Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: స్థానిక ఎన్నికలు – ఎన్నికల కమిషనర్

ఎమ్బీయస్‌: స్థానిక ఎన్నికలు – ఎన్నికల కమిషనర్

ఆంధ్రలో స్థానిక ఎన్నికల ధర్మమాని అన్ని వ్యవస్థల విలువల వలువలు జారిపడ్డాయి. స్థాయి పతనమై ప్రజలు ముక్కున వేలు వేసుకునే పరిస్థితి దాపురించింది. ఎన్నికలంటేనే ప్రజాస్వామ్యానికి గుర్తు. స్థానిక ఎన్నికలంటే ఆ సందర్భంగా గ్రామస్థాయిలో కూడా ప్రజాస్వామ్యం నెలకొందని చెప్పుకోవాలి. అలాటిది యీ ఎన్నికలు రచ్చో, రచ్చస్య, రచ్చభ్యహలా మారిపోయాయి. ఈ రొచ్చుభాగోతంలో ఎవరెవరు ఏ చీదర పాత్ర వహించారో చూద్దాం. ఇప్పుడు - ఎన్నికల కమిషనర్‌

ఈయన చేష్టలన్నీ వింతగా ఉన్నాయి. ప్రకటన వెలువడ్డాక ఎన్నికల సందర్భంగా హింస జరుగుతున్నపుడు చురుగ్గా వ్యవహరించాలి. పత్రికల్లో వచ్చే వార్తలకు సైతం స్పందిస్తూ, రిపోర్టులు తెప్పించుకుంటూ, పోలీసులని పిలిపించి మాట్లాడుతూ ‘కళ్లు తెరిచి చూస్తున్నా, అవసరమైతే మూడో కన్ను తెరుస్తా’ అన్నట్లు ఉండాలి. అదేమీ చేయలేదు. ఈ నిష్క్రియాపరత్వంపై శనివారం రాత్రి ఆంధ్రజ్యోతి టీవీలో ‘కొత్త పలుకు’ వినగానే ఆదివారం పొద్దున్నే ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రకటించేశారు. దానితో బాటు కొందరు అధికారులను ఎడాపెడా బదిలీ చేసేశారు. అతివృష్టి, అనావృష్టి అంటే యిదే కాబోలు.

ఎవరితో చర్చించారు? - న్యాయం చేసినా, న్యాయం జరిగినట్లు కనబడాలి అని చెప్తూంటారు. ఇంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకునేటప్పుడు చేపట్టవలసిన ప్రక్రియ ఏమీ చేపట్టలేదు. వాయిదా వేయడానికి కరోనాను వాడుకున్నారు. తనకు సొంతంగా ఎంత వైద్యపరిజ్ఞానం ఉన్నా, దానికో శాఖ ఉంది. వాళ్లను పిలిచి ఏం చేయాలి, ఏం చేస్తున్నారు, ప్రమాద తీవ్రత ఎలా వుంది అనే డిస్కషన్‌ పెట్టాలి. అదేమీ లేదు. వైద్యశాఖలో ఉన్నతాధికారులతో మాట్లాడాను అని ప్రెస్‌ మీట్‌లో చెప్పారు. జగన్‌ తన మీట్‌లో చీఫ్‌ సెక్రటరీని, హెల్త్‌ సెక్రటరీని అటూయిటూ కూర్చోబెట్టుకుని ‘వీళ్లతో మాట్లాడలేదు, వీళ్లని మించిన ఉన్నతాధికారులు ఉన్నారా?’ అని అడిగారు.

అప్పుడైనా కమిషనర్‌ నేను మాట్లాడినది ఫలానా వాళ్లతో అని చెప్పలేదు. గతంలో మార్గదర్శి విషయంలో రామోజీరావు యిలాగే ‘మేం డిపాజిట్లు సేకరించవచ్చని ఇన్‌కమ్‌టాక్స్‌ డిపార్టుమెంటులో ఒక ఉన్నతాధికారి చెప్పారు’ అని చెప్పారు తప్ప ఆయన పేరు చెప్పలేదు. ఈనాడు నిండా ‘పేరు చెప్పడానికి యిష్టపడని ఒక నాయకుడు’ వార్తలు చాలా ఉంటాయి. ఇదీ అలాటిదే అయింది. తర్వాత ఎంత రొక్కించినా రామోజీరావు ఆ అధికారి పేరు చెప్పలేదు. చివరకు ఆ సేకరణ తప్పని తేలింది. కోర్టు అందరికీ వెనక్కి యిప్పించడంతో ఈనాడు సంక్షోభంలో పడింది. ముకేశ్‌ అంబానీ దిగివచ్చి కాపాడవలసి వచ్చింది.

వెటకారాలొకటి.. - ఇప్పుడీ కమిషనర్‌ చీఫ్‌ సెక్రటరీకి ఉత్తరం రాస్తూ ఆ ఉన్నతాధికారుల పేరు ప్రస్తావించలేదు. ‘నేను 14న కేంద్ర ఆరోగ్యశాఖను సంప్రదించాలని మిమ్మల్ని కోరాను. అంతకుముందే ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడాను. అయినప్పటికీ మాకు ఎలాంటి సమాచారం పంపలేదు. బహుశా ఆరోగ్యశాఖ చాలా బిజీగా ఉన్నట్లుంది.’ అంటూ వ్యంగ్యంగా రాశారు. అంతకు ముందే అన్నారు తప్ప ఎప్పుడో చెప్పలేదు. రాష్ట్రంలో కరోనా ఉన్నపుడు ఆరోగ్యశాఖ బిజీగా వుండకపోతే తప్పుకానీ వుంటే తప్పు కాదు.

