cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: అభిమానం - అసహనం

ఎమ్బీయస్‌: అభిమానం - అసహనం

మనం కొన్ని విషయాలను, కొందరు వ్యక్తులను అభిమానిస్తాం. ఈ అభిమానం ఎలా ఏర్పడుతుంది అంటే చెప్పడం కష్టం. ఒక పాట, ఒక రచన, ఒక కళారూపం మనసుకు హత్తుకుంటుంది. ఇది పూర్తిగా వ్యక్తిగతం. అదే పాట యింకోర్ని మెప్పించలేక పోతుంది. మరి వీరి కెందుకు నచ్చింది అంటే వీళ్ల అభిరుచి, సంస్కారం, కుటుంబనేపథ్యం, పెరిగిన సామాజిక వాతావరణం యిలా అనేక కారణాలుండవచ్చు. మన తెలుగువాళ్లకు కర్ణాటక సంగీత బాణీ నచ్చినంతగా హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం తలకెక్కదు - దాన్ని సరళీకరించి, హిందీ సినిమా పాటగా మలిస్తే తప్ప! భరతనాట్యం, కూచిపూడి నచ్చినట్లుగా కథక్‌, కథాకళి నచ్చవు. మళ్లీ మనలో అందరికీ కర్ణాటక సంగీతమూ, భరతనాట్యం నచ్చవు. దానికి కుటుంబనేపథ్యం ఒక కారణం అనుకోవాలేమో! కానీ అలాటి నేపథ్యం ఉన్న అందరికీ నచ్చదు, ఆ నేపథ్యం లేకపోయినా నచ్చేవాళ్లున్నారు. అందువలన ఏది ఎవరికి ఎందుకు నచ్చుతుందో చెప్పలేం.

ఆ నచ్చడం కూడా స్థిరంగా ఉంటుందన్న గ్యారంటీ లేదు. చిన్నపుడు ఒక్కొక్క స్కూలు టీచరు అంటే పడి ఛస్తాం. (దీన్ని ఇంగ్లీషులో స్కూల్‌ గర్ల్స్‌ క్రష్‌ అంటారు) పెద్దయ్యాక అలా ఎందుకు పడి చచ్చామా అని మనమే ఆశ్చర్యపడతాం. చిన్నపుడు ఎత్తుగా కనబడిన బురుజులు, విశాలంగా కనబడిన వీధులు, గంభీరంగా కనబడిన వక్తలు పెద్దయ్యాక అంత ఎత్తుగా, విశాలంగా, గంభీరంగా ఆనరు. సినీతెరపై చిన్నపుడు మురిపించిన కత్తియుద్ధాలు, గుఱ్ఱపుస్వారీలు పెద్దయ్యాక నవ్వు తెప్పిస్తాయి తప్ప థ్రిల్‌ కలిగించవు. చిన్నప్పుడు పులకింపచేసిన ప్రేమ నవలలు పెద్దయ్యాక చప్పగా, చైల్డిష్‌గా అనిపిస్తాయి. చిన్నపుడు ఆరాధించిన అపరాధపరిశోధకుడు పెద్దయ్యాక హాస్యాస్పదంగా తోస్తాడు. ఇలా మన అభిప్రాయాలు, అభిమానాలు నిరంతరం మార్పుకు గురవుతూనే ఉంటాయి. ఒక్కోసారి అవి పలుచనవుతాయి. మరి కొన్ని సందర్భాల్లో అవి ఆవిరై పోతాయి. ఇంకొన్ని సందర్భాల్లో వెగటు కలిగిస్తాయి కూడా.

