Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సినీ స్నిప్పెట్స్‌- గీతా దత్‌- 1

గురుదత్‌, వహీదాల పేర్లు తలచుకోగానే, ఆ త్రికోణంలో మరో కోణం గీతా దత్‌ వెంటనే గుర్తుకు వస్తుంది. లతా, ఆశాల గొంతులకు భిన్నంగా తనకంటూ ప్రత్యేకమైన హస్కీ వాయిస్‌తో పాడి లక్షలాది అభిమానులను సంపాదించుకున్న గాయని గీతాదత్‌. ఆమె ఎక్కువ సంఖ్యలో పాటలు పాడకపోయినా, పాడిన పాటలు మాత్రం ఆమె అభిమానులు ఎన్నటికీ మరువలేనివే!  అంత గొప్ప గాయని అయితే అన్ని తక్కువ పాటలు మాత్రమే పాడడమేం? అని మీరడగవచ్చు. నిజానికి ఆమె జీవితగాథ ఆమె పాడిన ఏ గొప్ప విషాదగీతానికి తీసిపోదు. ఆమె జీవించినది 41 సంవత్సరాలు మాత్రమే! 1930 నవంబరులో పుట్టిన ఆమె 1972 జులైలో మరణించింది. మితిమీరిన తాగుడు వల్ల ఆమె లివర్‌కి సిరోసిస్‌ వచ్చింది. 

ఆమె భర్త అంతకుముందే వ్యక్తిగత కారణాల వల్ల 1964లో ఆత్మహత్య చేసుకున్నాడు. వారి వైవాహిక జీవితమంతా ఒడిదుడుకులమయం. భార్యాభర్తలిద్దరూ సినీరంగానికి చెందినవారే కాబట్టి ఇద్దరిలో ఈర్ష్యాసూయలు కలిగివుంటాయని ''అభిమాన్‌'' సినిమాలోలా అతను యీమె కంటె బాగా పాడలేక హింసించి వుంటాడని అనుకుంటే పొరబాటు. అతను గాయకుడు కాదు. దర్శకనిర్మాత. నటుడు కూడా. మరి యిద్దరి మధ్య సంఘర్షణ ఎందుకు? ఇది ఈమెకు యిష్టంలేని పెళ్లా? అబ్బే, ప్రేమవివాహమే!

గీతా దత్‌ కష్టాలన్నిటికీ మూలకారణం పెళ్లి కాబట్టి అక్కడే కథ మొదలుపెడదాం. వివాహానికి పూర్వం గీతా దత్‌ ఇంటిపేరు రాయ్‌. గీతా రాయ్‌ అనే పేరుతోనే అనేక సినిమాలలో పాటలు పాడింది. ప్రఖ్యాత దర్శక నిర్మాత గురు దత్‌తో 1953లో పెళ్లి అయిన తర్వాత ఆమె గీతా దత్‌ అయింది. స్త్రీలకు పెళ్లి అయిన తర్వాత పుట్టింటి పేరు బదులు భర్త ఇంటిపేరు వస్తుందనే సాంప్రదాయం ప్రకారమయితే ఆమె 'గీతా పడుకొనే' కావాలి. కానీ ఆమె భర్త అసలు పేరులో కొంతభాగం స్వీకరించి గీతాదత్‌ అయింది.

దత్‌ అనే ఇంటిపేరు బెంగాలీలలో, పంజాబీలలో ఉంది. (సునీల్‌ దత్‌ పంజాబీ, ఉత్పల్‌ దత్‌ బెంగాలీ). అందువల్ల గురుదత్‌ బెంగాలీ అని చాలామంది పొరబడతారు. కానీ అతను కర్ణాటకకు చెందిన సారస్వత బ్రాహ్మణ కులానికి చెందినవాడు. శ్యామ్‌ బెనగల్‌కు కజిన్‌. గీతా రాయ్‌ తల్లిదండ్రులు గురు దత్‌కు వివాహానికి అడ్డు చెప్పడానికి కారణాలలో ఒకటి - అతను బెంగాలీ కాకపోవడం.

