Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: అప్పుడెక్కడున్నారు మీ ఫ్రెంచ్‌వారు?

ఎమ్బీయస్‌: అప్పుడెక్కడున్నారు మీ ఫ్రెంచ్‌వారు?

పారిస్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ డెస్క్‌లో 83 ఏళ్ల ముసలాయనను ఆపి పాస్‌పోర్టు చూపించమని అడిగారు. ఆయన ఎక్కడ పెట్టాడో మర్చిపోయి బ్యాగ్‌ వెతుక్కుంటున్నాడు. కస్టమ్స్ట్‌లోని ఫ్రెంచ్‌ అధికారి పొగరుబోతు. ''మీ వయసు చూడబోతే 80 దాటినట్లున్నాయి. ఇన్నేళ్లల్లో ఫ్రాన్సు చూడడానికి వచ్చే వుంటారు (పారిస్‌కు టూరిస్టులు అత్యధిక సంఖ్యలో వస్తారు)'' అన్నాడు చికాగ్గా. 

పెద్దాయన చిరునవ్వు నవ్వి ''ఇంతకు ముందు కూడా వచ్చాను.'' అని జవాబిచ్చి బ్యాగ్‌ వెతసాగాడు. 

''మరి యిక్కడ ఎయిర్‌పోర్టులో పాస్‌పోర్టు చూపించమని అడుగుతారని, దాన్ని సిద్ధంగా పెట్టుకోవాలని తెలియదా? ఏళ్లు రాగానే సరిపోదు.'' అని దాదాపు అరిచినంత, కరిచినంత పనిచేశాడు ఆ అధికారి.

ఆ ముసలాయన తొణకలేదు, చిరునవ్వు చెదరనీయకుండా ''కితంసారి నేను ఫ్రాన్సు వచ్చినపుడు పాస్‌పోర్టు చూపించాల్సిన అవసరమేమీ పడలేదు మరి.'' అన్నాడు.

అతని ప్రశాంతత అధికారిని మరింత చిర్రెక్కించింది. ''ఇంపాజిబుల్‌, ఇదిగో ముసలాయనా, చూడబోతే అమెరికన్‌లా వున్నావు. మీ అమెరికన్లు మా ఫ్రాన్సు గడ్డమీద కాలు మోపాలంటే పాస్‌పోర్టు చూపించి తీరాలి. అబద్ధాలు మాని, యిప్పటికైనా తెలుసుకుంటే మంచిది.'' అని తర్జని చూపిస్తూ బెదిరించాడు.

ముసలాయన కాస్సేపు నిశ్శబ్దంగా వున్నాడు. తర్వాత ఆ ఫ్రెంచ్‌ అధికారిని ఎగాదిగా చూసి మొదలుపెట్టాడు - ''రెండవ ప్రపంచయుద్ధ సమయంలో మీ దేశం జర్మనీ ఆక్రమణలో వుంది. మిత్రదేశాలు జర్మనీకి వ్యతిరేకంగా పోరాడుతూ, వారిని అనేక దేశాల నుంచి తరిమికొడుతున్నాయి. అమెరికా సైన్యాదళాధిపతిగా మీ దేశాన్ని దాస్యం నుంచి విముక్తి చేయడానికి 1944లో నేను నార్మండీలోని ఒమాహా బీచ్‌లో దిగాను. అప్పుడు వెతికి పట్టుకుందామని పాస్‌పోర్టు చూపిద్దామన్నా ఒక్క ఫ్రెంచ్‌వాడూ కనబడలేదు. ఎక్కడ దాక్కున్నారో ఏమో..'' 

మొదటి ప్రపంచయుద్ధంలో పెద్ద సైనికశక్తిగా వున్న ఫ్రాన్సు రెండవ ప్రపంచయుద్ధం నాటికి బలహీనపడి జర్మనీకి లొంగిపోయింది. జర్మన్‌ సైన్యాలకు వ్యతిరేకంగా కొందరు ఫ్రెంచ్‌వారు స్థానికంగా సహాయనిరాకరణ, విద్రోహచర్యలు (రెసిస్టెన్స్‌) చేసేవారు తప్ప దేశపరంగా జర్మన్లను ఎదుర్కోలేక పోయారు. అమెరికా, రష్యా, ఇంగ్లండ్‌ వంటి మిత్రదళాల సైన్యాలే ఫ్రాన్సుకు స్వేచ్ఛ ప్రసాదించాయి. ఆనాటి రోజులను ముసలాయన గుర్తు చేయడంతో ఆ ఫ్రెంచ్‌ అధికారి మొహాన్న కత్తివాటుకి నెత్తురు చుక్క లేదు.

ఫోటో - 1944 జూన్‌ 6 న ఒమాహా బీచ్‌లో యుఎస్‌ ఫస్ట్‌ ఇన్‌ఫాంట్రీ డివిజన్‌ ప్రవేశిస్తున్న చిత్రం

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2016) 

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?