Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: చెఱసాల విలాసాలు

బెంగుళూరు సెంట్రల్‌ జైల్లో శశికళ అనుభవిస్తున్న భోగాలు బయటపెట్టిన డి.రూప అనే ఐపిఎస్‌ ఆఫీసరు బదిలీ అయిపోయారు. బయటపెట్టినందుకు కాదు, సర్వీసు నియమనిబంధనలు ఉల్లంఘించి మీడియాకు ఎక్కినందుకు చర్య తీసుకున్నాం. ఒట్టి బదిలీ మాత్రమే, సస్పెన్షన్‌ లాటివి చేయలేదు అని చెప్పుకున్నారు కర్ణాటక పాలకులు. శశికళకు సమకూరిన సౌకర్యాలకు ఆధారాలు అందించిన రూప, తన పై అధికారికి రూ.2 కోట్లు అందిందన్న ఆరోపణకు ఆధారాలు చూపలేకపోయారు.

దాంతో ఆయన పరువునష్టం దావా వేశాడు. తీవ్రమైన ఆరోపణ చేసినపుడు ఆధారాలు సమకూర్చుకోకుండా ఒక ఐపిఎస్‌ అధికారిణి అలా ప్రవర్తించారంటే సెన్సేషన్‌ సృష్టించడానికే అనుకోవాలి. కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దానిలో ఏం తేలినా, ములిగినా యిలాటి సౌకర్యాలు అమరడం ఒక్క శశికళ వంటి విఐపిల విషయంలోనే కాదనే విషయం ముందుగా గుర్తించాలి. 

జైలు పరిభాషలో సిఐపి (కమ్మర్షియల్లీ యింపార్టెంట్‌ పీపుల్‌)లకు సర్వసౌఖ్యాలు అమరుతాయి. డబ్బు ధారాళంగా విదల్చాలంతే. బయట దొరికేవన్నీ జైలుకి పట్టుకుని వచ్చి యిస్తారు. ఎటొచ్చీ రేటే ఎక్కువ. సమోసా బయట ఏ పది రూపాయలో వుంటే జైల్లో అందించడానికి రూ.200 పుచ్చుకుంటారు. మీ కిష్టమైన హోటల్లో వెయ్యి రూపాయలకు దొరికే డిష్‌ను జైలుకి చేరవేసేందుకు పదివేలవుతుంది. ఎందుకంటే మధ్యలో మూడు స్థాయిల్లో చెకింగ్‌ జరుగుతుంది. ప్రతీచోటా చేతులు తడుపుతూ రావాలి కదా, అందుకే ఖర్చు.

మద్యమూ అలాగే దొరుకుతుంది. ఖర్చుకి వెనకాడకపోతే గంజాయి కూడా...! ఇవన్నీ అటూయిటూ సరఫరా అవుతూ వుంటే జైల్లో అమర్చిన సిసిటివి కెమెరాలు రికార్డు చేసేస్తాయి కదా. అందువలన వాటిలో కొన్ని పనిచేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కేరళలోని కోళికోడ్‌ జైలుపై విచారణ జరిపినపుడు అక్కడున్న 90 సిసిటివి కెమెరాల్లో 35 పనిచేయటం లేదని తేలింది. సోలార్‌ కేసులో నిందితురాలు సరితా నాయర్‌ని కోర్టుకి తీసుకు వచ్చినపుడు ఆమె అనేక రంగుల చీరల్లో వచ్చింది. రూలు ప్రకారం రెండు చీరలు మాత్రమే అనుమతించాలి. మరి యిన్ని చీరలు ఎలా వచ్చాయన్న అనుమానం ఎవరికైనా తగలాలి. తగిలినట్లు లేదు.

సిఐపి ఖైదీల్లో చాలామందికి సహాయకులను ఏర్పాటు చేస్తారు. శిక్ష అనుభవిస్తున్న యిద్దరు తక్కువ స్థాయి ఖైదీలను వీళ్ల సెల్‌లో వేస్తారు. వాళ్లిద్దరూ వీళ్లకి పనివాళ్లుగా పనిచేస్తారు, బట్టలు ఉతుకుతారు, ఒళ్లు పడతారు, సెల్‌ కడుగుతారు, ఏ పని చెప్పినా చేస్తారు. స్టాంపు కుంభకోణంలో శిక్ష పడిన అబ్దుల్‌ కరీమ్‌ తెల్గికి కూడా యీ ఏర్పాటు వుంది. దీనికి గాను తీహార్‌ జైల్లో అయితే మనిషికి నెలకు రూ.15 వేలు చెల్లించాలి. ఒంట్లో బాగాలేదని చెప్పుకుని హాస్పటల్‌ పేర బయటకు రావాలనుకునేవారికీ ఆ సౌకర్యం వుంది. రూ.50 వేలు మీవి కాదనుకోవాలంతే.

