Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: స్థానిక ఎన్నికలు - ప్రతిపక్షం

ఎమ్బీయస్‌: స్థానిక ఎన్నికలు - ప్రతిపక్షం

ఆంధ్రలో స్థానిక ఎన్నికల ధర్మమాని అన్ని వ్యవస్థల విలువల వలువలు జారిపడ్డాయి. స్థాయి పతనమై ప్రజలు ముక్కున వేలు వేసుకునే పరిస్థితి దాపురించింది. ఎన్నికలంటేనే ప్రజాస్వామ్యానికి గుర్తు. స్థానిక ఎన్నికలంటే ఆ సందర్భంగా గ్రామస్థాయిలో కూడా ప్రజాస్వామ్యం నెలకొందని చెప్పుకోవాలి. అలాటిది యీ ఎన్నికలు రచ్చో, రచ్చస్య, రచ్చభ్యహలా మారిపోయాయి. ఈ రొచ్చుభాగోతంలో ఎవరెవరు ఏ చీదర పాత్ర వహించారో చూద్దాం. ఇప్పుడు - ప్రతిపక్షం

2019 ఏప్రిల్‌లో ఎన్నికలు జరిపి వుండాల్సింది. జరపలేదు. ఇప్పుడు జరగకపోతే కేంద్రం నుంచి నిధులు రావు మొర్రో అంటున్నా జరపకుండా చూడాలని తెగ ప్రయత్నిస్తోంది. అధికార పక్షంపై కోపం ఉంటే వుండవచ్చు కానీ రాష్ట్రానికి హాని జరగకుండా చూడాలి కదా. ఎన్నికలు జరిగితే వైసిపికి అత్యధిక సీట్లు వస్తాయన్న భయం దేనికి? ఏడాది తిరగకుండానే వైసిపి తన పాప్యులారిటీ పోగొట్టుకుంటుందని ఎలా అనుకుంటాం? సాధారణంగా స్థానిక ఎన్నికలలో అధికార పార్టీ గెలుస్తూంటుంది. 2014 మేలో జరిగిన గత స్థానిక ఎన్నికలలో కాంగ్రెసుకు ఒక్కటీ రాలేదు. ఎందుకంటే అప్పటికే విభజన తాలూకు కోపం కాంగ్రెసుపై చూపించడం ప్రారంభమైంది. 92 మునిసిపాలిటీల్లో మెజారిటీ టిడిపికే దక్కింది. అదే అసెంబ్లీ ఎన్నికలో రిపీటైంది. అప్పుడు టిడిపి అన్యాయం, అక్రమం అనలేదు కదా. తను నెగ్గినపుడు ప్రజాస్వామ్యం, యితరులు నెగ్గబోతున్నపుడు అక్రమం అంటే ఎలా?

పార్టీ ప్రక్షాళనకు తోసుకువచ్చిన అవకాశం- ఏ రాజకీయ పార్టీయైనా సరే, పైకి ఏం చెప్పినా మనసులో వాస్తవాలు గ్రహిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం మనకు మంచి రోజులు కావు. కొన్నాళ్లు పోతే కథ మారుతుంది. ప్రజలు మళ్లీ మన దగ్గరకే వస్తారు అనే ఆశాభావంతో ఉండాలి. మధ్యలో యిలాటి ఎన్నికలు వచ్చినపుడు మనం ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు ప్రజలు ఏ మేరకు నమ్ముతున్నారు అనేది తెలుసుకుంటూ దానికి తగ్గట్టుగా స్ట్రాటజీ మార్చుకోవాలి. ఇక ఫిరాయింపులంటారా? ఓటమి సమయంలో తోడుగా నిలబడినవారే అసలైన నమ్మకస్తులు. నాయకులు గోడ దూకి పోతూ వుంటే పోయింది పొల్లు అనుకోవాలి.

వృద్ధ జంబూకాలన్నీ అధికార పార్టీ గూటికి చేరాయి కాబట్టి వారి స్థానంలో యువతీయువకులను తెచ్చే అవకాశం దక్కిందని ఆనందించాలి. వాళ్లు ఉన్నంతకాలం అనుభవం పేర పదవులు వదలరు, వీళ్లను నిరుత్సాహ పరుస్తూండాలి. గత పదేళ్లగా చాలామంది నాయకులు కాంగ్రెసు, వైసిపి, టిడిపిల మధ్య స్తంభాలాట ఆడుతూ విశ్వసనీయత పోగొట్టుకున్నారు. వారికి బదులు యీ రోజు యువతను తెచ్చి వాళ్లకు సిద్ధాంతాలను నూరిపోస్తే, అధికారం దక్కినా దక్కకపోయినా, రెండు దశాబ్దాల దాకా పార్టీ మనుగడకు ఢోకా ఉండదు. పార్టీ ఆఫీసులో బూజు దులిపేసుకుని, కడిగేసి, ముగ్గులు పెట్టుకుని కొత్త వాళ్ల చేత కొబ్బరికాయ కొట్టించాలి.

