Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: బ్రిటన్‌కు కొత్త ప్రధాని

ఎమ్బీయస్‌: బ్రిటన్‌కు కొత్త ప్రధాని

ఈ రోజు బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరన్‌ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఎవరూ వూహించని రీతిలో ఆరేళ్లగా హోం మంత్రిగా పనిచేసిన థెరిసా మే గద్దె కెక్కుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో కాని, తర్వాత కానీ ప్రధాని అభ్యర్థిగా ఆమె పేరు ఎప్పుడూ వినబడలేదు. నిజానికి కామెరన్‌తో బాటు ఆమె 'రిమైన్‌' కాంపెయిన్‌లో వున్నారు. అలా అని తన అభిప్రాయాలను ఎలుగెత్తి చెప్పలేదు కూడా. ఈనాడు ప్రధాని అవుతూండగా ఆమె తన సొంత అభిప్రాయాన్ని పక్కన పెట్టేసింది. ''బ్రెగ్జిట్టంటే బ్రెగ్జిట్టే. ఇయులో దొడ్డిదారిన చేరడం వంటి పనులు జరగవు. రెండో రిఫరెండం కూడా జరగదు. ఈ ఏడాది చివరకు బయటకు వచ్చే ఫార్మాలిటీస్‌ పూర్తవుతాయి.'' అని ప్రకటించింది. 'అంతకంటె ముందే పొండి అని బ్రస్సెల్స్‌ అంటోంది కానీ నేను పట్టించుకోను, మనం తేల్చుకోవలసిన విషయాలు చాలా వున్నాయి.' అందామె. లీవ్‌ లేదా రిమైన్‌ కాంపెయిన్‌లో కొందరు వలసవచ్చినవారికి హామీలు కురిపించారు - మేం మీ జోలికి రాము అంటూ. థెరిసా అలాటిది హామీ ఏమీ యివ్వలేదు. ఇయుతో బేరసారాలడడానికి అది ఒక అంశంగా వాడుకోవచ్చు. మూడు దశాబ్దాల క్రితం బ్రిటన్‌కు ప్రధానిగా పనిచేసి ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న మార్గరెట్‌ థాచర్‌ తర్వాత మహిళా ప్రధాని థెరిసాయే! 

ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో యూరోపియన్‌ యూనియన్‌తో కలిసి వుండాలని కామెరన్‌ ప్రచారం చేయగా, విడిపోవాల్సిందే అంటూ భారీ ఎత్తున ప్రచారం చేసిన బోరిస్‌ జాన్సనే ప్రధాని పదవికి పోటీ పడతాడని అందరూ అనుకున్నారు. లండన్‌ మేయరుగా అతను అందరికీ తెలిశాడు. అతనికి అండగా జస్టిస్‌ సెక్రటరీగా పనిచేసిన మైకేల్‌ గోఫ్‌ నిలబడ్డాడు. మైకేల్‌ కామెరన్‌కు స్నేహితుడే కానీ ఇయు అంటే అతనికి తగని మంట. దానికి కారణం కూడా చెప్పుకున్నాడు - ''మా నాన్న స్కాట్లండ్‌లో చేపల వ్యాపారం చేసేవాడు. ఇయు దాన్ని మూయించేసింది. అప్పణ్నుంచే నాకు దానిపై కోపం.'' అని. అదేం లేదే అంటాడు వాళ్ల నాన్న. మైకేల్‌ ఆక్స్‌ఫర్డ్‌లో చదివే రోజుల్లో స్టూడెంటు యూనియన్‌కు ప్రెసిడెంటు అయ్యాడు. కన్సర్వేటివ్‌ పార్టీలో చేరదామని ప్రయత్నించాడు కానీ అతని తలిదండ్రులు లేబరు పార్టీ సమర్థకులు కావడం చేతనో ఏమో పార్టీ చేర్చుకోలేదు. తర్వాత చేరాడు కానీ వెనక వుండి మంత్రాంగం చేయగల మేధావిగానే గుర్తింపబడ్డాడు తప్ప క్షేత్రస్థాయి నాయకుడిగా పేరు రాలేదు. 2005లో పార్లమెంటుకి ఎన్నికయ్యాడు. కామెరన్‌ అతన్ని 2010లో విద్యామంత్రి చేశాడు. కానీ అతని పొదుపు చర్యలు ప్రజలను మండించాయి. నిరసన ప్రదర్శనలు జరిగాయి. దాంతో 2014లో అతన్ని కాబినెట్‌లోంచి తీసివేయవలసి వచ్చింది. మళ్లీ 2015లో ఎన్నికయ్యాక కామెరన్‌ అతన్ని జస్టిస్‌ సెక్రటరీగా చేశాడు. స్నేహం మాట ఎలా వున్నా కామెరన్‌తో విభేదించి, బ్రెగ్జిట్‌ తరఫున పెద్ద ప్రచారం నిర్వహించి బోరిస్‌ జాన్సన్‌ను ముందుకు తోశాడు.

