Advertisement

Advertisement


Home > Articles - MBS

సినీమూలం: పాండురంగ మహాత్మ్యం - 2/2

సినీమూలం: పాండురంగ మహాత్మ్యం - 2/2

మధ్యలో యింటిపెత్తనం భార్య చేతిలోకి ఎలా వెళ్లిందో కాస్త చెప్పుకోవాలి. అవి చాలా నేచురల్‌గా, ఎవరిదీ తప్పులేనట్టుగా చూపించారు.  భార్యాభర్తలు కలిసిన తొలిరాత్రి తెల్లవారుఝామునే తండ్రి, తల్లి కలిసి 'జయజయ గోకులబాలా' అంటూ భజన మొదలెట్టాడు. కొత్తకోడలు చికాకు పడింది. కొడుకూ విసుక్కున్నాడు. ఎన్టీయార్‌ నాగయ్యను తిట్టాడు. ఇంటికి వచ్చిపడిన యోగుల్ని అంజలి తిట్టిపోసింది. ఇదంతా చూసి నాగయ్య, హేమలత వెళ్లిపోతామన్నారు. అంజలి వద్దంది. అత్తగారు కోడలికి తాళం చెవులు యిచ్చేసింది. హీరో వేశ్య పుట్టినరోజుకి వెళ్లాడు కానీ బహుమతి ఏమీ పట్టుకెళ్లలేకపోయాడు. వేశ్య మీరే నా బహుమతి అన్నా యితను ఏదో ఒకటి యిద్దామనుకున్నాడు. అప్పు చేద్దామన్నా పుట్టలేదు. పెత్తనమంతా వాళ్ల ఆవిడదే నని వూళ్లో పొక్కింది. భర్తకు వేశ్యాసంపర్కం వున్నపుడు భార్య ఆపాటి జాగ్రత్త పడడంలో బేసబబు ఏముంది? కానీ హీరో అలా అనుకోడు కదా. ఇనప్పెట్టె దోచాడు. పారిపోతూ తల్లి చేతికి చిక్కాడు. నగలమూట వాళ్ల వాటా ముందు పడేసి ఏమీ తెలియనట్టు పడుక్కున్నాడు. అతని వుంగరం ఆమె చేతిలోకి రావడంతో దొంగ ఎవరో తెలిసిందామెకు. దొంగ ఎవరని రొక్కించినా చెప్పకపోవడంతో  కోడలు అపార్ధం చేసుకుంది. వాళ్లే  దొంగలనుకుని మాటలంది. కోడలు నిందలు భరించలేక అత్తమామలు వూరు విడిచి వెళ్లిపోయారు. ఈ విధంగా ఓ నేచురల్‌ కాన్‌సీక్వెన్స్‌గా చూపించారు తెలుగులో. ఇంట్లో అమ్మానాన్నా లేరు, ఎన్టీయార్‌ భార్య వద్దనుండి తాళం చెవి కొట్టేసి ఇనప్పెట్టెలోని నగలన్నీ వేశ్యకు దోచిపెట్టాడు. మదవతితో బాటు వేశ్య మొహమాట పెడితే మద్యం కూడా ఆస్వాదించసాగాడు.

తమిళంలో యింత సులభంగా మద్యం తాగడు. వేశ్య బలవంతంగా అలవాటు చేస్తుంది. తాగుడు మైకంలో వుండగానే ఆస్తి రాయించుకోవాలిగా అందుకు. ఒక తెలుగు చెట్టియార్‌ వద్ద హీరో అప్పు చేసాడు. నాలుగు నెలలైనా అప్పు తీర్చలేదు. అతను హీరో భార్య వద్దకు వచ్చి 'మీ ఆయన వూరెళుతున్నానని నిన్ను ఏమార్చి వేశ్యాగృహంలో పడివుంటున్నాడు. ఆమెతో జూదం ఆడుతున్నాడు. మీ అత్తమామలుంటే నీకీ గతి పట్టేది కాదు కదా' అన్నాడు. అది విని భార్యకు కోపం వచ్చింది కానీ నిజానికి జరుగుతున్నది అదే. వేశ్యతో ఆడిన జూదంలో ఓడిపోయిన హీరో అంతా సరదా సరదాగానే అనుకుంటూ యిల్లూగిల్లూ ఆస్తి అంతా ఆమెకు రాసి యిచ్చేశాడు తాగుడు మైకంలో. 

