Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సినీమూలం - అల్లరి ప్రియుడు - 2/2

తెలుగులో కథ కొస్తే రమ్యకృష్ణకు తన అభిమాని ఎవరో తెలిసే సమయం ఆసన్నమైంది. నిజానికి ఓ సారి పోస్ట్‌ ఆఫీసులో వాళ్లిద్దరూ తారసపడ్డారు కూడా. ఆమె రాసిన ఉత్తరం కోసమే హీరో వెంపర్లాడాడు. అయినా ఒకరి కొకరు తెెలియదు కదా. ఓ సారి హీరో ఆమెను రవీంద్రభారతిలో తన కార్యక్రమానికి రమ్మనమని పిలిచాడు. మీ పాటే పాడతాను. తలలో రోజా పెట్టుకు రమ్మనమని కోరాడు. 'రోజ్‌ రోజ్‌ రోజా పూవా' పాట పాడాడు. ఈమె వెళ్లింది. వెళుతూ వెళుతూ కూడా హీరోతో పోట్లాట పెట్టుకుని మరీ వెళ్లింది. హీరో కూడా యీమెను తిట్టుకుంటూనే వెళ్లాడు. పాట పాడుతూండగా ఆమె కోసం రిజర్వ్‌ చేసిన సీటు కేసి చూశాడు. ఖాళీగానే మిగిలిపోయింది. అయ్యో అనుకున్నాడు. కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన రమ్యకృష్ణకు మాత్రం తన అభిమాని ఎవరో తెలిసిపోయింది. తనెవరో చెప్పేద్దామా అనుకుంది. కానీ ఓ కొంటె ఆలోచన వచ్చి ఆగింది. అతని కష్టాలు తెలిసాక సాయపడదామని అనుకుంది. అద్దె చెల్లించలేక అతను యిల్లు ఖాళీ చేయవలసి వచ్చిందని తెలుసుకుని ఇంటి ఓనరుకి బాకీ చెల్లించి, ఐదు వేలు యిచ్చి అతన్ని జాగ్రత్తగా చూసుకోమంది. 

కథ యిలా సింపుల్‌గా నడవకూడదు కదా, ఇక్కడ రెండో కారెక్టరు హీరోకి పరిచయమవ్వాలి. దానికి కారణమైనవాడు మధుబాల బావ సుధాకర్‌. ఆమెను పెళ్లి చేసుకుని ఆస్తి అనుభవించాలని అతని ప్లాను. గూండాని పురమాయించి ఆమెను సతాయించమన్నాడు. అప్పుడు తనెళ్లి రక్షించినట్టు పోజు కొడదామని ప్లాను. అది బెడిసికొట్టి ఆ గూండాతో రాజశేఖర్‌ పోట్లాడాడు. మధుబాలను రక్షించాడు. ఇలా రక్షించినందుకు గాను రావుగోపాలరావు హీరోకి సహాయం చేద్దామనుకున్నాడు. యింట్లో వున్న పిల్లలకు పియానో మాస్టర్‌గా నియమించాడు. మ్యూజిక్‌ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయిస్తానన్నాడు. ఇదంతా మధుబాల వల్లనే కదాన్న కృతజ్ఞతతో బాటు ఆమె అన్నా, ఆమె ఫిడేలు వాయిద్యమన్నా హీరోకి యిష్టం కలిగింది.

