Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సినీ స్నిప్పెట్స్‌- సాహిర్‌ లుధియాన్వీ

''నయదౌర్‌'' సినిమాలో పాటలన్నీ రాసినది బిఆర్‌ చోప్డా అభిమాన పాటల రచయిత సాహిర్‌ లుధియాన్వీ. మన తెలుగువాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలంటే సాహిర్‌లో ఓ దేవులపల్లి వున్నాడు, ఓ ఆత్రేయ వున్నాడు, ఓ శ్రీశ్రీ వున్నాడు. సాహిర్‌ అసలు పేరు అబ్దుల్‌ హాయీ. 1921లో ఓ జాగిర్దార్‌ కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రికి చాలామంది భార్యలున్నారు కానీ కొడుకు మాత్రం సాహిర్‌ ఒక్కడే. అందువల్ల చాలా గారాబంగా పెరిగాడు. భర్త చాపల్యం భరించలేక సాహిర్‌ తల్లి విడాకులు తీసుకుని యిల్లు విడిచి వచ్చేసింది. భోగభాగ్యాలున్న తండ్రో, అభిమానం కురిపించే తల్లో ఎవరో ఒకరిని ఎంచుకోవలసి వచ్చింది సాహిర్‌కి. అతను తల్లిని ఎంచుకున్నాడు. దాంతో తండ్రి అతనికి ఆస్తిలో వాటా లేకుండా చేశాడు. పైగా తల్లిని చంపేయడమో, సాహిర్‌కు దూరం చేయడమో చేస్తానని బెదిరించాడు. దాంతో తల్లి తన నగలమ్మి సాహిర్‌ కి కాపలాదారులను పెట్టింది. అందువలన సాహిర్‌, అతని తల్లి దరిద్రంలో బతకవలసి వచ్చింది. మొదట్లో ఐశ్వర్యంలో పెరిగి తరువాత పేదరికంలో బతకాలంటే వెలుగులోంచి చీకట్లోకి వచ్చినట్లే. ఈ బాడీగార్డుల మధ్య బందిఖానా బతకడం సాహిర్‌ను ప్రభావితం చేసింది. స్వేచ్ఛావాయువులు పీల్చుకోలేకపోయినందుకు బాధపడేవాడు. 

ఈ దశలో ప్రేమలో పడ్డాడు కానీ దరిద్రం కారణంగా, అతనికి ధైర్యం లేని కారణంగా ప్రేమ ఫలించలేదు. పొట్టనింపుకోవడానికి అతను చిన్నా చితకా ఉద్యోగాలు వెలగబెట్టాడు. ఈ బాధల మధ్య, మనసులో సంఘర్షణ వల్ల ఓ జమీందారు బిడ్డడు ప్రజాకవిగా రూపొందాడు. అప్పటి ప్రసిద్ధ కవులైన ఫైయాజ్‌, మజాజ్‌ల ప్రభావం సాహిర్‌పై వుంది. సౌందర్యం గురించి రాసిన అతని తొలికవిత్వంలో ఫైయాజ్‌ ఛాయలు స్పష్టంగా కనబడతాయి. కానీ అతని వ్యక్తిగత అనుభవాలు, వాళ్ల నాన్నవంటి ధనికుల ప్రవర్తన అతన్ని సమాజానికి వ్యతిరేకంగా తిరగబడేట్లా చేశాయి. అందువల్ల భగ్నప్రేమికుడి కవిత్వంతో బాటు అభ్యుదయ కవిత్వం కూడా అంతే నేర్పుతో రాయగలిగాడు. 'తల్‌ఖియాఁ' అనే అతని కవితా సంకలనం ఉర్దూలో 21 సార్లు, హిందీలో 11 సార్లు ప్రచురించబడింది.  