డి పి యాదవ్‌ అనే రాజకీయవేత్త కొడుకు వికాస్‌ హత్యానేరంపై యావజ్జీవ శిక్ష అనుభవిస్తూన్నాడు. 2008 నుంచి 2010 వరకు 70 సార్లు మెడికల్‌ చెకప్‌ పేరుతో బయటకు వచ్చేశాడు. జైల్లో వున్న సమయం కన్నా ఆసుపత్రిలో వున్న సమయం ఎక్కువ. 2011 దీపావళి పండుగ అటు జైల్లోనూ కాక, యిటు ఆసుపత్రిలోనూ కాక బయట జరుపుకుంటూండడంతో పట్టుబడ్డాడు. ఇతనికి వున్న మాయరోగం ఏమిటని దిల్లీ హైకోర్టు మెడికల్‌ బోర్డును అడిగింది. మాకేమీ కనబడటం లేదన్నారు వాళ్లు. 

హాస్పటల్స్‌లో జనరల్‌ వార్డులో ఉండడానికి యిష్టపడని వారు స్పెషల్‌ రూములు తీసుకుంటారు. స్తోమతను బట్టి ట్విన్‌షేరింగ్‌ తీసుకుంటారు, లేదా రూము మొత్తం మాకే కావాలంటారు. జైల్లోనూ అలాటి బందోబస్తు వుంది. గాలీ, వెలుతురూ బాగా వస్తూ శుభ్రంగా వుండే సెల్‌ కావాలనుకోండి దానికి రేటుంది. నాతోపాటు ఇంకో యిద్దరున్నా ఫర్వాలేదు అంటే ఒక్కసారిగా ఐదు లక్షలు కట్టాలి. ఆ పైన నెలకు లక్ష. కాదు, నా ఒక్కడికే మొత్తమంతా కావాలి అంటే పది లక్షలు ఒక్కసారిగా కట్టి ఆ పై నెలకు మూడు లక్షలు కట్టాలి. ఇలా యివ్వనివాళ్ల సెల్స్‌లో ఐదుగురిని కుక్కుతారు.

తీహార్‌ జైలు కెపాసిటీ 6250 మంది ఖైదీలు. కానీ అక్కడ 14,500 మంది వున్నారు. డబ్బులిస్తే రాజభోగాలు. లేకపోతే జనతా వార్డు. అన్నిటికన్నా లగ్జరీ మొబైల్‌ ఫోను. అది వాడుకోవాలంటే నెలకు లక్ష కట్టాలి. డబ్బు పోతే పోయిందని చాలామంది సెల్స్‌ అడుగుతారు. ఎందుకంటే జైల్లో కూర్చునే సెటిల్‌మెంట్లు బోల్డు చేయవచ్చు. కొంతమంది అక్కణ్నుంచే ఫేస్‌బుక్‌లో మెసేజిలు పోస్టు చేశారట కూడా! తీహార్‌ జైల్లో ఓ సారి యిన్‌స్పెక్షన్‌ నిర్వహించినపుడు నీరజ్‌ బవానా అనే గ్యాంగ్‌స్టర్‌ సెల్‌ఫోన్‌ వాడుతూ కనబడ్డాడు. తర్వాత అతన్ని కోర్టుకి తీసుకుని వచ్చినపుడు ప్రత్యర్థి అతన్ని కాల్చి చంపేశాడు. 

నిజానికి తీహార్‌ జైలు సంస్కరణలకు పెట్టింది పేరు. అక్కడి ఖైదీలకు శిక్షలు పెద్దగా వేయరు. ప్రవర్తన మెరుగుపడే కొద్దీ వాళ్లకు సౌకర్యాలు పెంచుతూ పోతారు. ప్రవర్తన బాగుందో లేదో తేల్చేది ఏమిటో ఎవరైనా వూహించవచ్చు. 1999లో జెస్సికా లాల్‌ అనే మోడల్‌ హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న మనూ శర్మ యిప్పటికే 'మంచిబాలుడు' అయిపోయి 'సెమి-ఓపెన్‌' జైలుకి మార్చబడ్డాడు. అంటే 200 ఎకరాల ఆవరణలో ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరగవచ్చు. ఇలా రెండేళ్లు తిరిగాక అప్పుడు ఓపెన్‌ జైలుకి బదిలీ అవుతాడు. అంటే పొద్దున్నే బయటకు వదిలి వేస్తారు. అతను సిటీ లిమిట్స్‌ దాటకుండా, సాయంత్రాని కల్లా వెనక్కి వచ్చేయాలి. ఖైదీలలో మానసిక పరివర్తన రావాలనే ఉద్దేశంతో సంస్కరణలు తెచ్చి వుంటారు. అమలులో అవి ఏ రూపు దాలుస్తున్నాయో అధ్యయనం చేసి పునస్సమీక్షించుకోవాల్సిన అవసరం వుంది.

(ఫోటో - బెంగుళూరు జైల్లో శశికళ, ఇన్‌సెట్‌లో డి.రూప) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com