Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సినీమూలం - సితార 1/2

నవలలనుండి సినిమాలు తయారయ్యేటప్పుడు నవలా పాఠకుడు వేరు, సినిమా ప్రేక్షకుడు వేరు అని గుర్తించిన సినీకథాకారులు ఆ నవలలను తెరకు ఎలా మలుచుకున్నారో ''సితార'' మంచి ఉదాహరణ. రచయిత, డైరక్టర్‌ అయిన వంశీ 1984లో మంచి భావుకతతో తీసిన సినిమాకి ఆధారం - ఆయనే దానికి రెండేళ్ల క్రితం రాసిన 'మహల్లో కోకిల' అనే నవల. నవలలో వున్నన్ని పాత్రలు, ట్విస్టులు సినిమాలో పెడితే ప్రేక్షకులు గందరగోళపడతారని కాబోలు కథ నిడివి తగ్గించి, సినిమాను సాఫీగా చేసి దృశ్యపరంగా అద్భుతంగా తీశారు. ఇది ఒక సినిమా తార కథ. ఆమె అసలు పేరు కోకిల. ఆమెకో గతం వుంది. దాన్ని పాతిపెడదామని ఆమె అనుకుంది. కానీ అనుకోని రీతిలో అది బయటకు వచ్చింది. దానివలన తనకు నష్టం కలిగింది అనుకుందామె. అలా బయటపడడానికి కారకుడైన వాణ్ని ద్వేషించింది. అతని పేరు దేవదాసు. ఓ విధంగా అతనే కథానాయకుడు. ఆ పాత్ర వేసినది శుభలేఖ సుధాకర్‌. సినిమాలో అతనో ఫోటోగ్రాఫర్‌.

నవలలో దేవదాసు ఫోటోగ్రాఫర్‌ కాడు. ఓ పాత్రికేయుడు. ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు. తిలక్‌ అనే మిత్రుడు చీఫ్‌ రిపోర్టరుగా పనిచేస్తున్న ఓ సినిమా పత్రికకు గాసిప్‌ ఆర్టికల్స్‌ రాసి పంపుతూ వుంటాడు. అతనికి విపరీతమైన వుత్సాహం, ధైర్యం వున్నాయి. సినిమాతారల గురించి స్కూప్స్‌ వెలికిదీసి రాసిపెట్టమని తిలక్‌ అడిగితే సాహసాలకు ఒడిగడుతూంటాడు. కోకిల అనే డాన్సర్‌ తనకు ఓ సెక్రటరీ కావాలని అడిగితే తిలక్‌ను అడిగితే అతను దేవదాసు పేరు సిఫార్సు చేశాడు. నవలలో కోకిలకు సెక్రటరీగా దేవదాసు పరిచయమయ్యాడు. సినిమాలో వాళ్ల ప్రథమ పరిచయాన్ని మరోలా చూపించారు. దేవదాసు (సుధాకర్‌) రైల్లో వెళుతూంటే పై బెర్త్‌ మీద నుంచి సుధాకర్‌ బ్యాగ్‌ కిందపడింది. బ్యాగ్‌ తెరిచి కెమెరాను చూసుకుని 'ఏం కాలేదు' అనుకుంటూ ఎదురు సీట్లో వున్న భానుప్రియ కేసి చూశాడు. ఆ అమ్మాయెవరో యితనికి తెలియదు. అంతకుముందు స్టేషన్‌లో పరిగెట్టుకుంటూ వచ్చి రైలు ఎక్కేసింది. టిక్కెట్టు లేదు. ఇతనే టిక్కెట్టు కొన్నాడు. టిటిఇ పేరు అడిగాడు. పక్కన పడి వున్న సితార పత్రిక కేసి చూస్తూ 'సితార' అంటూ నోటికి వచ్చిన పేరు చెప్పాడు. ఆ పేరే ఆమె స్థిరం చేసుకుంది. 

నవలలో యిలా వుండదు. దేవదాసు పరిచయం అయ్యేనాటికే కోకిల పెద్ద డాన్సర్‌. మూడేళ్లగా ఫీల్డులో వుంది. డేట్స్‌ చూడడానికి సెక్రటరీ కావాలని అతన్ని తీసుకుంది. అతని దూకుడుతో, ఆమె వింత ప్రవర్తనతో అప్పుడప్పుడు తగాదాలు వస్తూ వుంటాయి. ఆ తగాదాలను జయ అనే ఓ కో-డాన్సర్‌ ఎగదోస్తూ వుంటుంది. రమణకుమారి అనే సింగర్‌ చల్లారుస్తూ వుంటుంది. కోకిల యింట్లో 'దయ' అనే ఓ మిస్టీరియస్‌ కారెక్టరు వుంటుంది. ఈ దేవదాసుకి అతి క్యూరియాసిటీ. దానివల్లనే అనేక చిక్కుల్లో పడతాడు. ఓ సారి వుద్యోగం కూడా పోగొట్టుకుంటాడు. కానీ సినిమాలో దేవదాసు ((సుధాకర్‌) సౌమ్యుడు. రైల్లో తారసిల్లిన భానుప్రియను తన యింటికి తెస్తాడు. గతం అడగనంటే అతనితో వుంటానని ఆమె అంటుంది. 

