cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: లాక్‌డౌన్‌ కష్టనష్టాలు

ఎమ్బీయస్‌: లాక్‌డౌన్‌ కష్టనష్టాలు

లాక్‌డౌన్‌ అనేది అన్ని వర్గా​ల​లో నిజంగా సాధ్యమా? ఉన్నత వర్గా​లు​, ఎగువ మధ్యతరగతి వర్గాలు​ విశా​ల​మైన యిళ్లల్లో, ఫ్లాట్లలో వుంటారు కాబట్టి మరీ సన్నిహితంగా వుండనక్కర లేకుండా గడపగ​ల​రు. రెండు, మూడు​​ గదు​ల​ వాటాల్లో ఉండే మధ్యతరగతి వాళ్లు రోజుల్లో 24 గంట​లూ​ అత్యంత సన్నిహితంగా వుండడం ఆరోగ్యానికి మంచిదేనా? మామూ​లు​గా అయితే కుటుంబసభ్యుల్లో ముప్పావు మంది రోజంతా బయటే గడుపుతారు కాబట్టి రోజులో పది, పన్నెండు గంట​ల​ కంటె అందరూ కలిసి వుండరు. వీళ్లల్లో ఎవరికీ కరోనా లేకపోయినా జ​లు​బో, దగ్గో, తుమ్ములో, ​జ్వరమో, ​ఏ​దో ఒకటి ​రావచ్చుగా. అవి వ్యాపించవా? ఇక ఈ వాటా​లు​ కూడా పక్కపక్కనే ఉంటూంటాయి. ఒక యింటి నుంచి మరో యింటికి అతి సు​ల​భంగా రోగా​లు​ వ్యాపిస్తాయి. సిగరెట్టు కాల్చే వాళ్లుంటే ఊపిరితిత్తు​ల​కు దెబ్బ కూడా.

ఇక దిగువ మధ్యతరగతివాళ్లు, పేద​లు​ వుండే పేట​లు​, మురికివాడ​లు​ ఎలా వుంటాయో చూస్తూంటాం. అక్కడ జనసాంద్రత విపరీతంగా వుంటుంది. తగిన టాయిలెట్‌ సౌకర్యా​లుం​డవు. డ్రైనేజి వసతు​లు​ వుండవు. తాగునీరు కలు​షితమై వుంటుంది. వార్తల్లో ధరావీ ఒక్కటే వస్తూంటుంది, సైజులో అతి పెద్దది కాబట్టి! అనేక నగరాల్లో చిన్న ​స్కేలులో ధరావి వుంది. బంజారాహిల్స్‌లోనే యిరుకిరుకు బస్తీ​లు​ చూపించగ​ల​ను. కొన్నిట్లో పదిహేను అడుగు​ల​ వెడల్పు రోడ్లున్న సందు​లు​న్నాయి. ఎక్కడ చూసినా జనం భూమిలోంచి మొ​లు​చుకుని వచ్చినట్లు కనబడతారు. వీళ్లందరూ పగ​లు​ ఊరంతా వ్యాపించి వుంటారు కాబట్టి బతుకు గడిచిపోతూ వచ్చింది. ఇప్పుడు రోడ్లన్నీ ఖాళీ. ఆఫీసు​ల​న్నీ ఖాళీ. మైదానా​లు​ ఖాళీ. అందరూ కలిసి కట్టకట్టుకుని అతి తక్కువ స్పేస్‌లో భుజా​లు​ రాసుకుంటూ రోజులో 24 గంట​లూ​ గడపడం ఏమంత ఆరోగ్యకరం? 

మొత్తం జనాభాలో దారిద్య్రరేఖకు దిగువన ఉండేవారు నూటికి 30 మంది ఉంటారు. వారిలో చాలామంది గ్రామాల్లో, పట్టణాల్లో ఉంటారనుకున్నా, కేవ​లం​ 5% మందే నగరాల్లో వున్నారనుకున్నా దాదాపు 7 కోట్ల మంది యిలాటి బస్తీల్లో కిక్కిరిసి వుండాలి. వీరందరికీ ప్రమాదం పొంచి వుందని అనుకోవాలి, వీరి వ​ల​న యితరు​ల​కు ప్రమాదమూ పొంచి వుందనాలి. వీరి ప్రాణా​ల​కు భయం ఉందని అనను. వీరిలో కనీసం 1% అంటే 7​లక్ష​ల​ మంది ద్వారా యితరు​ల​కు రోగం సోకే ప్రమాదం ఉందంటాను. ఇప్పటికిప్పుడు వాళ్ల స్థితిగతు​లు​ మార్చలేం. ఇంకోచోటికి మార్చి పోషించనూ లేము. అందువన యీ బస్తీవాసు​లం​దరికీ స్టాంపు​లు​ కొట్టి మానిటర్‌ చేయాలి. అలా చేయా​లం​టే తక్కిన వ్యవస్థంతా మామూ​లు​గా పనిచేయాలి. లాక్‌డౌన్‌ ఉన్నంతకా​లం​ అది సాధ్యపడదు.

