Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సినీమూలం- మా దైవం- 2

ఎమ్బీయస్‌: సినీమూలం- మా దైవం- 2

తెలుగు హీరోయిన్‌ కథ వేరేలా నడిచింది. ఆమె దోస్తీ పిల్లలతో కాదు. హీరోతోనే. ఆమె ఏకంగా అతని కాటేజీలోనే వచ్చి మకాం పెట్టేసే సందర్భం కల్పించారు తెలుగులో. విలన్‌ బారి నుండి ఆమె పారిపోయి వస్తుంది. హీరో వద్ద ఆశ్రయం కోరుతుంది. ఒకసారి యింట్లోకి చొరబడ్డాక ఆమె హీరోని టెమ్‌ప్ట్‌ చేయడానికి చూసింది. ఓ సారి అమృతాంజనం రాస్తూ చెయ్యి గుండెల దాకా పోనిస్తుంది. హిందీ సినిమా ఉదాత్తతతో పోలిస్తే యీ ఘట్టాలు చికాకు కలిగించే మాట వాస్తవం. కానీ యిక్కడ ఓ విషయం మనం గమనించాలి. 'దో ఆంఖే బారా హాత్‌'లో హీరోగా వేసిన దర్శక నిర్మాత శాంతారాం  కంటె తమిళ వెర్షన్‌లో వేసిన ఎంజీయార్‌, తెలుగు వెర్షన్‌లో వేసిన ఎన్టీయార్‌ పాప్యులర్‌ హీరోలు. మాస్‌ హీరోలు. వాళ్లు యిమేజి ప్రకారం ఫైట్లు చేయక తప్పదు. హీరోయిన్లతో పాటలు పాడక తప్పదు. పోనీ యిలా కమ్మర్షియల్‌ ఎలిమెంట్స్‌ కోసం రాజీపడి వీళ్ల బదులు వేరేవారిని హీరోగా తీసుకుంటే పోలా? అనుకోవచ్చు. మనం ఒక విషయం ఒప్పుకుని తీరాలి - ఈ సినిమాలో వున్న గొప్ప సందేశం జనాలకు చేరాలంటే ఒక పాప్యులర్‌ హీరో ద్వారా చెప్పిస్తేనే సాధ్యపడుతుంది. చంబల్‌లోయలో బందిపోట్ల సంస్కరణ గురించి రాజ్‌ కపూర్‌ 'జిస్‌ దేశ్‌మే గంగా బహతీ హై' సినిమాను పాటలు లేకుండా తీద్దామనుకున్నాడు. కానీ డాక్యుమెంటరీలా తయారవుతుందని భయపడ్డాడు. అందుకని డజను పాటలు, డాన్సులు గుప్పించాడు.  హీరోయిన్‌ అందాలు విరజిమ్మాడు. సినిమా హిట్‌ అయింది. సాంఘిక ప్రయోజనమూ సిద్ధించింది. అందువల్ల యీ సినిమాలో హీరోయిన్‌ వేసే చేష్టలు మనకు నచ్చకపోయినా భరించాలి.

తమలో ఓ ఖైదీకి పిల్లలతో కలిసి వుండే అదృష్టం పట్టగానే తక్కినవారికి అసూయ పట్టుకుంది. ధైర్యం చేసి జైలరును అడిగారు, మేమూ మా పెళ్లాం పిల్లల్ని తెచ్చుకుంటామని. 'అతని పిల్లలు అనాథలు, మీ పిల్లలు కారు, తెచ్చుకోవడానికి వీల్లేదు' అన్నాడు జైలరు. ఇంకా గట్టిగా అడుగుదామంటే అతని కళ్లు చూస్తే వీళ్లకు భయం. అందువల్ల పూర్తిగా చంపి పారేస్తే సరి అనుకున్నారు. వాళ్లలో మంగలి పని చేసే ఖైదీకి జైలరు పీక కోసే పని అప్పజెప్పారు. అతను యింతకుముందు యింకోడి పీక యిలాగే కోశాడు కానీ యిప్పుడు  జైలరు మంచితనం చూసి జంకాడు. నేను చంపను అని పారిపోయాడు. అతన్ని చూసి తక్కినవాళ్లూ పారిపోయారు. ఆ విషయం రిపోర్టు చేయడానికి వచ్చిన జైలరును సూపర్నెంటు హేళన చేశాడు. ఖైదీలను ఎక్కడ దొరికినా కాల్చి  చంపమని పోలీసులకు ఆర్డరేశాడు. పట్టుకోండి కానీ కాల్చవద్దని జైలరు ప్రాధేయపడ్డాడు. 'అయితే నా ప్రయోగం విఫలమైందని రాసి యిమ్మ'న్నాడు సూపర్నెంటు. గత్యంతరం లేక జైలర్‌ రాసిచ్చాడు. సూపర్నెంట్‌ అతన్ని అరెస్టు చేయించాడు. 

