Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సినీమూలం - చిట్టితమ్ముడు - 2/2

ఈ ఘట్టం ఇంగ్లీషు సినిమాలో లేదు. అక్కడ విలన్‌ పిల్లవాడి సవతి అన్నగారు. పేరు మాంక్స్‌. అతను తెరచాటునుండే కథ నడిపిస్తూ వుంటాడు. మాంక్స్‌ ఆలివర్‌ గతంలో వున్న వర్క్‌హౌస్‌కి వెళ్లాడు. అక్కడ యిన్‌ఛార్జ్‌గా వున్న దంపతులతో మాట్లాడాడు. సినిమా మొదట్లో పిల్లవాడి తల్లి నర్స్‌కి లాకెట్‌ యిచ్చింది కదా. దురాశతో ఆమె అప్పటికి దాన్ని కొట్టేసింది కానీ చనిపోయేముందు యిన్‌ఛార్జ్‌గా వున్నామెకు తను చేసిన తప్పు చెప్పేసింది. ఆ లాకెట్‌ యిప్పుడు యీ దంపతుల వద్దకు చేరింది. ఈ మాంక్స్‌ డబ్బిచ్చి ఆ లాకెట్‌ను తీసేసుకున్నాడు. ఆలివర్‌ ఫలానా అని సాక్ష్యాలు లేకుండా చేస్తే ఆస్తంతా తనకే దక్కుతుంది కదాని అతని ప్లాను. ఇక ఆ పిల్లవాణ్ని నేరస్తుడిగా చేసేసి జైలుకి పంపించమని ఫాగిన్‌కి డబ్బిచ్చాడు. ఫాగిన్‌ సరేనన్నాడు. ఇదీ ఆలివర్‌పై జరుగుతున్న కుట్ర.

తెలుగులో కూడా విలన్‌ కాంతారావు లాకెట్‌ చేజిక్కించుకుని లాకెట్‌లోనుండి అన్నగారి ఫోటో తీసి అవతల పారేశాడు. అది అనాథ శరణాలయంలో వున్న పనివాడి కంట పడింది. వాడు దాన్ని రమణారెడ్డికి అప్పజెప్పాడు. రమణారెడ్డికి కుర్రవాడు ఫలానా అని రూఢి అయింది. 

ఈ దశలో పిల్లవాడు కిడ్నాప్‌ అయిపోయి దొంగలముఠాకు చేరాడు. నవల ప్రకారం వాణ్ని బిల్‌తో బాటు దొంగతనానికి పంపుతారు -  ఏదో ఒక కేసులో యిరికించాలి కదా! అక్కడ బిల్‌కు తుపాకీ గుండు తగిలి గాయమౌతుంది. ఆలివర్‌ గోతిలో పడిపోతాడు. దగ్గరున్న యింటికి చేరతాడు. అది మిసెస్‌ మేలై అనే  ధనికురాలి యిల్లు. ఆమెతో బాటు రోజీ అనే మేనకోడలు వుంటుంది. ఆమె నిజానికి ఆలివర్‌ పిన్ని. వాళ్ల దగ్గిర ఆలివర్‌ స్థితి మళ్లీ బాగుపడుతుంది. వాళ్లకు మన పాత లాయరు బ్రౌన్‌లో తెలుసు. ఆలివర్‌ గతం తవ్వడంలో వాళ్లు ఆయనకు సహాయపడతారు. అయితే ఇంగ్లీషు సినిమాలో యీ పాత్రలు తీసేశారు. ఆలివర్‌ తప్పిపోయిన తర్వాత లాయరు ఒక ప్రకటన యిస్తాడు. అది చూసి నాన్సీ లాయరును రహస్యంగా కలిసి ఫాగిన్‌ను యీ పనులకు ప్రేరేపిస్తున్నది మాంక్స్‌ అనే అతను అని చెప్పింది. ఫాగిన్‌ కు నాన్సీమీద అనుమానం వచ్చి ఆమెమీద గూఢచారిని పెట్టాడు. వాడు వచ్చి జరిగినది చెప్పగానే ఫాగిన్‌ బిల్‌కు నాన్సీ చేసిన పని గురించి చెప్పాడు. బిల్‌ కోపంతో ముందూ వెనకా ఆలోచించకుండా నాన్సీని చంపేశాడు. దీంతో బిల్‌పై హత్యానేరం పడింది. అతను పారిపోయాడు. ఈ హత్య బయటపడుతుందని ఫాగిన్‌ మకాం మార్చవలసి వచ్చింది. 

