Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: లాక్‌డౌన్‌ సమీక్షాకాలం

 ఎమ్బీయస్‌: లాక్‌డౌన్‌ సమీక్షాకాలం

ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఫలితాల గురించి సమీక్షించుకుని భవిష్యత్‌ ప్రణాళికలను రూపొందించు కుంటున్నాయి. ఇది శుభసూచకం. విధించినపుడు విస్తృతమైన చర్చలు జరపకుండా, రాష్ట్రాలను యిన్‌వాల్వ్‌ చేయకుండా కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో అక్కరలేదని, కొన్ని రంగాలలో మినహాయింపులు యివ్వాలని అర్థం చేసుకుంది. కేంద్రం యిచ్చిన సూచనలను యథాతథంగా అమలు చేయకుండా రాష్ట్రాలు సొంత నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాయి. అంతిమంగా ఏ నిర్ణయం మంచిదో, కాదో తర్వాత తెలుస్తుంది. కానీ నిపుణులతో సంప్రదించి చేస్తున్నారు. అంతవరకు హర్షిద్దాం.

మే 7 వరకు పొడిగిస్తామని, కేంద్రం 20 నుంచి యిచ్చిన మినహాయింపులు రాష్ట్రంలో వర్తించవని నిన్న కెసియార్‌ ప్రకటించారు. మే1 తర్వాత కర్వ్‌ ఫ్లాటెన్‌ అవుతుందని లెక్క వేస్తున్నామన్నారు. ఇంతకుముందు కాళ్లూపుకుంటూ ‘జూన్‌ 3 దాకా పొడిగించేయాలి’ అన్నట్టుగా కాకుండా ఆలోచించి చేస్తున్నానమనడం సరైన పద్ధతి. ఆయన స్థానంలో మరొకరు ఉంటే అవే యిన్‌పుట్స్‌తో వేరే రకమైన నిర్ణయం తీసుకోవచ్చు. అది వేరే విషయం. చర్చంటూ జరిగింది. సంతోషం.

యుద్ధం చేయమని సేనాధిపతికి బాధ్యత అప్పగించాక, ఆయన ఏం చేసినా భరించాలి. కానీ ఆయన తన సైన్యంలోని యితర సేనాధిపతులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. మోదీ విషయంలో నేను తప్పుపట్టినదదే. రాష్ట్రాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సింది అని. ఎందుకంటే లాక్‌డౌన్‌ అమలు చేయవలసినది రాష్ట్రాలే. స్థానిక పరిస్థితులపై వాళ్లకే ఎక్కువ అవగాహన వుంటుంది. జనవరి 30న కరోనా మొదటి కేసు కనబడినా 80 రోజుల తర్వాత 56% జిల్లాల్లో అంటే 400టిలో కరోనా రానే లేదని కేంద్రమే చెప్పింది. ఆ తర్వాత తక్కినవాటిల్లో 170 జిల్లాలు మాత్రమే హాట్‌స్పాట్స్‌ అంది. 207 హాట్‌స్పాట్స్‌ అయ్యే ప్రమాదం ఉందని చెప్పింది.

జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుంది కాబట్టి యీ అంకెలు వచ్చాయి. ఈ ప్రకారం ఆంధ్రలోని 13 జిల్లాలలో 11 జిల్లాలు కరోనా పీడితలుగా గుర్తింపబడ్డాయి. దీనితో ఆంధ్ర ప్రభుత్వం విభేదించింది. రాష్ట్రాన్ని మండళ్ల వారీగా విడగొట్టి మొత్తం 676 మండలాల్లో 88% గ్రీన్‌ జోన్‌ అని 6% మాత్రమే రెడ్‌ జోన్‌ అని, 6% ఎల్లో జోన్‌ అని కనిపెట్టింది. అందువలననే ఆంధ్రలో లాక్‌డౌన్‌ సడలిస్తున్నారు. తెలంగాణ యిలాటి వివరాలు యివ్వకుండానే కఠినతరం చేసింది. ఎవరి లాజిక్‌ వారికి ఉండవచ్చు.

పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు. అమెరికాలో జరిగినది మనకు వర్తించాలని లేదు, అందర్నీ ఒక గాట కట్టకూడదని రాస్తూనే ఉన్నా. ఇక్కడ పుట్టి, పెరిగి నాలుగేళ్లు అమెరికాలో ఉండి వచ్చినవాడు యిక్కడి మంచినీళ్లు తాగితే జబ్బు పడుతున్నాడు, మనం పడం. కోస్తా జిల్లాల్లో పుట్టి పెరిగి, బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నవాడు సొంత వూరికి వస్తే స్థానికులకంటె ఎక్కువగా చెమట్లు కక్కుతాడు. కశ్మీర్‌ జనాలకు స్వెటర్లు కావాలి కదాని తమిళనాడులో పంచిపెడితే వాళ్లేం చేసుకుంటారు? కేరళ వాళ్లకి రెయిన్‌కోట్స్‌ అవసరం కదాని రాజస్థాన్‌లో పంచితే ఏం చేసుకుంటారు?

ఇప్పుడీ కరోనా విషయంలో 10 లక్షల మంది జనాభాకు చేసిన టెస్టింగు జాతీయస్థాయిలో 225 దరిదాపుల్లో వుంటే కేరళలో 480 దాకా వుంది. కర్ణాటకలో 182 ఉంది. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కేరళ విజయం సాధిస్తూండగా మహారాష్ట్ర వెనకబడుతోంది. దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో ఎక్కడా కరోనా లేదట. ఇలా ఒక్కో చోట ఒక్కోలా వున్నపుడు, ప్రజల నివాసాలు, ఆరోగ్యపు అలవాట్లు లెక్కలోకి తీసుకుని, ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ స్ట్రాటజీ మార్చుకుంటూ పోవాలి. ఇకపై అదే జరుగుతుందని ఆశిద్దాం.

ఏ విషయంలోనైనా స్వాట్‌ ఎనాలిసిస్‌ చేయమని మేనేజ్‌మెంటు సూత్రం. బలాలు, బలహీనతలు, అవకాశాలు, ప్రమాదాలు వేటినీ ఎక్కువగా కానీ తక్కువగా కానీ అంచనా వేయకూడదు. కరోనా ప్రమాదాన్ని ఎక్కువగా అంచనా వేసి అధిక జాగ్రత్తలు తీసుకున్నా నష్టపోతాం. ఉదాహరణకి చెప్పాలంటే, ఒక గది తలుపు వేసేసి వుందనుకుని మనం దూరం నుంచి పరిగెట్టుకుని వచ్చి గుద్దామనుకోండి, తలుపు గడియ తీసే వుంటే లోపలకి దొర్లి పడతాం. అలాగే ఏదైనా వస్తువును ఎత్తినపుడు ఎంత బలం కావాలో అంతే అప్లయి చేయాలి తప్ప ఎక్కువ చేయకూడదు.

ఏం చేసినా సైడ్‌ ఎఫెక్ట్‌స్‌ వుంటాయి. రోగానికి మందు యిస్తారు, మందు వలన అవాంఛిత పరిణామాలూ వుంటాయి. అలా అని మందు వాడకుండా వుండలేరు. ఈ సైడ్‌ ఎఫెక్ట్‌స్‌ ఒక్కో రోగికి ఒక్కోలా వుంటాయి. అవి తగ్గడానికి వేరే మందు యిస్తారు, లేదా అసలు మందే మారుస్తారు. రోగిని బట్టి, చికిత్సకు అతను రెస్పాండ్‌ అయ్యే విధానం బట్టి డాక్టరు మందు మారుస్తూ, మోతాదు హెచ్చిస్తూ, తగ్గిస్తూ పోతాడు. లాక్‌డౌన్‌ విషయంలోనే అదే జరగాలి. లాక్‌డౌన్‌ అవసరమే కానీ, ఫేజ్‌ వైజ్‌ పెట్టి వుండాల్సిందని, తీసేటప్పుడూ దశలవారీగా తీసేయాలనీ నా అభిప్రాయం. మొదటిది జరగకపోయినా, రెండోది జరుగుతోంది.

నేను లాక్‌డౌన్‌ గురించి ఏదైనా అనగానే అదిగో మోదీని అనేశావ్‌ అంటూ కొందరు విరుచుకు పడిపోతూంటారు. తాము ప్రతిపక్షంలో వున్న రాష్ట్రాలలో లాక్‌డౌన్‌ సరిగ్గా అమలు కావటం లేదని బిజెపి వాళ్లంటే తలూపుతారు. మరి అవి కూడా దేశంలో భాగమేగా! అలాటప్పుడు లాక్‌డౌన్‌ ఘనవిజయం సాధించిందని ఎలా అనగలరు? మోదీ ప్రతి రాష్ట్రంలోనూ లేడు కదా. లాక్‌డౌన్‌ పెట్టేరు కాబట్టే కరోనా అదుపులో వుందని, లేకపోతే విచ్చలవిడిగా పెరిగిపోయేదని వీరు వాదిస్తూ ఉంటారు.