హిందీ ఒరిజినల్‌లో యిలా వుండదు. తన ప్రేమ వెల్లడించేందుకు హిందీలో హీరో ఆలస్యం చేయడానికి కారణం - ఆత్మన్యూనతా భావం. తెలుగులో హీరోయిన్‌ ఆలస్యం చేయడానికి కారణం - ఇంకా కొన్నాళ్లు అల్లరి చేద్దామన్న సరదా! అలాగే హిందీ ఒరిజినల్‌లో లవ్‌ ట్రయాంగిల్‌లో మూడో కోణం పరిచయం మరోలా వుంటుంది. అక్కడ యీ ఫైటింగూ అదీ వుండదు. సంజయ్‌ దత్‌ స్నేహితుడు సల్మాన్‌ ఖాన్‌ అకస్మాత్తుగా వూటీ వచ్చిపడ్డాడు. దారిలోనే హీరోయిన్‌ను చూశాడు. మనసు పారేసుకున్నాడు. ఇదే సిన్సియర్‌ లవ్‌, ఈమె దక్కితే బాగుపడతానన్నాడు. సంజయ్‌ దత్‌కీ అతని ప్రేమపై నమ్మకం చిక్కింది. తనను యింతటివాణ్ని చేసిన స్నేహితుడికి, అతని కుటుంబానికి ఏదైనా చేయాలనుకున్నాడు. తన ప్రేమ త్యాగం చేశాడు. 'సాగర్‌ అనే కవి అంటే ఆమె పడిఛస్తుంది కాబట్టి ఆమె ప్రేమను గెలవాలంటే నువ్వే సాగర్‌ అని చెప్పు' అని సల్మాన్‌కి చెప్పాడు. వాడెవడో నాకు తెలియదు, పైగా అలా చెప్పడం తప్పు కదా అన్నాడు సల్మాన్‌. 'వాడెలాటి వాడో, నాలాటి కుంటివాడో, గుడ్డివాడో, అంతకంటె నీలాటివాడు ఆమెకు దొరకడం బెటర్‌ కదా, నువ్వే సాగర్‌ అని చెప్పేయ్‌' అన్నాడు సంజయ్‌. సల్మాన్‌ సంకోచిస్తూనే సరేనన్నాడు. ఆమె పుట్టినరోజుకి సల్మాన్‌ను తీసుకెళ్లి హీరోయిన్‌కు 'నేను పరిచయం చేస్తానన్న సాగర్‌ యితనే' అని చెప్పాడు సంజయ్‌ దత్‌. ఆమె నమ్మింది. అప్పుడప్పుడు కవిత్వం గురించి మాట్లాడబోతే సంజయే సమయానికి ఏదో చెప్పి రక్షించాడు. అయినా సల్మాన్‌కి యిదంతా చికాకుగా తోచింది. నిజం చెప్పేస్తే మంచిది కదా అనుకుని వుత్తరం రాసి పంపాడు. నేను కవిని కాకపోయినా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితేనే మా యింటికి రా అని స్పష్టంగా రాశాడు. అయితే సంజయ్‌ మధ్యలో ఆ ఉత్తరాన్ని మార్చేశాడు. ఆ అమ్మాయికి వేరే రకంగా వుత్తరం వెళ్లింది. ఆమె పెళ్లికి ఒప్పుకుంది. సల్మాన్‌ తలిదండ్రులు కూడా పెళ్లికి ఒప్పుకున్నారు. 

