Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సినీమూలం - దొంగమొగుడు - 2

ఎమ్బీయస్‌: సినీమూలం - దొంగమొగుడు - 2

నవలలో ఎలా రాశారంటే రవితేజ అమెరికానుండి వస్తూ బొంబాయిలో ఆగాడు. హైదరాబాదునుండి సెక్రటరీని బొంబాయి రప్పించుకున్నాడు. ఇతను బొంబాయిలో వుండగానే అతని భార్యను అతని శత్రువులు హత్య చేసి అతన్ని ఆ హత్యలో యిరికించారు. అంటే వేరే హోటల్లో యితని పోలికలతో వున్నతను యితని పేరుమీద అక్కడికెళ్లి స్టే చేసినట్టు బిల్డప్‌ యిచ్చారు. కేసు ఎలా తయారైందంటే రవితేజ బొంబాయినుండి హైదరాబాదు వచ్చి భార్యను హత్యచేసి, మళ్లీ బొంబాయి వెళ్లిపోయి, హత్య జరిగిన తర్వాత ఏమీ తెలియనట్టు వచ్చినట్టు నటిస్తున్నాడు - అని పోలీసులు నమ్మేట్టు తయారుచేశారు. భార్యను చంపడానికి మోటివ్‌ ఏమిటంటే - అతనికీ భార్యకూ పడదు. భార్యకు రహస్యప్రియుడు వున్నట్టు అతనికి తెలుసు. ఆ ప్రియుడి ఉత్తరం కూడా పోలీసుల కంట పడింది. పైగా హీరో భార్య రాసుకునే డైరీలో అతని ప్రస్తావన వుంది. ఈ కారణాల వలన హీరోయే తన భార్యను చంపాడని పోలీసులు నమ్మారు. హత్య జరిగిన టైములో తను హైదరాబాదు రాలేదు, బొంబాయిలో తన సెక్రటరీతో హోటల్లో వున్నాను అని - పరువు పోయినా సరే - చెప్దామంటే ఆ సెక్రటరీ హఠాత్తుగా మాయమై పోయింది. ఇదేమిట్రా అనుకుంటూ వుంటే ఆ సెక్రటరీ స్నేహితుడు భాస్కర్‌ వచ్చి అతనికి కాఫీలో మత్తుమందు కలిపి యిచ్చి స్పృహ పోగొట్టి వారం రోజులపాటు బంధించి వుంచాడు. ఈ లోపున యితనే హత్య చేశాడన్న వార్తలు పత్రికల్లో వచ్చేశాయి. ఆ వార్తలు చూపించి భాస్కర్‌ హీరోను హడలగొట్టాడు. తాము చేసినది చెప్పాడు. 'మేమే నీ పాత సెక్రటరీకి యాక్సిడెంట్‌ చేయించాం. ప్రియంవదను ఆ స్థానంలో ప్రవేశపెట్టి, నీ మనసు చెదరగొట్టాం. అవసరం తీరాక  ప్రియంవదను చంపేశాం.' అని. ఈ అనుకోని ఘటనలతో రవితేజ సంయమనం కోల్పోయాడు. పోలీసుల వద్దకు వెళ్లడానికి భయపడి శర్మ శరణు కోరాడు. 

సినిమాల్లో యీ కాంప్లికేషన్‌ అంతా తీసేశారు. భార్యకు ప్రియుడూ వుండడు. ఆమె చావనూ చావదు. సెక్రటరీ ఆధారంగానే కథ సూటిగా నడుస్తుంది. సెక్రటరీతో రవితేజ హోటల్లో వుండగా చరణ్‌రాజ్‌ వచ్చి నేను ఆమె మొగుణ్ని అన్నాడు. పెనుగులాటలో భానుప్రియ చచ్చిపోయినట్లు కల్పించి, గొల్లపూడి మారుతీరావు వచ్చి ఫోటో తీసి రవితేజను బ్లాక్‌మెయిల్‌ చేయసాగాడు. రవితేజ బ్లాక్‌మెయిల్‌కు లొంగాడు. దాని ఆసరాగా చరణ్‌రాజ్‌ చిరంజీవి సొంత ఆఫీసులోనే ఏడిపించాడు. గోడౌన్‌లోని స్టాక్‌ చెంచురామయ్యకు షిఫ్ట్‌ చేయమని ఆర్డరేశాడు. ఇలా వ్యాపారం అతని కంట్రోలునుంచి తప్పిపోతూ వుంటే భార్య అర్థం చేసుకోకపోగా యీసడిస్తుంది. మా నాన్న అప్పగించిన వ్యాపారం సర్వనాశనం చేసావంది. దాంతో హీరో ఆత్మహత్య చేసుకోబోయాడు. అప్పుడు నాగరాజు వచ్చి ఆపాడు. నీ బదులు నేను వెళ్లి నీ సమస్యలు తీరుస్తాను అన్నాడు నాగరాజు. ఫ్యాక్టరీ కాలిపోకుండా ఆపాడు. విలన్‌లను అవమానించాడు.  భానుప్రియ శవం ఎక్కడ పాతిపెట్టారు? అని ఆరాలు తీశాడు. వాళ్లు జంకారు.