అభిరుచుల విషయంలోనే కాదు, రుచుల విషయంలో కూడా మార్పులు వస్తాయి. చిన్నపుడు అమ్మ చేతి వంటే అమృతం. హాస్టల్‌కో, ఉద్యోగరీత్యా పొరుగూరికో వెళ్లినపుడు కొత్త రుచులు అలవడి, అవీ నచ్చుతాయి.  అమ్మ వంటను పోల్చి చూసి మార్కులు వేస్తూంటాం. అలాగే దేవుడి విషయం. చిన్నపుడు యింట్లో ఏ దేవుణ్ని మొక్కితే ఆ దేవుడే సర్వస్వం అనుకుంటాం. తర్వాత ఆ దేవుడు మార్కులు సరిగ్గా తెప్పించలేదనో, ఉద్యోగం యిప్పించలేదనో, క్లాసుమేటు చెప్పిన దేవుణ్ని ట్రై చేసి చూస్తాం. అది క్లిక్కయితే ఆయన్ని నమ్ముకుంటాం. కొంతకాలానికి ఏ దేవుడూ పనిచేయడం లేదన్న విసుగుతో దేవుడే లేదంటాం, వయసు మీద పడిన కొద్దీ, మన చేతిలో ఏమీ లేదని గ్రహించినకొద్దీ దేవుడిమీద మళ్లీ నమ్మకం పెంచుకుంటాం.

ఎందుకొస్తున్నాయి యిలాటి మార్పులు? అనుభవం వలన! మన దృష్టి విశాలమై, మన జ్ఞానం విస్తరించిన కొద్దీ మన పూర్వవిశ్వాసాలు సడలుతాయి. మనకు ఎక్స్‌పోజర్‌ పెరుగుతున్నకొద్దీ కొత్త సంగతులు తెలిసి, ఆలోచనా పరిధి పెరుగుతుంది. హైస్కూలులో ఉండగా యింటి పక్క అమ్మాయే రంభలా అనిపిస్తుంది, కాలేజీలో పక్క వూళ్ల నుంచి వచ్చిన అమ్మాయిలను కూడా చూసిన తర్వాత అనిపించడం మానేస్తుంది. యూనివర్శిటీలో పక్క జిల్లాల అమ్మాయిలను కూడా చూసిన తర్వాత కాలేజీ అమ్మాయిలను చూసి నోరు చప్పరిస్తాం. వాళ్లకు ప్రేమలేఖలు ఎందుకు రాశామా అని ఆశ్చర్యపడతాం. పర రాష్ట్రం, పరదేశం వెళితే యిక చెప్పనే అక్కరలేదు.

హిమాలయాలకు వెళ్లేవరకూ తిరుపతి కొండే మహాపర్వతం. మన వీధిలోనే ఉన్నంత కాలం గొప్పవాళ్లంతా మన కులంలోనే పుట్టారనుకుంటాం. లోకం తెలుస్తున్న కొద్దీ అర్థమవుతుంది - మన కులమే కాదు, అన్ని కులాలూ గొప్పవేనని, మన ప్రాంతమే కాదు, అన్ని ప్రాంతాలూ గొప్పవేనని. మనం ఒక దానిలో రాణిస్తే, వాళ్లు మరో దానిలో రాణిస్తున్నారు అని గ్రహించేసరికి మన కులాభిమానం చెదురుతుంది. పరిపూర్ణ జ్ఞానం రావాలంటే ఎక్స్‌పోజర్‌ పెరగాలి. ప్రపంచ భాషల్లో కల్లా తెలుగే గొప్పది అనే స్టేటుమెంటు యిచ్చే ముందు ప్రపంచంలోని సకల భాషల పేర్లయినా తెలుసుకోవాలి. విశ్వమతాలన్నిటిలో హిందూమతం గొప్పది అనే ముందు, లోకంలోని సమస్త మతాల సిద్ధాంతాలు, అవి అమలవుతున్న విధానం తెలుసుకోవాలి.

జ్ఞానం అనేది రాత్రికి రాత్రి వచ్చేయదు. విద్యార్జన అనేది నిరంతర ప్రక్రియ. కొత్త పరిశోధనలు జరుగుతున్న కొద్దీ ఆ విద్య కూడా విస్తృతమౌతూ ఉంటుంది. మనం గుడ్డు దశలో ప్రారంభమై, లార్వా, ప్యూపా దశలకు ఎదుగుతూ పూర్తి కీటకంగా మారడానికి కొన్ని ఏళ్లు పడుతుంది. మనం ఉన్న దశ గుడ్డో, లార్వాయో తెలుసుకోకుండా కీటకాన్ని విమర్శించడం మొదలుపెడితే 'గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందట' సామెతను నిజం చేసినవారం అవుతాం. కానీ మనం విమర్శకు దిగుతున్నాం. కారణమేమిటంటే అభిమానం! మనం ఆ సమయానికి నమ్ముతున్న సిద్ధాంతం పట్లో, నమ్మకం పట్లో, కళాకారుడి పట్లో అభిమానం పెంచుకుని మనతో విభేదించినవారిని విమర్శిస్తున్నాం. నిజానికి పైన చెప్పినట్లుగా యీ రోజు మన అభిమానం రేపు ఉండకపోవచ్చు. ఇంతలోపే అర్జంటుగా గొడవ పెట్టేసుకోవాల్సిన అవసరం లేదు. తెలిసీ తెలియని వ్యాఖ్యలు చేయనవసరం లేదు.

