Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: అఖిలేశ్‌ తిరుగుబాటు బిజెపికి లాభమా? నష్టమా?

ఎమ్బీయస్‌: అఖిలేశ్‌ తిరుగుబాటు బిజెపికి లాభమా? నష్టమా?

ఎస్పీ పార్టీ నాయకుల మధ్య గత నెలలో కుదిరిన రాజీపై రాసిన 'బాబాయి-అబ్బాయి.. ఆపై అమర్‌' అనే వ్యాసంలో యీ యుద్ధవిరమణ ఎంతకాలమో తెలియదు అని ముగించడం జరిగింది. రాజీ కుదిరాక కూడా ములాయం కొడుకుపై పగబట్టినట్లే ప్రవర్తించాడు. అఖిలేశ్‌ ఎంత మొత్తుకున్నా అమర్‌ సింగ్‌ను పార్టీ జనరల్‌ సెక్రటరీగా నియమిస్తూ సెప్టెంబరు 23న ఒక ఆదేశాన్ని స్వహస్తంతో రాసి విడుదల చేశాడు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో శివపాల్‌ కూడా అఖిలేశ్‌ని చెడుగుడు ఆడేశాడు. గూండాలు నడిపే క్వామీ ఏక్‌తా దళ్‌ పార్టీని ఎస్పీలో విలీనం కావడాన్ని ససేమిరా ఒప్పుకోనని అఖిలేశ్‌ ఎంత మొండికేసినా వినకుండా విలీనం ఎప్పుడో అయిపోయింది పొమ్మనమంటూ ప్రకటించాడు. అఖిలేశ్‌ మద్దతుదారు, శివపాల్‌కు కజిన్‌ అయిన రాంగోపాల్‌ యాదవ్‌ సహచరులను పార్టీలోంచి బహిష్కరించాడు. అవినీతి కేసులున్న అమర్‌మణి త్రిపాఠీ, ముకేశ్‌ శ్రీవాస్తవలకు టిక్కెట్లు యివ్వరాదని అఖిలేశ్‌ ఎంత మొత్తుకున్నా వినకుండా వాళ్లకు టిక్కెట్లిచ్చాడు. టిక్కెట్ల పంపిణీలో తన ప్రమేయం వుండాలని అఖిలేశ్‌ తండ్రితో వాదించి ఒప్పించినా, ఆచరణకు వచ్చేసరికి శివలాల్‌ దాన్ని తుంగలోకి తొక్కడమే కాక, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో అఖిలేశ్‌ అనుచరులందరినీ పదవుల్లోంచి ఊడబెరికాడు. అక్టోబరు 6న 81 మంది సభ్యులతో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏర్పాటు చేసి దాన్ని తన, ములాయం అనుచరులతో నింపేశాడు. అఖిలేశ్‌ అనుచరులందరినీ తీసేశాడు. అఖిలేశ్‌కు కూడా స్థానం దక్కలేదు. పైగా శివలాల్‌ గడుసుతనం ఒలకబోస్తూ 'ఈ కమిటీ ములాయం, అఖిలేశ్‌ల అనుమతితో ఏర్పాటు చేయడమైనది' అని ప్రకటించాడు.

శివలాల్‌ తన కొడుకుని యిలా ఎడాపెడా అవమానిస్తూ వుంటే ములాయం ఏం చేస్తున్నాడన్న అనుమానం వస్తుంది. నిజానికి మనం భారతకాలం నుంచి కొడుకుల్ని వెనకేసుకుని వచ్చే ధృతరాష్ట్రులనే చూస్తూ వచ్చాం. కానీ ములాయం వింతగా కొడుకుని పక్కన పెడుతున్నాడు. బహిరంగంగా అతన్ని యీసడిస్తున్నాడు. తమ్ముణ్ని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. బయటివాడైన అమర్‌ సింగ్‌ను చంకన వేసుకుని తిరుగుతున్నాడు. ఏమిటీ వింత? నిజానికి ములాయంకు, అఖిలేశ్‌కు 2014 నుంచి పడడం మానేసిందట. రాష్ట్రాన్ని కొడుక్కి అప్పగించి, తను 2014లో ఢిల్లీ వెళ్లి ప్రధాని అయిపోదామని ములాయం ఆశపడ్డాడు. మోదీ హవాకు అందరూ గాలికి కొట్టుకుపోవడంతో, ములాయంకు ఆ పదవి దక్కడం కాదు కదా, పరువు కూడా దక్కలేదు. ఆ ఓటమిని అఖిలేశ్‌ నెత్తిన రుద్దేసి, తను కనీసం ముఖ్యమంత్రి అవుదామని ఆశపడ్డాడట ములాయం. తప్పుకుని, తన కుర్చీ వప్పగించమని అడిగితే అఖిలేశ్‌ ఒప్పుకోలేదట. అందుకే ములాయం కత్తికట్టాడు. శివపాల్‌ యాదవ్‌ సలహా విని వుంటే 2012లో ముఖ్యమంత్రి, 2014లో ప్రధాని అయిపోయేవాణ్నని, అప్పుడు అఖిలేశ్‌ను ముఖ్యమంత్రి చేయడం పొరపాటైందని  ఇటీవల బహిరంగంగా వాపోయాడు. 

