Advertisement

Advertisement


Home > Articles - MBS

సినీ స్నిప్పెట్స్‌ - జయలలిత కొంటెతనం

సినీ స్నిప్పెట్స్‌ - జయలలిత కొంటెతనం

''ప్రేమలు పెళ్లిళ్లు'' సినిమాలో హీరో పొగరుబోతు భార్యతో వేగలేక, ఆమెతో విడిపోయి మత్తుమందుకు బానిసవుతాడు. హీరో పాత్ర అక్కినేని వేయగా మోడర్న్‌ డ్రెస్సులతో, హెయిర్‌ స్టయిల్‌తో తిరిగే హీరోయిన్‌ పాత్ర జయలలిత వేశారు. డైరక్టరు వి మధుసూదనరావు. అసిస్టెంటు డైరక్టర్లుగా కోదండరామిరెడ్డి, తర్వాతి రోజుల్లో నిర్మాతగా మారిన కె.మురారి పని చేశారు. హీరోయిన్‌కు డైలాగులు చెప్పడం రెడ్డి పని కాగా, డ్రెస్‌ కంటిన్యుటీ చెప్పడం మురారి పని. హైదరాబాదులో షూటింగుకి వచ్చిన జయలలిత రిట్జ్‌ హోటల్లో వుండేవారు. అప్పట్లో ప్రొహిబిషన్‌ వున్నా అది స్టార్‌ హోటల్‌ కాబట్టి బియరు దొరుకుతుందనే ఆశతో మురారి డ్రెస్‌ల గురించి హీరోయిన్‌తో డిస్కస్‌ చేయాలి అంటూ ప్రొడక్షన్‌ కారులో హోటల్‌కి వెళ్లి ఆమెతో కాస్సేపు ఇంగ్లీషులో, తెలుగులో బాతాఖానీ కొట్టి, ఆ తర్వాత నిర్మాత ఖర్చుతో నాన్‌వెజ్‌ వెరైటీలు, బియరు కొట్టి వచ్చేవారు. 

జయలలిత పుస్తకాలు బాగా చదివేవారు. ఓ సారి మురారిని - ''త్యాగయ్య, అన్నమయ్య తెలుగువాళ్లా, తమిళులా?'' అని అడిగారు. ''తెలుగువాళ్లే'' ''వాళ్ల ప్రత్యేకత ఏమిటి?'' (ఇదేమిట్రా యీవిడ టీచర్లా ప్రశ్నలేస్తోంది, సినిమా నటి యిన్ని ప్రశ్నలడగడమంటే అహంకారప్రదర్శనే అని మురారి అప్పుడు అనుకున్నా ''గోరింటాకు'' షూటింగు వాళ్లింట్లో చేసిన సందర్భంలో జయలలిత లైబ్రరీ చూశాక ప్రపంచం చాలా చిన్నదనిపించిందట) మురారి మాట్లాడలేదు. ''త్యాగరాజు తెలుగువాడైనా తమిళనాడులో పుట్టి పెరిగి కీర్తనలన్నీ తెలుగులో రాశారు., అదిసరే భారతియార్‌ తెలుగు గురించి రాసింది తెలుసా?'' అని జయలలిత అడిగారు. ''తెలియదు.'' ''భారతియార్‌ తమిళకవి అయినా తెలుగు భాషను పొగిడారు. తెలుగు మ్యూజికల్‌ లాంగ్వేజి అంటారు. అజంత భాష కాబట్టి కాబోలు. ఆయన 'సుందర తెలుంగినిల్‌ పాట్టు యిసైప్పోమ్‌..' అన్నారు. ఇది ఒక పాటలో మధ్యలో వస్తుంది. ఆ పాట ఏదో తెలుసుకుని నాకు చెప్పండి. ఛానెల్‌-5 సెంటు బాటిల్‌ బహుమతిగా యిస్తా.'' అని అంటూనే 'సరే ముందే యిచ్చేస్తున్నా, ఆన్సర్‌ మాత్రం రేపు చెప్పండి'' అందామె. ఆవిడ కోసం మురారి ఇంగ్లీషులోకి తర్జుమా చేసిన భారతియార్‌ గీతాలు చదివి జవాబు తెలుసుకున్నారు.