ఇది జోస్యం లాటిది. ఓ జ్యోతిష్కుడు వచ్చి మీకు గండం వుంది. రాహు పూజలు, చండీ హోమాలు చేయాలంటాడు. అన్నీ చేసినా కాలు విరిగిందనుకో. ఇదేమిటి అని అడిగితే నిజానికి ప్రాణానికే ముప్పుంది. పూజ వలన కాలితో పోయింది అంటాడు. పూజలు చేసినా కనీసం కాలు విరగక తప్పదని ముందే చెప్పాలిగా అని అడిగితే, ముందే చెప్తే కంగారు పడతారని చెప్పలేదు అంటాడు. మీరు ఆయనతో వాదించలేరు, దణ్ణం పెట్టి ఊరుకోవడమే.

ప్రజలకు హెచ్చరికలు చెప్పాలి, లాక్‌డౌన్‌ ఉండాలి కానీ చైనాలోలా డేంజర్‌ జోన్‌కు పరిమితం చేయాలి తప్ప దేశమంతా అక్కరలేదు, అప్పుడే మానిటార్‌ చేయడం, నియంత్రించడం సులభం అని నా భావన. ప్రపంచంలో 195 దేశాలుంటే 42టిల్లో మాత్రమే సంపూర్ణ లాక్‌డౌన్‌ చేశారని గమనించాలి. కొన్నిటిలో దీర్ఘంగా వుంది. కొన్నిటిలో హ్రస్వంగా వుంది. కొన్నిటిలో ఎత్తేసి, కొన్నాళ్లకు మళ్లీ పెట్టారు. వీటిలో మనకు ఏది అనుకరణీయమో చర్చించి లాక్‌డౌన్‌ విధించారా అన్నదే ప్రశ్న.

అసలీ దేశంమొత్తం లాక్‌డౌన్‌ ఐడియా ఎవరికి ఎలా వచ్చిందాని పరిశోధించాలి. ఎందుకంటే యిది చాలా దేశాలకు ఆత్మహత్యాసదృశంగా పరిణమిస్తోంది. వారి కంపెనీలు చైనా వాళ్ల చేతిలోకి వెళ్లిపోతున్నాయి. రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యం అని విన్నాం. ఇప్పుడు చైనా సామ్రాజ్యం అనాల్సి వచ్చేట్టుంది. గతంలో యుద్ధాలు చేసి సాధించారు. ఇప్పుడు జస్ట్‌ మానిప్యులేషన్‌తో సాధిస్తున్నారు. నిధుల కొరత వలన ప్రపంచ ఆరోగ్యసంస్థ చైనా చెప్పినట్లు ఆడుతోందని యివాళ ట్రంప్‌ అనడమే కాదు, ఈ ఆరోపణ గత కొద్దికాలంగా వింటున్నాను. దేశమంతా లాక్‌డౌన్‌ చేస్తే మంచిది, దాన్ని పొడిగిస్తే మంచిది అని ఆరోగ్య సంస్థ సూచిస్తోందా? ఒకవేళ సూచిస్తే చైనాకు మేలు చేయడానికా?

ఎందుకంటే చైనా ఉదాహరణే తీసుకుని వుంటే ఆ యా దేశాలు ప్రభావిత రాష్ట్రాలకే లాక్‌డౌన్‌ పరిమితం చేసి వుండాల్సింది. దేశమంతా చేసి ముప్పు తెచ్చుకోవడం దేనికి? ఈ విషయమై ఎవరైనా గట్టిగా పరిశోధన చేస్తే బాగుంటుంది. వైరస్‌ను చైనా సృష్టించిందా లేదా అన్నది కనుక్కోవడం కష్టం కానీ యిది మరీ అంత కష్టం కాదనుకుంటాను. కుట్ర ఏమీ లేదనుకున్నా ప్రపంచ ఆరోగ్యసంస్థ లౌక్‌డౌన్‌ అంటే ఆరోగ్యకోణం మాత్రమే చూస్తుంది. ఆర్థికం వాళ్ల పర్‌వ్యూ కాదు, అన్ని కోణాలలోంచి చూసుకుని, బాలన్స్‌ చేసుకోవలసినది మనమే! శత్రువు దాడి చేసినపుడు కోటలోని వారు కందకం వంతెనలు ఎత్తేసి, తలుపులు మూసేసి లోపల కూర్చుంటారు. అప్పుడు కోటలో స్టాకు ఎంత వుందో, ఎన్నాళ్లకు వస్తుందో అన్నీ లెక్కలు వేసుకుని ఆ నిర్ణయం తీసుకుంటారు.