దానికి తోడు అతనిపై రెండో భార్య సాధన ఒత్తిడి బాగా వుంది. ములాయంకు ఆరోగ్యం అంత బాగా లేకపోవడంతో అతని రెండో భార్య సాధనకు తన 27 ఏళ్ల కొడుకు ప్రతీక్‌కు రాజకీయ భవిష్యత్తు గురించి చింత పట్టుకుంది. సవతి కొడుకు అఖిలేశ్‌ పార్టీలో, ప్రభుత్వంలో పాతుకుపోతే తన కొడుక్కి గతి లేకుండా పోతుందని ఆమె భయం. అఖిలేశ్‌ మీద తండ్రి వంటి గూండా ముద్ర, బాబాయి వంటి అవినీతిపరుడి ముద్ర లేదు. ములాయందంతా మొరటు వ్యవహారం. అఖిలేశ్‌ది సున్నితమైన కార్యశైలి. ములాయమే కాదు, శివలాల్‌ యాదవ్‌, యితరులు అవినీతిలో, హింసారాజకీయాల్లో ఆరితేరినవారు. కేవలం కులరాజకీయ సమీకరణాలతో నెట్టుకుని వస్తున్నారు. అఖిలేశ్‌పై అవినీతి ఆరోపణలు లేవు. రెండున్నరేళ్ల సమయంలో పాలనా పటిమ చూపలేకపోవడంతో అసమర్థుడనే ముద్ర పడింది. ఆ అసమర్థతకు కారణం కూడా కుటుంబం అతని కాళ్లూచేతులూ కట్టేసిందని కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు. యుపికి అయిదున్నర మంది ముఖ్యమంత్రులున్నారు, ఆ అర ముఖ్యమంత్రి అఖిలేశ్‌ అని అందరూ అతన్ని ఎగతాళి చేశారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు చూశాక అఖిలేశ్‌ నిద్రలోంచి మేల్కొని, ఉంటే వుంటాం, పోతే పోతాం అనుకుని పార్టీ సీనియర్లను ఎదిరించి, ఆరు బృహత్‌ పథకాలు చేపట్టి పేరు తెచ్చుకుందామని విపరీతంగా శ్రమించసాగాడు. అది సత్ఫలితాలు యిస్తూ, ప్రజల్లో అతని యిమేజి పెరగసాగింది. 

ఇదే కొనసాగితే తమను గుర్తించేవారుండరని శివలాల్‌ యాదవ్‌ ప్రభృతులు వ్యాకులం చెందారు. వారితో బాటు సవతి తల్లి సాధన కూడా. ఈ భయంతోనే ఆమె అఖిలేశ్‌పై చేతబడి చేయిస్తోందని అఖిలేశ్‌కు సన్నిహితుడైన ఎమ్మెల్సీ ఉదయవీర్‌ సింగ్‌ శుక్రవారం ఆరోపణ చేస్తూ ఏకంగా ములాయంకే లేఖ రాశాడు. ఆమె చెప్పడం బట్టే కాబోలు ములాయం 'అఖిలేశ్‌ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి కాడు. నెగ్గిన లెజిస్లేటర్లు ఎవర్ని ఎన్నుకుంటే వాళ్లే ముఖ్యమంత్రి' అన్నాడు. నిజానికి ములాయం రాజీ ప్రతిపాదన అంటూ పార్టీ వ్యవస్థ మొత్తాన్ని శివలాల్‌ చేతిలో పెట్టాడు. అఖిలేశ్‌కు పార్టీ కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు లేవు. శివలాల్‌ అభ్యర్థులే టిక్కెట్లు సంపాదించుకుని, ఎన్నికైతే యిక అఖిలేశ్‌కు ముఖ్యమత్రి అయ్యే ఛాన్సెక్కడ? ఇలా ఆలోచిస్తే ములాయంలో ధృతరాష్ట్రుడి కంటె కైకేయి మాట వినవలసి వచ్చిన దశరథుడు కనబడతాడు. అఖిలేశ్‌ను తొక్కేసి, రెండో భార్య కొడుకుని గద్దె కెక్కించడానికి అంగీకరించిన శివలాల్‌కు మద్దతు యిస్తూండవచ్చు. అఖిలేశ్‌కు తన క్లీన్‌ యిమేజి గురించి పాకులాడుతూ పార్టీకి నిధులు సమకూర్చడం లేదని, అందుకని ఎన్నికలకు ముందు అతన్ని దింపేసి, వేరే వాళ్లని కూర్చోబెట్టి అవినీతికి పాల్పడి, నిధులు సేకరిద్దామనే వూహలో ములాయం వున్నట్లు వార్తలు వచ్చాయి కూడా. 

