Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎస్వీయార్‌ అంటే అంత గౌరవం ఎందుకు?

ఎమ్బీయస్‌: ఎస్వీయార్‌ అంటే అంత గౌరవం ఎందుకు?

వాహినీ స్టూడియోలో కెమెరా డిపార్టుమెంటుకి చీఫ్‌గా, విజయా వారి సినిమాలకు ఫోటోగ్రాఫర్‌గా మార్కస్‌ బార్‌ట్లే అందరికీ సుపరిచితుడు. చాలా క్రమశిక్షణ గల వ్యక్తి. సెట్‌, లైటింగ్‌ వగైరాలు జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆర్టిస్టులు ఏదైనా పొరబాటు చేస్తే నిర్మొగమాటంగా చెప్పి మందలించేవాడు. అందరికీ ఆయనంటే అడలు. ''రాముడు భీముడు'' సినిమా ఆధారంగా దిలీప్‌ కుమార్‌ ద్విపాత్రాభినయంతో నాగిరెడ్డిగారు హిందీలో నిర్మించిన ''రామ్‌ ఔర్‌ శ్యామ్‌'' (1967) షూటింగు ముచ్చట్లను రచయిత డివి నరసరాజుగారు ''తెర వెనుక కథలు''లో గ్రంథస్తం చేశారు.

ఆ సినిమాకు దర్శకుడిగా తాపీ చాణక్య పేరు వేసినా, నిజానికి దిలీప్‌ కుమారే దర్శకత్వం వహించాడు. సెట్స్‌ మీదకు ఆలస్యంగా రావడం అతని అలవాటు. హిందీ చిత్రరంగంలో రారాజు కాబట్టి బొంబాయిలో చెల్లిపోయింది. మద్రాసులో అలా కుదరదని చెప్పినా ఓ రోజు 12 గం||లకు వచ్చాడు. ''1 గంటకి లంచ్‌ కదా. ఒక గంటలో ఏం పనిచేస్తాం? ఒకేసారి లంచ్‌ తర్వాత షూటింగు చేద్దాం.'' అన్నాడు. బార్‌ట్లే 9 గం||ల నుంచి లైటింగు అదీ చేసుకుని సిద్ధంగా ఉన్నాడు. దిలీప్‌ యిలా అన్నాడని వినగానే ''నాకీ మాట ముందే చెబితే నేనూ లంచ్‌ తరువాత వచ్చేవాణ్ణి కదా'' అని దిలీప్‌ మీద కొంత పరుషపదజాలం విసిరాడు. అది దిలీప్‌కి చేరింది. అప్పణ్నుంచి బార్‌ట్లే అంటే భయం పట్టుకుంది.

దిలీప్‌ కథలో కొన్ని మార్పులు చేద్దామనుకున్నాడు. ఒరిజినల్‌ కథారచయిత నరసరాజుగారిని పిలిపించి, చర్చించి మార్పులు చేసేవాడు. ఓ రోజు సాయంత్రం 6 గం||లకు నరసరాజుగారు వేరే పని మీద స్టూడియోకి వెళ్లి షూటింగు చూడబోయారు. దిలీప్‌ ఒక సీను ప్లాను చేశానని, అది తీయబోతున్నాననీ చెప్పాడు.

'ఈ సీను సినిమాలో ఎలా అతుకుతుంది? దీనివలన సస్పెన్సు పోతుంది కదా' అని యీయన అంటే ''మీరు చెప్పినది కరక్టే. ఆ విషయం నాకూ మధ్యాహ్నమే తట్టింది. కానీ వెళ్లి సీను తీయనక్కరలేదని చెబితే బార్‌ట్లే ఎగిరి నా గొంతు పట్టుకుంటాడు. 2 గంటల నుంచి ఫుల్‌ ఫ్లోర్‌ ఎంతో కష్టపడి లైటప్‌ చేశాడు. అందువలన సీను తీస్తాను, కానీ సినిమాలో పెట్టను. ఈ రహస్యం ఎవరికీ చెప్పకండి.'' అని దిలీప్‌ చెప్పాడు. అంటే బార్‌ట్లేకు కోపం వస్తుందని దిలీప్‌ ఉత్తుత్తి సీను ఒకటి తీశాడన్నమాట. అదీ బార్‌ట్లే యిమేజ్‌! కడదాకా అది అలాగే సాగింది.

రామానాయుడు గారి ''చక్రవాకం'' (1974) సినిమాకు బార్‌ట్లే కెమెరామన్‌. హీరోయిన్‌ వాణిశ్రీ. వాహినీ స్టూడియోలో షూటింగు. ఓ సీనులో ఆయన కెమెరాలో చూస్తూ లైట్‌మన్‌కి ఏదో చెబుతూంటే వాణిశ్రీ అటూయిటూ కదులుతూ పక్కనున్న మేకప్‌మన్‌తో ఏదో మాట్లాడుతూ టచప్‌ చేసుకుంటోంది. 'లైటింగు చూసుకుంటున్నాను కదా కదలకుండా నిలబడమని వాణిశ్రీకి చెప్పండి' అని బార్‌ట్లే అసిస్టెంటు డైరక్టరుగా పని చేస్తున్న మురారి  (తర్వాతి రోజుల్లో 'యువచిత్ర' బ్యానర్‌లో చాలా మంచి సినిమాలు తీశారు)కి చెప్పారు.