మామూలుగా నాయకులందరూ పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి, సమాజంలో యువతను ఉద్దేశించి ‘వైఫల్యాలకు బెదరవద్దు, స్థయిర్యం చెదరనీయవద్దు, పోరాడండి. వైఫల్యాలు విజయానికి సోపానాలు. ఇవాళ కాకపోతే రేపటికైనా గెలుపు మీదే’ అని లెక్చర్లు దంచుతారు. చంద్రబాబు కూడా అలాటివి కోకొల్లలు యిచ్చారు. అలాటిది యీ రోజు ఆయన పరీక్ష రాయడానికే భయపడుతున్నారన్న మెసేజి వెళితే ఎలా? రేపు ఎవరైనా గౌరవిస్తారా? గత ఏడాది పెట్టకపోవడానికి కూడా ప్రజల్ని ఎదుర్కునే ధైర్యం లేకనే అని వెక్కిరిస్తున్నారు. ఇప్పుడు కూడా ఎన్నికల రణరంగం నుంచి పారిపోవడానికి ఎన్ని అడ్డదారులున్నాయో అన్నీ వెతికారు. బిసి రిజర్వేషన్లన్నారు, విద్యార్థుల పరీక్షలన్నారు, అమరావతి ఉద్యమం అన్నారు, కరోనా అన్నారు. చివరకు ఏం చేసినా ప్రభుత్వం ముందుకు వెళ్లిపోవడంతో హతాశులయ్యారు. ఎన్నికల కమిషనర్‌పై బాహాటంగా ఒత్తిడి తేవడం చూశాం.

లోపాయికారీగా ఏమైనా జరిగిందేమో మనకు తెలియదు కాబట్టి వ్యాఖ్యానించలేం. కానీ ఎన్నికలు వాయిదా పడగానే ఆయనను ఆకాశానికి ఎత్తేస్తున్న వైనం, పాలాభిషేకాల సందడి చూస్తూ ఉంటే అనుమానం సహజం. మండలి చైర్మన్‌ కూడా ఎవర్నీ సంప్రదించకుండా తన విచక్షణాధికారం ఉపయోగించారు. ఆయన టిడిపి సభ్యుడు. అది ఓపెన్‌గా తెలుసు. ఈ ఎన్నికల కమీషనర్‌ కూడా ఎవర్నీ సంప్రదించకుండా తన విచక్షణాధికారం ఉపయోగించారు. దానిలో బాబు హస్తం స్పష్టం. దీనిలో అస్పష్టం. మోడస్‌ ఒపరాండీ మాత్రం సేమ్‌.

ఎవరి పని వాళ్లను చేయనీయండి - సరే ఎన్నికలు 6 వారాలు వాయిదా పడ్డాయి. కానీ దానితో తృప్తి పడటం లేదు. వాయిదా కాదు, మొత్తం కాన్సిల్‌ చేసేయాలిట. కేంద్ర నిధుల విషయంలో ‘మార్చి 31 లోగా పోలింగు జరగలేదు కానీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది’ అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మొత్తం రద్దు చేసేస్తే అలా చెప్పుకునేందుకు వీలుండదు. నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది. రద్దు చేయడంతో సరిపోదట, కేంద్ర ఎన్నికల సంఘమే నిర్వహించాలట, రాష్ట్ర పోలీసులు పనికి రారట, కేంద్ర బలగాలు రావాలట.

పదవి పోయినదగ్గర్నుంచి బాబుకి కేంద్రం చాలా ముచ్చట వేస్తోంది. తను ముఖ్యమంత్రిగా ఉండగా ‘రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రానికి ఏం పని?’ అని హుంకరించేవారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కన పడేసి కేంద్రమే పాలించాలంటున్నారు. జగన్‌ కూడా అంతే. తను ప్రతిపక్షంలో ఉండగా ప్రతీ కేసూ సిబిఐ విచారించాలనేవారు. ఇప్పుడు తన బాబాయి హత్య కేసు సిబిఐ తీసుకుంటానంటే, అబ్బే మేం చూసుకుంటాంగా అంటున్నారు. మాజీ ఎంపీ, ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, మరో ముఖ్యమంత్రికి బాబాయి అయిన ప్రముఖ వ్యక్తి దారుణహత్యకు గురై ఏడాది అయినా విచారణ దిక్కూదివాణం లేకుండా ఉందంటే రాష్ట్ర పోలీసు ఏదో ఊడబొడుస్తోందంటే ఎవరైనా నమ్ముతారా? అవునూ, కోడికత్తి దాడిలో టిడిపి అభిమాని హస్తం ఉందని నిరూపించారా!?