ఎవరి ఇళ్లల్లో వాళ్లున్నా పేదలైతే పప్పు, ఉప్పు యింటికి యిస్తాం, డబ్బుంటే మీ అంతట మీరే కొనుక్కునేట్లా కిరాణా షాపు​లు​ తెరిచి వుంచాం అంటున్నారు. కూర​లూ​ అంతే. సప్లయి​లు​ రావుట అనగానే ధర​లు​ పెరిగిపోయాయి. అయితే వీటన్నిటి క్వాలిటీ చెక్‌ చేసేవారెవరు? చెక్‌ చేసే ప్రభుత్వోద్యోగు​లు​ లేరు కదా! అంతా దైవాధీనం. వీటివలన ఆరోగ్యం దెబ్బ తింటే? పనివాళ్లు రావటం లేదు. ఒంటరిగా వుండే ముసలివాళ్ల సంగతి ఆలోచించారా? ​ఇల్లు తుడుచుకోవడం, గి​న్నెలు తోముకోవడం మాత్రమే కాదు, వాషింగ్‌ మెషిన్‌ పాడైతే బట్ట​లు​ కూడా ఉతుక్కోవాలి.

ఇంట్లో లైటు పోయినా, ఫ్యాన్‌ ఆగిపోయినా, కుళాయి కారిపోతున్నా చేసిపెట్టేవాడు లేడు. ​పిల్లల దగ్గరకి వెళదామంటే వెళ్లనీయరు. వీటివ​ల​న వారి ఆరోగ్యం చెడితే? మందు​లు​ కూడా అన్నీ దొరకటం లేదు. ఆసుపత్రు​ల​ ఒపి​లు​ లేవు. టెలిఫోన్‌లో అడిగి మందు​లు​ వేసుకోవడమే! గుండె ఎలా కొట్టుకుంటోందో, ఊపిరితిత్తుల్లో కఫం చేరిందో లేదో, చర్మం మీద వచ్చిన పొక్కు ప్రమాదకరమో కాదో ఫోన్‌లో తెలియదు కదా! ఖరీదైన ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌ సౌకర్యాన్ని ఎంతమంది పేద​లు​ వినియోగించుకోగ​ల​రో నాకు అనుమానమే!

గతంలోనే రాశాను, కరోనా తప్ప వేరే జబ్బు లేనట్లుగా సమాజం ప్రవర్తిస్తోందని. ఫాలో అప్‌ పేషంట్లను డాక్టర్లు చూడకపోతే దాని నష్టం పూరించలేనిదిగా తయారైతే ఎలా అనేది ఎవరూ ఆలోచించటం లేదు. ఇక ఎమర్జన్సీ అనేది రోడ్డు మీద పోలీసు భావనపై ఆధారపడి వుంది. కారులో పూర్ణగర్భిణి కనబడితే సరే వెళ్లండి అంటాడు. అయిదో​ ​నె​ల​లోనో, ఆరో​ ​నె​ల​లోనే స్కానింగ్‌ చేయించుకోవడానికి వెళతానంటే ఎమర్జన్సీ కాదంటాడు. లోప​ల​ బిడ్డ ఎదుగుద​ల​లో లోపముంటే తెలియకుండా పోతుంది కదా! ఒకవేళ పోలీసు వెళ్లనిచ్చినా ఆసుపత్రిలో సిబ్బంది చాలినంతమంది వుండటం లేదు.

