Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సినీమూలం - సితార 2/2

కోర్టులో కేసు వాయిదా పడింది. లాయరు సోమయాజులు శరత్‌బాబుతో నువ్వు 10 రోజులు ఊళ్లు తిరిగి సమాచారం సేకరించాలి అని చెప్పాడు. అతను ఊళ్లు పట్టుకుని తిరుగుతున్నాడు. అందువలన ఆ రాజమహల్లో భానుప్రియ ఒక్కత్తే మిగిలిపోయింది. పగటివేషగాళ్లకు ఓ ఆనవాయితీ వుంది. రోజూ రాజమహల్‌ ముందు ఆడిన తర్వాతనే వూళ్లో ఆడాలని. అందువలన రోజుకి ఓ వేషం చొప్పున వాళ్లు ఆడారు - మూసేసిన తలుపుల ముందు. ఆ తలుపుల వెనక్కాలనుంచి భానుప్రియ పగటివేషాలు చూస్తోంది - బయటకు వచ్చే అవకాశమే లేదు  కాబట్టి! రోజూ తామెంత కష్టపడినా ఎవరూ వచ్చి తొంగి చూడకపోవడంతో, అభినందించకపోవడంతో హీరో సుమన్‌కి మండిపోయింది. అవేళ వేషం కట్టనన్నాడు. నేనే కడతా అంటూ రాళ్లపల్లి బేతాళుడి వేషం వేశాడు. దీనికి పర్యవసానం ఏమిట్రా అంటే వూళ్లో పిల్లాపాపా అందరూ భయపడి చావడం. మళ్లీ యితను వేషం వేస్తే చంపేస్తామన్నారు. దాంతో మర్నాడు హీరో శివుడి వేషం కట్టి మహల్‌ ముందు అడాడు. అవేళ లోపలనుండి హీరోయిన్‌ చూడడం గమనించాడు. బహుమానం కోసం అంటూ మర్నాడు అతను ఒక్కడే వచ్చి మహల్‌ బయట నిలబడ్డాడు. హీరోయిన్‌ ఓ వెండిపళ్లెం మీద బహుమానం అంటూ రాసి తలుపు ఓరగా తీసి బయటకు దొర్లించింది. హీరో తీసుకున్నాడు కానీ అది పట్టుకెళితే ఎత్తుకొచ్చామంటారేమోనని అతనికి భయం వేసింది. తిరిగి యిచ్చేద్దామని తలుపు తట్టాడు. ఆమె తలుపు తీసి లోపలికి రానిచ్చింది. 

హాల్లో చుట్టూ వున్న చిలకలు ఎగిరాయి. వాటిని పట్టుకుంటూ వుండగా చేతులు కలిశాయి. ఇంకేముంది? వారిద్దరికీ స్నేహం కుదురుకుంది. పాటలు పాడుకున్నారు. ఈ వ్యవహారం ముదిరింది. హీరో తన జట్టులోంచి విడిపోయి యీ మహల్‌ చుట్టూ తిరుగుతున్నాడు. ఊళ్లో జాతర జరుగుతూంటే వీళ్లిద్దరూ అక్కడికి వెళ్లారు. ఆమెను ఎవరూ గుర్తుపట్టలేదు కానీ హీరోని రాళ్లపల్లి గుర్తుపట్టాడు. అతన్ని వెంటాడి యిల్లు కనుక్కుని, ఆ అమ్మాయి ఫలానా అని గ్రహించి, హీరోపై అసూయతో శరత్‌బాబుకి చెప్పేశాడు. సరిగ్గా అదే సమయానికి అతను కేసులో ఓడిపోయాడు. మధ్యలో ముత్యాలరావు అతనికిి కబురంపించి తనకు తెలియకుండా కొడుకులు కేసు వేశారని, ఆ అమ్మకం సరైనదే నని తానే స్వయంగా వచ్చి సాక్ష్యం చెప్తానని చెప్పాడు. ఆ సాక్ష్యంతో  కేసు గెలిచేస్తానని శరత్‌బాబు అనుకుంటూండగా దురదృష్టవశాత్తూ ముత్యాలరావు గుండెపోటుతో మరణించాడు. దాంతో కేసు పోయింది. యీ ట్విస్టు నవలలో లేదు. కేసు పోయింది అని మాత్రమే రాశారు. కేసు పోవడంతో శరత్‌బాబు బెంబేలెత్తిపోయాడు. లాయర్‌ అతన్ని వూరడించి, ఫీజు వాపసిచ్చి యింటికి పంపాడు. నిరాశతో, కసితో రగిలిపోతున్న శరత్‌బాబు తన చెల్లెలి వ్యవహారం వినగానే కోపంతో మండిపడ్డాడు. హీరోని హత్యచేయమని పురమాయించాడు. రౌడీలు సుమన్‌ వెంటపడ్డారు. అతను గోదావరిలో పడ్డాడు. మర్నాడు హీరో శవం గోదావరిలో దొరికింది. మొహం ఆనవాలు తెలియలేదు. శవదహనానికి శరత్‌బాబు డబ్బిచ్చాడు. హత్య చేయించాక డిప్రెషన్‌లోకి వెళ్లాడు. చిలకలను హింసించాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. 