ఇవన్నీ తెలిసి కాబోలు, అఖిలేశ్‌ యిప్పుడు తెగించాడు. అట్టోపెట్టో తేల్చేద్దామనుకున్నాడు. అక్టోబరు 21 శుక్రవారం నాడు శివలాల్‌ రాబోయే ఎన్నికలలో పాటించ వలసిన వ్యూహం గురించి జిల్లా స్థాయి పార్టీ నాయకులతో  సమావేశం ఏర్పాటు చేసి, మర్యాద కోసం అఖిలేశ్‌ను స్వయంగా ఆహ్వానించాడు. అంతే కాకుండా ముఖ్యమంత్రి అభ్యర్థి అఖిలేశే అని ప్రకటించాడు. అయినా అఖిలేశ్‌ ఆ సమావేశానికిి డుమ్మా కొట్టాడు. అది కాగానే అదే సభ్యులతో తన యింట్లో మరో సమావేశం ఏర్పాటు చేసి, దానికి రమ్మనమని రహస్యంగా కబురు పంపాడు. దాంతో జిల్లా నాయకులు రెండిటికీ హాజరయ్యారు. తన సమావేశంలో అఖిలేశ్‌ తండ్రి మాట జవదాటనని, తన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో గెలుపు ఖాయమని చెప్పాడు. నవంబరు 3 నుంచి రథయాత్ర ప్రారంభించి తను రాష్ట్రమంతా పర్యటిస్తానని, దానికి జిల్లా నాయకులు సహకరించాలని విజ్ఞప్తి చేశాడు. నవంబరు 5న జరిగే పార్టీ రజతోత్సవ సభల్లో తాను పాల్గొనని పరోక్షంగా చెప్పేశాడు. (ఆదివారం తండ్రిని కలిసి మాట్లాడినప్పుడు సభకు వస్తానని చెప్పాట్ట)  

ఈ సంఘటనల నేపథ్యంతో ఆదివారం రోజంతా ఉత్కంఠభరితంగా సాగింది. ఉదయమే రాంగోపాల్‌ యాదవ్‌ అఖిలేశ్‌ను సమర్థిస్తూ, అఖిలేశ్‌ వున్నచోట విజయమని చాటుతూ, పార్టీ కార్యకర్తల పేర లేఖ రాసి విడుదల చేయడంతో రగడ ప్రారంభమైంది. అఖిలేశ్‌ను ముఖ్యమంత్రిగా ఒప్పుకున్నాను కదా దానితో చల్లారుతాడులే అనుకున్న శివపాల్‌ కంగు తినాల్సి వచ్చింది. అఖిలేశ్‌ చురుగ్గా వ్యవహరించి 175 మంది ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశాడు. 65 మందిని (వారిలో 11 మంది మంత్రులు) పిలవలేదు. అంటే వారు శివపాల్‌ సన్నిహితులన్నమాట. ఆ సమావేశంలో తను పార్టీ చీల్చనని చెపుతూనే, అమర్‌ సింగ్‌ను సహించేది లేదని హుంకరించాడు. ఆ సమావేశం కాగానే శివపాల్‌ని, మరో ముగ్గురు మంత్రులను తీసిపారేశాడు. అంతేకాదు, అమర్‌ సింగ్‌ సిఫార్సుపై కాబినెట్‌ హోదా గల ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ పదవిలో వున్న నటీమణి జయప్రదను తొలగించివేశాడు. శివపాల్‌ ఏమీ చేయలేక రాంగోపాల్‌ యాదవ్‌ను పార్టీ పదవుల్లోంచి తీసేసి పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించాడు. అతనిపై, అతని కుటుంబసభ్యులపై అవినీతి ఆరోపణలు చేశాడు. రాంగోపాల్‌ వాటిని ఖండించాడు. అఖిలేశ్‌, ములాయంతో ముఖాముఖీ భేటీ అయ్యాడు. నీ మాట జవదాటనంటూనే అమర్‌ సింగ్‌పై, శివలాల్‌పై విరుచుకుపడ్డాడట. 