రవితేజ బయటి ప్రత్యర్థుల పని పట్టడం అయ్యాక యింట్లో వున్నవారి పని పట్టాడు నాగరాజు. అతని భార్య కళ్లు తెరిపించడానికి తన ప్రేయసిని యింటికి తీసుకుని వచ్చి డాన్సులు చేసి విచ్చలవిడిగా చెలరేగిపోయాడు. అతను రవితేజే అనుకున్న భార్య భయపడిపోయింది. తన తల్లిని, అన్నను మెడబట్టుకుని బయటకు నెడుతూంటే చూడలేకపోయింది. ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆ తప్పనిసరి పరిస్థితిలో తను రవితేజను కాదని నాగరాజు చెప్పేశాడు. ఈ విధంగా సినిమాలో సినిమాటిక్‌గా రవితేజ కష్టాలను నాగరాజు సాల్వ్‌ చేశాడు. కానీ నవలలో యింత సాఫీగా సాగదు. 

రవితేజ పోలీసులకు దొరక్కుండా తన ఫ్యాక్టరీ గెస్ట్‌హౌస్‌లో వుంచి కాపాడినవాడు శర్మ.  లాయరు వద్దకు తీసుకెళితే అతను 'మీ కేసు చాలా వీక్‌గా వుంది. దొంగ పాస్‌పోర్టు మీద ఏ సింగపూరో పారిపోండి. పోలీసులు కేసు మూసేశాక మళ్లీ తిరిగి వద్దురుగాని' అని చెప్పాడు. శర్మ అన్ని ఏర్పాట్లూ చేశాడు. రవితేజ తన షేర్లన్నీ శర్మ పేర రాసేశాడు. పది సంవత్సరాల క్రితర శర్మ చేత రాయించుకున్న అగ్రిమెంట్లు చింపేశాడు. ఆస్తి మాత్రం అమ్మలేకపోయాడు. దేశం విడిచి వెళ్లవలసిన ముందురోజు ఎవరికో ఒకరికి తన గురించి నిజాలు చెప్పాలనిపించి తన అజ్ఞాత ప్రేయసి, ప్లాటోనిక్‌ లవర్‌ ఐన శర్మ భార్యకు ఫోన్‌లో అంతా చెప్పేశాడు. పోలీసులు ఆ ఫోన్‌ ట్యాప్‌ చేసి విన్నారు. 

పోలీసువాళ్లలో ఒక నిజాయితీ అయిన ఆఫీసరు వున్నాడు. ఎవరో రవితేజను తెలివిగా యీ కేసులో యిరికించారని అతనికి అనుమానం. ఎందుకంటే ఆ ప్లాను వేసినవారికి ఆ రోజు బొంబాయి విమానం లేటుగా వచ్చిందని తెలియదు. ఆ లూప్‌హోల్‌ను యీ యిన్‌స్పెక్టరు పట్టుకున్నాడు. రవితేజ దొరికితే అతని దగ్గర్నుంచి వివరాలు రాబట్టి గట్టున పడేద్దామని చూస్తున్నాడు. కానీ భయంతో రవితేజ పోలీసులను తప్పించుకుని తిరగడంతో విషయం కాంప్లికేట్‌ అయిపోయింది. ఈ ఫోన్‌కాల్‌తో పోలీసుకి రవితేజ నిర్దోషి అని తెలిసి మరిన్ని వివరాలు సేకరించి ధృవపరుచుకున్నాడు. 

ఇవన్నీ సినిమాలో తీసేశారు. అక్కడ రవితేజ నాగరాజు యింటికి చేరాడు. రవితేజ నాగరాజు అక్క ప్రేమను, అభిమానాన్ని పూర్తిగా పొందాడు. ఆమె కూడా తమ్ముడిలో యింత మంచి మార్పు చూసి సంతోషపడింది. ఇక్కడ ఆఫీసులో నాగరాజు దూకుడు చూస్తే యితను రవితేజ అనిపించలేదు విలన్‌లకు. చరణ్‌రాజ్‌కు ముందునుండీ అనుమానం. రవితేజ పోలికలతో మరొకడు వున్నాడని, వాడు స్టంట్‌ మాస్టర్‌ నాగరాజు అయి వుంటాడని. నిర్ధారించుకోవడానికి చెంచురామయ్య నాగరాజు యింటికి వెళ్లాడు. అక్కడ జయంతిని చూసి తన పాత యజమానురాలిగా గుర్తు పట్టాడు. 'నీ భర్త పోయాడనుకుంటున్నావా? బతికే వున్నాడు రా చూపిస్తాను' అని తీసుకెళ్లాడు. ఆమె భర్త బతికున్నమాట వాస్తవమే. కానీ అతని బతుకు అలా తెల్లారడానికి కారకుడు చెంచురామయ్య. ఆ విషయం భానుప్రియ రవితేజకు వివరంగా చెప్పింది. ఈ విధంగా సెక్రటరీ ప్రియంవదను కూడా మంచిదానిగా చూపించారు సినిమాలో. ఆమె నాగరాజు మేనకోడలు. ఆమె తండ్రిని బంధించి ఆమె చేత యీ డ్రామా ఆడించాడు విలన్‌ చెంచురామయ్య. 