జూన్‌ 23 నాటి రిఫరెండం ఫలితాలు వచ్చాక జరిగిన పరిణామాలు అందర్నీ దిమ్మెరపోయేట్లు చేశాయి. బోరిస్‌ జాన్సన్‌ తనను తాను ప్రధాని అభ్యర్థిగా చూపుకుంటూ హైరాన పడ్డాడు. అంతలో మైకేల్‌ అతనికి నమ్మకద్రోహం చేశాడు. '''స్పెక్టేటర్‌'' అనే పత్రికలో వ్యాసం రాస్తూ 'యూరోప్‌నుండి విడిపోయి స్వతంత్రంగా నిలదొక్కుకునే ప్రక్రియను జాన్సన్‌ సమర్థవంతంగా నిర్వహించగలడని నాకు నమ్మకం చిక్కటం లేదు.' అని రాశాడు. దాంతో జాన్సన్‌ ఆశలు అడుగంటాయి. తనపై కక్ష సాధించడానికే కామెరన్‌ మైకేల్‌ను తననుంచి దూరం చేశాడని, మైకేల్‌ మద్దతు ఉపసంహరించిన యిలాటి పరిస్థితుల్లో పార్టీ మద్దతు సంపాదించడం కష్టమని భావించి జూన్‌ నెలాఖరులో పత్రికా సమావేశం ఏర్పరచి నేను విత్‌డ్రా అయిపోతున్నాను అని ప్రకటించేశాడు. వెంటనే మైకేల్‌ నేనే అభ్యర్థిగా నిలబడతాను అన్నాడు.

మైకేల్‌తో బాటు యిద్దరు మహిళా అభ్యర్థులు కూడా ముందుకు వచ్చారు. వారిలో ఒకరు ఆండ్రియా లీడ్సమ్‌. ఆమె బ్రెగ్జిట్‌ కోసం పోరాడిన కన్సర్వేటివ్‌ నాయకురాలు. ఆమెకు  విశేషమైన పాలనానుభవం లేదు. ఎనర్జీ శాఖలో జూనియర్‌ మంత్రి. ఆమెకు బోరిస్‌ జాన్సన్‌ తన మద్దతు ప్రకటించాడు. మరొకామె థెరిసా మే. హోం శాఖ మంత్రిగా ఆమె పట్టుదల గల మహిళగా పేరు తెచ్చుకుంది. అతివాద ఇస్లామిక్‌ మతవాది ఆబు ఖటడాను జోర్డాన్‌ పంపించి వేశారనే పేరు వుంది. థెరిసాకు పిల్లల్లేరు. ఆండ్రియా మాట్లాడుతూ ''థెరిసా కంటె నేనే ప్రధాని పదవికి అర్హురాలిని. ఎందుకంటే ఆమెకు పిల్లలు లేరు. మేనల్లుళ్లు, మేనకోడళ్లు వుండవచ్చు. కానీ నాకు పిల్లలున్నారు, మనుమలు కలుగుతారు. వారి భవిష్యత్తు కోసమైనా యీ దేశాన్ని బాగా పాలించాలని కోరుకుంటాను. థెరిసాకు అలాటి బాధ్యతలు లేవు.'' అంది. ఒక దశలో థెరిసా కంటె పార్టీ ఎంపీలలో ఎక్కువ పాప్యులారిటీ సంపాదించుకున్న ఆండ్రియా ఈ వ్యాఖ్యతో దుమారం లేపి తన అవకాశాలను పాడు చేసుకుంది. వివాదం చెలరేగడంతో ఆమె థెరిసాకు క్షమాపణ చెప్పింది. అయినా ఆమెపై సొంత పార్టీ ఎంపీలకు నమ్మకం పోయినట్టుంది. జులై మొదటివారంలో 329 మంది పార్టీ ఎంపీలతో కన్సర్వేటివ్‌ పార్టీ నాయత్వానికి ఎన్నిక జరిగినప్పుడు ఆమెకు 84 ఓట్లు వచ్చాయి. నమ్మకద్రోహిగా పేరుబడిన మైకేల్‌కు 46 రాగా థెరిసాకు 199 వచ్చాయి. దాంతో ఆమె  పార్టీ పార్లమెంటరీ నాయకురాలిగా ప్రధాని పదవికి ఎంపికైంది. మళ్లీ పార్టీ కార్యకర్తలతో విస్తృతమైన ఎన్నిక జరపాలనుకున్నారు కానీ తక్కిన యిద్దరూ పోటీలోంచి తప్పుకున్నామని ప్రకటించారు. 

థెరిసాది చాలా సాధారణ నేపథ్యం. ఆమె పూర్వీకులు పనిమనుషులుగా, బట్లర్లగా పనిచేశారు. తండ్రి చర్చిలో చిన్న మతాధికారి. సాధారణ స్కూళ్లలోనే చదివింది. ఆక్స్‌ఫర్డ్‌లో జాగ్రపీ చదివింది. లండన్‌ శివార్లలో కౌన్సిలరుగా పనిచేసి, తర్వాత ఎంపీ అయింది. ఆమెవి తీవ్రమైన రైటిస్టు భావాలు. ఆమె ఎన్నికైందని వినగానే కన్సర్వేటివ్‌ పార్టీకి చెందిన మాజీ ఛాన్సెలర్‌ 'బ్లడీ డిఫికల్ట్‌ ఉమన్‌' అని వ్యాఖ్యానించినట్లు బయటకు వచ్చింది. అది విని ఆమె నొచ్చుకోలేదు. 'ఈ విషయాన్ని యూరోపియన్‌ యూనియన్‌ వారు కూడా త్వరలోనే తెలుసుకుంటారు' అని చెప్పుకుంది. బ్రిటన్‌కు వలస వచ్చినవారిని ఆమె వుండనిస్తుందన్న నమ్మకం లేదు. యూరోప్‌ నుంచి బ్రిటన్‌ తప్పుకునేటప్పుడు వాళ్లని యూరోప్‌ వెనక్కి తీసుకోవాలనే షరతు పెడుతుందనే అందరూ అనుకుంటున్నారు. బ్రెగ్జిట్‌ వలన రాబోయే చిక్కులేమిటో మరో వ్యాసంలో చర్చించుకోవచ్చు. వాటిని థెరిసా ఎలా ఎదుర్కోబోతోందో మాత్రం యిప్పుడప్పుడే తెలియదు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?