Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: స్థానిక ఎన్నికలు - ప్రభుత్వం

ఎమ్బీయస్‌: స్థానిక ఎన్నికలు - ప్రభుత్వం

ఆంధ్రలో స్థానిక ఎన్నికల ధర్మమాని అన్ని వ్యవస్థల విలువల వలువలు జారిపడ్డాయి. స్థాయి పతనమై ప్రజలు ముక్కున వేలు వేసుకునే పరిస్థితి దాపురించింది. ఎన్నికలంటేనే ప్రజాస్వామ్యానికి గుర్తు. స్థానిక ఎన్నికలంటే ఆ సందర్భంగా గ్రామస్థాయిలో కూడా ప్రజాస్వామ్యం నెలకొందని చెప్పుకోవాలి. అలాటిది యీ ఎన్నికలు రచ్చో, రచ్చస్య, రచ్చభ్యహలా మారిపోయాయి. ఈ రొచ్చుభాగోతంలో ఎవరెవరు ఏ చీదర పాత్ర వహించారో చూద్దాం. ఇప్పుడు – ప్రభుత్వం

ప్రభుత్వం అన్నాక అధికార వ్యవస్థలను సరిగ్గా పనిచేయనీయాలి. పాతప్రభుత్వ విధానాలకు అనువుగా పనిచేసిన వారిని శిక్షించే పని పెట్టుకోకూడదు. కొంతమంది అధికారులు సిన్సియర్‌గా పని చేస్తారు. మరి కొంతమంది అతివిధేయతతో పని చేస్తారు. వంగమంటే పాకేసే రకాలు కొన్ని. బ్యూరాక్రసీలో యిలాటివి సహజం. వాళ్లని మనవైపు తిప్పుకుంటే (తిరగడానికి వాళ్లు రెడీగా వుంటారు, అధికారం ఎటుంటే అటు తిరగగల గద్దెతిరుగుడు పూవులు వాళ్లు) వారి సామర్థ్యం మనకు పనికి వస్తుందనుకోవాలి తప్ప, శత్రువులుగా పరిగణించకూడదు.

పనిముట్లతోనే విరోధమా?- తిరగను అని మొండికేసే ఘటాలను అప్రాధాన్యమైన పదవులకు తరలించడం అందరూ చేసేదే కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ జాస్తి కృష్ణకిశోర్‌ విషయంలో చేసినట్లు ఏ పోస్టూ యివ్వకుండా జీతం యివ్వడం తప్పు. ఎందుకంటే ఆ జీతం యిస్తున్నది పన్నుల ద్వారా వసూలైన మొత్తం నుంచి! నష్టపోతున్నది ప్రజలు, తమరు కాదు. కొంతకాలానికి జీతం ఆపేయడం, ఆధారాలు చూపకుండా సస్పెండ్‌ చేయడం యింకా తప్పు. ఈ దేశంలో ఎక్కడికక్కడ చెక్స్‌ అండ్‌ బాలెన్సెస్‌ ఉన్నాయని మర్చిపోకూడదు. క్యాట్‌, కోర్టు అక్షింతలు వేసినపుడు యిది కక్ష సాధింపు చర్యే అని జనాలకు తెలిసిపోతుంది.

ఇక పోలీసులను ఎలా హ్యేండిల్‌ చేస్తున్నారనేది అతి ముఖ్యమైన విషయం. అప్పుడెప్పుడో నాకు వైజాగ్‌ ఎయిర్‌పోర్టులో జరిగినది యిప్పుడు పునరావృతం చేస్తానని పంతం పడితే ఎలా? కట్‌ చేస్తే యిప్పుడు ఎవరెక్కడ ఉన్నారో తెలిసి కూడా అలా ప్రవర్తిస్తే ఎలా?  పోలీసులు తప్పుడు సెక్షన్‌ ఉపయోగించారని డిజిపి కోర్టు ముందు ఒప్పుకోవలసి రావడం ఎంత తలవంపులు? మాచెర్ల సంఘటనలో కూడా హత్యాప్రయత్నం సెక్షన్‌పై కేసు పెట్టినపుడు స్టేషన్‌ బెయిల్‌ ఎలా యిచ్చారని అడుగుతున్నారు. వైసిపి క్యాడర్‌ను ఉత్సాహపరచడానికై నియమాలను ఉల్లంఘిస్తే సామాన్యప్రజలు తిరస్కరించరా?

కులప్రస్తావన అవివేకం - ఎన్నికలు వాయిదా వేశానని కమిషనర్‌ చెప్పగానే పెట్టిన ప్రెస్‌మీట్‌లో జగన్‌ కరోనా పెద్ద అంశం కాదని చెప్పడానికి చాలా విషయాలే చెప్పారు, సంతోషం. మరి దీన్ని సాకుగా పెట్టుకుని కమిషనర్‌ వాయిదా వేశారు అని చెప్పి ఆపేస్తే మంచి ఎఫెక్టివ్‌గా ఉండేది. కానీ ‘చంద్రబాబు తన సామాజికవర్గం ఆయనను, తనకు అనుకూలమైన వ్యక్తిని నియమించుకున్నారు’ అనడం అసహ్యంగా ఉంది. ఇక్కడ కులప్రస్తావన దేనికి? మనమందరం ఏదో ఒక కులానికి, మతానికి చెందుతాం. అంతమాత్రం చేత లింకులు కట్టేయడమేనా? అలా అయితే వైయస్‌ వివేకానంద సొంత వదిన మీద పోటీకి నిలబడ్డారేం? ఆయన హత్యకేసులో అవినాశ్‌ రెడ్డి పాత్ర ఉందని సునీత అంటున్నారేం? చంద్రబాబు సొంత మామను గద్దె దింపేయడమేం?