తెలుగులో కూడా హీరోయిన్‌ రమ్యకృష్ణ, తన సోదరి మధుబాలను యిలాగే వొప్పించింది. అదెలా జరిగిందంటే - ఓసారి మధుబాల యింట్లో రమ్యకృష్ణ కనబడడంతో తనకు ఆశ్రయం యిచ్చిన వాళ్లమ్మాయే రమ్యకృష్ణ అని రాజశేఖర్‌కు తెలిసింది. అతనామెను యింకా శత్రువుగానే చూస్తున్నాడు. అతను మధుబాలంటే యిష్టపడుతున్నాడు. మధుబాలకు అతనంటే ప్రేమ పుట్టుకొచ్చింది. రమ్యకృష్ణ తన ప్రేమ సంగతి మధుబాలకు చెప్దామనుకున్నపుడే సరిగ్గా మధుబాల తను హీరోని ప్రేమిస్తున్నట్టు చెప్పేసింది. దాంతో యీమె త్యాగం చేయడానికి నిశ్చయించుకుంది. కవిత పేరుతో రాసిన వంద కవితల పుస్తకాన్ని దాచేసింది. హిందీ సినిమాలో లాగానే 'నువ్వే కవిత అని చెప్పుకో' అంది. ఆవిడెవరో అంటే మా స్కూల్లో తెలుగు టీచరులే అంది. హిందీ సినిమాలో సల్మాన్‌లాగానే సంకోచిస్తూనే మధుబాల ఒప్పుకుంది. అంతేకాదు, 'ఈమెయే కవిత, నాకు తెలుసు' అంటూ మధుబాలను రాజశేఖర్‌కు పరిచయం చేసింది. అతను అది నమ్మాడు. మధుబాలపై ప్రేమ పెంచుకున్నాడు. తల్లికి చెప్పాడు. హిందీలో లాగానే తొలివలపు పై కవిత్వం రాయమని రాజశేఖర్‌ మధుబాలను యిరకాటపు పరిస్థితుల్లో పెట్టాడు కానీ ఎలాగోలా ఆమె తప్పించుకుంది. అయితే ఆమె హిందీలో సల్మాన్‌లా నిజం చెప్పేస్తూ వుత్తరాలూ అవీ రాయలేదు. ఇటువంటి పరిస్థితిలో నిజం బయటపడాలి. పైన బంతి పడితే మధుబాల ఫిడేల్‌ కమాన్‌తో లాగబోయినప్పుడు ఉత్తరాలు బయట పడ్డాయి. ఆమెకి నిజం తెలిసింది.

 తెలుగులో యిలా సింపుల్‌గా బయటపడింది కానీ హిందీ ఒరిజినల్‌లో యింకా బాగా పెట్టారు. ఓసారి సల్మాన్‌, మాధురీ టీస్టాల్‌కి వెళితే అక్కడ టీస్టాల్‌ ఓనర్‌ సంజయ్‌ దత్‌ గురించి వాకబు చేశాడు. అతను హీరోయిన్‌ను చూసి బొమ్మలు వేసేవాడని చెప్పాడు. అప్పటికే సల్మాన్‌కు మనసులో ఓ చిన్న అనుమానం వుంది. ఇది తోడవడంతో వెళ్లి అతని బీరువా వెతికాడు. అతని కవితలు, బొమ్మలు, తను రాయగా సంజయ్‌ మార్చేసిన ఉత్తరం అన్నీ బయటపడ్డాయి. సాగర్‌ అతనే ననీ, తనకోసం త్యాగం చేశాననీ గ్రహించాడు. మథన పడ్డాడు. మాధురి తనను తిరస్కరిస్తే తప్ప సంజయ్‌ దత్‌ మళ్లీ దగ్గరవడన్న పథకంతో అతను మళ్లీ విమనైజర్‌ అయినట్టు నటించాడు.  మాధురి అతన్ని అసహ్యించుకుంది. ఇతను గొప్పవాడని చెబుతూ పరిచయం చేసిన సంజయ్‌ను తిట్టిపోసింది. తిడుతూ మెడలో గుంజితే గతంలో తను గిఫ్ట్‌గా పంపిన సాగర్‌ అనే గొలుసు చేతికి రావడంతో అప్పుడే ఆమెకు తెలిసింది - సంజయే అసలు సాగర్‌ అని. ఈలోగా సంజయ్‌ సల్మాన్‌ని నిలదీశాడు -'నువ్వు మారావంటేనే పూజాకు పరిచయం చేశాను. ఆమె వద్ద నా పరువు పోయింది. ఇదేనా స్నేహం అంటే?' అని అడిగాడు. సల్మాన్‌ ఎదురు తిరిగాడు. 'స్నేహితుణ్ని అనుకుంటే నువ్వు నీ ప్రేమను రహస్యంగా ఎందుకుంచావ్‌?' అని. 'నేను ఎవరికీ వుపయోగపడలేనివాణ్ని. నువ్వే ఆమెను స్వంతం చేసుకో' అన్నాడు సంజయ్‌, ఇదంతా విన్న మాధురీ దీక్షిత్‌ యిద్దర్నీ తిట్టిపోసింది - 'మీ పాటికి మీరు దానం యిచ్చిపుచ్చుకోవడానికి నా యిష్టాయిష్టాలతో ప్రమేయం లేదా? అని. నా హృదయం, నా హక్కు ' అంది. సల్మాన్‌లో మార్పు వచ్చింది. ఆమె మాటల్లో నిజానిజాలు గ్రహించాడు. వెళ్లి తనే తలిదండ్రులను, ఆమెను కన్విన్స్‌ చేసి సంజయ్‌ దత్‌కు అప్పగించి అతని ఆత్మన్యూనతను పోగొట్టాడు. కవీ, అతని అభిమానీ ఏకమయ్యారు. 