 గురుదత్‌ దర్శకత్వం వహించిన ''బాజీ'' (1951) ముహూర్తం నాడు గురుదత్‌ కుటుంబాన్ని కలిసేనాటికే గీతా రాయ్‌ అనేకమంది కంపోజర్స్‌ వద్ద పనిచేసి పేరు తెచ్చుకుని ఉంది. ఆ రోజు ముహూర్తం షాటుగా ''తబ్‌దీర్‌ సే బిగ్‌డీ హుయీ'' పాటను గీతాబాలి పై చిత్రీకరిస్తున్నారు. ఆ పాట గీతారాయ్‌ పాడినదే. ఆ పాట రికార్డింగు టైములో ఆమెను చూసిన గురుదత్‌ మనసు పారేసుకున్నాడు. 

తను ప్రసిద్ధ గాయకురాలయినా, అప్పటికి గురుదత్‌ పేరులేని దర్శకుడయినా ఆమె గురుదత్‌ను అభిమానించింది. వాళ్ల ఇంటికి తరచుగా వస్తూ పోతూ ఉండేది. కానీ ఆమె సంపాదనపై ఆధారపడిన తల్లిదండ్రులు ఆమె వివాహానికి సమ్మతించలేదు. దాంతో వారి వివాహానికి మూడేళ్లు ఆలస్యమయింది. ఈ లోపుల గురుదత్‌ తీసిన ''బాజీ'', ''జాల్‌'' హిట్‌ అయ్యాయి. ''బాజ్‌'' ఫెయిలయింది. చివరికి గురుదత్‌ గీతాను కల్యాణ్‌లోని హాజీ మలాంగ్‌ బాబా సమాధి వద్దకు తీసుకెళ్లి ''నన్ను పెళ్లి చేసుకుంటావో, మీ అమ్మానాన్నా చెప్పిన ఆ బెంగాలీ కుర్రాణ్ని చేసుకుంటావో తేల్చి చెప్పు'' అన్నాడు. గీతా తల్లిదండ్రులను ఎదిరించింది. వాళ్లు దిగిరాక తప్పలేదు.

1953 మే 26న వాళ్ల వివాహం సాంప్రదాయ బెంగాలీ పద్ధతిలో జరిగింది. పెళ్లికి దేవ్‌ ఆనంద్‌, వైజయంతిమాల, నూతన్‌, మోతీలాల్‌ ఇత్యాదులు వచ్చారు. ఈ ప్రేమవివాహం పట్టుమని పదేళ్లు కూడా సవ్యంగా సాగలేదు. గీతా దత్‌ జీవితం ఏ సినిమాకథకూ తీసిపోదు. 1930లో నవంబరు 23న ఆమె ఫరీద్‌పూర్‌లో పుట్టింది. ఆ వూరు ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో వుంది. ఆమె తండ్రి దేవేంద్రనాథ్‌ రాయ్‌ చౌధురి బాగా డబ్బున్న జమీందారు. ఆమె తల్లి అమియాకు కవిత్వం అంటే ప్రాణం. చిన్నప్పుడు ఆమె పాటలపై ఆసక్తి కనబడరచడం చూసి తలిదండ్రులు ఆమెకు పండిట్‌ హీరేంద్రనాథ్‌ చౌధురి వద్ద సంగీతం నేర్పించారు. పదేళ్ల పిల్లగా వుండగానే ఆమె శ్రద్ధగా సంగీతం అభ్యసించడం చూసి తలిదండ్రులు మురిసిపోయేవారు.  

ఇంతలో 1942 క్విట్‌ యిండియా ఉద్యమం వచ్చింది. బెంగాల్‌లో సమస్యలు వచ్చిపడ్డాయి. చేతికి అందినంత మేర తీసుకుని తట్టాబుట్టా నెత్తిని పెట్టుకుని బయటపడవలసి వచ్చింది. రాయచౌధురిల కుటుంబం కూడా భూములు యిక్కడ వదిలేసి బొంబాయికి తరలి వెళ్లవలసి వచ్చింది. హఠాత్తుగా ఓడలు బళ్లయ్యాయి. ఆ వరుసలో ఆమె సంగీతపాఠాలపై బ్రేకు పడింది. అయితే అప్పటికే గీతా సంగీతంపై పట్టు సంపాదించుకుంది, హార్మోనియం వాయించగలిగే స్థాయికి చేరుకుంది. అందువల్ల తమ యింటి సెకండ్‌ ఫ్లోర్‌లో హార్మోనీ వేసుకుని కూచుని సంగీతసాధన చేసేది. 

