cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: అదొక్కటే తప్పుడు నిర్ణయం

ఎమ్బీయస్‌: అదొక్కటే తప్పుడు నిర్ణయం

సమాజంలోని అనేక వర్గాల వారికి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి జగన్‌ చిత్తశుద్ధితో పాటుపడుతున్నాడని తెలుస్తోంది. కానీ వీటికి నిధులు ఎక్కణ్నుంచి వస్తాయన్నదే అందరూ అడుగుతున్న ప్రశ్న. 'ఇవి అమలు చేసేందుకు నిధులు లేవు' అని అధికారులు చెపుతున్నా జగన్‌ పట్టించుకోకుండా మూర్ఖంగా, మొండిగా వ్యవహరిస్తున్నారని 'ఆంధ్రజ్యోతి' తరచుగా వాపోతూ ఉంటుంది. దక్షత కలిగిన వ్యాపారవేత్తగా రాణించిన జగన్‌ ఆర్థికపరమైన అంశాల పట్ల అవగాహన లేకుండా ఉంటారని అనుకోవడానికి లేదు. బాబు పెట్టిన అనేకానేక పథకాలను ఎత్తివేసో, ప్రభుత్వ భూములను అమ్మివేసో తన నవరత్నాలకు నిధులు సమకూరుస్తారేమో చూడాలి. ఎన్నికల ప్రచారంలో నవరత్నాలు అమలు చేస్తానన్నాడు కానీ, బాబు పథకాలను కొనసాగిస్తానని చెప్పలేదు కదా!

టీడీపీ హయాంలో నిధులు విదల్చని కేంద్రం వైసీపీ అధికారంలో రాగానే ఉదారంగా ఉంటుందేమోనని అనుకున్నవారు నిరాశపడేట్లా, కేంద్రం వైఖరి ఉంటోంది. ఖఱ్చు తగ్గిద్దామని విద్యుత్‌ రంగపు పీపీఏలను సమీక్షిద్దామన్నా, పోలవరంలో రివర్స్‌ టెండరింగ్‌ చేద్దామన్నా ఠఠ్‌ వీల్లేదంటోంది. అందువలన స్థానికంగా లభ్యమయ్యే వనరులతోనే కాలక్షేపం చేయాలి. అందుకేలాగుంది అమరావతి గురించి పెద్దగా మాట్లాడటం లేదు. ప్రభుత్వ ఆఫీసులను వికేంద్రీకరించి, ఖర్చు తగ్గిద్దామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 100 రోజుల్లో ఏదీ ఆడంబరంగా నిర్వహించలేదు. రాజకీయపరంగా కక్షసాధింపు చర్యలకు ఇంకా దిగలేదు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి, టీడీపీని తుడిచి పెట్టేదామన్నా ఆదుర్దా కానీ, బీజేపీని ఎదగనీయకుండా చేయడానికి దానిలో చేరదామనుకున్న నాయకులను బెదిరించాలన్న పథకం కానీ కనబడటం లేదు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి తగినంత అవకాశం ఇవ్వడం జరిగింది. ఆర్థిక నేరాలపై విచారణ చేయించడమనేది ప్రభుత్వ బాధ్యత. వాటివలన డబ్బు రికవర్‌ అవుతుందని ఆశించలేము.

జగన్‌ వంద రోజుల పాలనపై..
ప్రభుత్వం మారగానే 100 రోజులు, ఆర్నెల్లు, ఏడాది... ఇలా మైలురాళ్లు పెట్టుకుని సమీక్షించడం ఆనవాయితీ. 'పాత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిన వ్యవస్థను చక్కదిద్దడానికే సమయం చాలటం లేదు, ఫలితాలు అప్పుడే ఏం చూపిస్తాం?' అంటుంది అధికార పక్షం. 'కోడలు కాలు మెట్టిన నాడే తెలుస్తుంది, సంసారం చేసే లక్షణం. ఈ సర్కారుది అన్ని రంగాలలోనూ వైఫల్యం' అంటుంది ప్రతిపక్షం. 100 రోజుల్లో ఫలితాలు కనబడతాయని ఆశించలేం కానీ పాలకుడి ఆలోచనలు ఏ దిశలో సాగుతున్నాయో తెలిశాయి. చేసిన వాగ్దానాలు నెరవేర్చాలనే తపన ప్రస్ఫుటంగా కనబడుతోంది. తనపై అవినీతిపరుడనే ముద్ర తుడిచివేసుకోవడానికి ఎటువంటి అవినీతినీ సహించననే సంకేతం ఇవ్వడానికి జగన్‌ పడుతున్న తాపత్రయమూ తెలుస్తోంది. అదే సమయంలో బాబు 'నిప్పు' కాదు అని నిరూపించే ప్రయత్నమూ ఉధృతంగా సాగుతోంది. జగన్‌ గెలిస్తే 'పులివెందుల సంస్కృతి, రాయలసీమ రక్తపుటేరులు' రాష్ట్రమంతా  పాకుతాయని టీడీపీ, జనసేన చేసిన ప్రచారం తప్పని ఇప్పటికే రుజువై పోయింది. శాంతిభద్రతలు గతంలో కంటె దిగజారలేదు. రాజకీయ నాయకులు అధికారులను బెదిరించిన సంఘటనలు తెలియరాలేదు.

