Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సినీ స్నిప్పెట్స్‌- గీతా బాలి

ఎమ్బీయస్‌: సినీ స్నిప్పెట్స్‌- గీతా బాలి

షమ్మీ కపూర్‌ భార్య గీతా బాలి. ఆమె ఒక నటీమణి. పృథ్వీరాజ్‌ కపూర్‌ సినిమాలలోకి వచ్చినా కులీనవంశానికి చెందినవాడు. అతని తాతముత్తాతలు దివాన్‌లుగా పనిచేసేవారు. అందువల్ల పెద్ద కొడుకు రాజ్‌ కపూర్‌ను సినిమా నటుణ్ని చేసినా, కోడలుగా పెద్దింటి అమ్మాయిని తెచ్చుకున్నాడు. రెండో కొడుకు షమ్మీ ఓ సినిమా నటీమణిని చేసుకుంటానంటే ఒప్పుకోలేదు. చాలా తర్జనభర్జనలయ్యాక ఒప్పుకోవలసి వచ్చింది. 

కొంతకాలానికి రాజ్‌ కపూర్‌ పెద్ద కొడుకు రణధీర్‌ కపూర్‌ కూడా బబిత అనే సినిమా నటిని పెళ్లాడతానన్నాడు. తండ్రీ, తాత యిద్దరూ ఒప్పుకోలేదు. షమ్మీ భార్య పంజాబీ అయితే ఈమె సింధీ. అప్పుడు రణధీర్‌కిి అండగా నిలిచినది షమ్మీయే! చివరికి పెద్దవాళ్లు ఒప్పుకోవలసి వచ్చింది. ఈ గొడవల మీద రణధీర్‌ కపూర్‌ ''కల్‌ ఆజ్‌ ఔర్‌ కల్‌'' అనే సినిమా డైరక్ట్‌ చేసి తనతోబాటు తండ్రి, తాతలచేత దానిలో నటింపజేశాడు. సరసన భార్య ఎలానూ వుంది. ఆ సినిమా నిర్మించినది తండ్రి రాజ్‌ కపూరే! ఇది జరిగిన కొన్నాళ్లకి రణధీర్‌ తమ్ముడు ఋషి కపూర్‌ తన సహనటి నీతూ సింగ్‌ను పెళ్లాడతానన్నాడు. గీతా, బబిత విషయాల్లో వీళ్లు సినిమాల్లోకి వచ్చినా వారి నేపథ్యం మచ్చలేనిదేే. కానీ నీతూ విషయంలో అలా కాదు. వాళ్లమ్మ ఈమెను సినిమాలలోకి ప్రవేశపెట్టడానికి  ఈమె చేత అసభ్యంగా ఫోటోలు తీయించి, పత్రికల్లో వేయించింది. వాళ్ల నాన్న ఏ విలువా లేనివాడు. మళ్లీ తర్జనభర్జనలు, చివరకి ఒప్పుకోవడాలు జరిగాయి. ఇలా జరిగినా ఋషి-నీతా వివాహం యిప్పటిదాకా సవ్యంగానే సాగింది. రణధీర్‌-బబిత విడిపోయారు.  షమ్మీ-గీతా వివాహం ఆమె అకాలమరణంతో విషాదమయమైంది. అతను ద్వితీయ వివాహం చేసుకోవలసి వచ్చింది.

ఈ విధంగా కపూర్ల కుటుంబంలో తారామణులు కోడళ్లుగా రావడానికి తెరతీసినవాడు షమ్మీయే. ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో  గీతా బాలి  ఆహుతి కావడం అతన్ని కలచివేసింది. రెండో పెళ్లి చేసుకున్నా గీతా కుటుంబంతో సంబంధబాంధవ్యాలు కొనసాగించాడు. గీతా అక్క కూతురు యోగితా బాలి కొన్నాళ్లకు సినిమాలలో ప్రవేశిద్దామని అనుకుంది. ఆమెను తన మిత్రుడు, ఈగిల్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాత ఎఫ్‌.సి.మెహ్రాకు పరిచయం చేసి వారి ''పర్దే కే పీఛే'' (1971) ద్వారా ఆమెను సినీరంగ ప్రవేశం చేయించాడు. కొన్ని రోజులు పోయాక ఆమె నటగాయకుడు కిశోర్‌ కుమార్‌ను పెళ్లి చేసుకుంటానంది. అప్పటికే కిశోర్‌ చేసుకున్న రెండు పెళ్లిళ్లు భగ్నమయ్యాయి. ఈ పెళ్లి అట్టహాసంగా కాకుండా రహస్యంగా, సిఖ్కు సంప్రదాయబద్ధంగా జరగాలని ఆమె కోరుకుంది. (యోగితా బాలి పంజాబీ సిఖుక్కు కాగా, కిశోర్‌ బెంగాలీ బ్రాహ్మణుడు). అప్పుడు ఆ పెళ్లిలో షమ్మీ పూర్‌ ఆమె తండ్రి స్థానంలో కన్యాదానం చేశాడు.