ఒకరోజు ఆమె వాయిస్‌ ఆ సెకండ్‌ ఫ్లోర్‌నుండి గాలిలో తేలుతూ పోయి కింది అంతస్తులో హనుమాన్‌ ప్రసాద్‌ ఆయన చెవిలో పడింది. ఆయన సినిమాలకు సంగీతం సమకూరుస్తాడు. ఈమె పాటకు ముగ్ధుడైన ఆయన యీవిడకు ఛాన్సు యివ్వడం సైతం జరిగింది. ఆ విధంగా ''భక్త ప్రహ్లాద'' (1946) నాటి సినిమాలో ఓ పాటలో రెండు లైన్లు పాడడం ద్వారా గీతా చిత్రరంగ ప్రవేశం జరిగింది. మామూలు పరిస్థితుల్లో ఆమె తలిదండ్రులు సమ్మతించేవారో లేదో కానీ ఆర్థిక దుస్థితి వారిని సరేననిపించింది.  అప్పట్లో ఆమె పేరు గీతా రాయ్‌. 

ఒక్కసారి ఆమె గొంతు విన్నవారెవరూ మర్చిపోలేరు. అందుకు మొదటి సినిమా తర్వాత ఆమెకు ఆరునెలల్లో ఆరు సినిమాలు వచ్చాయి. అయితే ఆ సినిమాలు గానీ, సినిమా పాటలు గానీ యిప్పుడెక్కడా దొరకటం లేదు. సినిమారంగంలో నిలదొక్కుకుంటున్న మరొక బెంగాలీ - సచిన్‌దేవ్‌ బర్మన్‌ ఈమెలో సానబట్టిన వజ్రాన్ని చూశాడు. తను చేయవలసినదల్లా పట్టుకెళ్లి షోకేస్‌లో పెట్టడమే అనుకున్నాడు. ''దో భాయ్‌'' (1947) అనే సినిమాలో పాడించాడు. దీనిలోనే ఆమె తొలి హిట్‌ సాంగ్‌ 'మేరా సుందర్‌ సప్‌నా టూట్‌ గయా' రూపు దిద్దుకున్నది. అప్పటికి ఆమె వయస్సు 17 సంవత్సరాలే. ఇంత చిన్న పిల్లేం పాడుతుంది? అంటున్న ప్రొడ్యూసర్‌ మాటను లక్ష్యపెట్టక బర్మన్‌ పాడించాడు; గీతా రాయ్‌ కెరియర్‌కు పునాది వేశాడు. దీనిలోనే యింకో మంచి పాట 'యాద్‌ కరోగే యాద్‌ కరోగే, యిక్‌ దిన్‌ హమ్‌కో యాద్‌ కరోగే'!

ఇక దాంతో పేరున్న సంగీతదర్శకులంతా ఆమెను పిలవసాగారు. సి. రామచంద్ర, ఘులామ్‌ హైదర్‌, గ్యాన్‌ దత్‌, హన్స్‌రాజ్‌ బెహల్‌.. యిలా... వీటితో బాటు మరిచిపోదగ్గ పాటలూ వున్నాయి. అయితే అతి త్వరలోనే ఈ ఫేజ్‌ మారిపోయి, గీతా పాడిన ప్రతీపాటా హిట్‌ అయ్యే యుగం వచ్చింది. ఆమె 'తక్‌దీర్‌' మారే రోజు వచ్చింది.

1950లో ఎస్‌.డి.బర్మన్‌ గురుదత్‌ సినిమా ''బాజీ''కి సంగీతదర్శకత్వం వహిస్తున్నాడు. గీతా చేత ''తద్‌బీర్‌ సే బిగడీ హుయీ తక్‌దీర్‌ బనాలే'' అని ఓ సాంగ్‌ పాడిస్తున్నాడు. ఆ రికార్డింగు సమయంలోనే గురుదత్‌ గీతాను చూసి మనసిచ్చాడు. గురుదత్‌ తొలిప్రేమ 19వ యేటనే మోసులు వేసింది. పూనాలో ప్రభాత్‌ స్టూడియోలో పనిచేసే రోజుల్లో విజయ అనే డాన్సర్‌ను ప్రేమించాడు. (గురుదత్‌ కూడా మంచి డాన్సర్‌). ఆమెకు ఒక వివాహితుడితో కూడా ఎఫయిర్‌ ఉంది.ఈ విజయ తన భర్తజోలికి రాకుండా చూడాలని ఆ పెద్దమనిషి భార్య ప్రయత్నించేది. దానిలో భాగంగానే ఆ అమ్మాయిని పెళ్ళి చేసేసుకోమని గురుదత్‌ను ప్రోద్బలం చేసేది. మొత్తానికి పెళ్లి జరక్కుండానే ఆ ఎఫయిర్‌ ముగిసి పోయింది.