కథ యింకా నడుస్తూనే వుంది. పార్టీ చీలడం ఖాయమనే అనిపిస్తోంది. దీని పర్యవసానాలపై చర్చ జరుగుతోంది కూడా. పార్టీలో యిరు వర్గాల వారు ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడం వలన వారి అవినీతిని, కేసులను వారే తవ్వుకుని ప్రజల్లో చులకన కావడం ఖాయం. దానివలన ప్రతిపక్షాలకు లాభం. 2014లో మోదీకి ఓటేసిన బిసిలు యీసారి కూడా బిజెపి అండ చేరవచ్చు. ఎస్పీకి సాంప్రదాయకంగా వుండే ఓటు బ్యాంక్‌ రెండు ముక్కలుగా చీలిపోయి, బిజెపికి లాభం చేకూరవచ్చు. ఇక్కడే యింకో మాటా గమనించాలి. ముస్లిముల ఓట్లు సాధారణ పరిస్థితుల్లో ఎస్పీ, బియస్పీల మధ్య చీలిపోతే బిజెపికి లాభం. కానీ ఎస్పీ దెబ్బ తినడంతో ముస్లిములు ఎస్పీపై ఆశ విడిచి మొత్తంగా బియస్పీను ఆశ్రయిస్తే బిజెపికి నష్టం. అఖిలేశ్‌ అభివృద్ధి మోడల్‌ ఫలితాలు ప్రజలకు ఎంతవరకు చేరాయన్నది అతి ముఖ్యమైన అంశం. మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏ మాత్రం తీసిపోకుండా అతను పబ్లిసిటీ గుప్పిస్తున్నాడు. దానిలో పావు వంతు వాస్తవమున్నా ప్రజలు అతన్ని ఆదరించవచ్చు. అతని పనికి అడ్డుపడుతున్న ములాయంపై ఆగ్రహాన్ని మళ్లించి, అఖిలేశ్‌ కొత్త పార్టీ పెడితే అతనికి మద్దతు తెలుపవచ్చు. సమాజంలో పెద్దభార్య కొడుక్కి వున్న గౌరవం రెండో భార్య కొడుక్కి వుండదు. మన కథల్లో సవతి తల్లి ఎప్పుడూ క్రూరురాలే. ఆమె కొడుకు ఎప్పుడూ చవటే. రెండో భార్య మోహంలో పడి ములాయం పెద్ద భార్య సంతానానికి ద్రోహం చేశాడన్న మాట ప్రజల మెదళ్లకు ఎక్కిందంటే అఖిలేశ్‌ పట్ల సింపతీ పెరిగిపోతుంది. రాజకీయాల్లో రెండో భార్య ప్రమేయం రాజకీయంగా, యిమేజి పరంగా ఎంత చేటో, ఎన్టీయార్‌ విషయంలో మనం చూశాం. అవినీతికి, హింసకు, కులతత్వానికి పేరుబడిన ములాయం ఒక లెక్కా?

అఖిలేశ్‌ కొత్తగా పార్టీ పెట్టినా తనంతట తాను అధికారంలో రాగలడా అంటే కష్టమే అని చెప్పాలి. పార్టీ వ్యవస్థపై అతనికి పట్టు లేదు. ఓటర్లను బూతులకు తెచ్చే పార్టీ నిర్మాణం లేదు. ఇప్పుడు అదంతా చూసుకుంటూ కూర్చుంటే పాలన దెబ్బ తింటుంది. పార్టీ చీలిపోతే, ప్రభుత్వం పడిపోయి, రాష్ట్రపతి పాలన విధించవచ్చు. అప్పుడు అతనికి తీరిక చిక్కుతుంది. కానీ అతని ప్రాజెక్టుల ఘనత గాలికి ఎగిరిపోతుంది. కేంద్రమంత్రులు వచ్చి ప్రారంభోత్సవాలు చేస్తారు. మొత్తం మీద అఖిలేశ్‌ ఏ 100 సీట్లతోనో నెగ్గాడనుకున్నా ఎటూ కాకుండా ఓ పార్టీ నాయకుడిగా మిగులుతాడు తప్ప మళ్లీ ముఖ్యమంత్రి కాలేడు. అఖిలేశ్‌కు ప్రజల మద్దతు వుందన్న నమ్మకం కలిగితే కాంగ్రెసు అతనితో చేతులు కలపవచ్చనే మాట కూడా వినవస్తోంది. వారివురి మధ్య పొత్తు కుదిరితే కాంగ్రెసు నిధులు, పార్టీ యిన్‌ఫ్రాస్ట్రక్చర్‌, అఖిలేశ్‌ యిమేజి అన్నీ కలిసి వస్తాయి. ములాయంను ఎలాగైనా అణగదొక్కి బుద్ధి చెప్పాలని తపించే బ్రాహ్మణ, ఠాకూర్‌ వంటి అగ్రవర్ణాలు ఆ పొత్తుకు అండగా నిలవవచ్చు. అప్పుడు అది బిజెపికి చేటు కలిగిస్తుంది. కథ ఎలా సాగుతుందో రాబోయే రోజులు చెపుతాయి. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?