Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: జగన్‌ తప్పటడుగు

 ఎమ్బీయస్‌: జగన్‌ తప్పటడుగు

నా దృష్టిలో చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేసిన విధానం జగన్‌ వేసిన పెద్ద తప్పటడుగు. 100 రోజుల పాలన ముగిసేనాటికి నాకు కనబడిన పొరబాటు - స్థానికులకు 75% రిజర్వేషన్‌. ఆ తర్వాత ఇసుక విషయంలో చాలా అనర్థం జరిగింది. ఇసుక గందరగోళం దురుద్దేశం కంటె అసమర్థత కారణంగా జరిగింది అని నమ్మడానికి కూడా నేను రెడీయే కానీ యీ బదిలీ మాత్రం తెలిసి చేసిన తప్పని నా దృఢాభిప్రాయం. 

చీఫ్‌ సెక్రటరీని మార్చే అధికారం ముఖ్యమంత్రికి ఉందా లేదా అన్నది చర్చనీయాంశమే కాదు. అలా అయితే ప్రభుత్వం పన్నులు వేస్తూంటాయి, తీస్తూంటాయి, ఎవరెవరితోనో ఒప్పందాలు చేసుకుంటూ ఉంటాయి. వాటికా అధికారం ఉంది. కానీ వాటిని విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు, ప్రజలకు ఉంటుంది. ఎడ్మినిస్ట్రేటివ్‌ కారణాల వలన సిఎస్‌ను మార్చాం అని ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు చెప్పుకోవచ్చు. అసలు కారణాలు వాళ్లు చెప్పరు కానీ సిఎస్‌కు, సిఎంకు పొసగ లేదు అని మనకు అర్థమవుతుంది. పొసగకపోతే మార్చవచ్చు, కానీ యిక్కడ మార్చే విధానంలో లోపం ఉంది. అదే విమర్శకు గురవుతోంది.

అసలు వాళ్లిద్దరి మధ్య పొసగకపోవడానికి కారణాలు ఇప్పుడు తెలియవు. ఐదు నెలల తర్వాత ఎల్వీ రిటైరై, ఐవైఆర్‌ తరహాలో పుస్తకం రాస్తే తప్ప! అప్పుడు కూడా ఆయన వెర్షన్‌ మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు ఆయనను ప్రాధాన్యత లేని హ్యూమన్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌ సంస్థకు డైరక్టర్‌ జనరల్‌గా బదిలీ చేశారు. అది కనబడుతోంది. జీతం తగ్గిందా లేదా అని కాదు, బదిలీ చేసిన పోస్టు ఎలాటిది అనేది ముఖ్యం. రేపు బొత్సను యీ శాఖ నుంచి తీసేసి క్రీడాశాఖా మంత్రిగా వేస్తే అప్పుడు తెలుస్తుంది నొప్పి. పైగా ఎల్వీ విషయంలో బదిలీ ఎవరి చేత చేయించారు, అతనికి ఆ అర్హత ఉందా లేదా అనేది కూడా వివాదమే అయింది.

ఎల్వీ ఐదు నెలల తర్వాత ఎటూ రిటైరై పోతాడు. అప్పటి దాకా ఆగలేకపోవడం ఒక పాయింటు. నచ్చకపోతే సెంట్రల్‌ సర్వీసెస్‌కు అప్పగించేయవచ్చు. పదవీవిరమాణానంతరం ఏదో మంచి పోస్టు యిస్తామని నచ్చచెప్పి రాజీనామా చేయించవచ్చు. కానీ యిలా తన కంటె జూనియర్‌ చేత, పైగా ఆయన చేతుల మీదుగా షోకాజ్‌ నోటీసు యిప్పించుకున్న వాడి చేత బదిలీ చేయించడం - యివన్నీ ఆయనకు గుణపాఠం చెప్పి తీరాలనే తపన కనబరుస్తున్నాయి. ఆయనకే కాదు, తన మాట వినకపోతే అందరికీ యిదే గతి అని తక్కిన బ్యూరాక్రసీని కూడా భయపెట్టడం కనబడుతోంది. ఇది తప్పకుండా అడ్మినిస్ట్రేషన్‌పై ప్రభావం చూపుతుంది. అందుకే తప్పటడుగు అనేది.