హిందీ సినిమా యిలా గంభీరంగా సాగిపోయింది. తెలుగులో కాస్సేపు గంభీరంగా చూపించి, క్లయిమాక్స్‌ మార్చారు. రమ్యకృష్ణ త్యాగం గుర్తించిన మధుబాల తన తండ్రి వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పింది. రమ్యకృష్ణకు రాజశేఖర్‌ దక్కేట్టు చేయమంది. అతను కూతురు కోరిక మేరకు హీరో తల్లి వద్దకు వెళ్లి కావాలని కఠినంగా మాట్లాడాడు. 'పోనీ కదాని ఆధారం కల్పిస్తే మా అమ్మాయినే వలలో వేసుకుంటాడా? మా మేస్త్రీ కూతురు రమ్యకృష్ణను కూతురిలా పెంచాను, కావాలంటే దాన్ని పెళ్లి చేసుకోమను' అని. తల్లి హీరోతో చెప్పింది. అతను మండిపడుతూ వీళ్లింటికి వచ్చాడు. అదే సమయానికి హిందీలో లాగానే త్యాగమూర్తులిద్దరి మధ్యా నువ్వు చేసుకో, అంటే నువ్వే చేసుకోమని వాగ్వివాదం జరుగుతోంది. అది విని హీరోకి ఒళ్లు మండింది. ఇద్దర్నీ తిట్టేసి వెళ్లిపోయాడు. 

ఈ దశలో తెలుగు సినిమా మార్కు ట్విస్ట్‌ పెట్టారు. మధుబాలను పెళ్లాడాదామనుకుంటున్న వాళ్ల బావ, హీరోకి ప్రొఫెషనల్‌ రైవల్‌ ఐన శ్రీహరి చేతులు కలిపారు. హీరోని కిడ్నాప్‌ చేసి, ఓ గదిలో తలకిందులుగా వేలాడేశారు. అతన్ని కాపాడాలంటే ఫలానా చోటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకో అని హీరో బావ మధుబాలకు ఉత్తరం రాసి పంపాడు. ఆ ఉత్తరం చూసి రమ్యకృష్ణ ఆమె స్థానంలో వెళ్లి బావను పెళ్లాడడానికి సిద్ధపడింది. ఈమె త్యాగం చూసి యీమెను కాపాడడానికి మధుబాల కూడా వచ్చింది. అప్పటికప్పుడు మధుబాలను సుధాకర్‌, రమ్యకృష్ణను శ్రీహరి దొంగతనంగా పెళ్లాడడానికి పురోహితులను రప్పించేశారు. హీరోగారు తప్పించుకుని వచ్చి ఫైట్‌ చేసేశారు. ఆ ఫైట్‌లో అనుకోకుండా మంగళసూత్రం రమ్యకృష్ణ మెడలో పడింది. ఈ విధంగా హీరోగారు ఎవర్ని పెళ్లాడాలో విధి నిర్ణయించేసింది. మధుబాల దగ్గరుండి హీరో హీరోయిన్లకు పెళ్లి చేయించింది. -  (సమాప్తం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2016)

[email protected]

Click Here For Part - 1

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?