నవలలో యిలా జరగదు. అతను హత్య చేయించిన కొన్ని రోజుల తర్వాత ఇంట్లో సామాను అమ్మేసి చెల్లెల్ని తన మానాన తనను వదిలేసి పారిపోదామనుకున్నాడు. పోయేటప్పుడు పక్షులన్నిటినీ కసిదీరా దబ్బనంతో పొడిచాడు. వాటిలో అగ్నిపక్షి అనే కౄరమైన పక్షి అతని కళ్లు పొడిచేసింది. అతను భయంతో పరుగులు పెడుతూ గోదాట్లో పడి చనిపోయాడు. హీరోయిన్‌ యింటి లోపలే తలుపులు బిడాయించుకుని వుండిపోయింది. ఊళ్లోవాళ్లే అతని అంత్యక్రియలు చేశారు. దీన్ని సినిమాలో మార్చారు. అతను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతూ మన వంశచరిత్ర ఎవరికీ చెప్పవద్దు అని చెల్లెల్ని ఆదేశించాడు. 

దీని తర్వాతనే హీరోయిన్‌ పారిపోయి రైలెక్కడం, సుధాకర్‌ సహాయంతో సినిమాతార కావడం జరిగింది. అన్న ఆదేశం ప్రకారం యిన్నాళ్లూ గుట్టు దాచింది కానీ, యిప్పుడు చెప్పక తప్పలేదు. నవలలో అయితే యింకోలా వుంటుంది. హీరోయిన్‌ సినిమాతారగా మారిన తర్వాత ఆమె గతజీవితం గురించి ఏవేవో కల్పించి సినిమా పత్రికల వాళ్లు సీరియల్‌ రాయబోతున్నారని విని, 'అదంతా ఎందుకు నేనే నా కథ చెప్త్తా' అంటూ ఆమె  తన కథను చెప్పింది. ఆమె అనుమతితో దేవదాసు 'మహల్లో కోకిల' పేరుతో  సీరియల్‌గా రాశాడు. అది ఆంధ్రదేశమంతా  సంచలనాన్ని సృష్టించింది. ఈ ఘట్టాన్ని సినిమాలో యింకోలా తీశారు. సుధాకర్‌కు భానుప్రియ తన కథ చెప్పేసమయంలో అనుకోకుండా అక్కడకి వచ్చిన సుధాకర్‌ మిత్రుడు, సినిమా పత్రికకు చీఫ్‌ రిపోర్టరుగా పనిచేస్తున్న తిలక్‌ చాటుగా మొత్తం విన్నాడు. అది యాథాలాపంగా వాళ్ల ఎడిటర్‌కి చెప్పాడు. అతను దాన్ని పుస్తకంగా రాసి, ప్రజల్లో విడుదల చేసేశాడు. అది హీరోయిన్‌ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది. సుధాకర్‌ను విశ్వాసఘాతకుడని నిందించి దూరంగా పెట్టేసింది. తర్వాత అతనేం చెప్పినా నమ్మలేదు.

నిజానికి హీరో చనిపోలేదు. శరత్‌బాబు అతన్ని చంపించడానికి మనుష్యుల్ని పంపించిన రోజున ఓ ఘటన జరిగింది. అదేవూళ్లో ఒకమ్మాయి యింకో అబ్బాయితో కులుకుతోంది. అతనే హీరో అనుకుని రౌడీలు ఆ అబ్బాయిని చంపేశారు. ఈ విషయాన్ని ఆ అమ్మాయి ఒక వుత్తరం ద్వారా పుస్తకం వేసిన పబ్లిషర్‌కి తెలియపరిచింది. అతను సుధాకర్‌కి చెప్పాడు. ఆ కబురు చెప్పబోతే హీరోయిన్‌ సుధాకర్‌ మాటలను నమ్మలేదు. కానీ అతను సుమన్‌ కోసం అన్వేషించాడు. సరిగ్గా యితను అతని వూరు వెళ్లేసరికి అతను యీ వూరికి వచ్చాడు. అనుకోకుండా ఓ డాక్టర్‌ (ప్రభాకరరెడ్డి) కారుకింద పడ్డాడు. ఆ డాక్టర్‌ వేరెవరో కాదు, హీరోయిన్‌ను ట్రీట్‌ చేసే ఆయనే. సుధాకర్‌పై కోపంతో రగిలిపోతున్న భానుప్రియ ఆయన్ని పెళ్లి చేసుకుంటానంది. ఆయనకు ఒప్పుకోక తప్పలేదు.