కానీ నవలలో ఆమె, విలన్‌ ప్రియురాలు. విలన్‌ చెంచురామయ్య కాదు, శర్మ. అది ఎలా తెలుస్తుందంటే - దేశం నుంచి పారిపోబోతూ భార్య సమాధి దర్శించి వస్తున్న రవితేజకు చనిపోయిందనుకుంటున్న సెక్రటరీ అనుకోకుండా ఓ కారులో కనబడింది. ఆమెను వెంటాడాడు. తీరా చూస్తే ఆమె శర్మ వుంపుడుగత్తె. శర్మే రవితేజపై అసూయతో భాస్కర్‌ చేత, ప్రియంవద చేత యింత డ్రామా ఆడించాడు. లాయర్‌ను తనవైపు తిప్పుకుని తను చెప్పినట్టు ఆడేట్టు చేశాడు. నవల చదువుతున్నంత సేపు చెంచురామయ్య యిదంతా చేయిస్తున్నాడన్న భ్రమలో మనల్ని ముంచిన రచయిత చివర్లో శర్మను విలన్‌గా చూపించి ఆశ్చర్యపరుస్తాడు. ఎందుకిదంతా చేశావ్‌ అని హీరో అడిగితే 'నా కంపెనీని వృద్ధి చేశావ్‌ కానీ మేనేజ్‌మెంట్‌ నా చేతుల్లోంచి లాక్కున్నావ్‌. పైగా నా భార్య నువ్వంటే పడిఛస్తుందని తెలిసింది. అసూయతో నీ బతుకు నాశనం చేశాను. నీ భార్యను చంపించి, ఆ హత్యానేరం నీపై నెట్టాను. ఆస్తులన్నీ లాక్కుని దేశంకాని దేశం పంపిస్తున్నాను. ఇప్పుడు నా భార్యను చంపి ఆ హత్యానేరం కూడా నీ మీద నెట్టేస్తాను' అన్నాడు. అన్నట్టుగానే అతన్ని కారులో తన యింటికి తీసుకెళ్లాడు. భార్యను తుపాకీతో కాల్చబోయాడు. కానీ రవితేజ, భాస్కర్‌, శర్మ, శర్మ భార్య మధ్య జరిగిన ఘర్షణలో శర్మ భార్య భాస్కర్‌ను కాల్చేసింది. పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. ఆత్మరక్షణ గురించి చంపింది కాబట్టి ఆమెపై కేసు నిలవలేదు. శర్మ కన్ఫెషన్‌ స్టేటుమెంటు యిచ్చేశాడు. తనతోబాటు ప్రియంవదను కూడా యిరికించాడు. రవితేజ మళ్లీ తన బిజినెస్‌ వ్యవహారాల్లో పడ్డాడు. మిసెస్‌ శర్మకు చేరువయ్యాడు అన్న సజెషన్‌తో నవల ముగుస్తుంది. 

సినిమాలో మాత్రం క్లయిమాక్స్‌ అంతా సరదా సరదాగా తీశారు. విలన్‌ అందర్నీ ఒకచోట చేరుస్తాడు. చరణ్‌రాజ్‌ భానుప్రియను పెళ్లాడతానంటాడు. అప్పుడు నాగరాజు, సుత్తి వేలు కలిసి పురోహితుల్లా వేషాలేసుకుని వచ్చి నానా యాగీ చేసి, అందర్నీ చావగొట్టి కథ సుఖాంతం చేస్తారు. ఇదీ దొంగమొగుడు అసలు కథ. ఒక బిజినెస్‌ మాగ్నెట్‌కు ఫ్యామిలీ లైఫ్‌ ఆనందదాయకంగా వుండకపోతే కలిగే అనర్థాలను సీరియస్‌గా చెప్పిన నవలను ఆధారం చేసుకుని ఆ మెసేజ్‌ను హాస్యస్ఫోరకంగా చెప్పారు సినిమా ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసేటట్టు. నవలలాగే సినిమా కూడా సూపర్‌ హిట్‌ అయింది. (సమాప్తం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2016)

[email protected]

Click Here For Part-1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?