నేను విన్నదాని ప్రకారం ఎల్వీ సమర్థుడు, నిజాయితీపరుడే కానీ, స్వభావత: చాదస్తుడు. అన్నీ రూల్సు ప్రకారమే జరగాలంటాడు. ప్రభుత్వంలో రూల్సూ ఉంటాయి, వాటికి మినహాయింపులూ ఉంటాయి. ఆయన్ని అడిగితే వద్దనే రూలు మాత్రమే చూపుతాడు తప్ప మినహాయింపు మాట ఎత్తడని ప్రతీతి. అందువలన అనేక మంది మంత్రుల దృష్టిలో - ఆయనకు అడ్డుపడడమే తెలుసు తప్ప పని జరిపించే విధానం తెలియదు. ఈ లక్షణం చూసే కాబోలు బిజెపి ఈసి ద్వారా ఆయనను బాబుకి ప్రతిగా తీసుకుని వచ్చి నిలబెట్టింది. ఎన్నికల వేళ బాబు ఏదేదో చేసి ఓటర్లను ఆకట్టుకుందామని చూస్తే యీయన సాగనీయలేదు. అప్పుడు వైసిపి ఎల్వీని మెచ్చుకుంటూ ఆహాఓహో అంది. ఇప్పుడు తన దగ్గరకు వచ్చేసరికి విసుక్కుంటోంది. తావులు మారితే మిత్రులు శత్రువులవుతారంటే యిదే!

ఎల్వీని బదిలీ చేశారు అని వినగానే ఇసుక పాలసీ ఫెయిల్యూర్‌కు ఆయనే కారణం కావచ్చు, లేదా ఆయన్ను బాధ్యుణ్ని చేసి వుండవచ్చు  అనుకున్నా. ఎందుకంటే జగన్‌ ఎక్కడ దొరుకుతాడా అని చూస్తున్నవాళ్ల కోసమా అన్నట్లు మయసభలో దుర్యోధనుడు మడుగులో జారిపడినట్లు జగన్‌  ఇసుకలో జారిపడ్డాడు. పాతవాళ్ల దోపిడీ అరికట్టామంటూ సెప్టెంబరు 5 పాలసీ ప్రకటన వరకు ఇసుక లేకుండా ఎండగట్టారు, సరే. తర్వాత సరిగ్గా హేండిల్‌ చేయలేకపోవడం అసమర్థతే కదా. ఆవురావురుమంటున్న జనాలు హోర్డింగుకి ఎగబడతారని ఊహించి వుండాల్సింది. ధర ఆకాశానికి అంటి, అందరూ అవస్థ పడుతున్నారు. ఇలాటి సందర్భాల్లో పాలకులు అధికారులను పాపాలభైరవులుగా చూపించి వారిని శిక్షించి ప్రజాగ్రహాన్ని వారిపై మళ్లిస్తారు. ఇది అలాటి కేసనుకున్నా కానీ కాదుట, ఏవేవో చెప్తున్నారు.

మొదటిది టిటిడిలో క్రైస్తవులను కట్టడి చేయబోతేది జగన్‌కు కోపం వచ్చి తీసేశాడనేది నమ్మశక్యంగా లేదు. అది చేయగల విషయమే అయితే ఎల్వీ టిటిడికి ఇఓగా ఉండగానే చేసి ఉండేవారు. టిటిడి సంస్థలో రిక్రూట్‌మెంట్‌ పాలసీ ఏమిటో నాకు పూర్తిగా తెలియదు. వేదాధ్యాపకుల గురించి యాడ్‌ ఒకటి చూస్తే వాళ్లు హిందువులు అయి ఉండాలని కనబడుతోంది. అది సహజం. గుడిలో పనిచేసేవారు హిందువులు అయి వుండాలనే నిబంధన ఉండడం కూడా సహజమే. కానీ టిటిడికి చెందిన హాస్పటళ్లలో, యూనివర్శిటీలలో, సత్రాలలో హిందువులే పని చేయాలన్నా రూలు ఉందా? నాకు సందేహమే. క్రైస్తవ సంస్థలు నడిపే ఆసుపత్రులలో, స్కూళ్లల్లో పని చేసే అనేకమంది హిందువులు నాకు తెలుసు. ఒక మతానికి చెందినవారు మాత్రమే ఉద్యోగాలకు అప్లయి చేయాలని నిబంధన పెడితే చట్టాలు ఒప్పుకోవేమో!