కేంద్ర ఎన్నికల సంఘమే ఎన్నికలు నిర్వహించాలంటే అయ్యే పనా? ప్రతీ రాష్ట్రంలోనూ ప్రతిపక్షం యిలాటి ఆరోపణలే చేస్తూ వుంటుంది. అవి పట్టుకుని పంచాయితీ ఎన్నికల దగ్గర్నుంచి వాళ్లే జరపాలంటే వాళ్ల పని అయిందే! 2019లో కాలం కలిసిరాక, బాబు జాతీయ నాయకుడు కాలేకపోయారు కానీ ఆయనే కేంద్రంలో చక్రం తిప్పుతూ వుంటే ఏదైనా ప్రాంతీయ పార్టీ నుంచి యిలాంటి డిమాండ్‌ వస్తే ఎంత విసుక్కునేవారు?

ఇవి జరిగే పనులు కాదని ముందే తెలిసినపుడు మాల్యాద్రి, వర్ల రామయ్య వంటి వారి చేత అడిగించాలి తప్ప తనే అడిగి భంగపడడం దేనికి? ఎన్నికల కమిషనర్‌ ఎన్నికలు వాయిదా వేశారు, ఆయనకా అధికారం ఉంది. కానీ ఎన్నికలు జరిగేదాకా నేనే పాలించేస్తా, నా యిష్టం వచ్చినట్లు అధికారులను బదిలీ చేసేస్తా అంటే ఎలా? చివరకు కోర్టు చేత చెప్పించుకోవాల్సి వచ్చింది కదా! కోర్టు యిలా చెపుతుందని బాబు వంటి సీనియరు గెస్‌ చేయగలరు కదా. ఈ లోపునే భలేభలే అనడం దేనికి?

ఇవాళ జగన్‌ అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎన్నికల కమిషనర్‌ను హద్దు మీరనిస్తే ఎలా? వైసిపి శాశ్వతమా? రేపు మనం అధికారంలోకి రావచ్చు. అప్పుడు మరో ఎన్నికల కమిషనర్‌ సదుద్దేశంతోనే, దురుద్దేశంతోనే యిలాగే వ్యవహరిస్తే దెబ్బ తింటాం కదా అన్న యింగితం ఉండాలి కదా! తను అధికారంలో ఉండగా స్పీకరు వ్యవస్థను చిత్తం వచ్చినట్లు వాడేశారు. ఇప్పుడు వైసిపి స్పీకరు మొదట్లో బాగానే ఉన్నా, క్రమేపీ కట్టు తప్పుతున్నారు. సభ బయట పద్ధతి లేకుండా కమ్మ కరోనా అంటూ మాట్లాడుతున్నారు. తప్పు అని ఎత్తి చూపుదామంటే కోడెలా యింతేగా అంటూ మూడు వేళ్లు వెనక్కి తిరిగి తననే చూపిస్తున్నాయి.

పథకాలు ఆపిస్తే ప్రజలు హర్షిస్తారా?- పథకాలు ఆపేయాలి అనే థీమ్‌ మీద కూడా మరీ అంత హంగామా చేయడం అభిలషణీయం కాదు. లబ్ధిదారులు దాన్ని సరైన కోణంలో స్వీకరించరు. అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినా నివ్వదు అనుకుంటారు. ఇళ్ల స్థలాలకై పేదలు ఎదురు చూస్తూంటే యివ్వవద్దు అంటూ ఎన్నికల కమిషనర్‌కు పిటిషన్‌ పెడితే వారు భరించగలరా? కరోనా భయం ఫలానా టైముకి పోతుందన్న హామీ ఏమైనా ఉందా? ఎన్నికలు వాయిదా పడుతూ పోవచ్చు. అప్పటిదాకా మేం ఆగాలా అనుకోరా?

అయినా ఎన్నికలు ఆరువారాల్లో జరిగినా, ఆరు నెలల్లో జరిగినా ఫలితాలు మారిపోతాయా? టిడిపిలోకి కొత్తగా ఎవరైనా వచ్చి చేరతారా? యువనేత జూలు విదిలిస్తారా? ఫలితాలు ఎప్పుడు వచ్చినా ‘మీరు బెదిరించి నెగ్గారు’ అని టిడిపి వారు వైసిపిని అనబోతారు. ఇప్పటికే ఆ స్టేటుమెంటు రెడీ చేసుకుని పెట్టుకుని ఉంటారు. తేదీ వేయడమే తరవాయి.