ఆయన వెళ్లి చెపితే వాణిశ్రీ కాస్సేపు కదలకుండా నిలబడి ఆ తర్వాత మళ్లీ కదలడం మొదలుపెట్టింది. బార్‌ట్లేకి విసుగు పుట్టి 'ఐ కాంట్‌ డూ దిస్‌ నాన్సెన్స్‌' అని స్టూల్‌ను ఒక్క తన్ను తన్ని సెట్‌లో నుండి వెళ్లిపోయాడు. దూరంగా నిలబడి ఉన్న చక్రపాణి, రామానాయుడు, నాగిరెడ్డిలకు విషయం అర్థమై, దర్శకుడు వి.మధుసూదనరావుతో మాట్లాడి 'బార్‌ట్లే దగ్గర వాణిశ్రీని బుద్ధిగా మసులుకోమని చెప్పు' అన్నారు. ఈ విషయాన్ని మురారి తన ఆత్మకథ 'నవ్విపోదురుగాక..'లో రాశారు. ఆయనే బార్‌ట్లే-ఎస్‌ వి రంగారావు పరస్పరగౌరవం గురించి కూడా రాశారు. 

అదే సినిమా షూటింగులో హీరోయిన్‌ యింట్లోకి వరదనీరు వస్తే, తండ్రి పాత్ర చేస్తున్న ఎస్వీయార్‌ నీళ్లలో చిక్కుకున్న వాణిశ్రీ (కుమార్తె), అంజలి (భార్య)లను బయటకు తీసుకెళ్లే దృశ్యం తీయాలనుకున్నారు ఒకరోజు. సెట్టు నిండా అరడుగులోతు నీళ్లు పోసి, నీళ్లలోనే కెమెరా పెట్టి బార్‌ట్లే రెడీగా కూర్చున్నారు. కానీ తక్కిన యిద్దరూ సెట్‌లోనే ఉన్నా ఎస్వీయార్‌ మేకప్‌ రూములోంచి బయటకు రావటం లేదు. మరో అసిస్టెంటు డైరక్టరు కోదండరామిరెడ్డిని పంపినా ఆయన రాలేదు. మురారి కాస్త పోజుగా 'షాట్‌ రెడీ అయింది కదా, ఏంటీ ఆయన యింకా రాలేదు' అన్నారు. అప్పుడు బార్‌ట్లే చిరునవ్వి నవ్వి 'మురారీ, నువ్వె వెళ్లి పిలుచుకుని రా' అన్నాడు.

లోపలికి వెళ్లి చూస్తే రంగారావు తాగుతూ కూర్చున్నారు. ఇక లాభం లేదని బయటకు వచ్చి బార్‌ట్లేతో 'హీ ఈజ్‌ డ్రంక్‌ సర్‌' అన్నారు మురారి. ఇక అవేళ ఆయనతో పని కాదని అర్థమై, కాస్సేపటికి ప్యాకప్‌ చెప్పేశారు. బార్‌ట్లే నొచ్చుకోలేదు. మురారి ప్రశ్నార్థకంగా చూస్తే భుజం మీద చేయి వేసి తన గదిలోకి తీసుకుని వెళ్లి ''ఆయన ఒక్కోసారి అలాగే ఉంటారు. దాని అర్థం యింట్లో ఏదో గొడవ జరిగి ఉంటుంది. మహానటుడు, కానీ వ్యక్తిగత సుఖం లేదు. ఇదీ ఆయన పరిస్థితి. విజయా వారి సినిమాలలో ఎప్పుడూ ఆయన్ని యిలాగ చూడలేదు. చక్రపాణి అంటే ఆయనకు విపరీతమైన గౌరవం. గొప్ప కమిటెడ్‌ ఆర్టిస్ట్‌. 

మాయాబజారులో ఓ ట్రిక్‌ షాట్‌ తీయాల్సి వచ్చినపుడు ఘటోత్కచుడి భారీ మేకప్‌, గెటప్‌తో ఆరుగంటలపాటు కదలకుండా నుంచున్నారు.'' అని మెచ్చుకున్నారు. ఎస్వీయార్‌కు ఆంగ్లభాషపై మంచి పట్టు ఉంది. షేక్‌స్పియర్‌ నాటకాల్లో నటించేవారు. షైలాక్‌ ఆయన అభిమాన పాత్ర.  బార్‌ట్లే అంటే అందరూ భయపడినా ఆయన నవ్వుతూ ఇంగ్లీషులో మాట్లాడేవారు. ఈయన కూడా నవ్వుతూ లైటింగ్‌ చేసేవారు. ఎస్వీయార్‌తో ''రంగారావ్‌, జస్ట్‌ లుక్‌ దిస్‌ సైడ్‌'' అంటూ అటూయిటూ తిరుగుతూ లైట్లు అడ్జస్ట్‌ చేసుకునేవారు.

కొసమెరుపు ఏమిటంటే - ''చక్రవాకం'' సినిమా షూటింగు సమయంలోనే రంగారావు మరణించారు. కథ ప్రకారం ఆ పాత్ర చివరిదాకా ఉండాలి. కానీ మధ్యలో మరణించడంతో ఊరెళ్లారని, రైల్లో తిరిగి వచ్చేటప్పుడు చనిపోయారని మార్పు చేసేశారు. దానివలన క్లయిమాక్సులో పండవలసిన డ్రామా మిస్సయి, సినిమా సరిగ్గా ఆడలేదు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?