహ విషయంలో జరిగిన ధర్మసందేహపు చర్చలో పాల్గొనలేదు. ద్రౌపది ఐదుగుర్ని పెళ్లాడవచ్చా లేదా అనే విషయంపై చాలా చర్చ జరిగిందని యీ పుస్తకం చెపుతోంది. దాని గురించి మరోసారి చెప్పుకోవచ్చు. శర్మగారు అనేక విషయాల్లో క్లారిటీ యిచ్చారు. ‘శిఖండి ఎదురుపడితే నేను యుద్ధం చేయను’ అని మాత్రమే భీష్ముడు అన్నాడనీ, నాటకాల్లో, సినిమాల్లో చూపినట్లు ‘అస్త్రసన్యాసం చేస్తాను’ అని అనలేదని చెప్పారు. 

సినిమాల్లో శిఖండిని నపుంసకుడిగా, వయ్యారాలు పోతూ యుద్ధంలోకి వచ్చినట్లు, భీష్ముణ్ని చంపడానికి అప్పటికప్పుడు అర్జంటుగా యుద్ధంలోకి దింపినట్లు చూపిస్తారు. శర్మగారు రాశారు – ‘శిఖండి మహావీరుడు. తొమ్మిది రోజుల యుద్ధంలో భీష్ముని ఎదుర్కొని చంపాలని ప్రయత్నిస్తూ దుర్యోధనుడు పంపిన వీరులను ఓడిస్తూ భీష్ముణ్ని చేరుతున్నాడు. భీష్ముడు మాత్రం అతనితో యుద్ధం చేయకుండా తప్పుకుని వెళ్లిపోతున్నాడు.’ అని.

భీష్ముడు పడిపోయిన తర్వాత కర్ణుడు వస్తే, ‘నువ్వు అతిరథుడు కావాల్సినవాడివి. నేనేదో అర్థరథుణ్మని చేశాను కానీ...’ అని అన్నట్లుగా ఆధునికులు రాస్తున్నది తప్పు అని శర్మగారు రాశారు. ‘నీ పట్ల నాకు ద్వేషం లేదు. నువ్వు అకారణంగా పాండవులను ద్వేషిస్తూ, పరుషంగా మాట్లాడుతూంటే, నీ కారణంగా దుర్యోధనుడు రెచ్చిపోతున్నాడు. అందుకని శాంతి కోసమే నిన్ను అదుపు చేయడానికి అలా మాట్లాడాను.’ అని మాత్రమే చెప్పాడని వివరించారు. 

అలాగే పద్మవ్యూహం గురించి గర్భంలో వుండగానే అభిమన్యుడికి తెలుసా? మయసభలో దుర్యోధనుడికి పరాభవం జరిగితే ద్రౌపది నవ్విందా? లేదా? ‘నిన్ను ద్రౌపది ఆరవ భర్తగా స్వీకరిస్తుంది’ అని కృష్ణుడు కర్ణుడికి ఆఫర్ యిచ్చాడా? పాత కక్ష పెట్టుకుని శకుని తన తండ్రి ఎముకలతో పాచికలు చేశాడా? – యిలాటి విషయాలపై వ్యాసభారతంలో ఏముందో దీని ద్వారా మనకు తెలుస్తుంది.

అలాగే ఏకలవ్యుడి విషయంలో ధర్మాధర్మవివేచన, కర్ణుడి గుణదోష విచారణ చేయడంతో బాటు శర్మగారు ద్రోణసంహార ఘట్టంలో అశ్వత్థామ హతః’ గురించి విపులంగా చర్చించారు. భీముడు అశ్వత్ధామ అనే ఏనుగును సంహరించాక, కృష్ణుడు ధర్మరాజుకి ‘అశ్వత్థామ హతః’ అనమనే చెప్పాడు. ధర్మరాజు అపరాధభావనతో లోగొంతుతో ‘..కుంజరః’ అని చేర్చాడు. 

ధర్మరాజు అలా చెప్పటం వలన అసత్యదోషం అంటలేదు కానీ, ‘వంచన’ అనే దోషం వచ్చింది. అది కూడా గురువంచన! దాని ఫలితం వెంటనే కనిపించింది. అప్పటిదాకా యుద్ధంలో ఒక్క ధర్మరాజు రథం మాత్రమే భూమని తాకకుండా నాలుగంగుళాల ఎత్తులో, దేవతల రథంలా, నడుస్తోంది. కానీ ఈ గురువంచన కారణంగా రథం నేలమీదకి దిగిపోయింది. ఈ దోషం వలననే ధర్మరాజుకి స్వర్గానికి వెళ్లబోయేముందు ఓసారి నరకం చూపించాడు ఇంద్రుడు.

ఇలా అనేక విశేషాలతో సాగింది యీ పుస్తకం. ప్రవచనకర్తల్లో శర్మగారిది ఒక విశిష్టస్థానం. సీరియస్‌గా విషయానికి కట్టుబడి, నియమిత క్రమంలో, కేటాయించిన సమయంలో ఒక చక్కని ఉపాధ్యాయుడిలా బోధపరుస్తారు. పురాణం కదాని పుస్తకం చదవడానికి భయపడనక్కరలేదు. శర్మగారి ప్రవచనం, మిత్రులు వల్లీశ్వర్ గారి అక్షరీకరణ ఎంత సరళంగా సాగాయంటే, పై వ్యాసంలో చాలా వాక్యాలు యథాతథంగా దింపేసినవే. 685 పేజీలున్నా హాయిగా చదివేయవచ్చు. 

ప్రస్తుతం సామవేదం సాంస్కృతిక సమన్వయ సమితి, ముంబయి ఆధ్వర్యంలో శర్మగారు కాళిదాసు రాసిన ‘‘రఘువంశం’’ ఆన్‌లైన్‌ ప్రవచన మహాయజ్ఞం తలపెట్టారు. ఈ మే 18 నుంచి 26 వరకు ప్రతీ రోజూ సాయంత్రం 7 గంటలకు యూట్యూబ్‌లో ఋషిపీఠం లింకులో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. రాముడి పూర్వీకుల గురించి చెప్పే రఘువంశం గాథ 19 భాగాల్లో (సర్గలు అంటారు) చెప్పబడింది. మహానుభావులైన దిలీపుడు, రఘువు, దశరథుడు, రాముడు, లవకుశులు వారి వారసులు అందరి గురించి చెప్తూ ఆఖరి సర్గలో అగ్నివర్ణ అనే పొగరుబోతు రాజు పతనం గురించి కూడా చెప్తుంది. చాలా యింట్రస్టింగ్ కథలున్నాయి. వీలుంటే వినండి.

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2021)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?