అభిమానంగా ఉన్నంతవరకు పెద్దగా పేచీలు రావు. అది అంతటితో ఆగకుండా దురభిమానంగా మారడంతోనే వస్తాయి చిక్కులు. మా అభిమాన నటుడు గొప్ప, మా అభిమాన నాయకుడు గొప్ప, మా అభిమాన స్వామీజీ గొప్ప అంటూ కొట్లాటలకు దిగడం జగడాలకు దారి తీస్తుంది. ఒక నటుడి నటనంటే యిష్టం పెంచుకుని అతని సినిమాకు తప్పకుండా చూడడం అభిమానం కింద వస్తుంది. ఫ్యాన్స్‌ అసోసియేషన్‌గా ఏర్పడి, కటౌట్లకు క్షీరాభిషేకాలు చేయడం అభిమానంలో తారస్థాయి. ఇతర నటుల కటౌట్ల మీద దాడి చేయడం, వాళ్ల సినిమాల కెళ్లి యీలలేసి, వెబ్‌సైట్‌లలో వెకిలి వ్యాఖ్యలు చేయడం దురభిమానం కింద వస్తుంది. మా చిన్నప్పుడు ఎన్టీయార్‌ అభిమానులు ఎయన్నార్‌ సినిమాల వాల్‌పోస్టర్లపై పేడముద్దలు కొట్టేవారు. ఎయన్నార్‌ అభిమానులు బదులు తీర్చేసేవారు. బాగా చదువుకుని, మామూలు పరిస్థితుల్లో పేడ ముట్టుకోవడానికి అసహ్యించుకునే వారు కూడా యిలా చేయడానికి కారణం వారి దురభిమానం.

రాజకీయాలకు వస్తే యీ దురభిమానాలు హింసకు, రక్తపాతానికి దారి తీసేవి. కాంగ్రెసు, కమ్యూనిస్టు అనేవి రెండు ప్రధానమైన చీలికలు. కాంగ్రెసులో మళ్లీ సంజీవ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి అభిమానుల మధ్య చీలిక వేరే! నెహ్రూ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చీలిక వేరే! నిరంతరం వాదనలు వినబడుతూనే ఉండేవి. పట్టణాలలో విద్యాధికుల మధ్య అరుచుకోవడాలతో ఆగితే, పల్లెల్లో, పాటక జనంలో కర్రలతో కొట్టుకోవడం వరకు వెళ్లేది. ఇవి ఎన్నికల సమయంలో ఉధృతమయ్యేవి. ఆ నాయకుడు రేపు పక్షం మారతాడో, పార్టీ మారతాడో తెలియకుండా వీళ్లు చొక్కాలు చింపుకునేవారు. మా నాన్నగారి తరం వాళ్లు చేసుకునే వాదనలు వింటూ పెరిగిన నేను పెద్దయ్యాక వాళ్లెంత పరిమిత జ్ఞానంతో వాదులాడుకునేవారో తెలిసి నవ్వుకున్నాను. అప్పట్లో తెలుగు పేపర్లు 6 పేజీల్లో వచ్చేవి. దాంట్లోనే స్థానిక, జాతీయ, అంతర్జాతీయ విషయాలన్నీ రేఖామాత్రంగా కవర్‌ చేసేవారు. రాజకీయ విషయాలపై పెద్దగా పుస్తకాలు వెలువడేవి కావు. తెలిసీ తెలియకుండానే  వాళ్లు ఆవేశపడిపోయేవారు.