లాక్‌డౌన్‌ ఒకసారి సడలిస్తే రోగం వ్యాపించడం ఖాయమని మొండిగా వాదించేవారుంటారు. మొన్నటిదాకా అత్యవసర సేవలంటూ అనేకమందికి సడలించలేదా? ఉదయం 11 వరకు కూరలకని, షాపులకని వదిలేస్తున్నారుగా! వారందరి వలనా వ్యాపిస్తోందా? పాలు, నీళ్లు, విద్యుత్‌ ఉత్పాదన, పంపిణీ విభాగాల్లో ఉన్నవారు, మందులు, కూరగాయలు, కిరాణా సరుకులు యివన్నీ ఎలా వస్తున్నాయి? వైద్యసిబ్బంది, ఆసుపత్రుల సిబ్బంది, పోలీసు సిబ్బంది, పారిశుధ్యపనివారు, పెట్రోలు బంకుల వారు, టీవీ స్టాఫ్‌, ఇంటర్నెట్‌ సౌకర్యాలు చూసేవారు, యిలా కోట్లాది మంది బయటకు వచ్చి పనిచేస్తున్నారు కదా! ఇవాళ వీళ్లు తీసుకుంటున్న జాగ్రత్తలే, రేపు తక్కినవాళ్లూ తీసుకుంటారు.

ప్రతివాడికీ ప్రాణం ముఖ్యమే! మాస్కులు కట్టుకుంటారు, కాస్త అసింటా వుండు నాయినా అంటారు. కొంతకాలం పాటు పార్టీలు, సినిమాలకు దూరంగా వుంటారు. కాదూకూడదని వెళితే వాళ్లను యింట్లో వాళ్లే దూరంగా పెడతారు. ఒంటరిగా వుండేవాళ్లయితే యింటి పక్కవాళ్లే వార్నింగు యిస్తారు. మనవాళ్లకు బుద్ధి లేదు, ఇప్పటికే కట్టు తప్పుతున్నారు. ఎత్తేస్తే యింకా రెచ్చిపోతారు అని వాదిస్తున్నారు. కాదనలేం. అలా అని పనులు మానలేం కదా. గోదావరి పుష్కరాల్లో జనం తోపులాటకు దిగి చచ్చిపోయారు. మరి కృష్ణా పుష్కరాలు జరపడం మానారా?

కర్ఫ్యూ సమయంలో ఎవరైనా తుంటర్లు బయట తిరిగినా కాస్సేపే తిరుగుతారు. ఏమైనా ఎంటర్‌టైన్‌మెంటు ఉంటే యింకాస్సేపు తిరిగేవారు. తమ సాహసం చూసి చప్పట్లు కొట్టేవారు ఎవరూ లేనపుడు తిరిగి ప్రయోజనం ఏముంది? అందువలన కాస్సేపటికే  రూల్సు ఉల్లంఘించాం, ఏదో సాధించాం, చాలు అనే తృప్తితో తిరిగి వచ్చేస్తారు. ఇక బేఫర్వాగా వుండేవాళ్లంటారా? ఇప్పటికే వాళ్లున్నారు. కర్ణాటక ఎమ్మేల్యే పుట్టినరోజు పండగ చేశాడు. కుమారస్వామి కొడుకు పెళ్లి చేశాడు. రేపు రంజాన్‌లో కొంతమంది మసీదుకు వెళ్లి తీరతామని, అల్లాయే అన్నీ చూసుకుంటాడనీ పట్టుబట్టవచ్చు. వాటితో డీల్‌ చేయాల్సిందే. వాళ్ల గురించి 135 కోట్ల మందికి లాక్‌డౌన్‌ శిక్ష పొడిగిస్తూ పోలేం. రెండేళ్ల దాకా కరోనా ఉంటుందంటున్నారు, యీ లోపున మరో వైరస్‌ వస్తుంది. ఇలాటివి ఎన్ని చూడాలో!