ఒకవేళ అలాటి రూలు ఉండి వుంటే చాలా వివాదాలకు దారి తీస్తుంది కూడా. ఎస్సీ, ఎస్టీల్లో రిజర్వేషన్‌లు పోతాయని బాప్టిజం తీసుకోకుండా ఉన్నవాళ్లుంటారు. వారు క్రైస్తవులే అని తక్కినవాళ్లు ఫిర్యాదు చేస్తారు. కాదు, మేం హిందువులమే అని వీళ్లంటారు. చర్చికి వెళ్లాడు, బైబిల్‌ చదివాడు అని రుజువులు చూపించినా లాభం లేదు. బైబిల్‌ ఎవరైనా చదవవచ్చు. చర్చికి వెళ్లినంత మాత్రాన క్రైస్తవుడు అనలేం. మన పిల్లలకు రోగాలు వస్తే దర్గాకు వెళతాం, తావీజులు కట్టించుకుంటాం, అంతమాత్రాన ముస్లింలు అవుతామా? రోజంతా ఇలాటి ఫిర్యాదులు డీల్‌ చేస్తూ కూర్చుంటే ఎడ్మినిస్ట్రేషన్‌ మూలపడుతుంది. అందువలనే కాబోలు ఎల్వీయే కాదు, ఎవరు ఈఓగా ఉన్నా ఏమీ చేయలేదు.

అప్పుడే తీరిక లేదనుకుంటే యిప్పుడు సిఎస్‌గా ఉన్నపుడు దీన్ని పట్టించుకునే తీరిక ఉంటుందా? అసలే రాష్ట్రం గందరగోళంగా ఉంది. పాత బకాయిలు పేరుకుపోయాయి, కొత్త పథకాలు వచ్చిపడి ఊపిరి సలపటం లేదు. ఇలాటి సమయంలో టిటిడిలో యిలాటి సమస్య గురించి ఏం ఆలోచించగలుగుతారు? దాని కారణంగానే జగన్‌, ఎల్వీ కలహించుకున్నారని చిత్రీకరించడానికి కారణం ఏమిటంటే - జగన్‌ను క్రైస్తవాభిమానిగా, హిందూద్వేషిగా ముద్ర వేయడానికి శతథా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో యిదొకటి. వైయస్‌ ఉన్నపుడు కూడా ఏడుకొండల్ని మింగేసి, రెండు కొండలు చేశాడని పెద్ద ప్రచారం చేశారు. రుజువులు చూపించిన వారెవరూ లేరు.

నిజానికి జగన్‌ తన క్రైస్తవాన్ని డౌన్‌ప్లే చేయడానికి శతథా శ్రమిస్తున్నాడు. గుళ్ల చుట్టూ, వైజాగ్‌ స్వామి చుట్టూ తెగ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. అర్చకులకు రిటైర్‌మెంటు లేదన్నాడు. వాళ్లకు వంశపారంపర్యంగా ఉద్యోగాలు వస్తాయన్నాడు. ఇది హిందూ ముఖ్యమంత్రి ఉన్నపుడు కూడా జరగలేదు. ఈ కారణంగా హిందువులలో పేరు వచ్చేస్తోందేమోనన్న జంకుతో కాబోలు యిప్పుడీ ప్రచారం సాగుతోంది. దీనిలో అతి తెలివితేటలేమిటంటే జెరూసలెం మత్తయ్య లేఖ. అతను ఎవరి తాలూకు మనిషో తెలుసు. జగన్‌ సిఎం కాగానే క్రైస్తవులు పండగ చేసుకున్నారనే వీడియోలు అప్పుడే ప్రచారంలో పెట్టారెవరో. ఇప్పుడు యిది. దీన్ని ఎదుర్కోవడానికి జగన్‌ పద్ధతి కూడా వింతగా ఉంది. విమర్శించిన ప్రతిపక్ష నాయకుడు ఏ కులం వాడైతే తన పార్టీలో ఆ కులం వాడితో ప్రతివిమర్శ చేయించడం బాబు పద్ధతి. మత్తయ్య విమర్శిస్తే దాన్ని యీ మధ్యే వైసిపి తీర్థం పుచ్చుకున్న జూపూడి చేత తిప్పి కొట్టించాడు. జూపూడి మాల అని తెలుసు కానీ క్రైస్తవ కనక్షన్‌ కూడా ఉందేమో తెలియదు.