ఓ సారి జయలలిత మురారిని ''ఇంగ్లీషులో మీకు యిష్టమైన రచయితలు ఎవరు?'' అని అడిగితే మురారి ''పిక్చర్‌ ఆఫ్‌ డోరియన్‌ గ్రే'', ''ఆఫ్‌ హ్యూమన్‌ బ్యాండేజ్‌'', ''రెబెకా'' నవలల పేర్లు చెప్పి రెబెకాలో ఒక భార్య తన భర్తను ఎలా వేధించిందో వివరించి, యీ సినిమాలో మీ పాత్రకు, ఆ పాత్రకు పోలిక వుంది అన్నారు. ''..ఇంకా?''

''ఆఫ్‌ హ్యూమన్‌ బ్యాండేజ్‌''లో హీరో ఫిలిప్‌ ప్రేమించాననుకున్న మిల్డ్రెడ్‌ పాత్రకు కూడా మీ పాత్రకు పోలిక వుంది. అయితే ఆమెను పాశవికంగా, వేశ్యగా రచయిత మలిచాడు. మీ విషయంలో అంత చేటుగా చేయలేదు..''

జయలలిత కాస్సేపు వూరుకుని ''నా పాత్రను మిల్డ్రెడ్‌ పాత్రలా ఎందుకు మలచలేదు?'' అని అడిగారు.

''అలాటి పాత్రల్లో స్త్రీలను భరించే శక్తి యీ నాటి సగటు మనిషికి వుందని అనుకోను. ముఖ్యంగా స్త్రీలకు నచ్చని సినిమా ఆడదు'' అన్నారు మురారి. జయలలిత సాలోచనగా తల వూపారు.

ఇంత పాండిత్యం వున్నా ఆమెలో ఆకతాయితనం కూడా వుండేది. మురారి హోటల్లో తన రూముకి రాగానే ''సీన్‌ ఏమిటి?'' అని అడిగేది. డ్రెస్‌ కంటిన్యుటీ దగ్గర చర్చలు మొదలుపెట్టేది. ఈయన్ని తికమక పెట్టేది. ఒకరోజు 'లొకేషన్‌ మారింది కదండీ, హెయిర్‌ స్టయిల్‌, డ్రస్సు ఎందుకు మారకూడదు?'' అని అడిగింది కావాలని. ఇతను 'అవును, మారవచ్చు' అన్నాడు. అంతే, మర్నాడు జయలలిత చింపిరి జుత్తుతో నడుముకి కాస్త క్రిందగా వుండే మోడర్న్‌ డ్రెస్‌తో సెట్‌లోకి వచ్చింది. చూడగానే మురారికి భయం వేసింది. రెడ్డి పరిగెత్తుకుని వచ్చి ''ఇదేమిటి? డ్రెస్‌ కంటిన్యుటీ వుంది కదా, యిలాంటి బట్టలు వేసుకుని వచ్చిందేమిటి? డైరక్టరు గారికి అసలే ముక్కు మీద కోపం.'' అన్నారు. మురారి ''ఏదో డ్రస్సు కాస్త మార్చుకుంటానంటే సరే అన్నా, యిలా వేసుకువస్తుందని నాకేం తెలుసు?''అని చెప్పి ''అయినా యింతకు ముందు సీను నైట్‌లో కదా, యిప్పుడు యీ సీను పగలు కదా, రాత్రి వేసుకున్న డ్రెస్సే పగలు ఎందుకు వేసుకుంటారు? మార్చుకుంటారుగా'' అని వాదించారు. నిజానికి యీ సీను కూడా నైట్‌ ఎఫెక్ట్‌ లోనే. కానీ తన చర్మం కాపాడుకోవడానికి మురారి అర్జంటుగా అబద్ధం ఆడేశారు. నీ చావు నువ్వు చావు అని రెడ్డి విసుక్కుని వెళ్లిపోయారు. 