లాక్‌డౌన్‌ పెడితే ఓ రకమైన కష్టాలు, ఎత్తేస్తే మరో రకమైన కష్టాలు. పెట్టిన కష్టాలు చూశాం, తీసేసిన కష్టాలు చూద్దాం. ఎందుకంటే ఎక్కువకాలం మనుషులను కట్టడి చేసి ఆపడం కష్టం. రోడు క్రాస్‌ చేద్దామని కొందరు పాదచారులు ఆగారనుకోండి. వాహనాలు ఆగుతాయేమోనని చాలాసేపు చూస్తారు. వాళ్లు ఆగారు కదాని వాహనాలు వెళ్లిపోతూనే వుంటాయి తప్ప అయ్యోపాపమని తాము ఆగి వీళ్లను వెళ్లనివ్వరు. కాస్సేపటికి పాదచారుల్లో కొందరికి ఒళ్లు మండుతుంది. ఎహెయ్‌ అంటూ రోడ్డుకి అడ్డంగా నడవడం మొదలుపెడతారు. ఇక వాహనాలు చచ్చినట్లు ఆగుతాయి. ట్రాఫిక్‌ పోలీసైనా సరే, ఒకవైపు వాళ్లనే ఎక్కువసేపు వెళ్లనిస్తూ ఉంటే మరో వైపు వాళ్లు కాస్సేపే డిసిప్లిన్‌డ్‌గా వుంటారు. తర్వాత ఉల్లంఘిస్తారు. ఏరు పొంగింది, కాస్సేపు ఆగండి అంటే ఆగుతారు. కాస్త తగ్గుముఖం పట్టగానే దాటడానికి చూస్తారు.

ఇలాటి కేసుల్లో నూటికి 99 సందర్భాల్లో ఏమీ అవదు. అందువలననే ప్రజల ధీమా. మిగిలిన ఒక సందర్భం గురించి అడిగితే తలరాత అని సింపుల్‌గా తేల్చేస్తారు. ఇది ఇండియన్‌ సైకీ. పాశ్చాత్యుల సంగతి నాకు తెలియదు. నిజానికి ఇండియాలో లాక్‌డౌన్‌ను 80% కంటె ఎక్కువ మంది జనాభా నిజాయితీగా పాటించినట్లు తోస్తోంది. వీటి గురించి గణాంకాలు ఎవరూ చెప్పలేరు. ఫీలింగంతే. ఈ గుడ్‌విల్‌ కాపాడుకోవాలంటే లాక్‌డౌన్‌ త్వరగా ముగిస్తే మంచిది. జనాలు అసహనంతో తిరగబడితే అప్పుడు ఇన్ని కోట్లమందిని కట్టడి చేయడానికి ఎన్నిలక్షలమంది పోలీసులూ చాలరు. రిలాక్సు చేస్తే జనాలంతా చిత్తమొచ్చినట్లు తిరిగేసి, రోగుల సంఖ్య పెరిగిపోతుందని ఎంతకాలం భయపడతాం?

లాక్‌డౌన్‌ కొనసాగించినా, ఎత్తివేసినా రోగుల సంఖ్య పెరుగుతుంది, వారికి మందు కావాలి. ఫార్మా ఇండస్ట్రీ 20-30% కెపాసిటీతో మాత్రమే పనిచేస్తోందని, త్వరలో మందుల కొరత రాబోతోందని ఏప్రిల్‌ 11న ఫార్మా మంత్రిత్వశాఖ హోం శాఖను హెచ్చరించింది. ఉత్పాదన పెంచమని హోం శాఖ ఫార్మా రంగాన్ని హెచ్చరించింది. వారం తర్వాత చూస్తే 30-50%కి మాత్రమే పెరిగిందని వార్త. అదేమంటే ముడిసరుకు లేదు, వర్కర్లు రావటం లేదు, కొరియర్‌ సర్వీసు లేదు అని చెపుతున్నారు. మరో పక్క మన ప్రభుత్వం పారసిటమాల్‌ ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేసింది.

కోవిడ్‌పై చక్కగా పనిచేస్తోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ తాజాగా సర్టిఫై చేసిన హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ 29 మిలియన్‌ డోసులను ట్రంప్‌ మహాశయుడు బెల్లించి లాక్కున్నాడు. మందుల స్టాకులు తరిగిపోవడం లాక్‌డౌన్‌ కొనసాగింపువలన జరిగే ముఖ్యమైన కష్టాల్లో ఒకటి. లాక్‌డౌన్‌ సమయాన్ని ప్రభుత్వం కరోనాపై యుద్ధానికి సమాయత్తం చేయడానికి ఉపయోగించుకుంది అంటున్నారు కొందరు. దాని సంగతి యింకో వ్యాసంలో చూద్దాం. `

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?