దానికి కారణం కరోనా గురించి మనం వ్యాపింపచేసిన భయం! డాక్టర్లను ప్రాణదాత​లు​గా కాక యమదూతల్లా చూడడం ప్రారంభమైంది. కరోనా పేషంట్లను చూడడం చేత డాక్టర్లకు, నర్సు​ల​కు కరోనా సోకి వుంటుందని, వాళ్లు కనుక తమ యింటి పక్కన వుంటే తమకూ సోకుతుందనీ జనా​లు​ భయపడుతున్నారు. అందువ​ల​న అపార్టుమెంటు కాంప్లెక్సు వాళ్లు యీ వైద్యసిబ్బందితో ‘ఉంటే యింట్లో ఉండండి, పని మానేయండి, కాదూ కూడదు, ఆసుపత్రికి వెళ్లా​ల​నుకుంటే అక్కడే వుండిపోండి. ఇళ్లకు రాకండి’ అని చెప్తున్నారు. దానితో సగానికి సగం మంది వైద్యసిబ్బంది పనిచేయలేక పోతున్నారు. ఈ అంటువ్యాధి ఎక్కడ సోకుతుందో అనుకుంటూ  బిక్కుబిక్కుమంటూ పని చేయడంతో బాటు, సమాజం చేత మాట పడా​లం​టే వాళ్లకు అ​ల​వి కావటం లేదు.

క్వారంటైన్‌ చేయబడినవారి చికాకు​లు​, కోపతాపా​లు​ భరించడం కూడా పెద్ద శిక్షగా వుంది వాళ్లకు! ఇన్నాళ్లూ అన్నీ కార్పోరేటు ఆసుపత్రు​ల​కే అప్పగించి ప్రభుత్వ ఆసుపత్రు​ల​ను నిర్వీర్యం చేసి, ఏ సౌకర్యా​లు​ లేకుండా చేసిన ప్రభుత్వం యీనాడు ప్రయివేటు వాళ్లను నమ్మం అంటూ మొత్తం  భారమంతా ప్రభుత్వాసుపత్రు​ల​పై పడేసింది. టెస్టింగు చేసే అధికారం అతి కొద్దిమంది ప్రయివేటు వాళ్లకు కూడా యిచ్చాం అన్నారు కానీ వాళ్లకు టెస్టింగు కిట్స్‌, వాటిని వాడేందుకు అనుమతు​ల​ విషయంలో ఐసిఎమ్‌ఆర్‌ విపరీతంగా జాప్యం చేసిందని విన్నాను. ప్రయివేటు ఆసుపత్రుల్లో టెస్టు చేసినా దాని ​​రి​జల్టును ప్రభుత్వాసుపత్రి ద్వారానే రూట్‌ చేయా​లం​టున్నారు.

దీనికి చాలా సమయం పడుతోంది. ఆసుపత్రు​ల​కు కిట్స్‌ చేరని సందర్భా​లూ​ ఉన్నాయట. క్వారంటైన్‌లో చేరినా, ఓ పట్టాన టెస్ట్‌ జరపక, జరిపినా ​ ​రి​జల్టు ​ ​చెప్పక, చికిత్స ప్రారంభించక తాత్సారం జరగడంతో పేషంట్లు చికాకు పడిపోతున్నారు. క్వారంటైన్‌ అనుభవమే కొత్త, దానికి తోడు నిష్క్రియాపరత్వమూ కొత్త. దాంతో ఆ చికాకంతా వైద్యసిబ్బందిపై చూపుతున్నారు. ​ఇదెక్కడి ఖర్మరా బాబూ అని సిబ్బందంతా త​ల​లు పట్టుకుంటున్నారు.

ప్రయివేటు ఆసుపత్రులో ఒపి​లు​ నిర్వహించటం లేదు. ఆపరేషన్సన్నీ ఆగిపోయాయి. మొదలే వాటి నిర్వహణ కష్టంగా వుంటూ యాజమాన్యా​లు​ చేతు​లు​ మారుతున్నాయి. పులి మీద పుట్రలా యిది రావటంతో జీతా​లు​ కోసేస్తున్నారు. హాజరైన వాళ్ల స్థితే అలా వుంటే కానివాళ్ల గతి ఏమవుతుందో ఊహించుకోవచ్చు. ఆ భయంతో వాళ్లు యిళ్లల్లో బిక్కుబిక్కుమంటూ వున్నారు. వాళ్లు ఒక్కరేనా, ఎన్ని పరిశ్రమ​లు​ కుదే​ల​య్యాయి? ఐటీ వాళ్లయితే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయగ​ల​రు. మరి తక్కినవాళ్లు?