కులం కామన్‌ అయినంత మాత్రాన తీర్మానాలు చేసేయగలుగుతారా? మరి తన కోటరీలో ఆ కులస్తులు వుంటే దానికేం సమాధానం చెపుతారు? ఇక ఆయన నియమించారు అంటున్నారు. ముఖ్యమంత్రి అన్నాక, ఎవరో ఒక అధికారిని నియమిస్తారు. అంతమాత్రం చేత వారు ఎల్లకాలం విధేయులై ఉంటారని చెప్పగలమా? ఈ రోజు మీరు నియమించే అధికారులు రేపు మీరు సీటు దిగాక మీ మాట వింటారని గ్యారంటీ వుందా? నియామకంలో పక్షపాతం చూపించారు, సీనియారిటీ విస్మరించారు వంటి అభియోగాలు ఉంటే బాధిత సీనియర్లు కోర్టుకి ఎలాగూ వెళతారు. రమేశ్‌ కుమార్‌ విషయంలో అలాటి కేసులు పెండింగులో ఉంటే వాటిని ప్రస్తావించి వదిలేస్తే చాలు ఈయన గత పాలకుడికి ఫేవరేట్‌ అని అర్థమయ్యేది.

మీరేమైనా సర్వంసహా పాలకులా?- ఇక నిర్ణయాలు ఆయనే తీసుకుంటే నేనెందుకు అనే ధోరణిలో ‘ఈ రాష్ట్రాన్ని పాలించేది జగన్‌మోహనరెడ్డా? లేక రమేశ్‌ కుమార్‌ అని చెప్పబడే ఆ వ్యక్తా?’ అనడం చాలా చైల్డిష్‌గా ఉంది. మీకు 151 సీట్లు గెలిపించినా మీ స్థానం ముఖ్యమంత్రి మాత్రమే. అదీ ఐదేళ్లు మాత్రమే. దానితో రాష్ట్రంలో అన్ని రకాల వ్యవస్థలపై మీకు అధికారం సిద్ధించదు. మీ పవర్‌ మీది, ఎన్నిక కమిషన్‌ పవర్‌ కమిషన్‌ది, కోర్టు పవర్‌ కోర్టుది. ఈ విషయం సుప్రీం కోర్టు చేత చెప్పించుకోవాలా? మీ అధికారగణం ఎవరూ చెప్పలేదా? చెప్పివుండకపోతే వాళ్లు అర్హత లేనివారని, మీ పక్షపాతబుద్ధి కారణంగా, కులతత్వ కారణంగా ఆ పదవుల్లో ఉన్నారనీ అనుకోవాలి.

ఇక కులం మాట ఎత్తి జగన్‌ కమ్మ కులస్తుల మనోభావాలను దెబ్బ తీశారని తప్పకుండా చెప్పాలి. 2019 ఎన్నికలో 35% మంది కమ్మలు వైసిపికి ఓటేశారని అంటున్నారు. వారు నాలిక కరుచుకునే పరిస్థితి రాకూడదు. కులమతాలకు అతీతంగా కమిషనర్‌ వ్యవహరించాలి అని చెప్పిన పాఠాలు మీకూ వర్తిస్తాయి. విమర్శను రమేశ్‌కు పరిమితం చేయకుండా ఆయన కులాన్ని పిక్చర్‌లోకి తీసుకురావడంతో జగన్‌ చాలా నష్టపోతారు. బాబు ప్రాంత ముద్రలు కొడుతున్నారు. రాయలసీమ రౌడీయిజం అంటూ. మీరు కులముద్రలు కొడుతున్నారు. రాయలసీమ ఆయన చేజారింది. కమ్మలు మీకు ఎదురు తిరుగుతారు.

కులం కార్డు ఉపయోగించి బాబు డర్టీ గేమ్స్‌ ఆడుతున్నారంటూ విలన్‌గా చూపిద్దామనుకుంటే అది ఏ బొత్స నోటి మీదుగానో అనిపించాలి తప్ప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కులం గురించి మాట్లాడకూడదు. వేరెవరూ కాకుండా బొత్స అని ఎందుకు అంటున్నానంటే మండలి చైర్మన్‌ను పట్టుకుని ‘సాయిబుకే పుట్టావా?’ అన్నారని వార్త వచ్చింది. దానిపై ఆయనా ఫిర్యాదు చేయలేదు. బొత్సలో సౌలభ్యం ఏమిటంటే ‘నేను అన్నది అది కాదు’ అని ఆయన అనేసినా దిక్కు లేదు, ఓ పట్టాన అర్థమై చావదు కనుక! .

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?