గతంలో యీ దురభిమానాలతో ఆగేవారు. ఇటీవల ఇది అసహనంలోకి మారుతోంది. అప్పట్లో 'మనకు తక్కిన వాళ్ల విషయాలు పెద్దగా తెలియవులే' అనే అవగాహన ఉండేది. ఈనాటి సమాజంలో యింటర్నెట్‌ వచ్చాక అన్నీ తెలుసనే భ్రమలో పడ్డారు చాలామంది. గూగుల్‌లో ఏదో వెతికేసి, మొదట తగిలినదాన్ని అక్షరసత్యమని నమ్మేసి, అభిమానించి, దురభిమానించి ఆ పై తమతో ఏకీభవించనివారిపై అసహనం వెళ్లగక్కుతున్నారు. నిజానికి యింటర్నెట్‌లో ఎవరు కావాలంటే వాళ్లు, ఏం కావాలంటే అది పెట్టేయవచ్చు. అబద్ధం రాసేవేమని కేసులు పెట్టే పరిస్థితి లేదు. ఒక జవాబుదారీతనం లేదు. గాంధీ, నెహ్రూలతో సహా బతికున్నవారిపై, చచ్చిపోయినవారిపై ఎంత బురద చల్లినా చెల్లిపోతోంది. ఇక హిందూ దేవీదేవతలపై అయితే చెప్పనే అక్కరలేదు, ఏ చెత్త రాసినా నమ్మేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారు. అసత్యాన్ని నమ్మడంతో ఆగటం లేదు వీరు, దాన్ని ప్రచారం చేయడానికి ముందుంటున్నారు.

దేని గురించైనా అభిప్రాయం ఏర్పరచుకోవాలంటే విషయం పూర్తిగా తెలిసి వుండాలి. తర్జనభర్జనలు చేసుకోవాలి. తర్కం ఉపయోగించాలి. క్రాస్‌చెక్‌ చేసుకోవాలి. కొన్ని అసత్యవార్తల్లో ఫలానావారు దీన్ని ధృవీకరించారు అని రాసినా నమ్మే పరిస్థితి లేకుండా ఉంది. అందువలన ఆ సోర్స్‌ను కూడా చెక్‌ చేసుకోవాల్సి వస్తోంది. దీనికంతా సమయం పడుతుంది. కానీ మనకంత ఓపిక ఉండటం లేదు. ఏదైనా చెడు వినగానే, యితరుల కంటె ముందు మనం ప్రచారంలో పెట్టేయాలనే యావ ఉంటోంది. సోషల్‌ మీడియాలో, వాట్సప్‌లలో యీ అబద్ధాలు వీరవిహారం చేసేస్తున్నాయి. ఇవి చదివిన మిడిమిడి జ్ఞానంతో వాదనకు దిగుతున్నారు కొందరు. అంతటితో ఆగకుండా దానికి వ్యతిరేకమైన వాదన వినిపించినవారి పట్ల అసహనం చూపుతున్నారు. ఇది మన భారతీయ సమాజానికి కీడుగా పరిణమిస్తోంది.

మన భారతీయ సమాజం బహుళత్వాన్ని ఎప్పుడో స్వీకరించింది. మంచి ఆలోచనలను ఎటునుంచి వచ్చినా స్వీకరించమంది. 'వినదగు నెవ్వరు చెప్పిన...' అని పాఠాలు నేర్పింది. వినకపోగా వాడి నోరు నొక్కడం ఫాసిజం లేదా కమ్యూనిజం కింద వస్తుంది. మన మతాచార్యులందరూ వేదాంత చర్చల ద్వారా తమ సిద్ధాంతాలను వ్యాప్తిలోకి తెచ్చారు తప్ప బలిమితో కాదు. రాజుగారు బౌద్ధుడు, రాణిగారు హిందువు అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని పంజాబీ కుటుంబాల్లో అన్నగారు హిందువు, తమ్ముడు సిఖ్కు కావడం కూడా చూస్తాం. తెలుగునాట అనేక కుటుంబాల్లో కుటుంబ సభ్యుల్లో ఒకరిద్దరు సత్సంగులు కావడమో, బ్రహ్మసమాజికులు కావడమో, నాస్తికులు కావడమో, క్రైస్తవులు కావడమో చూస్తాం. అంతమాత్రం చేత వారిని అసహ్యించుకోరు. వాడి నమ్మకాలు వాడివి అని నిట్టూర్చి వదిలేస్తారు.