తెలుగులో యిదంతా మార్చారు. కుర్రవాణ్ని ఎత్తుకుని వచ్చి చంపేయమని రాజనాలకు చెప్పాడు కాంతారావు. రాజనాల సరేనన్నాడు కానీ చంపలేదు. పిల్లవాణ్ని రామకృష్ణ, అతని భార్య రక్షించారు. వారికి కాంతారావు తారసపడ్డాడు. కుర్రవాడు చావలేదని తెలిసిపోయింది. వచ్చి రాజనాలను నిలదీసి, 'వాళ్లు ఓ హోటల్‌లో బస చేశారు, యిప్పటికైనా వెళ్లి వాణ్ని చంపేసిరా' అన్నాడు. ఇది రాజసులోచన వింది. వెళ్లి వాళ్లను ఎలర్ట్‌ చేద్దామని రాజనాలను, తాతను ఒక పాటా, డాన్సుతో బురిడీ కొట్టించి టైముకి వెళ్లకుండా చేసింది.  రామకృష్ణ, అతని భార్య పిల్లవాడిని తీసుకెళ్లి రమణారెడ్డికి అప్పజెప్పారు. రాజసులోచన రమణారెడ్డికి కబురు పంపించి రహస్యంగా కలిసింది. పిల్లవాడిని చంపాలని చూస్తున్నవాడి వివరాలు చెప్పింది. ఇదంతా తాత గూఢచారి చూసి, తాతకు చెప్పాడు. కాంతారావు కోరిక మేరకు కుర్రవాణ్ని ఎత్తుకుని వచ్చిన రాజనాలకు తాత రాజసులోచన చేసిన పని గురించి చెప్పాడు. ఇది విని కోపం వచ్చి రాజనాల రాజసులోచనను కొట్టాడు. అంతలో కాంతారావు వచ్చాడు. పిల్లవాడిని రక్షించమంటున్న రాజసులోచనను కాల్చాడు. తన భార్యను కాల్చడంతో కోపం వచ్చి రాజనాల, కాంతారావుతో తలపడ్డాడు. ఇంతలో తాత అనుచరుడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసి పోలీసులను వెంటబెట్టుకుని వచ్చాడు. పోలీసువాళ్లు వచ్చి అందర్నీ పట్టుకున్నారు. ఇది తెలుగు క్లయిమాక్స్‌ అయితే ఇంగ్లీషు సినిమాలో క్లయిమాక్స్‌ భారీగా తీశారు. 

నాన్సీ చావుతో లాయరు తన దర్యాప్తు వేగవంతం చేశాడు. మాంక్స్‌ పాత్ర బయటపడింది. ఫాగిన్‌కు కష్టకాలం వచ్చింది. హత్య చేసిన బిల్‌ కనబడలేదు కానీ లాయర్‌కు అతని కుక్క కనబడింది. దాన్ని వెంటాడుతూ లాయరు, యితర ప్రజలు వచ్చిపడ్డారు. ఫాగిన్‌ పట్టుబడ్డాడు. కానీ బిల్‌ ఆలివర్‌ను తీసుకుని పారిపోదామనుకున్నాడు. ఓ తాడు తీసుకుని ఆలివర్‌ను యింటి కప్పుకి బిగించమన్నాడు. అప్పుడు జరిగిన పొరపాటులో తాడు బిల్‌ మెడలో పడి, అదే అతనికి ఉరితాడయింది. నవలలో ఫాగిన్‌ స్థావరాన్ని జనాలకు చూపించింది అతని మనుష్యుల్లో ఒకడు. కానీ సినిమాలో కుక్కకు ఆ పని అప్పజెప్పారు. అది చూసి మనం యీలలు వేస్తాం. నవలలో దీని తర్వాత కూడా కథ నడుస్తుంది. ఫాగిన్‌కు ఉరిశిక్ష పడుతుంది. ఆఖరి క్షణాల్లో పశ్చాత్తాపపడి ఆలివర్‌ తాలూకు సాక్ష్యాలను అప్పగిస్తాడు. మాంక్స్‌ కూడా తన సవతిసోదరుడితో ఆస్తి పంచుకోవడానికి ఒప్పుకుంటాడు. తెలుగులో కూడా యిదంతా తీసేశారు. కుర్రవాడు మేనత్త యింట చేరి హాయిగా బొమ్మలు వేసుకుంటూండగా సినిమా ముగుస్తుంది. -  (సమాప్తం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2016)

[email protected]

Click Here For Part- 1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?