కానీ మర్నాటికి అనుకోని మలుపు. దొంగలు తమంతట తామే క్యాంప్‌కు తిరిగి వచ్చి తమ తమ పనులు చేస్తున్నారని కబురు వచ్చింది. జైలరును విడుదలయ్యాడు. ప్రయోగం విఫలమైందని రాసిచ్చిన కాగితం చింపేయబోతూండగా 'ఉంచు, ఎప్పటికైనా పనికి వస్తుంది' అన్నాడు సూపర్నెంట్‌. ఎందుకు తిరిగి వచ్చారని జైలర్‌ ఖైదీలను అడిగాడు. 'పారిపోయాం కానీ గుడిలో కృష్ణుడి కళ్లు చూడగానే నీ కళ్లే గుర్తుకు వచ్చాయి. నీ కళ్లలోని ఆకర్షణకు లొంగి వెనక్కు వచ్చామ'ని చెప్పారు వాళ్లు. కానీ తెలుగులో వెంకటేశ్వరస్వామిని చూపించారు, తెలుగు దేవుడు కదాని. పనిలో పనిగా ఎన్టీయార్‌ను దేవుడి గెటప్‌లో కూడా చూపించారు. ఖైదీలు పారిపోయే అనర్థానికి కారణమైన తన పిల్లల్ని గోపాల్‌ తరిమేయబోతూ వుంటే తక్కిన ఖైదీలు ఆదరించారు. ఉండనీ అన్నారు. 

తెలుగు హీరోయిన్‌ వూరికే కలలు కనేస్తోంది. కలలో డ్యూయెట్లు పాడేస్తోంది. ఆ తర్వాత ఆమెను విలన్‌ కిడ్నాప్‌ చేయించబోయినట్టు ఓ ఫైటింగ్‌ సీను పెట్టారు. ఎన్టీయార్‌ను పెట్టాక ఫైట్స్‌ వుండకపోతే ఎలా? ఈ దశలో తెలుగులో హీరో తల్లిని రంగంపైకి తీసుకుని వచ్చారు. హీరోయిన్‌తో కలిపించారు. కొడుకుతో పెళ్లి గురించి మాట్లాడించారు. ఇదంతా హిందీలో లేదు. తల్లి వుందని చెప్పారు కానీ ఎక్కడా చూపించలేదు. 

ఖైదీల వ్యవసాయం చేయిస్తూ వుండగానే వర్షాలు వచ్చాయి. పంటలు పండాయి. ఖైదీలందరూ రైతులుగా మారి కూరలు పండించారు. వాటిని వారం వారం వచ్చే సంతకు పోయి అమ్మాలని బయలుదేరారు. లాభాలు వేసుకోకుండా కిట్టుబాటు రేట్లకే అమ్మాలని జైలర్‌ ధరలు ఓ కాగితంమీద రాసి యిచ్చాడు. వాళ్లు బయలుదేరుతూండగా సూపర్నెంట్‌ వచ్చాడు. జరిగిన కృషి చూసి ముచ్చటపడ్డాడు. ఖైదీలందరూ సూపర్నెంటుకి పువ్వులు యిచ్చారు. కథ యిక్కడితో అయిపోతే డాక్యుమెంటరీలాగే వుండేది. కానీ యిక్కడనుండి వేరే టర్న్‌ తీసుకుంది. మార్కెట్‌ శక్తులు యిలాటివారితో ఎలా ఆడుకుంటాయో చూపించారు. ఇలా సరసమైన ధరలకు అమ్మితే కమిషన్‌ వ్యాపారి వ్యాపారం కూలిపోదూ? అందుకని వాళ్లని బెదిరించబోయాడు. వీళ్లు బెదరలేదు. స్నేహం నటించి యింటికి భోజనానికని పిలిచి తాగించాడు. తాగడంతో వీళ్ల పాత స్వభావాలు బయటకు వచ్చాయి. రాక్షసత్వం పురి విప్పింది. ఇంట్లో వున్న హీరోయిన్‌పై అఘాయిత్యం చేయబోయారు. అడ్డుపడ్డ జైలరును చంపబోయారు.