ఆస్తి రాయించేసుకున్న తర్వాత వేశ్య వచ్చి యిల్లు ఖాళీ చేయమంది. హీరోని హీరో భార్యను బయటకు పంపింది. హీరోకి కళ్లు తెరుచుకున్నాయి. అయితే మైకంలో రాయించుకున్నది కాబట్టి ఆ పత్రం చెల్లదన్నాడు గ్రామాధికారి. అప్పుడు ఆ వేశ్య ఆ గ్రామాధికారిని కూడా ఆటా, పాటతో వశం చేసుకుని తనకు అనువుగా తీర్పు చెప్పించుకుంది. అవసరం తీరాక పొమ్మంది. హీరో ఆస్తి అనుభవించసాగింది. ఇదంతా చూసి ఆమెను హీరోకి తగిలించిన మారిదాసుకి పశ్చాత్తాపం కలిగింది. హీరోని యిలా తయారుచేసింది నేనే కదా అనుకుని వూళ్లో ఓ వర్తకుడి సహాయంతో రాజు గారి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. రాజు గ్రామాధికారికి దండన వేసి వేశ్యనుండి ఆస్తి వశపరచుకుని గ్రామబహిష్కరణ విధించి ఆ ఆస్తిని  హీరో పేరే పెట్టి కాపాడుతున్నారు. కానీ యిదంతా తెలియని హీరో, అతని భార్య అడవుల పడి పోయారు. ఇది తమిళ ఒరిజినల్‌లో కథ.

తెలుగులో యిలా వుండదు. తెలుగులో ఎన్టీయారు వేశ్యకు ఆస్తి రాసిచ్చేశాడని తెలియగానే అంజలి అతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆస్తి ఎందుకు రాయించుకున్నావని అడగడానికి వేశ్య యింటికి వెళ్లిన హీరోకి అక్కడ ఆమె వేరేవారితో కులుకుతూన్న దృశ్యం కళ్లబడింది. ఆమెను చంపబోయాడు. కానీ అవతలి విటుడు యితన్ని నెత్తిమీద కొట్టాడు. ఇతను సిగ్గుతో వూరు వదలి అడవుల్లోకి పోయాడు. అయితే అతనికి వేశ్యను తగిలించిన శివరావుకి పశ్చాత్తాపం కలిగింది. వేశ్య యింట్లోనుండి పత్రం దొంగిలించి గ్రామాధికారి ముందు తన తప్పు వొప్పుకుంటాడు. వేశ్యకు గ్రామబహిష్కారం విధిస్తారు.

తమిళంలో భార్యతో సహా కాశీకి బయలుదేరిన హీరోకి అడవిలో నిద్రిస్తూండగా ఆడగాలి తగిలింది. లేచి చూస్తే ముగ్గురు అమ్మాయిలు కనబడ్డారు. సరసమాడబోయాడు. తామెవరో వాళ్లు చెప్పారు. వాళ్లు గంగా, యమునా, సరస్వతీ నదులు. జనాలందరూ తమ పాపాలను వదుల్చుకోవాలని ఆ నదుల్లో మునుగుతారు. ఆ పాపాలు తగిలి వీళ్లు దూషితలవుతున్నారు. ప్రతీరోజూ కుక్కుట మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆయనను సేవించి, తమ పాపాలు వదుల్చుకుని. తిరిగి తేజోమూర్తులై వెళుతున్నారు. కామాంధుడై వున్న హీరో వాళ్ల మాటలు విశ్వసించలేదు. అక్కడున్న రుషి వీళ్లతో శృంగారం చేస్తున్నాడనుకున్నాడు. ఆయన్ను దూషించాడు. నువ్వెంత పాపివో చూడు నీ గాలి సోకితేనే గంగ నల్లబడుతోంది అంటూ ముని నచ్చచెప్పాడు. నువ్వు దారితప్పావు నాయనా. కాశీ వెళ్లనక్కరలేదు. తలిదండ్రులను సేవించు చాలు అన్నాడు. హీరో వినలేదు. ఋషిని తన్నాడు. అంతే కాళ్లు మోకాళ్ల వరకు మాయమై కిందపడ్డాడు. 

