Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సినీ స్నిప్పెట్స్‌ - సావిత్రి

ఎమ్బీయస్‌ : సినీ స్నిప్పెట్స్‌ - సావిత్రి

''మిస్సమ్మ'' సినిమాలో కథానాయిక పాత్ర వేయడంతో సావిత్రికి మంచి పేరు వచ్చింది. అసలా పాత్ర భానుమతి వేయవలసింది. సావిత్రికి యిచ్చినది జమున పాత్ర. నాలుగు రీళ్లు షూటింగు పూర్తయ్యాక భానుమతి షూటింగుకు లేటుగా వచ్చారు. ఇంట్లో పూజ కారణంగా ఆలస్యంగా వస్తానని ముందు రోజే ఆవిడ లేఖ రాసి పంపారు. చక్రపాణి గారి అసిస్టెంటు పొరపాటు వలన ఆయనకు కబురు తెలియలేదు. భానుమతి చెప్పలేదని అపోహపడి, ఆగ్రహంతో ఆమెను ఆ పాత్ర నుంచి తొలగించడమే కాక, అప్పటికప్పుడు షూట్‌ చేసిన ఫిల్మ్‌ను తగలబెట్టించారు. సావిత్రికి ఆ పాత్రను అప్పగించారు. ఈ సంఘటన అందరికీ తెలుసు. దీని తర్వాత కూడా భానుమతి, చక్రపాణి-నాగిరెడ్డిల మధ్య స్నేహం చెడిపోలేదు. విజయా సినిమాలలో ఆమె మళ్లీ నటించకపోయినా, చక్రపాణి నడిపే ''యువ''కు కథలు రాసేవారు. చక్రపాణిని వెక్కిరిస్తూ వ్యంగ్యరచనలు వేశారు కూడా. అయితే సావిత్రితో ఆమె రిలేషన్‌షిప్‌ ఎలా వుండేది అనే విషయం ఎవరూ స్పష్టంగా చెప్పలేదు. ''వెండితెర విషాద రాగాలు'' అనే పుస్తకం రాసిన పసుపులేటి రామారావు పత్రికా విలేకరిగా యిద్దర్నీ దీని గురించి యింటర్వ్యూ చేసిన సంగతిని తన పుస్తకంలో రాశారు. 

తక్కిన హీరోయిన్ల గురించి మాట్లాడుతూ సావిత్రి ''వాహినీ స్టూడియోలో చెట్టు క్రింద బ్రేక్‌ టైమ్‌లో అందరం చేరి హాయిగా కబుర్లు చెప్పుకునేవాళ్లం. జానకి, సూర్యకాంతమ్మలు యిళ్ల దగ్గర్నుంచి రకరకాల కూరలు, పిండివంటలు స్వయంగా చేసి తీసుకువచ్చేవాళ్లు. అందరికీ వడ్డించి మరీమరీ తినిపించేవారు. జి. వరలక్ష్మి గారైతే ఆవిడ టైపే వేరు. ఆవిడ నోటికి అందరం భయపడిపోయేవాళ్లం. అందరం లక్ష్మి మీద జోకులు వేస్తూ నవ్వుకునేవాళ్లం. ఆట పట్టిస్తూంటే పాపం ఉడుక్కునేది. తర్వాత నవ్వించేవాళ్లం. జమునకు కోపం ఎక్కువ. సరదాగా అన్నా కోపం తెచ్చుకునేది. కానీ తనది మంచి మనసు.'' అని చెప్పినపుడు ''భానుమతి గారు కూడా మీకు ఫ్రెండేనా?'' అడిగారు పసుపులేటి. అప్పుడామె ''ఫ్రెండ్స్‌ కానివారు ఎవరూ లేరు. భానుమతిగారు నా కంటె సీనియర్‌. ఆవిడ యాక్టింగ్‌ అంటే చాలా యిష్టం నాకు. ఆవిడ చేసే కారెక్టర్స్‌ కొన్ని మేమెవరం చేయలేం. ఆవిడ పాటంటే కూడా నాకు బాగా యిష్టం. ఇండస్ట్రీలో ఆవిడ ఒక ప్రత్యేకమైన మనిషి. మిస్సమ్మలో అనుకోకుండా ఆవిడ చేయాల్సిన పాత్ర నాకు వచ్చింది. చక్రపాణి గారు అలాటి డెసిషన్‌ సడన్‌గా తీసుకంటారని ఎవరం అనుకోలేదు. అప్పట్నుంచీ ఆవిడకు నామీద కోపం. ఎక్కడైనా కనిపిస్తే నేనే పలకరిస్తాను. ముక్తసరిగా మాట్లాడతారంతే. ఎప్పుడో ''మిస్సమ్మ'' నాటి కోపం యింకా అవిడలో అలానే వుంది. మా యింటి గృహప్రవేశానికి, మా అబ్బాయి బారసాలకు ఇంటికెళ్లి పిలిచినా రాలేదు.'' అన్నారు.