ఇలాటి రాజకీయపు విమర్శలు వస్తాయి కదాని ఏ నాయకుడూ చేద్దామనుకున్న పని చేయకుండా ఉండలేడు. జగన్‌ ఎల్వీని తీసేద్దామనుకున్నాడు, తీసేశాడు. ఇంతకీ యిలా చేద్దామని ఎందుకు అనుకున్నారు అన్నదానిపై రెండు, మూడు కథనాలు వినవచ్చాయి. స్థానికులకు 75% రిజర్వేషన్ల విషయంలో ఒక అధికారి వ్యతిరేకించినప్పుడు ఎల్వీ అతన్ని వారించలేదని జగన్‌కు కోపమట. తర్వాత చూస్తే స్థానికులు అనే నిర్వచనానికి చాలా మార్పులు జరిగాయి. అంటే జగన్‌ ఆ అభ్యంతరాలను మన్నించినట్లే కదా. అందువలన యిది కారణమనడానికి లేదు.

ఇక ప్రభుత్వ స్థలాలు ఏయే వూళ్లల్లో ఉన్నాయో చూసి, వాటిని గుర్తించి జగన్‌ వాటిని జనాలకు యిళ్ల స్థలాలుగా యిద్దామనుకుంటే, కాదు, డంపింగ్‌ యార్డులకు కేటాయిద్దామని ఎల్వీ అన్నారని, అందువలన యిద్దరి మధ్య ఘర్షణ ఏర్పడిందని ఒక కథనం. పర్యావరణం కాపాడాలంటే డంపింగ్‌ యార్డులు చాలా ముఖ్యం. కానీ వాటివలన వెంటనే పేరు రాదు, అందువలన పాలకుడు యిళ్ల స్థలాలే యిద్దామనవచ్చు. కానీ ఇళ్ల స్థలాలు వేల సంఖ్యలో, అధమం వందల సంఖ్యలో ఉంటాయి. చెత్తపడవేసే డంపింగ్‌ యార్డుకి పెద్ద ఎంత కావలసి వస్తుంది కనుక! అందువలన యిదీ పెద్ద పాయింటు కాకపోవచ్చు. పారిశుధ్య పనివారి జీతాల పెంపు విషయంలో రోజుకి కొన్ని గంటలు మాత్రమే చేసే పనికి అంత ఎందుకని ఎల్వీ అభ్యంతరం, చెపితే 'ఎంత యిచ్చినా మీరూ నేనూ ఆ మురికిలో దిగం' అని జగన్‌ అన్నారని వినికిడి. అంతమాత్రానికే పెద్ద గొడవ వచ్చేసిందని అనుకోవడానికి లేదు.