సినిమాలో యీ డాక్టర్‌ పాత్ర అర్థవంతంగా వుంది. సవలలో హీరోయిన్‌ ఓ ముసలాయన్ని చేసుకుంటా ననుకుంటుంది. ఆయన యీమెకు వీరాభిమాని. డబ్బూ లేదు, ఏమీ లేదు. అతన్ని పెళ్లి చేసుకుంటాననడం తిక్కపనిగా తోస్తుంది మనకు. అంతేకాదు, నవలలో యింకోమార్పు వుంది. హీరో తనే స్వయంగా వుత్తరం రాశాడు. ఆ వుత్తరాన్ని దేవదాసు మొదట్లో పట్టించుకోడు. తర్వాత అతనికోసం వెతికాడు. ఇతను అటు వెళ్లినపుడు, అతను యిటు వస్తాడు. చాలాసార్లు దాగుడుమూతలు జరిగి, చివరకు హీరోయిన్‌ ముసలాయనతో పెళ్లి జరిగేసమయానికి హీరో కళ్యాణమంటపానికి చేరగలుగుతాడు. హీరోయిన్‌ గతంలో తనకిచ్చిన వెండిపళ్లాన్ని అజ్ఞాతంగా పెళ్లికానుకగా యిచ్చేసి వెంకటనారాయణపురం చేరి గోదాట్లో పడి ఆత్మహత్య చేసుకుంటాడు. పెళ్లి జరిగినతర్వాత తన పొరబాటును గ్రహించిన హీరోయిన్‌ ఆ వూరు వచ్చి అతని శవంమీద పడి ప్రాణాలు విడుస్తుంది. ఈ ఘోరమైన ట్రాజడీని సినిమాలో సుఖాంతం చేశారు.

సుధాకర్‌ డాక్టరు ప్రభాకరరెడ్డి వద్దకు వెళ్లి భానుప్రియ వలచిన సుమన్‌ బతికేవున్నాడని చెప్పాడు. ఆయన భానుప్రియను పెళ్లి చేసుకోను అని చెప్పాడు. ఈ సుధాకర్‌ తనపై కోపంతో డాక్టరు మనసు కూడా విరిచేశాడని అపోహ పడిన హీరోయిన్‌ సినిమా షూటింగు సమయంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించుకుంది. క్లయిమాక్స్‌లో  డాన్సు చేస్తూ మాత్రలు వేసేసుకుంది. ఇంతలో పోలీసులు పోలీసులు వెండి పళ్లెం తీసుకువచ్చారు. అది డాక్టరు కారుకింద పడిన వ్యక్తిదే అని తెలియగానే తాము వెతుకుతున్న మనిషి యితనేనని వీళ్లకు తెలిసింది. సుమన్‌ను పట్టుకుని సుధాకర్‌, ప్రభాకరరెడ్డి కొండ ఎక్కుతూ వచ్చారు. ఆ పాటికే మృత్యుముఖంలోకి అడుగుపెట్టిన భానుప్రియ సుమన్‌ను కళ్లారా చూసి సుధాకర్‌ నిజమే చెప్పాడని గ్రహించింది కానీ మూర్ఛపోయింది. డాక్టరు వెంటనే చికిత్స చేసి బతికించాడు. హీరో, హీరోయిన్‌ ఒకటయ్యారు. సుధాకర్‌ ఒక మంచి మిత్రుడిగా మిగిలిపోయాడు. 

ఇలా అనేక మార్పులు చేసి కథను సుఖాంతం చేశారు సినిమాలో. నవల వేదనను మిగిలిస్తే, సినిమా ఆహ్లాదాన్ని మిగిల్చింది. స్వతహాగా భావుకుడైన వంశీ చిత్రీకరణతో పాటలు ప్రధాన ఆకర్షణగా మారాయి. ఈ కొత్తతరహా సినిమాను ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేశారు. నవలారచయితకు తను సృష్టించిన పాత్రలపై మమకారం వుంటుంది. సినిమాకోసం వాటిని తుంచడం చాలా బాధాకరమైన పని. అయినా సినీప్రేక్షకుడికి కావలసినది మేధోమథనం కాదని తగుపాటి కథతో, చిత్రీకరణతో కంటికి, చెవికి యింపుగా వుంటే చాలని గ్రహించడంలోనే యింగితం వుంది. అది లేని నవలాకారులు సినిమాగా తీసినపుడు తన నవలను తగలేశారని వాపోతూ వుంటారు, గగ్గోలు పెడతారు. నవలాకారుడే నిర్మోహంగా తన పాత్రలపై, ఘట్టాలపై కత్తెర వేస్తూ, తన నవలను తనే మంచి సినిమాగా మలుస్తూ చేసిన చక్కటి యింప్రొవైజేషన్‌ దీనిలో కనబడుతుంది. (సమాప్తం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2016)

[email protected]

Click Here For Part-1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?