ఆ కార్యదర్శి కమిషనర్‌ నాతో మాట్లాడలేదని యిప్పటికే చెప్పారు. అయినా శనివారం యీయన చీఫ్‌ సెక్రటరీతో మాట్లాడినప్పుడు అప్పుడే ఫిర్యాదు చేయాలి కదా, చేసి వుంటే లేఖలో రాసి వుండేవారు. మర్నాడు పొద్దున్న కల్లా వాయిదా ప్రకటన చేసేయడమేమిటి? పైగా ఎన్నికల కమిషన్‌ సెక్రటరీకి కూడా దీని గురించి చెప్పకపోవడమేమిటి? ఇది లాకాయిలూకాయి వ్యవహారం కాదు. రాష్ట్ర పాలనా వ్యవస్థను, ఆర్థికవ్యవస్థను అతలాకుతలం చేసే విషయం. కాస్త ఓపిక పట్టవద్దా?

నిధుల విడుదల హామీ తమరివ్వగలరా? - ఈ వాయిదా వలన రాష్ట్రానికి రావసిన 5 వేల కోట్లు ఆగిపోతాయని ముఖ్యమంత్రి మొత్తుకుంటున్నారు. ‘ఆర్థికశాఖలో పనిచేసిన అనుభవం నాకుంది. ప్రస్తుతానికి యివ్వరు కానీ, ఎన్నికలయ్యాక విడుదల చేస్తారు, గతంలో అలా జరిగింది’ అని కమిషనర్‌ తన లేఖలో రాశారు. ఫిబ్రవరి 28న కమిషనర్‌ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో యీ విషయం చర్చకు వచ్చిందని దానికి హాజరైన వైసిపి నాయకుడు చెప్పారు. ‘గతంలో అలా యిచ్చేవారు కానీ రెండేళ్లగా రూల్సు మారాయి. ఇప్పుడైతే యివ్వరు, అందుకే వాయిదా వేయడం కుదరదు’ అని కమిషనరే ప్రతిపక్షం వాళ్లకు చెప్పారని ఆయన అంటున్నాడు.

మోదీ ప్రభుత్వం నిబంధనలు పాలించడంలో కచ్చితంగా ఉంటోంది. ఎన్‌డిఏ వచ్చాక ఇన్‌కమ్‌ టాక్స్‌లో కానీ, మరో దానిలో కానీ జరిమానాలు పెరిగాయి, వెసులుబాట్లు తగ్గాయి. రాష్ట్రం తప్పు చేస్తే క్షమించి వదిలేస్తుందన్న గ్యారంటీ లేదు. ముఖ్యంగా ఆంధ్రకు హోదా యివ్వలేదు, వెనకబడిన జిల్లాలకు యివ్వాల్సింది యివ్వలేదు, లోటు భర్తీ బకాయిలు అలాగే ఉన్నాయి, అన్ని రాష్ట్రాలతో బాటు జిఎస్‌టి బకాయిలు తొక్కిపెట్టింది. ఇలాటి పరిస్థితిలో 5 వేల కోట్లు ఎగ్గొట్టే వీలు వున్నచోట ఎగ్గొట్టదా? ఏమో కరోనాతో ఒక విశేష పరిస్థితి ఏర్పడింది కాబట్టి నిధులిస్తుందని ఆశిద్దాం.

తమరికీ కోర్టు చెప్పాలా? - ఇక అధికారుల బదిలీ విషయం - కమిషనర్‌ గారు ఏకంగా ఆరువారాల పాటు వాయిదా వేశాడు. అప్పుడైనా కరోనా పరిస్థితి చూసి మళ్లీ వాయిదా వేస్తే వేయవచ్చు. సరే, యీ లోగా కోడ్‌ నిబంధన ఉపయోగించుకుని రాష్ట్రాన్ని తనే పాలించేద్దామని చూస్తే ఎలా? ముఖ్యమంత్రి పరిధి ఏదో, కమిషనర్‌ పరిధి ఏదో కోర్టు చేత చెప్పించుకోవాలా? జగన్‌ అయితే రాజకీయనాయకుడు, తమరేమో అధికారి. రూల్సు కాచివడపోసిన వ్యక్తి. స్వతంత్రంగా పనిచేసే వ్యవస్థను నడుపుతున్నారు. మంత్రిగారు చెప్పారు కాబట్టి చేయాల్సి వచ్చింది అనడానికి లేదు. అలాటప్పుడు యింత తప్పు చేస్తే ఎలా? మీ ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం పౌరులకు కలగాలి. మీ వ్యవహారం, సెటైర్లు చూస్తూంటే మీరే ప్రతిపక్షం పాత్ర పోషించేయాలన్న యావ కనబడుతోంది. అది కనబడకుండా చూసుకోవాలి కదా!

చివరగా - కమిషనర్‌గారి పేర ఒక ఉత్తరం బయటకు వచ్చింది. ఆయన లెటర్‌హెడ్‌, ఆయన సంతకం. అది వెలువడి, నాలుగైదు గంటల పాటు టీవీల్లో వీరవిహారం చేశాక కూడా ‘అది నేను రాసింది కాదు’ అని ఖండించకపోతే ఎలా? ఎవరైనా సరే తన పేర దుష్ప్రచారం జరగనిస్తారా? ఎవరో వచ్చి అడిగేదాకా దాని గురించి చెప్పకపోవడమేం? చెప్పాక కూడా యింకా వార్తలు వచ్చేస్తూ ఉంటే కనీసం ఓ స్టేటుమెంటు విడుదల చేయాలి. అజ్ఞాతవాసంలో ఉండడమేమిటి? తీరిక లేదు కాబోలు అంటూ ఆరోగ్యశాఖ అధికారుల మీద సెటైర్లు వేశారు కదా, అది ఆయనకు అన్వయించదా?

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2020)

    [email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?