దేశవిభజన తర్వాత సాహిర్‌ లాహోర్‌కి వెళ్లిపోయాడు. వెళ్లాడే కానీ అక్కడ చుట్టుపట్ల హిందువులెవరూ కనబడకపోవడం అతనికి నచ్చలేదు. అతని స్వతంత్ర భావాలను పాకిస్తాన్‌ ప్రభుత్వం భరించలేకపోయింది. ''సవేరా'' అనే పక్షపత్రికలో అతని కవిత్వం చూసి ప్రభుత్వం అతని పేర వారంటు జారీ చేసింది. అతను ఢిల్లీ వచ్చేసి, తన మిత్రుల సహాయంతో తల్లిని తన వద్దకు తెప్పించుకున్నాడు. ''షా రాహ్‌'', ''ప్రీత్‌ లారీ'' అనే ఉర్దూ పత్రికలకు పనిచేశాడు. ఢిల్లీలో ఓ ఏడాది గడిపి అక్కడినుండి బొంబాయి సినిమారంగానికి చేరుకున్నాడు. అక్కడ ప్రేమ్‌ ధవన్‌ అండ దొరికింది. ప్రేమ్‌ ధవన్‌ సినిమాలో పాటలు రాసేవాడు. సాహిర్‌ను తన యింట్లోనే పెట్టుకుని అతను రాసిన పాటల్ని, పద్యాల్ని నిర్మాతలకు, సంగీతదర్శకులకు చూపించేవాడు. అలా నాలుగునెలలపాటు సాహిర్‌ వాళ్లింట్లోనే వున్నాడు. అనిల్‌ బిశ్వాస్‌ అప్పట్లో ''దో రాహా'' అనే సినిమాకు సంగీతం సమకూరుస్తున్నాడు. ప్రేమ్‌ ధవన్‌ సిఫార్సుతో సాహిర్‌చేత ఒక పాట రాయించుకున్నాడు. తలత్‌ మొహమ్మద్‌ పాడిన 'మొహబ్బత్‌ తర్క్‌ కీ మైనేఁ' అనే ఆ పాట చాలా గొప్పగా వుంటుంది. కానీ సినిమా రిలీజవడం చాలా లేటయింది. 

ఈలోపున 1949లో ప్రగతిశీలక రచయితల సదస్సుకు వెళ్లినపుడు సాహిర్‌కు తనలాటి యితరకవులతో పరిచయం అయిందిసాలీ సర్దార్‌ జాఫ్రీ, మజ్రూ సుల్తాన్‌పురి, కైఫీ ఆజ్మీ, జాన్‌ నిసార్‌ అఖ్తర్‌, ఇస్మత్‌ చుగ్తాయ్‌ - వీళ్లంతా అక్కడే కలిశారు. వాళ్ల మధ్య తన కవిత్వం వినిపించే అవకాశం లభించడంతో సాహిర్‌కు మరింత ఉత్సాహం పుట్టుకు వచ్చింది. ఇతని కవితాప్రతిభ బొంబాయి సినీరంగంలో చాలామందికి తెలిసింది. వాళ్లలో గురుదత్‌ ఒకడు. తనూ, దేవ్‌ ఆనంద్‌ కలిసి తీసే ''బాజీ''లో పాటలు యితనిచేత రాయించుకున్నారు. ఆనాటికే పేరు తెచ్చుకుంటున్న ఎస్‌.డి.బర్మన్‌ సంగీతదర్శకత్వంలో ఆ పాటలు అతి సుందరంగా రూపుదిద్దుకున్నాయి. 1951 ఏప్రిల్‌లో రిలీజైన ఆ సినిమాయే సాహిర్‌కి తొలి సినిమా అని చెప్పాలి. 'తద్‌బీర్‌ సే బిగ్‌డీ హుయూ తక్‌దీర్‌ బనాలే' 'ఆజ్‌ కీ రాత్‌ పియా', 'యే కౌన్‌ ఆయా కి మేరి దిల్‌కీ దునియా మేఁ' (ఇవన్నీ గీతా రాయ్‌ పాడినవి) 'శర్మాయే కాహే' (శంషాద్‌), 'మేరే లబోంపే దేఖో ఆజ్‌ భీ తరానే హై ' (కిశోర్‌) - యివన్నీ హిట్‌ సాంగ్సే! ముఖ్యంగా మొదట చెప్పిన 'తద్‌బీర్‌ సే బిగ్‌డీ' సూపర్‌ సూపర్‌ హిట్‌. 