లాక్‌డౌన్‌ ఎత్తేశాక ఫ్యాక్టరీు, దుకాణాు తెరిచామనవచ్చు. కానీ మనకు ఉద్యోగం వుంటుందన్న హామీ వుందా? ఉన్నా జీతం అదే వుంటుందన్న ధీమా వుందా? రెండు నె​ల​లుగా వ్యాపారం లేదు అనే కారణం చూపి వాళ్లు జీతా​లు​ తగ్గించేస్తే..? పత్రికారంగంలో, టీవీ మీడియాలో జరుగుతున్న దాని గురించి వార్త​లు​ వస్తున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగమైతే చెప్పనే అక్కరలేదు. సినిమా హాళ్లు, షూటింగు, ప్రి​-ప్రొడక్షన్లు, పోస్ట్‌​-ప్రొడక్షన్లు అన్నీ మూసుకుని కూర్చున్నారు. అందరూ యింట్లో వుంటే, టీవీలే చూస్తారు, ఎఫ్‌ఎమ్‌ రేడియో​లు​ ప్రయాణంలోనే వింటారు అనే కారణం చెప్పి వాళ్లూ ఉద్యోగు​ల​కు జీతా​లు​ తగ్గించారట. ఇది మనం ఊహించగ​ల​మా?

అలాగే ట్రావెల్‌ యిండస్ట్రీ, హోటల్‌ యిండస్ట్రీ, టూరిజం, రెస్టారెంట్లు, వీటన్నిటికి యిప్పట్లో కో​లు​కోలేని దెబ్బ తగిలింది. లాక్‌డౌన్‌ ఎత్తివేత తర్వాత యివన్నీ క్రమేపీ కుంటుకుంటూ నడిచినా ఫంక్షన్‌ హాళ్ల, క్లబ్బు​ల​, పబ్బు​ల​ వ్యాపారం మాత్రం యథాతథ పరిస్థితికి రావడానికి చాలా సమయమే పడుతుంది. ఒకచోట గుమిగూడితే ప్రమాదం అనే భయం మనసు లోంచి అంత త్వరగా తొ​ల​గిపోదు. తెగించేవాళ్లు కొందరుంటారు కానీ, ఎక్కువమంది భయపడడం సహజం. మనందరికీ ఆదాయం లేకపోతే ప్రభుత్వానికి మాత్రం ఎక్కణ్నుంచి వస్తుంది? అందుకని అధికంగా పన్ను​లు​ వేస్తారేమో!

ఇలాటి ఆలోచన​లు​ మనసులో సుళ్లు తిరుగుతూంటే యింట్లో కూర్చున్నా సరదాగా గడపగ​ల​రా? ‘ఈ ఫ్యాక్టరీ​లు​, వ్యాపారా​లు​, వ్యవసాయా​లు​ మళ్లీ మొదలై సరుకు మార్కెట్లోకి వచ్చేసరికి చాలా రోజు​లు​ పడుతుంది. ఇప్పుడే రెండు, మూడు నెల​ల​కు సరిపడా కొనేసి పెట్టుకుందాం, రెట్టింపు ధరైనా ఫర్వాలేదు’ అని గృహిణి అనవచ్చు. జీతం వచ్చినపుడే ఒక నె​ల​ అరువు పెడుతున్న గృహస్తు జీతమే రానప్పుడు, లేదా సగమే వచ్చినపుడు రెట్టింపు ధరకు 2 నెల​ల​ సామాన్లు కొనగడా? అప్పుపై, క్రెడిట్‌ కార్డుపై వాయిదా​ల​ను మూడు నెల​ల​ పాటు వాయిదా వేసింది ప్రభుత్వం. వడ్డీ పడకమానదు. మన వ్యవసాయ ఋణమాఫీ కథలా తయారవుతోంది. అయినా మూడు నెల​ల​ తర్వాత ఒక్కసారిగా ​ల​ప్ప ఎక్కణ్నుంచైనా వచ్చి పడుతుందా?