మరి ఏమిటి అయి వుండవచ్చు అంటే నా మటుకు నేను అనుకునేదేమిటంటే, పథకాలకు నిధుల విషయంలో గొడవలు వచ్చి ఉంటాయని. ఎందుకంటే జగన్‌ పథకాలకు అడ్డూ, ఆపూ లేకుండా ఉంది. విద్యుత్‌ కొనడానికి డబ్బుల్లేవు, పాత బకాయిలు తీర్చడానికి డబ్బుల్లేవు. వచ్చిన కాస్త ఆదాయాన్ని అప్పులకూ, వడ్డీలకు, జీతాలకు కాస్తకాస్త పంచలేక ఛస్తున్నాడు ఆర్థికమంత్రి. కానీ కొత్త పథకాలు వెలుస్తున్నాయి, జీతాలు పెంచేస్తున్నారు, వాగ్దానాలు వానల్లా కురుస్తున్నాయి. ఇది తెలివైన పని కాదని ఆచరణవాదులెవరైనా చెప్తారు. నవరత్నాలు ఒకేసారి అమలు చేస్తారని ఎవరూ ఆశించి వుండరు. ఏడాదికి మూడేసి చొప్పున చేసుకుంటూ వచ్చినా ప్రజలు సహిస్తారు.

కానీ జగన్‌కు ఒకటే ఆత్రుత. ఆర్నెల్లలోనే మంచి ముఖ్యమంత్రి అనిపించేసుకోవాలన్న ఆబ. ఈ పథకాలకు నిధులు ఎక్కడ నుంచి తెస్తాడా అని జగన్‌ అభిమానులకు, వ్యతిరేకులకు అందరికీ కుతూహలమే. క్రమేపీ అర్థమవుతున్నదేమిటంటే - పాత పథకాలకు మంగళం పాడేస్తున్నారు, పాత బిల్లులను బకాయి పెట్టేస్తున్నారు. పాత ప్రభుత్వానికి పని చేసిన వాళ్లందరూ అక్రమాలు చేసినవారే అనే ముద్ర కొట్టి, వాళ్లకు చెల్లింపులు చేయడం లేదు. ఇలాటి పాలకులతో అధికారులకు మహా యిబ్బంది. ఎందుకంటే మంత్రిగారు చెప్పినా, ఆఫీసర్లు నిధులు విడుదల చేయటం లేదంటూ ప్రజలు అనుకుంటారు. బిల్లులు పెండింగులో ఉన్నవాళ్లు వ్యవహారాలు కోర్టుకి వెళితే, జడ్జిలు అధికారులకే చివాట్లు వేస్తారు.

ఎల్వీ వంటి పద్ధతి గల మనిషి ముఖ్యమంత్రిని మాటిమాటికి యీ విషయంలో హెచ్చరిస్తూ ఉండవచ్చు. 'నేను ప్రజలకు ఏదో చేద్దామనుకుంటే, యీయన రూల్సంటూ అడ్డుపడుతున్నాడ'ని ముఖ్యమంత్రికి కోపం వస్తూ ఉండవచ్చు. ఎన్టీయార్‌ తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు యిలాటి తంతే నడిచింది. అధికారుల అభ్యంతరాలు వినేవాడు కాదు, ఏదో చేసి, కోర్టు చేత మొట్టికాయలు వేయించుకునేవాడు. అందుకే అధికారులందరూ ఎన్టీయార్‌తో వ్యవహరించడం తలనొప్పి అనుకునేవారు. ఇప్పుడు జగన్‌తో కూడా అదే అనుభవం పునరావృతం అవుతోందనుకుంటా. 

దీర్ఘకాలికి సౌర, పవన విద్యుత్‌ ఒప్పందాలను తిరస్కరించడం వలన, రివర్స్‌ టెండరింగు వలన ప్రజాధనం మిగిల్చానని జగన్‌ అనుకోవచ్చు, ప్రజలు కేరింతలు కొట్టవచ్చు. కానీ పాతవాటిలో భాగస్వామ్యం ఉన్న కేంద్రం చూస్తూ ఊరుకోదు. అవతలి పార్టీ కోర్టుకి వెళితే కోర్టులు ఒప్పుకోవు.  అది జరిగినప్పుడు అధికారులు సరిగ్గా సహకరించలేదని, అడ్వకేట్‌ జనరల్‌ సరిగ్గా వాదించలేదని రాజకీయ నాయకులు ప్రజలకు చెప్పేస్తారు. నింద మోసే అధికారులు బయటకు వచ్చి తమ వాదన వినిపించలేరు. రూల్సు అడ్డువస్తాయి. అందువలన యిలాటివి వద్దని ఎల్వీ పదేపదే చెపుతూ ఉండవచ్చు. ఆయన అలా చెపుతూనే ఉంటాడు, ఏం ఫర్వాలేదు చేసేయండి అని చెప్పేందుకు జగన్‌ చుట్టూ బోల్డుమంది చేరారు.