దేవ్‌ ఆనంద్‌, గురుదత్‌ మిత్రులు. దేవ్‌, అతని అన్న చేతన్‌ కలిసి నవకేతన్‌ సంస్థ స్థాపించారు. వాళ్ల మొదటి సినిమా ''అఫ్సర్‌'' చేతన్‌ ఆనంద్‌ నిర్వహణలోనే నడిచింది. తర్వాతి సినిమా ''బాజీ''(1951) కి దేవ్‌ తన మిత్రుడు గురుదత్‌ను డైరక్టరుగా తీసుకునివచ్చాడు. బలరాజ్‌ సహానీ కథకు కాస్త మార్పులు చేసి గురుదత్‌ దాన్ని విజయవంతమైన సినిమాగా మలచాడు. ఆ సినిమాలో దేవ్‌ ఆనంద్‌ సరసన హీరోయిన్‌గా వేసినది గీతా బాలి. ఆ సినిమా విజయవంతం కావడంతో టి.ఆర్‌. ఫతేచంద్‌ అనే ఓ సింధీ ఆయన అదే కాంబినేషన్‌లో ''జాల్‌'' (1952) సినిమా తీయడానికి ముందుకు వచ్చాడు. కథ, స్క్రీన్‌ప్లే, డైరక్షన్‌ గురుదత్‌ది కాగా, హీరో హీరోయిన్లు దేవ్‌, గీతాలు. అదీ హిట్‌ అయింది. గురుదత్‌ దర్శకత్వ ప్రతిభ చూసి గీతా బాలి యీసారి మనమే భాగస్వాములుగా సినిమా తీయవచ్చుగా అంది. 

గీతా సోదరి పేరు హరిదర్శన్‌ కౌర్‌. నిర్మాతగా ఆమె పేరు వేశారు. ఆమె పేరులో 'ఎచ్‌', గురుదత్‌లో పేరులో 'జి' తీసుకుని ఎచ్‌.జి. ఫిలింస్‌ పేరుతో ''బాజ్‌'' (1953) అనే సినిమా ప్లాను చేశారు. 16 వ శతాబ్దంలో మలబార్‌ తీరంపై దాడి చేసిన పోర్చుగీసులపై తిరగబడడానికి స్థానిక యువరాజు సహాయం తీసుకున్న సముద్రపు దొంగల రాణి కథ అది. విప్లవకారిణిగా గీతా బాలిని అనుకుని హీరోగా ఎవరా అని వెతికారు. దేవ్‌ ఆనంద్‌ అప్పటికే స్టార్‌ అయిపోవడంతో అతనికి మార్కెట్‌ రేటు యిస్తే సినిమా బజెట్‌ దాటిపోతుంది. అందుకని సజ్జన్‌ (దరిమిలా విలన్‌గా వేషాలు వేశాడు) లేదా శేఖర్‌ అనుకున్నారు. వాళ్లెందుకు? నువ్వే ఎందుకు వేయకూడదు? అన్నారు గురుదత్‌తో గీతా బాలి, ఆమె సోదరి. 

గురుదత్‌కి నాట్యం వచ్చు. అప్పటికి చిన్నా, చితకా వేషాలు వేశాడు. అయినా అవన్నీ వదిలిపెట్టి డైరక్షన్‌వైపుకి దృష్టి మరలించాడు.  ఈ సమయంలో సినిమా బజెట్‌ తగ్గించడం కోసం తనను వేయమంటున్నారన్న సందేహం అతనిది. ఓ పట్టాన ఒప్పుకోలేదు. గీతా బాలి దగ్గరుండి అతన్ని చాలా ప్రోత్సహించి వేయించింది. అంతేకాదు ఈ సినిమాకు సంగీతం యివ్వడానికి ఎస్‌.డి.బర్మన్‌ నిరాకరించినప్పుడు ఓ.పి.నయ్యర్‌ను, పాటలు రాయడానికి మజ్రూహ్‌ను తీసుకోమని సలహా యిచ్చింది. గురుదత్‌ ఈ సినిమాలో అంత బాగా నటించలేకపోయినా తర్వాత, తర్వాత సినిమాల్లో అద్భుతమైన నటన ప్రదర్శించాడు.  ఆ సినిమాలు హిట్‌ అయ్యాయి కూడా.

ఈ సినిమా తీస్తూండగానే 'బియమ్‌టి 112' అని ఓ టాక్సీడ్రైవర్‌ కథ, 'గీతాంజలి' అనే మరో కథ సినిమాగా తీస్తామని నిర్మాతలు ప్రకటించారు. కానీ ఈ సినిమా ఫ్లాప్‌ కావడంతో అవన్నీ మూలపడ్డాయి. అప్పట్లోనే లక్షన్నర నష్టం వచ్చింది. గీతా బాలి అప్పట్లో సినిమాకి తీసుకునే పారితోషికం పాతిక వేలు. ఎన్ని సినిమాలలో నటిస్తే ఈ నష్టం పూరేను? అందువల్ల ''బాజ్‌'' తర్వాత  వారు కలిసి సినిమాలు తీయలేదు. (సశేషం) (ఫోటోలు-   01. కిశోర్‌-యోగితాలకు సిఖ్కు సంప్రదాయంలో జరిగిన పెళ్లిలో కన్యాదాతగా షమ్మీ కపూర్‌ (ఎడమవైపు గడ్డం వున్న వ్యక్తి)  02 - గురుదత్‌, గీతా బాలి హీరో హీరోయిన్లుగా నటించి పెట్టుబడి పెట్టిన ''బాజ్‌'' 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2015) 

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?