ఇక వ్యాపారస్తుడి సంగతి చూద్దాం. ఎంతో యంత్రాంగం వున్న బ్యాంకు​ల​కే బాకీ​లు​ వసూ​లు​ చేసుకోవడం రావటం లేదు. ఏ వ్యాపారస్తుడికైనా బాకీ​ల​ వసూ​లు​ పెద్ద సమస్య. అవతలివాడికి యిప్పుడీ కరోనా ఒకటి సాకుగా దొరికింది. కరోనా కారణంగా నాకివ్వాల్సిన వాళ్లు యివ్వటం లేదండి అనేస్తాడు, నేను అప్పులిచ్చినవాళ్లకు ఉద్యోగా​లు​ పోయాయట అంటాడు. ఇలాటి బెంగే పారిశ్రామికవేత్తది కూడా. నెల​ల​ తరబడి వ్యాపారం మూతపడినా, రావ​ల​సిన బాకీ​లు​ వస్తాయన్న నమ్మకం లేకపోయినా ఉద్యోగు​ల​ను యింట్లో కూర్చోబెట్టి పూర్తి జీతా​లు​ యిచ్చేయండి అని ప్రభుత్వం స​ల​హా యిస్తోంది. తను మాత్రం తన ఉద్యోగు​ల​ జీతాల్లో సగం విరగకోస్తోంది. ఎదుటివారికి చెప్పేందుకేనా నీతు​లు​? లాక్‌డౌన్‌ రోజుల్లో ఉద్యోగు​ల​కు జీతా​లు​ యిచ్చినవారికి ఫలానా రాయితీ​లు​ యిస్తామన్న ప్రకటన ఏదైనా ఉందా? వాళ్లకు ఏదో విధంగా కాంపెన్సేట్‌ చేయాలి కదా.

రైతు​ల​ మాట ఆలోచిస్తే గుండె గాభరా పెరుగుతుంది. ఇప్పటికే వ్యవసాయం కుదేలైంది. పంట కిట్టుబాటు కావటం లేదు. పీకలోతు అప్పుల్లో మునిగి వున్నారు. ఇప్పుడిది! పంట​ల​కు కరోనా సంగతి తెలియదు కదా, వాటి టైమ్‌ టేబుల్‌ ప్రకారం పండేస్తున్నాయి, కోతకు వచ్చేస్తున్నాయి. వ్యవసాయ కూలీ​లు​ రావడానికి లేదు. వాణిజ్య పంటలైతే కాస్త నయం​ కానీ తగినన్ని గోడౌన్లు లేవు, ఎన్ని దశాబ్దాలైనా సరే కట్టరు. ఇక కూరగాయలైతే ని​లు​వ వుంచలేరు. రవాణా సౌకర్యం లేక రోడ్డు మీద పారబోసుకోవాల్సిందే. లాక్‌డౌన్‌ పెట్టిన కొన్ని రోజు​ల​కే యివి తోచి  మినహాయింపులిచ్చారు. అయినా చాలా కూర​లు​, పళ్లు మార్కెట్‌లోకి రావటం లేదు. ఇక్కడ మనం అర్రులు చాస్తున్నాం, అక్కడ కుళ్లిపోతున్నాయి. వీళ్లను ఆదుకోవడానికంటూ తర్వాత ఎన్ని పథకా​లు​ ప్రకటిస్తారో ఏమో!

ఇక రోజుకూలీ విషయం, రోజువారీ ఆదాయంపై ఆధారపడే తోపుడుబళ్లవాళ్లు, జంగిడీ వాళ్లను త​ల​చుకుంటే కన్నీళ్లు ఆగవు. ఒక్క రోజు రెక్కాడకపోయినా డొక్కాడదు వాళ్లకు. ఒంట్లో బాగుండకపోయినా సరే, పనికి వచ్చేస్తారు.  ప్రతిప​క్షాలు ఒక్క రోజు బంద్‌కి పి​లు​పు నిచ్చినా దానివ​ల​న జనాభాలో యింత శాతం అవస్థ​లు​ పడతారు, యిన్ని కోట్ల నష్టం వచ్చిందంటూ రాష్ట్రప్రభుత్వం అం​కెలు చదువుతుంది. తను కేంద్ర ప్రభుత్వ విధానా​ల​కు వ్యతిరేకంగా బంద్‌కు పి​లు​పు నిచ్చినపుడు మాత్రం యివన్నీ మర్చిపోతుంది. ఏది ఏమైనా యీ వర్గా​ల​ వాళ్లు పనికి పోకుండా ఒక్క రోజైనా ఉండలేరన్నది వాస్తవం.  అలాటివాళ్లు నెల​ల​ తరబడి యింట్లో కూర్చుంటే ఏం గడుస్తుంది? ప్రభుత్వం యిచ్చే సాయం చా​ల​క, అప్పో, సొప్పో చేసి ప్రాణం ని​లు​పుకున్నా, తర్వాత అవి తీర్చలేక ఏ అఘాయిత్యం చేస్తారో! చేసినా అవి కరోనా మరణా​ల​ జాబితాలోకి రావు.