దీని తర్వాత వచ్చిన ''నౌజవాన్‌''లో (దీని సంగీతమూ ఎస్‌.డి.బర్మనే) లతా పాడిన 'ఠండీ హవాయే లెహరా కే ఆయే' ఇప్పటికీ వినబడుతూనే వుంటుంది. లతాకు కూడా చాలా యిష్టమైన పాట. ఈ సినిమాలు, వాటితోబాటు పాటలూ హిట్‌ కావడంతో సాహిర్‌ వెనక్కి తిరిగి చూసుకోనక్కరలేకపోయింది. బర్మన్‌-సాహిర్‌ జోడీకి పరాకాష్ట ''ప్యాసా'' (1957). అక్కడితో వారి జోడీ భగ్నమైంది కూడా - సంగీతదర్శకుడితో సమానంగా గీత రచయితకు పారితోషికం యివ్వాలన్న సాహిర్‌ పట్టుదల కారణంగా! ''ప్యాసా'' తర్వాత బర్మన్‌ మార్కెట్‌ విలువ విపరీతంగా పెరిగిపోవడంతో సాహిర్‌కు అంత యివ్వలేమనేశారు బర్మన్‌ను బుక్‌ చేసుకున్న నిర్మాతలు. 'అయితే రాయను పొండి' అన్నాడు సాహిర్‌. 

సినిమారంగంలో పాటలు కట్టడానికి రెండు తరహాలు వుంటాయి. గీతం రాసాక, దానికి అనుగుణంగా బాణీ కట్టడం, బాణీ కట్టాక, అది విని ప్రేరితుడై కవి గీతం రాయడం! సాహిర్‌కి రెండో పద్ధతి అస్సలు నచ్చదు. కవిత్వమే మొదట ప్రభవిస్తుందని అతని నమ్మకం. ఇక్కడ తమాషా ఏమిటంటే బెంగాలీ, ఇంగ్లీషు మాత్రమే తెలిసిన ఎస్‌.డి.బర్మన్‌కి  హిందీయే సరిగ్గా రాదు. సాహిర్‌ ఉర్దూ ఏమర్థమయిందో తెలియదు. కానీ అతని కవిత్వానికి అద్భుతమైన ట్యూన్‌లు కట్టి జనాలకు చేరువ చేశాడు.''మునీంజీ'' ('జీవన్‌ కీ సఫర్‌ మే రాహీ'), ''జాల్‌'' ('యేరాత్‌ యే చాంద్‌నీ'), ''టాక్సీ డ్రైవర్‌'' ('జాయే తో జాయే కహాఁ, సమ్‌ఝేగా కౌన్‌ యహాఁ, దర్ద్‌ భరే దిల్‌ కీ జుబాఁ', ) ''దేవదాస్‌''  ('జిసే తూ కుబూల్‌ కర్‌లే'), ''హోస్‌ నెంబరు 44'' ('తేరీ దునియా మే జీనేసే బెహతర్‌హై కి మర్‌ జాయే') ''ఫంటూష్‌'' ('దుఃఖీ మన్‌ మేరే, సున్‌ మేరా కెహ్‌నా, జహాఁ నహీ చైనా, వహాఁ నహీ రెహ్‌నా') ''ప్యాసా'' ('జానే వో కైసే లోగ్‌ థే జిన్‌కే ప్యార్‌కో ప్యార్‌ మిలా, హమ్‌నే తో కలియా మాంగీ, కాంటోంకా హార్‌ మిలా', 'యే దునియా అగర్‌ మిల్‌గయాతో క్యాహై') వీటన్నిటిలోనూ వారిద్దరి గీతసంగీతాలు పడుగుపేకల్లే కలిసిపోయాయి. 

సాహిర్‌ నిర్మాతకు చెప్పేది ఒక్కటే - 'కథ చెప్పు, దృశ్యం ఏమిటో చెప్పు. కాస్త టైమియ్యి. హడావుడి పెట్టకు. మాటలతో యింద్రజాలం చేసి చూపిస్తాను, కాస్తాగు'. ఆయనంటే పడి చచ్చే నిర్మాతల్లో బియార్‌ చోప్డా ఒకరు. తన సినిమాలన్నిటికీ అతని చేతే రాయించుకున్నాడు. (సశేషం)  

(ఫోటోలు-  సాహిర్‌, బిఆర్‌ చోప్డా కాంబినేషన్‌లో వచ్చిన ''ధూల్‌ కా ఫూల్‌''లో మాలా సిన్హా, రాజేంద్ర కుమార్‌)  

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015) 

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?