ఇది విన్న గురుదత్‌ తల్లి వాసంతి పడుకొనే హైదరాబాద్‌లో ఉన్న తన కజిన్‌ కూతురు సువర్ణ అనే అమ్మాయితో గురుదత్‌ వివాహం నిశ్చయించింది. గురుదత్‌ సరేనన్నాడు. ఆ అమ్మాయితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేడు. పెళ్లి దగ్గరపడుతోందనగా ఈ విజయ వ్యవహారం సువర్ణకు చెప్పడం భావ్యమనుకున్నాడు గురుదత్‌. ఆ విషయం వివరంగా రాశాడు. దెబ్బకి ఆమె తల్లిదండ్రులు పెళ్లి కాన్సిల్‌ చేసేశారు. గురుదత్‌ ఫీలయ్యాడో లేదో ఎవరికీ తెలియదు కానీ మళ్లీ అతను ప్రేమ జోలికి పోలేదు - 1950లో గీతా రాయ్‌ను కలిసేదాకా! చూడగానే, వినగానే గుమ్మయిపోయాడు. గీతా కూడా అతని ప్రేమకు స్పందించింది. 

ఇది గీతా జీవితంలో అత్యంత ఆనందదాయకమైన సమయం. డబ్బు, కీర్తి ఎలాగూ గడిస్తోంది. వీటితో బాటు ప్రేమించే హృదయాన్ని కూడా గెలుచుకుంది. నిజానికి అప్పటికి గురుదత్‌ యింకా స్థిరపడలేదు. విజయాన్ని చవి చూడలేదు. అయినా ఆమె పట్టించుకోలేదు. అతన్ని వలచింది. అతను ఆమె డబ్బు కోసమే వెంట పడ్డాడని, తనకు డబ్బు రాగానే ఆమెను నిర్లక్ష్యం చేశాడని కొందరు అన్నారు.  ''డబ్బుకోసమే గీతాను మా అబ్బాయి వరించాడని అనుకున్నారు కానీ ఆమె డబ్బుని మావాడు ఎన్నడూ తాకనైనా తాకలేదు. ఆమె డబ్బు ఎలా ఖర్చు పెట్టిందో అడగలేదు.'' అని అంది అతని తల్లి వాసంతి పడుకొనే.

గురుదత్‌, గీతా రాయ్‌ల ప్రణయం మూడేళ్లు సాగింది. ''బాజీ'' సినిమా కూడా హిట్‌ అయింది. గురుదత్‌ తన తర్వాతి సినిమా 'బాజ్‌' ప్లాన్‌ చేశాడు. ఈ లోపున ఓపి నయ్యర్‌ ఆమెకు మంచి హిట్స్‌ యిచ్చాడు. నిజానికి అతను సంగీతం యిచ్చిన ''ఆస్మాన్‌'' (1952) ఫెయిలయిపోయినా, దానిలో గీతా పాడిన 'దిల్‌ హై దీవానా' పాట మాత్రం చాలా బాగా వచ్చింది. 'దేఖో జాదే భరే మోరె నైన్‌' కూడా బాగుంటుంది. అయినా నయ్యర్‌ సినిమా ఫ్లాప్‌ అయింది కాబట్టి తన తరువాతి చిత్రం ''ఛమ్‌ ఛమా ఛమ్‌'' లో గీతా బదులు ఆశాను తీసుకున్నాడు. అదీ దెబ్బ తింది. నయ్యర్‌ తనను రిపీట్‌ చేయలేదని గీతా మనసులో ఏమీ పెట్టుకోకుండా 'బాజ్‌'కు నయ్యర్‌ను గురుదత్‌కు రికమెండ్‌ చేసింది. 'బాజ్‌' సినిమాలో  మంచి పాటలున్నాయి. అయినా నయ్యర్‌ దురదృష్టమో ఏమో యీ సినిమా కూడా ఫెయిలయ్యింది.  (సశేషం) (ఫోటోలు-  గీతా దత్‌, ''బాజీ'' ) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2015) 

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?