రెగ్యులర్‌ బ్యూరాక్రసీపై జగన్‌కు నమ్మకం చాలక, సలహాదార్లను వేసుకున్నాడు. వీళ్లంతా రాజ్యాంగేతర శక్తులుగా తయారవుతారు. ఒక  కింది అధికారి ఎందరి మాట వినాలో తెలియక, ఏదీ చేయకుండా మానేయవచ్చు. ఐవైఆర్‌ చెప్పినట్లు ఈ సలహాదార్లకు బాధ్యత లేదు. జగన్‌ను మెప్పించడానికి ఏవేవో చెప్పేస్తారు. వాటిలో ఉండే చిక్కులు తెలియవు. ఎన్టీయార్‌ యిలాటి సలహా వినే, కార్పోరేషన్లను రద్దు చేద్దామనుకున్నాడు. ఆయనకు సెక్రటరీగా ఉండే మోహన్‌ కందా ఆపి ఎన్టీయార్‌ ఆగ్రహానికి గురయ్యానని తన ఆత్మకథ ''మోహనమకరందం''లో రాసుకున్నారు. ఆ ఎపిసోడ్‌ లింకు కింద చూడండి. 

వైయస్‌కు కూడా చాలా ఉబలాటం ఉండేది, ఏవేవో చేసేయాలని. రోశయ్య అడ్డుపడేవాడు. ఇద్దరూ రాజకీయపక్షులే కాబట్టి, ఎక్కడో రాజీ పడి లాక్కుని వచ్చారు. 2009 ఎన్నికలకు వెళ్లబోతూ వైయస్‌ కొత్త హామీలేవీ లేవు అని చెప్పుకున్నాడు. ప్రజలను మెప్పించాల్సిన ఆబ్లిగేషన్‌ కానీ అధికారికి ఉండదు. 'ఇలా చేస్తే ఫలానా దానికి ఫండ్స్‌ ఉండవు, కేంద్రం నుంచి మొట్టికాయలు పడతాయి' అని మంత్రికి నిష్కర్షగా చెప్తాడు. ఎందుకంటే  చీఫ్‌ సెక్రటరీకి సెంట్రల్‌ సెక్రటేరియట్‌ నుంచి మందలింపులు వస్తూ ఉంటాయి - మీ సిఎంకు తెలియకపోతే నువ్వయినా చెప్పవద్దా? అని. ఇలాటి సంఘటనలు 'ఎస్‌ మినిస్టర్‌'లో సైతం కనబడతాయి.  

ఇక్కడ జగన్‌ తనను అతి బలమైన సిఎంగా, తన కార్యాలయాన్ని (సిఎంఓ)ను ఆల్‌పవర్‌ఫుల్‌గా చూపించదలచాడు. అందుకే సిఎంఓలో ఉన్న ప్రిన్సిపల్‌ సెక్రటరీ (పొలిటికల్‌) ప్రవీణ్‌ ప్రకాశ్‌ చేత సిఎస్‌కు ఆదేశాలు యిప్పించాడు - అక్టోబరు 30 నాటి కాబినెట్‌ సమావేశంలో ఎజెండా ఏమిటో ఆయనే నిర్ణయించేశాడు. నియమాలను ఉల్లంఘించి, పద్ధతి మీరి అలా ఎందుకు చేశావు అని ఎల్వీ అతనికి షోకాజ్‌ నోటీసు యిచ్చారు. అది చూపించి ప్రవీణ్‌ ఘొల్లుమని ఉంటాడు - మీరు చెప్పినట్లు అక్షరాలా చేస్తే ఏం జరిగిందో చూడండి అని. దాంతో జగన్‌కు పొడుచుకు వచ్చింది. నా విధేయుణ్ని నిలదీస్తే నన్ను నిలదీసినట్లే అనుకుని అదే ప్రవీణ్‌ చేత ఎల్వీకి బదిలీ ఆర్డరు యిప్పించాడు. పై అధికారులను ధిక్కరించావని ఎల్వీ ప్రవీణ్‌ను కారణం అడిగితే, అతను కారణం చెప్పవలసిన అవసరం లేకుండా, జగనే 'ధిక్కారము సైతునా?' అంటూ ఎల్వీపై వేటు వేశాడు. 