తెలుగులో కూడా కాస్త తేడాగా యిలాగే కాళ్లు పోగొట్టుకున్నాడు. ఇక్కడ ఋషి మొదట్లో హితబోధ చేయలేదు. తర్వాత చేశాడు. హీరోకి హఠాత్తుగా ఋషి మహిమ, తన పాపాల ఉధృతి తెలియవచ్చింది. పశ్చాత్తాపంతో దేవుణ్ని ప్రార్థిస్తూ పాకుతూ, డేకుతూ అరణ్యంలో తిరగసాగాడు. అతని తల్లీతండ్రీ సాధువుల బృందంతో కలిసి కాశీ వెళుతున్నట్లు కనబడింది. వాళ్లని ఎలుగెత్తి పిలిచాడు. చేరుకుందామని డేకాడు. కానీ ఎత్తయిన చోట నుంచి దొర్లిపోయాడు. గడ్డిలో పడ్డాడు. పశ్చాత్తాపం వలన పాపప్రక్షాళన జరిగి కాళ్లు వచ్చి చేరాయి. తెలుగులో అయితే పడిపోయేటప్పుడు కృష్ణుడు పట్టుకున్నాడు. కాళ్లు వచ్చాయి. హీరో మొత్తం మారిపోయాడు. తలిదండ్రుల సేవ చేసుకోవడం, యిలా భిక్షాటన చేసుకోవడం. వేశ్య కూడా పశ్చాత్తాపపడింది. సన్యాసినిగా మారిపోయింది. పుట్టింటికి వెళ్లిన హీరో భార్యకు కూడా బుద్ధి వచ్చింది. భర్తను చేరి అత్తమామలకు సపర్యలు చేసింది.

ఈ పుండరీకుడి కథలో గొప్పతనమేమిటంటే ఈ భక్తుడు తలిదండ్రులకు సేవ చేస్తూండగా కృష్ణుడు వస్తాడు. అయినా యితను లేవడు. మా తలిదండ్రుల సేవ చేసుకునే దాకా ఆగు అంటాడు. దేవుడు అక్కడ నిల్చిపోయి వెలుస్తాడు. తెలుగులో చేర్చినదేమిటంటే అలా వెయిట్‌ చేస్తున్నపుడు కృష్ణుడి కాలు తగిలి  సినిమా మొదట్లో శాపగ్రస్తుడై రాయిగా మారిన యింద్రుడికి శాపవిమోచనం కావడం. పుండరీకుడి కుటుంబమంతా దేవుడిలో ఐక్యం కావడం. తెలుగులో యీ సినిమా గొప్ప మ్యూజికల్‌ హిట్‌గా తయారైంది. క్లయిమాక్స్‌లో పుండరీకుడి కథతో సరిపెట్టకుండా పాండురంగడిని కొలిచిన భక్తులందరినీ చూపించారు. వరుసగా చూస్తే తుకారాం, మీరా, జ్ఞానేశ్వర్‌, సక్కుబాయి కనబడతారు. ఆ యా భాషల్లో పాటలు వినిపించారు. పండరీపురం గుడిని కూడా చూపించారు. ఇలా హరిదాసు మూలకథను తీసుకుని ఎంతో బాగా తీర్చిదిద్దారు. మూలంలో ఎన్‌.ఎస్‌.కృష్ణన్‌, టి ఏ మధురంల హాస్యం వుంటుంది. కథతో సంబంధం అతి తక్కువ. ఒకతను వేశ్యకోసం వెళితే అక్కడ వంటలక్కను వేశ్య అని చెప్పి అంటగడతారు. వాళ్లకు పాటలూ అవీ పెట్టి చాలా టైము వేస్టు చేశారు. తెలుగులో శివరావు, బాలకృష్ణ పాత్రల పరంగా తత్త్వాలు అవీ పెట్టి సందర్భోచిత హాస్యం పెట్టారు.  (సమాప్తం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2016)

[email protected]

Click Here For Part-1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?