మా చిన్నప్పుడు స్కూలు పిల్లల్లో నువ్వు ఎన్టీయార్‌ అభిమానివా, ఎయన్నార్‌ అభిమానివా అని అడిగేవారు. 'ఇద్దరి సినిమాలూ చూస్తాను, ఏది నచ్చితే వారిని మెచ్చుకుంటాను' అని సమాధానం చెప్తే ఊరుకునేవారు కారు. ఎవరో ఒకరి పేరే చెప్పాలి అని పట్టుబట్టేవారు. పరిపక్వత లేని స్కూలు పిల్లల్లో ఆనాడు కనబడిన ఆ ధోరణి ఇటీవల మన సమాజంలో విద్యాధికుల్లో సైతం కనబడుతోంది. మోదీని విమర్శిస్తే 'అయితే రాహుల్‌ అభిమానివా?' అంటున్నారు. ఇద్దరూ నచ్చరు అంటే అదెలా? అంటున్నారు. అలాగే నువ్వు హిందువు వైతే ముస్లిములను అసహ్యించుకుని తీరాలి అని పట్టుబడుతున్నారు. వాళ్ల మానాన వాళ్లని పోనిస్తాను అంటే 'అయితే నువ్వు అచ్చమైన హిందువువి కావు, మీ అమ్మ ముస్లిముతో పడుక్కుని ఉంటుంది' అనేస్తున్నారు.

చిత్రమేమిటంటే యిటీవల సెక్యులరిస్టు అనే మాటను తిట్టుగా వాడుతున్నారు. రాజకీయాలను, మతాన్ని కలపకూడదనేవాణ్ని సెక్యులరిస్టు అంటారు. 'సర్వమతాలను సమభావంలో చూసేవాడు' అనే అర్థంలో కొందరు వాడతారు. అలా చెపుతూనే మైనారిటీలను బుజ్జగించేవారిని వెక్కిరించడానికై ఆడ్వాణీ సూడో-సెక్యులరిస్టులు అనే పదం కాయిన్‌ చేసి, బిజిపియేతర పార్టీల వాళ్లందరినీ తిట్టేవాడు. సూడో-సెక్యులరిజం అనేది ఓటు బ్యాంకు రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడేది. రాజకీయాల్లో లేనివారికి అదేమీ ఉపయోగపడదు కదా! వాళ్లను సూడో సెక్యులరిస్టులు అనడం ఒప్పదు కదా! అయినా హిందూత్వ వాద పార్టీలు అలా అనడం మొదలుపెట్టాయి.

కొంతకాలానికి సూడో కూడా ఎగిరిపోయింది. సెక్యులరిజం సిద్ధాంతాన్ని నమ్మేవారిని 'సిక్‌-యులర్‌' (వ్యాధిగ్రస్తమైన) అని నిందించడం మొదలు పెట్టారు. హిందూత్వ వాదులు తప్ప తక్కిన సాధారణ హిందువుల్లో అధికాంశం సెక్యులర్‌ భావాలు కలవారే. అందువలననే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన అయిదారు దశాబ్దాల దాకా మతంతో రాజకీయాలు ముడిపెట్టిన పార్టీలకు అధికారం దక్కలేదు. సెక్యులరిజం పేరు వినగానే అసహనం ప్రకటించే హిందూత్వవాదులందరూ హిందువులను అవమానిస్తున్నట్లే!

అలాగే కమ్యూనిస్టులను నిందించడం కూడా యీ మధ్య ఎక్కువైంది. రాజకీయ పరంగా కానీ, సిద్ధాంతపరంగా కానీ విమర్శిస్తే తప్పు లేదు. కానీ 'నువ్వు పాపాత్ముడివి' అన్న రీతిలో 'నువ్వు కమ్యూనిస్టువి' అని పలుకుతున్నారు. కమ్యూనిజం, కాపిటలిజం, సోషలిజం - యివన్నీ రాజకీయ సిద్ధాంతాలు. నమ్మినవాళ్లు నమ్ముతారు, అనుసరించినవాళ్లు అనుసరిస్తారు. చాలా ఏళ్లుగా భారతీయులు ఆ సిద్ధాంతాలను ఏదో ఒక మోతాదులో ఆమోదిస్తూ వచ్చారు. అందలం ఎక్కిస్తూ వచ్చారు. ఈనాడు వారి ప్రభ తగ్గవచ్చు, రేపు పెరగవచ్చు, లేదా కనుమరుగు కావచ్చు. తమ విధానాలకు ప్రతికూలంగా ఉన్నంత మాత్రాన వారికి దురుద్దేశాలు ఆపాదించకూడదు.