ఆత్మీయులతో, ఇచ్చకాలు చెప్పేవారితో నిండి, సర్వాధికారాలు చెలాయించే సిఎంఓ రాష్ట్రంలో తయారయినట్లే, కేంద్రంలో కూడా పిఎంఓ ఉంది. అందుచేతనే  దేశం యిలా అఘోరిస్తోంది. పిఎంఓలో ఉన్న సలహాదార్ల మాట వినే మోదీ నోట్ల రద్దు, జిస్‌టి వంటివి చేపట్టి, చివరకు ఆర్థికస్థితిని యీ గతి పట్టించాడు. ఇక్కడా అదే జరుగుతుంది. అధికారులు సొంత బుర్ర వాడడం మానేస్తారు, అందరూ జీహుజూర్లే అవుతారు. అయితే మోదీలో ఒక సుగుణం ఉంది. ఫ్రీబీస్‌కి వ్యతిరేకం. ఉచితంగా యిచ్చే సంక్షేమ పథకాలను ప్రోత్సహించడు. మరి ఇక్కడ జగన్‌కు వాటి మీదే గురి. చివరకు ఈ పథకాలే రాష్ట్రాన్ని గుల్ల చేస్తాయి. 

కనీవిని ఎరగని మెజారిటీతో నెగ్గిన జగన్‌పై కనీవిని ఎరుగని రీతిలో ఆశలు కూడా ఉంటాయి. అవి విఫలమైనప్పుడు నిరాశ కూడా అదే మోతాదులో ఉంటుంది. రాజీవ్‌ గాంధీ విషయంలో అదే జరిగింది. అలా జరగకుండా ఉండాలంటే ఎడ్మినిస్ట్రేషన్‌ సహకరించాలి. వాళ్ల నైతికస్థయిర్యం, మొరేల్‌ బాగుండాలి. ఎందుకంటే ప్రజల్ని చేరడానికి వాళ్లే ఉపకరణాలు. రాజు ఉపకరణాలతోనే యుద్ధం చేస్తే అది ఆత్మహత్యే. జగన్‌ ఆ బాటలో తొలి అడుగు వేశాడు. చివరగా - విభేదించిన ప్రతీవాడు శత్రువు కాదని జగన్‌ తెలుసుకోవాలి. బాబుని నిలవరించినప్పుడు ముద్దువచ్చిన ఎల్వీ తన దాకా వచ్చేసరికి వెగటు పుట్టడం ఎందుకో జగన్‌ ఆలోచించుకోవాలి. ఇక్కడ మోహన్‌ కందాగారి మరో ఉదంతం గుర్తుకు వస్తోంది. ఆయన బాబు వద్ద, వైయస్‌ వద్ద యిద్దరి దగ్గరా సిఎస్‌గా పని చేశారు. ప్రతిపక్షంలో ఉండగా వైయస్‌ దృక్పథానికి, అధికారంలోకి వచ్చాక మారిన దృక్పథానికి వచ్చిన తేడాను ఆయన మోహనమకరందంలో 'చోటు మారి చూడు' వ్యాసంలో చెప్పారు. దాని లింకు కూడా కింద యిస్తున్నాను.

https://telugu.greatandhra.com/articles/mohana-makaranadam/mohanamakarandam-25-51540.html

https://telugu.greatandhra.com/articles/mohana-makaranadam/mohana-makarandam-28-51621.html

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?