నవలలో కోకిలకు, దేవదాసుకు గొడవ వస్తే రమణకుమారి సర్ది చెప్పి మళ్లీ వుద్యోగంలో చేర్పించింది. దయ అనే ఆవిడ తనను విడిచి వెళ్లిపోవడంతో మానసికంగా ఒంటరి ఐపోయిన కోకిల దేవదాసును ఆదరించింది. అతను కోకిల జీవితం గురించి ఓ నవల రాయడానికి పూనుకున్నాడు. ఆమె చెప్పిన వివరాలపై ఆరా తీస్తే ఆమె గత జీవితంపై అబద్ధాలు చెపుతోందని గ్రహించాడు. ఇంతలో కోకిల దూరపు బంధువు ఒకతను కలిసి కోకిల అసలు వూరు వెంకటనారాయణపురం అనే పల్లెటూరు అని చెప్పాడు. అన్నగారి పేరు చందర్‌ అని చెప్పాడు. ఆ సమాచారం పెట్టుకుని దేవదాసు కోకిలను అడలగొట్టసాగాడు. ఇంతలో ఓ సినిమాలో వేషం వేసే ఛాన్సు వచ్చిందామెకు. వేయనంది కానీ ఆమె కిష్టురాలైన దయ ఆమెనుండి విడిపోయి, దరిమిలా చనిపోవడంతో దు:ఖాన్ని మర్చిపోవడానికి సినిమాల్లో నటిస్తానని ఒప్పుకుంది. సినిమాలో సినిమాప్రవేశాన్ని మరోలా చూపారు. హీరోయిన్‌కు ఆశ్రయం యిచ్చిన సుధాకర్‌ ఆమెను మోడల్‌గా పెట్టి ఫోటోలు తీశాడు. అవి చూసి ఆమెతో డాక్యుమెంటరీ తీస్తానంటూ ఒకతను వస్తే సుధాకర్‌ సిఫార్సు చేయగా భానుప్రియ 'నీ యిష్టం' అంటూ ఒప్పుకుంది. అక్కణ్నుంచి సినిమా ఛాన్సు వచ్చింది. ఈ విధంగా అతి సులభంగా ఆమె పెద్ద సినిమాతార అయిపోవడం, సుధాకర్‌ ఆమెకు పిఏ అయిపోవడం జరుగుతుంది సినిమాలో. 

కానీ నవలలో యింత సులభంగా జరగదు. ఓ సినిమాలో ఆమె వేషం వేస్తుంది. షూటింగ్‌కని 40 రోజులు ఔట్‌డోర్‌ వెళ్లడంతో డాన్సు ట్రూపులో వాళ్లు గొడవ పెడతారు. దాంతో కోకిల తన ఆస్తినంతా వాళ్లకి పంచి యిచ్చేసి చిన్న యింటికి మారిపోతుంది. ఆ సినిమా ఫ్లాపవుతుంది. ఇక వేషాలు రావు. కానీ కోకిల స్థయిర్యం కోల్పోలేదు. మళ్లీ యింకో అవకాశం వచ్చినపుడు పెద్ద తారగా అయింది. ఈ అప్స్‌ అండ్‌ డౌన్స్‌ నవలలో గొప్పగా వున్నాయి. నవలలో కోకిల సినిమా తార కావడానికి అయిదేళ్లు పట్టినట్టు చెప్పారు. ఆమె అన్నగారు పోయాక అతను వుంచుకున్న స్త్రీ - ఆమె పేరు దయ - వచ్చి యీమెను మద్రాసు తీసుకుపోయింది. మనుష్యులు అలవాటు కావడానికి హోటల్లో రిసెప్షనిస్టుగా చేర్పించింది. ఆ తర్వాత కోకిల డాన్సు నేర్చుకుంటానంది. డాన్సు టీచర్‌ కూతురు జయకి సినిమాల్లో చేరాలన్న కోరిక వుంది. అందుకని కోకిలను పక్కన పెట్టుకుని డాన్సు ట్రూపు తయారుచేసింది. ఓ ప్రోగ్రాం  యిస్తే జయ కంటె కోకిలకే ఎక్కువ పేరు వచ్చింది. ఆమె డాన్సరుగా మారింది. ఆమె వెంట నరహరి అనే ఓ ఫోటోగ్రాఫర్‌, పళని అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌ పడ్డారు. వాళ్లిద్దరూ యీమెకోసం ఘర్షణ పడ్డారు. పళని నరహరిని చంపేసి జైలుపాలయ్యాడు. 