జైలర్‌ విసిగిపోయాడు. 'నా ఆదర్శాలు విఫలమైన తర్వాత నేను బతికి ప్రయోజనం ఏముంది? నన్ను కాల్చి చంపేయండి అంటూ పిస్తోలు వాళ్ల చేతికి యిచ్చాడు. కానీ వాళ్లు కాల్చలేక చేతులు వణుకుతూంటే హీరోయిన్‌ వచ్చి తిట్టింది. జైలరు కళ్లలో వెలుగు చూసి ఖైదీలు ఆగిపోయారు. తాగి గోల చేసిన వాళ్లంతా మర్నాడు క్షమాపణ కోరడం, జైలర్‌ క్షమించడం జరిగింది. కాంట్రాక్టరు గోవిందస్వామి వచ్చి కూరగాయలు తనకే అమ్మమన్నాడు. జైలర్‌ పొమ్మన్నాడు. మరుసటివారం మార్కెట్లో అతనేదో గొడవ చేస్తాడని, దానికి యీ ఖైదీలు రియాక్టయి యింకా చిక్కుల్లో పడతారని జైలర్‌ భయం. అందుకని తనే మార్కెట్‌కు  బయలుదేరాడు. వాళ్లు తిట్టినా, కొట్టినా పడివుంటాం, చెయ్యెత్తం, నీ మీద వొట్టు అని చెప్పి వాళ్లు మార్కెట్‌కి బయలుదేరారు. మార్కెట్‌ వ్యాపారులు వాళ్లను చావగొట్టారు. జైలరుకు యిచ్చిన మాట ప్రకారం ఖైదీలు సహనం చూపించారు కానీ చావుదెబ్బలు తిన్నారు. హీరోయిన్‌ వచ్చి అడ్డుకోకపోతే ఏమయ్యేవారో పాపం. వాళ్లని బండిలో వేసుకుని ఆమె జైలరు వద్దకు తీసుకెళ్లింది. చూపించింది. వ్యాపారులు యింతటితో ఆగలేదు. వాళ్ల కూరగాయల తోటలో ఆంబోతులను తోలాడు. వాటిలో ఒకటి యీ పడిపోయిన ఖైదీల మీదకు వచ్చింది. వాళ్లను కాపాడడానికి జైలరు ఆంబోతుతో పోరాడాడు. ఆంబోతు కుమ్మేయడంతో హిందీ సినిమాలో జైలరు చనిపోయాడు. 

కానీ తెలుగులో హీరోను చంపేయలేదు. మాస్‌ హీరో కదా, ఫైటింగ్‌ సీన్లు పెట్టారు. వాటికి తోడు భారీ రంగుల సినిమా కాబట్టి ఏనుగులు పెట్టారు. ఎన్టీయార్‌ వాటిని అదుపు చేసి అందర్నీ రక్షిస్తాడు. హీరోయిన్‌ను పెళ్లాడతాడు. ఇలా తెలుగు సినిమా సుఖాంతం అయింది. కానీ హిందీ ఒరిజినల్‌లో హీరో మరణించాడు. అతని మరణం చూస్తూనే హీరోయిన్‌ గాజులు పగలగొట్టుకుని, బొట్టు చెరిపేసుకుంది. ఈ వొక్క సీను ద్వారానే  ఆమెకు అతనిపై ప్రేమ వుందని వ్యక్తమవుతుంది. ఇంకెక్కడా వాళ్లిద్దరి మధ్యా ప్రేమ సంభాషణ వుండదు. ఈ సీను మనల్ని కదిలించేస్తుంది. సినిమా చివర్లో చనిపోయిన జైలర్‌కు నివాళి ఘటించడానికి సూపర్నెంటు వచ్చాడు. జైలర్‌ స్థానంలో బొమ్మలమ్మాయి ప్రార్థన చేస్తూ కనబడింది. ఖైదీలు తమకు ప్రభుత్వం శిక్ష రద్దు చేసినా, అక్కడే వుండిపోయి, జైలర్‌ తలపెట్టిన కార్యాన్ని పూర్తి చేయడానికి వుండిపోయారు. ఈ సన్నివేశాలను చూస్తూంటే గుండె బరువెక్కిపోతుంది. (సమాప్తం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015)

[email protected]

Click Here For Part-1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?