మొన్న ఎన్నికలలో ఆంధ్ర సమాజం కులాల వారీగా చీలిపోయింది. అది పెచ్చరిల్లి పోకుండా చూడడానికి, సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తోందీ ప్రభుత్వం. కొత్త ముఖ్యమంత్రిపై జనాలు చాలా ఆశలు పెట్టుకున్నారు. వాటిని నెరవేర్చడం చాలాకష్టం. పైగా రాష్ట్ర అర్థిక పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉంది. అయినా జగన్‌ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు. అవినీతి సహించనంటే, తన ఎమ్మెల్యేలే పళ్లు నూరుకుంటారన్న భయం కూడా కనబడటంలేదు. అధికారులతో మాట్లాడినప్పుడు కూడా 'మనమంతా కలిసిచేద్దాం' అంటూ టీము లీడర్‌షిప్‌ లక్షణాలను కనబరిచాడు. రాత్రికి రాత్రి అద్భుతాలు చేస్తానని చెప్పకుండా ప్రతీదానికీ టైము ఫ్రేమ్‌ చెపుతున్నాడు. అసత్యపు వార్తలు వ్యాప్తి చేయకండి అని మీడియాకు చెప్పడం జరిగింది కానీ అంతకు మించి ఏమీ చేసినట్లు కనబడటం లేదు. పత్రికలు, టీవీలు తాము అనుకున్నది స్వేచ్ఛగా రాస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్లూ టీడీపీ, మీడియా ప్రచారం చేసిన ఇమేజికి విరుద్ధంగా జగన్‌ ఆర్భాటం లేకుండా, హుందాగా వ్యవహరిస్తున్న తీరు ప్రజలను ఆకట్టుకుంటోందన్న సందేహం రావడం చేత కాబోలు, టీడీపీ 'హనీమూన్‌ పీరియడ్‌'కు చాలా ముందుగానే విమర్శలు మొదలుపెట్టింది.

తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయనే విమర్శ సర్వసాధారణంగా అన్నిపార్టీలు చేసేవే. ఆ దాడుల్లో కొన్ని నిజంగా జరిగినవే అయినా వ్యక్తిగత స్థాయిలో జరిగినవే అయి వుండాలి తప్ప పార్టీ విధానపరంగా తీసుకున్న లైను కాదనిపిస్తోంది. రియల్‌ ఎస్టేటు ధరలు పడిపోతున్నాయని టీడీపీ వ్యక్తంచేస్తున్న ఆందోళన కూడా ప్రజలను కదిలించేది కాదు. ఇక జగన్‌ ప్రమాణస్వీకారం చేసిన నిమిషం నుంచి చేస్తున్న ఆరోపణ ఏమిటంటే - రాష్ట్రానికి పెట్టుబడులురావు, రావటంలేదు, రాబోవు అని. విజయవాడలో రేప్‌ జరిగినా, రాజధానిని అద్భుతంగా కట్టకపోయినా, పాత ఒప్పందాలను సమీక్షించినా, టెండరింగు విధానం మార్చినా... వాళ్ల నాలిక చివర ఉండేమాట - దీని కారణంగా పెట్టుబడులు రావు అని. ఇప్పటిదాకా పెట్టుబడుల వర్షం కురిసేసినట్లు, జగన్‌ రాగానే ఆగిపోయినట్లు బిల్డప్‌. కానీ పెట్టుబడి పెట్టేవాడు చూసే కోణం వేరుగా ఉంటుంది.

ఆ కోణంలో చూసినప్పుడు జగన్‌ పెట్టిన స్థానికులకు 75% ఉద్యోగాల రిజర్వేషన్‌ అనేది పెద్ద అవరోధం. స్థానికులన్న హోదా తప్ప తగిన నైపుణ్యం లేనివారికి ఉద్యోగం ఇచ్చి పరిశ్రమ నడుపుదామని ఎవరూ అనుకోరు. ఆంధ్రలో ఇప్పటిదాకా విద్యాలయాల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు లేవని, యువతకు ఉద్యోగార్హత లేకుండా అయిపోతోందని వాపోతూ వచ్చిన జగన్‌, అలాంటి యువతకు 75% ఉద్యోగాలు ఇచ్చి తీరాలనే నిబంధన పెట్టి పెట్టుబడిదారులను ఎలా ఆకర్షించగలరు? తెలంగాణ ఉద్యమసమయంలో ఇలాంటి డిమాండ్‌ చేసిన తెరాస అధికారంలోకి వచ్చాక మిన్నకుంది. మాట ఇచ్చాక మడమ తిప్పనంటూ జగన్‌ భీష్మించుకుని కూర్చుంటే దీనివలన రాష్ట్రానికి హాని కలుగుతుంది. నా దృష్టిలో జగన్‌ ఇప్పటిదాకా తీసుకున్న ఈ నిర్ణయ మొక్కటే తప్పుడు నిర్ణయం. దీని పర్యవసానం కియామోటర్స్‌ వద్ద వైసీపీ నాయకుడు చేసిన హంగామా ద్వారా రుజువైంది.- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2019)
mbsprasad@gmail.com

జగన్ 100 రోజుల పాలనపై 'గ్రేట్ ఆంధ్ర' పేపర్ ప్రత్యేక కథనం