రాజకీయ నాయకులపై వ్యతిరేకత ప్రకటించడం అర్థం చేసుకోవచ్చు. కానీ మేధోజీవుల పట్ల, ఆలోచనాపరుల పట్ల, సైన్సుని సైన్సుగా చూసేవారి పట్ల, మూఢవిశ్వాసాలను ప్రశ్నించేవారి పట్ల అసహనం ప్రకటించడం గర్హనీయం. వారందరికీ కమ్యూనిస్టులనీ, సిక్యులరిస్టులని ముద్ర కొట్టి హేళన చేయడం, వారిపై దుష్ప్రచారం చేయడం, వ్యక్తిత్వహననం చేయడం - యివన్నీ దుర్మార్గం. దీన్ని అదుపులో పెట్టకపోతే సమాజానికి హాని కలుగుతుంది. వేలాది సంవత్సరాలుగా యీ భరతభూమిపై వెలసిల్లిన సంస్కృతి క్షీణిస్తుంది. ఇటీవలి కాలంలో గోరక్షణ పేరుతో అత్యాచారాలు పెరిగాయి. అమాయకులైన వారిని కూడా గోహంతకులుగా భావించి అల్లరి మూకలు మట్టుపెడుతున్నాయి. పోలీసులు ఆధారాలు సేకరించడంలో విఫలమయ్యారన్న మిష పెట్టి కోర్టులు ఎవరికీ శిక్ష పడకుండా కాపాడుతున్నాయి. ఈ మూకస్వామ్యాన్ని అదుపులో పెట్టండని కొందరు మేధావులు ప్రధానికి బహిరంగ లేఖ రాస్తే దాన్ని దేశద్రోహంగా ఆరోపిస్తూ కేసు పెట్టడం ఎంత విచిత్రం!

అలా కేసు పెట్టిన వ్యక్తి బిజెపి సమర్థకుడా, ఆ పోలీసు స్టేషన్‌ ఉన్న రాష్ట్రం బిజెపి ఏలుబడిలో ఉందా, దాని వెనుక బిజెపి అధినాయకత్వం ఉందా అనే ప్రశ్నలు అప్రస్తుతం కావచ్చు. కానీ బహిరంగ లేఖను దేశద్రోహంగా ముద్ర కొట్టే వాతావరణం నెలకొనడమే దురదృష్టకరం. చివరకు ఆ కేసు విత్‌డ్రా అయింది. ఎప్పుడు? లేఖ రాయడమే దేశద్రోహమైతే మేమూ రాస్తాం అంటూ మరి కొందరు మేధావులు ముందుకు వచ్చినపుడు! ఈ లోగా ఆ కేసు పెట్టడాన్ని తప్పుపట్టిన బిజెపి నాయకులెందరు అనేదే ప్రధాన ప్రశ్న. బిజెపి నాయకుల స్పందన గురించే ఫోకస్‌ ఎందుకు? అంటే మరి వారే కదా, కేంద్రంలో, అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది! వారి భావజాలమే కదా మన దేశంలో పేదల నుంచి ధనికుల దాకా అందరినీ ప్రభావితం చేస్తున్నది!

ఈ అసహనం అత్యంత ప్రమాదకరం అనేది మనం ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది. రాజకీయ నాయకుల మాట ఎలా ఉన్నా, యితర విషయాలలో అవతలివాళ్ల అభిప్రాయం గౌరవించే ఓర్పు నేర్చుకోండి, విషయాలను సమగ్రంగా నేర్చుకునే నేర్పు చూపండి.
-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2019)
mbsprasad@gmail.com