సినిమాలో యీ కారెక్టర్లు కనబడవు. భానుప్రియ, సుధాకర్‌ కలిసి తిరుగుతూంటే ఓ రిపోర్టరు గాసిప్‌ రాసి పడేశాడు. అది చూసి సుధాకర్‌ ఆ వార్త నిజం కావాలని ఆశపడ్డాడు. కానీ భానుప్రియ మొహం చిట్లించింది. సుధాకర్‌ జంటిల్‌మన్‌ కాబట్టి ఆమెపై తన యిష్టాన్ని మనసులోనే దాచుకున్నాడు. అమెను యిబ్బంది పెట్టలేదు. ఇలా కథ నడుస్తూండగా ఓ సారి ఓ సినిమాకు ఔట్‌డోర్‌ షూటింగ్‌కై వెంకటనారాయణపురం వెళ్లాలని సుధాకర్‌ చెప్పాడు. ఆమె ఆ వూరిపేరు వినగానే వెళ్లను పొమ్మనమంది. ఆ విషయం చెబితే నిర్మాత తిట్టిపోశాడు. ఇంతకంటె ఏదైనా బ్రోకర్‌ పని చేసుకోరాదా అని తిట్టాడు. దాంతో బాధపడిన సుధాకర్‌ భానుప్రియను నిందించాడు. రిజైన్‌ చేసి వెళ్లిపోతానన్నాడు. అప్పుడు ఆమె తన గతాన్ని చెప్పుకొచ్చింది.

ఆమె అసలు పేరు కోకిల. ఆమె ఓ జమీందారుగారి కూతురు. అన్నగారు (శరత్‌బాబు) ఒక్కడే మిగిలాడు. తండ్రి హయాంలో వున్నదంతా వూడ్చుకుపోయింది. కోర్టులో ఒక లిటిగేషన్‌ నడుస్తోంది. ఆ కేసు గెలిస్తే డబ్బు కలిసి వస్తుంది. అప్పటిదాకా గుట్టు బయటపడకుండా అన్నగారు మేనేజ్‌ చేస్తున్నాడు. లంకంత యింటికి ఎప్పుడూ తలుపులు మూసేవుంటాయి. కోకిలను చూసినవారు ఎవరూ లేరు. ఆమె ఆ యింట్లో బందీ. తలుపుల వెనకాల సకలభోగాలు అనుభవిస్తున్నారని వూళ్లోవాళ్లు అనుకుంటారు. బాహర్‌ షేర్వాణీ, ఘర్‌మే పరేశానీ అన్నట్టుగా వుంటుంది అన్నగారి వ్యవహారం. లాయర్‌ సోమయాజులు వద్దనైనా సరే అదే బడాయి. ఉక్కపోస్తున్నా కోటు యిప్పడు, యిప్పితే లోపల చిరుగుల బనీను కనబడుతుందని భయం. 

ఈ శరత్‌బాబుకు జమీందారీ అహంకారం. తన పరిస్థితి యిలా అయినందుకు బాధతో శాడిస్టు అయ్యాడు. చెల్లెలితో ఒక్కమాట మాట్లాడడు. నవలలో అతనికి ఒక  ప్రియురాలిని పెట్టారు కానీ సినిమాలో అదీ లేదు. వాళ్ల నాన్నగారు ముత్యాలరావు అనే అతనివద్ద కొన్న పొలం డీల్‌ చెల్లదని ముత్యాలరావు కొడుకులు అన్యాయమైన కేసు పెట్టారు. దానికి సంబంధించిన కాగితాలు దొరకలేదు. ఆ కోపంతో  సిగరెట్టుతో పిట్టల్ని కాలుస్తూంటాడు. ఇది చాలనట్టు వూళ్లో జాతర జరుగుతోందని పెద్దమనుషులు వస్తే పదివేలు యిస్తానని వాగ్దానం చేశాడు బడాయిగా. ఇంతలో పగటివేషగాళ్లు దిగారు. వాళ్లకి యితని అసలు సంగతేం తెలుసు? కొత్తగా ట్రూపులో చేరిన రాజు (సుమన్‌) అనే కుర్రాడికి వీరాస్వామి (రాళ్లపల్లి) అనే పాతవాడు రాజావారి ఘనత గురించి తెగ చెప్పాడు. మూసిన తలుపుల వెనక శరత్‌బాబు పడే అవస్థ అతనికేం తెలుసు? (సశేషం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?