డైరక్టరు వచ్చి సీన్‌ కాగితం చదువుకుంటున్నారు. లైటింగు ఏర్పాట్లు జరుగుతూంటే జయలలిత మేకప్‌ రూం నుంచి వయ్యారంగా  ఫ్లోర్‌లోకి నడుచుకుంటూ వచ్చారు. షాట్‌ రెడీ అయిన తర్వాత వెళ్లి పిలిస్తే కానీ ఏ రోజూ బయటకు రాని ఆమె, యివాళ తనంతట తనే బయటకు వచ్చిందంటే మురారిని ఆటపట్టించడానికే అని రెడ్డికి, మురారికి అర్థమైంది. మురారి అటు చూడకుండా క్లాప్‌ బోర్డు రెడీ చేసుకుంటున్నట్టు నటించేస్తున్నారు. డైరక్టరు ఆమెను చూసి తెల్లబోయి ''ఇదేం డ్రెస్‌?'' అని అడిగారు. 

ఆమె చాలా వినయంగా ''మురారిగారు చెప్పారు'' అంది, తన తప్పేమీ లేనట్లు. డైరక్టరు మురారి కేసి ఉగ్రంగా చూడగానే మురారి ''కంటిన్యుటీ లేదుగా. పైగా చిన్న సీను. అందులోనూ పొగరుబోతు. చూడగానే యిలాంటి పెళ్లాం పగవాడికి కూడా వద్దురా అన్న భావం రావాలి. ఈ విగ్‌ యింతవరకూ వేసుకోలేదని ఆవిడ అంటే సరే అన్నా'' అని దబాయింపు మొదలెట్టారు.

''ఈ సీన్‌ కంటిన్యుటీ కాదని నీకెవరు చెప్పారు?'' అని డైరక్టరు అరిచారు.

''ఇంతకు ముందు సీన్‌ నైట్‌ ఎఫెక్టు. ఇది పగలు కదా, కంటిన్యుటీ ఎలా అవుతుంది?'' అని అడ్డంగా వాదించారు మురారి.

''ఒరిజినల్‌ సీను తీసుకురా..''

''సీను లేదు. ఆత్రేయగారు రాత్రి ఫోన్‌లో డైలాగు చెప్పారు.'' అని అబద్ధం ఆడేశారు మురారి, ఆత్రేయ అలవాటును అలా వుపయోగించుకుని.

డైరక్టరుకి అర్థమైంది మురారి తెలివిగా సమర్థించుకుంటున్నాడని. ఇదంతా చూసి జయలలితకు నవ్వాగలేదు. 

ఆమె నవ్వితే అంతా వింతగా చూశారు. ఆమె అక్కినేనికి, డైరక్టరుకి మెల్లిగా నవ్వుతూ అసలు విషయం చెప్పింది. వాళ్లూ నవ్వారు. మురారి కేసి చూసి మళ్లీ నవ్వారు. మురారిని ఆటపట్టించడం అయిపోయాక జయలలిత సరైన డ్రస్సు వేసుకోవడానికి మేకప్‌ రూంకి వెళ్లినపుడు అక్కినేని మురారిని పిలిచి ''డ్రెస్‌ కంటిన్యుటీ చెప్పడానికి రిట్జ్‌ హోటల్‌ దాకా వెళుతున్నావా పాపం?'' అని వెక్కిరించేసరికి మురారి దొంగనవ్వు నవ్వి దణ్ణం పెట్టారు. ఆ సాయంత్రం షూటింగు జరిగిపోయాక ఆ వుదంతానికి గుర్తుగా మురారి, రెడ్డి జయలలిత విగ్గులు పెట్టుకుని ఫోటోలు దిగుదామనుకున్నారు. వెళ్లి అడిగితే జయలలిత ఎందుకు అని అడిగి, వీళ్లు చెప్పిన కారణం విని నవ్వుకుని తన అసిస్టెంటుకి చెప్పి విగ్గు యిమ్మనమంది. ఈ విషయాలన్నీ మురారి తన ఆత్మకథ ''నవ్విపోదురు గాక..''లో రాశారు. (సశేషం) 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2015)  

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?