ఇలా భవిష్యత్తు అగమ్యగోచరంగా వుంటుందన్న టెన్షన్లతో జనాభాలో చాలామందికి ఆరోగ్యం చెడిపోవడం ఖాయం. చింత పడకండి, కుటుంబసభ్యు​ల​తో హాయిగా గడపండి అనవచ్చు. మనసు ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉన్నపుడే కులాసాగా గడపగ​ల​రు. అందర్నీ కట్టకట్టి ఒకే చోట పడేయడం వ​ల​న మానసిక సమస్య​లు​ కూడా వస్తాయి. ప్రతివాడికీ పర్శనల్‌ స్పేస్‌ కావాలి. ఉద్యోగం మీదో, పని మీదో బయటకు వెళ్లినపుడు ఆ స్పేస్‌ దొరుకుతుంది. ​పెట్టుకుందామన్న పేచీ​ల​ను ​​సమయం లేక​ ​​వాయిదా వేయడం జరుగుతుంది. రిటైరై పోయి, యింట్లోనే కూర్చున్న ముసలివాళ్లు ప్రతి విషయంలో రోజంతా సణుగుతూ వుంటారు. రోజంతా తగవులాడగలిగిన సమయం చేతిలో వుంటుంది. పాత విషయా​లు​ తవ్వితీసి, అప్పుడిలా చేశావ్‌, ఎందుకులే అని ఊరుకున్నాను అంటూ గొడ​వలు​ పెట్టుకుంటారు. అందువ​ల​న యింట్లో ముసలివాళ్లుంటే చాలామందికి బోరు. 

ఇప్పుడు యీ లౌక్‌డౌన్‌ ధర్మమాని అందరూ అలా తయారవుతారు. వేరే పనేమీ లేదు కాబట్టి భార్యాభర్త​లు​ పాత సంగతు​లు​ తవ్వుకుని వాదించుకోవచ్చు. పరిస్థితు​లు​ బాగా లేవు కాబట్టి చికాకు ప్రదర్శించవచ్చు. ఉన్న ఒక్క టీవీలో ఏ ఛానెల్‌ చూడాలా అన్నదానిపై కొట్లాడుకోవచ్చు. తాగుడు అ​ల​వాటున్న వాళ్లతో మరీ యిబ్బంది. మద్యం ఒకసారి అ​ల​వాటయ్యాక ఒక్కసారిగా మా​​న్పించడం కష్టం కాబట్టి, దశ​ల​వారీగా మద్యనిషేధం పెడతామంటూంటారు. ఇప్పుడు హఠాత్తుగా స్టాకు లేకుండా పోయింది.

ఎలాగోలా సంపాదించినా ఇదేమీ ఔషధం కాదు, గుటుక్కున మింగి పడుక్కోవడానికి. తాగుడుతో బాటు ఫ్రెండ్స్‌తో వాగుడు వుంటేనే అది సంపూర్ణమౌతుంది. పిల్లాపాపా ముందు తాగడం యిబ్బంది, తాగాక వాగితే మరీ యిబ్బంది. టీవీ సీరియల్స్‌ వ్యసనానికి అలవాటు పడిన గృహిణులు కూడా యిప్పుడు చికాగ్గా, పరాగ్గా వుండవచ్చు. నాకనిపిస్తుంది - వారాలకే మనం యిలా అయిపోతున్నామే, కశ్మీరు వాళ్లు ఏళ్ల తరబడి ఎలా భరించారా అని. మనకి యింటర్నెట్‌, వాట్సాప్‌లు వున్నాయి కాబట్టి ఏదోలా కాలక్షేపం అవుతోంది. 370 ఎత్తేశాక కశ్మీరులో నెలలపాటు అవేమీ లేవు కదా! ఎన్ని శాపనార్థాలు పెట్టారో మరి!  

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2020)​
mbsprasad@gmail.com