cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: స్థానిక ఎన్నికలు - మీడియా

ఎమ్బీయస్‌: స్థానిక ఎన్నికలు - మీడియా

ఆంధ్రలో స్థానిక ఎన్నికల ధర్మమాని అన్ని వ్యవస్థల విలువల వలువలు జారిపడ్డాయి. స్థాయి పతనమై ప్రజలు ముక్కున వేలు వేసుకునే పరిస్థితి దాపురించింది. ఎన్నికలంటేనే ప్రజాస్వామ్యానికి గుర్తు. స్థానిక ఎన్నికలంటే ఆ సందర్భంగా గ్రామస్థాయిలో కూడా ప్రజాస్వామ్యం నెలకొందని చెప్పుకోవాలి. అలాటిది యీ ఎన్నికలు రచ్చో, రచ్చస్య, రచ్చభ్యహలా మారిపోయాయి. ఈ రొచ్చుభాగోతంలో ఎవరెవరు ఏ చీదర పాత్ర వహించారో చూద్దాం. ఇప్పుడు - మీడియా

ఆంధ్ర రాజకీయాల్లో మీడియా పాత్ర ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంది. దీనిలో మరీనూ...! హింసాత్మక ఘటన గురించి టిడిపి నాయకుల ఆరోపణలనే ప్రముఖంగా వేస్తున్నారు తప్ప నిజానిజాలివి అని వేయటం లేదు. గతంలో యిలాటివి జరగలేదా అని జగన్‌ అన్నపుడు గత స్థానిక ఎన్నికలలో జరిగిన ఘర్షణలను, కేసులను తమ ఆర్కయివ్స్‌ నుంచే వెలికిదీసి పోల్చి చూపాలి తప్ప ప్రస్తుత ప్రభుత్వంతో తలపడినట్లు ప్రవర్తిస్తే ఎలా?

ఎవరి పరిధి ఏదో వీరికైనా తెలియదా? - ఆంధ్రజ్యోతిలో ఎన్నికల కమిషనర్‌ చేతకానితనాన్ని నిందిస్తూ మార్చి 15న ఓ వ్యాసం వెలువడింది. ముందురోజు టీవీలో దాన్ని చదివారు. ఆదివారం ఉదయమే కమిషనర్‌ కొరడా ఝళిపించాడు. అద్భుతం అంటూ మెచ్చుకున్నారు తప్ప, ఈ ఆరువారాలూ అధికారాన్ని తన చేతిలో తీసుకోవడం ఎబ్బెట్టుగా వుందని ఎత్తిచూపలేదు. ఆ పని సుప్రీం కోర్టు చేయాల్సి వచ్చింది. అంటే యీ మీడియా కూడా వలపక్షం చూపినట్లే కదా!

ఇక సాక్షి దగ్గరకు వస్తే కమిషనర్‌ను కులం గాటికి కట్టేయడంతో పాటు, ఆయన కూతురికి జాస్తి కృష్ణకిశోర్‌ టీములో పదవి యిచ్చారని చెపుతూ బాబుకి యీయనకూ ఉన్న లింకును ఎస్టాబ్లిష్‌ చేయడానికి చూశారు. కూతురైతే కావచ్చు కానీ ఆవిడకు విడిగా అర్హతలు లేవని ఎక్కడా నిరూపించలేదు. ఆవిడ ప్రభుత్వ ఖర్చుతో ఫారిన్‌ ట్రిప్స్‌కు వెళ్లడం కూడా తప్పుగానే చూపిస్తున్నారు. పెట్టుబడుల కోసం అందరూ వెళ్లినట్లే ఆవిడా వెళ్లింది. అదీ తప్పేనా?

బోగస్‌ లేఖకు అంత హైప్‌యా? - మార్చి 18న కమిషనర్‌ పేర హోం సెక్రటరీకి రాసిన లెటరు అంటూ వెలువడింది. వెలువడిన కొన్ని గంటల్లోనే కమిషనర్‌ ఆఫీసు నుంచి ఓ అధికారి ఆఫీసుకి, దానికి సంబంధం లేదని చెప్పేశారు. రాత్రి 10 గంటల ప్రాంతానికే, అంటే పేపర్లు ప్రింటుకి వెళ్లడానికి ముందే అది బోగస్‌ అని తెలిసిపోయింది. అయినా ఆంధ్రజ్యోతి మర్నాడు ఉదయం యథాతథంగా పూర్తి పాఠం వేసింది.  ఎకనమిక్‌ టైమ్స్‌ కూడా వేసింది. ఈనాడు లేఖ వేసి, దాన్ని కమిషనర్‌ ఖండించారంటూ జోడించింది. ఖండించినప్పుడు యిక దాన్ని వేయడం ఈనాడు పతనాన్ని సూచించింది.

జ్యోతి ఖండన విషయం వెయ్యనే లేదు. పైగా కేంద్రం స్పందించిందంటూ బిజెపి వర్గాలు చెప్పాయంది. 20 నాటి పేపర్లో గవర్నరు దానిపై చర్యలు కూడా తీసుకున్నారని వేసింది. కమిషనర్‌ను సంప్రదించి నిజానిజాలు తేల్చుకునే ప్రయత్నమే లేదు. ఆయన ప్రాణభీతితో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే బిల్డప్‌ యిస్తోంది మీడియా. ఆ లేఖ ఎవరు రాశారో, ఎవరు మీడియాకు విడుదల చేశారో యింకా తెలియలేదు. దానిలో ఉన్న అభ్యంతరకర విషయాల్లో మద్యం, ధనం సరఫరా నిరోధిస్తూ తీసుకుని వచ్చిన ఆర్డినెన్సుపై విమర్శ ఒకటి. నిజానికి కమిషన్‌ పట్టుబట్టవసిన రూలు అది. అలాటిది వాళ్లే దాన్ని డ్రాకోనియన్‌ లా అనడమేమిటి?

మరో జెడి ఇన్‌ మేకింగ్‌? - ఈ వైరుధ్యాన్ని ఈ పత్రికలు ఎత్తి చూపలేదు, విమర్శించలేదు. పైగా ఆ ఆర్డినెన్సు చేయడం తప్పు అని వాదిస్తూ వచ్చిన ఆంధ్రజ్యోతి లైనుకి అనుగుణంగానే యీ లేఖాంశం ఉంది. ఇది మాత్రమే కాదు, మొత్తం లేఖంతా ప్రతిపక్షాల వాదనతోనే నిండి వుంది. ‘...ఫ్యాక్షన్‌ నేపథ్యం’ అని కూడా రాశారు. అది నిజమని నమ్మితే మాత్రం రమేశ్‌ కుమార్‌ గార్ని ప్రతిపక్షాలు తమ నాయకుడిగా ఎన్నుకోవచ్చు. గతంలో జెడి లక్ష్మీనారాయణ గార్ని ఎత్తేసినట్లు యీయన్నీ ఎక్కడికో తీసుకుపోవచ్చు.

బాధ్యతగల మీడియా అయితే ఎన్నికల కమిషనర్‌ వంటి అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి పేరు దుర్వినియోగం చేసినందుకు, ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసినందుకు సదరు వ్యక్తులపై చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండు చేయాలి. అలా చేయకపోగా, ‘తన ప్రాణాలకు, తన కుటుంబానికి రక్షణ లేదని ఆయన వాపోయినట్లుగా ఉన్న భాగాన్నే హైలైట్‌ చేశారు. ఇది అత్యంత దురదృష్టం.   ఇది యిక్కడితో ఆగుతుందో యింకా పతనమౌతుందో చూడాలి.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2020)
 mbsprasad@gmail.com