ఎన్నికల కమిషనర్‌ కరోనా పేరు చెప్పి వాయిదా వేయగానే ‘అవునవును, కరోనా మహా భయంకరం. దానిపై జగన్‌కు అవగాహనా, అక్కరా లేకపోయినా కమిషనర్‌గారికి ఉంది కాబట్టే వాయిదా వేసి ప్రజల్ని కాపాడారు’ అంటున్నారు బాబు. ఆయన్ని అభినందించడమే కాదు, అనుకరించాలి కూడా. అమరావతి ఉద్యమకారులు వందల సంఖ్యలో గుమిగూడి కరోనా బారిన పడే ప్రమాదం ఉంది కాబట్టి, కరోనా దృష్ట్యా అమరావతి ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నాం అని ప్రకటించాలి కదా! ఉద్యమకారులును ఏమీ చేయనని కరోనా అభయహస్తం ఏమీ యివ్వలేదు కదా! వాయిదా వేస్తే ఉద్యమం చల్లారిపోతుందన్న భయమా, ఏమిటి?

శకుని పేరు ఎవరూ పెట్టుకోరు-  బాబు రాజకీయ దురంధరుడని, వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో ఘనుడని, ఆయన ఎత్తుల్ని పసిగట్టలేక జగన్‌ బోల్తా పడుతున్నాడని విశ్లేషకులు అంటున్నారు. మండలిలో బాబు ఎత్తుగడను ఊహించలేక జగన్‌ దెబ్బ తిన్నారని, యిప్పుడు ఎన్నికల కమిషనర్‌ను కూడా మేనేజ్‌ చేసి, జెల్లకాయ కొడితే విలవిల లాడుతున్నారని అంటున్నారు. టిడిపి నాయకులు ముసిముసిగా నవ్వుకోవడం, వైసిపి వారు ఏమీ చేయలేక ఆక్రోశపడడం స్పష్టంగా కనబడుతోంది. రాజకీయాల్లో యిలాటివి సహజం. కానీ నేను గమనించిన దేమిటంటే ప్రజలు బుర్ర ఉన్న నాయకుల కంటె, హృదయంతో స్పందించి, ప్రజలతో డైరక్టు కాంటాక్ట్‌ పెట్టుకుని ‘మీ కోసం నిలిచినందుకే నాతో వాళ్లు ఆడుకుంటున్నారు’ అని చెప్పేవారినే పాపం అనుకుని జాలిపడి ఆదరిస్తున్నారు.

రాజాజీ అపర మేధావి. కాంగ్రెసులో ఉన్నంతకాలం నెగ్గాడు కానీ సొంత పార్టీ పెట్టుకున్నాక ప్రజలు ఓటేయలేదు. కరుణానిధి మేధస్సు ముందు ఎమ్జీయార్‌ది ఎందుకూ పనికి రాదు. కానీ ఎమ్జీయార్‌ విడిగా పార్టీ పెట్టుకుని గెలిచాక అతన్ని కరుణానిధి ఓడించలేక పోయాడు. ఇందిరా గాంధీని ఆడించడానికి చూసిన సిండికేటులో అందరూ చాణక్యులే - మొరార్జీ, కామరాజ్‌, నిజలింగప్ప, అతుల్య ఘోష్‌, ఎస్‌ కె పాటిల్‌. కానీ ఇందిర విక్టిమ్‌ కార్డు ప్లే చేసేసరికి అందరూ కొట్టుకుపోయారు. ఎన్టీయారూ అంతే. కాంగ్రెసు హేమాహేమీలు సమయం చూసి నాదెండ్ల ద్వారా దెబ్బ తీశారు. అయితే ప్రజల్లోకి వెళ్లగానే ఎన్టీయార్‌కే జయం భించింది.

శకుని ఎంత మేధావి ఐనా అతన్ని ఎవరూ గౌరవించరు. సగంసగం జ్ఞానంతో, మొండిగా ముందుకు వెళ్లి పద్మవ్యూహంలో చిక్కుకుపోయిన అభిమన్యుడికే ఆరాధన. తన తండ్రి మరణం తర్వాత ఎమ్మేల్యేలను మేనేజ్‌ చేసి, ఫిరాయింపుదార్ల సహాయంతో అధికారంలోకి వద్దామను కున్నంతకాలం జగన్‌కు ప్రజల్లో మంచి పేరు రాలేదు. విడిగా వచ్చేసి, పార్టీ పెట్టుకుని, ఎన్నికల్లో పోరాడి, ఓడినా ధృతి కోల్పోక, మరో ఐదేళ్ల పాటు పోరాడితే ఆ హీరోయిక్‌ ఫైట్‌కి మార్కులు పడ్డాయి. రాష్ట్రచరిత్రలో కనీవినీ ఎరగనంత మెజారిటీతో గెలిచాడు. నేను పదేపదే కోరుకునేది - లోకేశ్‌ యిది గుర్తించాలి. తండ్రి చాటునుంచి బయటకు వచ్చి, కుయుక్తులతో, కువ్యాఖ్యలతో సరిపెట్టుకోకుండా పోరాటవీరుడి అవతారం ఎత్తితేనే భవిష్యత్తు ఉంటుంది. .

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?