సావిత్రి కష్టాల్లో పడ్డాక ఆవిడ గురించిపసుపులేటి భానుమతిగారితో మాట్లాడినప్పుడు ఆమె ''మీరంతా సావిత్రిది స్వయంకృతాపరాధం అనుకుంటున్నారు కదా, కాదు, అదంతా ఆమె జాతక ప్రభావం. ఆమెది మహత్తరమైన జాతకం. కానీ చివరి రోజులు భయంకరంగా వుంటాయి. ఆమె మరణం కూడా అంతే!  సావిత్రి అప్పుడప్పుడు పూజలు చేసేది తప్ప తన జాతకం చూపించుకున్నది లేదు. ఎదుగుతున్న వ్యక్తులకు గండాలుంటాయి. గ్రహాలు మారుతూంటాయి. జ్యోతిష్కులను అడిగి గ్రహాలకు శాంతులు చేయించుకోవాలి. సినిమాలు చేయడం, డబ్బు సంపాదించుకోవడం సరిపోదు. తనకు తెలియకపోతే తెలిసిన వాళ్లనైనా అడగాలి. సావిత్రిపై కోపంతో యీ మాటలు అనడం లేదు. తన చుట్టూ అంతమందిని పెట్టుకుంటుంది. సమయానికి మంచి సలహా కూడా చెప్పనివాళ్లంతా ఎందుకంట? అసలు ఆమె చుట్టూ చేరిన వాళ్లంతా దొంగలే'' అన్నారు.

''పోనీ మీరైనా ఓ మాట చెప్పలేకపోయారా?'' అని అడిగితే ''అడగందే చెప్పకూడదు. అవి ఎప్పుడూ సిద్ధాంతులే చెప్పాలి. ఓ సారి మంచికి పోయి ఓ లైట్‌మ్యాన్‌కు సలహా చెపితే క్రియలో ఏదో వక్రీకరించింది. మా రామకృష్ణగారు కొట్టినంత పని చేశారు. ఇంకెప్పుడూ నీ బోడిజాతకాలు, పూజలు చెప్పకు, చెప్పావంటే నీ నాలిక కత్తిరిస్తానన్నారు. అప్పణ్నుంచి నేను యిలాటి విషయాల్లో బయటపడడం లేదు. పోనీ సావిత్రయినా నోరు తెరిచి ఏమిటక్కయ్యా ఇలాగుంది పరిస్థితి ఏం చెయ్యమంటారు? అంటూ అడిగింది లేదు. నాకెందుకయ్యా దురద?'' అని జవాబిచ్చింది. ''కానీ మీరంటే ఆవిడకు చాలా గౌరవం కదా'' అంటే ''సావిత్రి మంచిదే. కాదనను. కానీ తాను లేనిపోని ఆర్భాటాలకు పోయింది. తెలిసీ తప్పులు చేసింది. అలాంటప్పుడు నేను బాధపడిన సందర్భాలున్నాయి. అయితే 'మిస్సమ్మ' సంఘటన నుండి తనకీ నాకూ మధ్య దూరం పెరిగిన మాట వాస్తవమే. మా మధ్య సఖ్యత లేదు. తన పొరపాటు ఏమీ లేదన్న విషయం నాకు తెలుసు. దేవుని వ్రతం వల్ల షూటింగ్‌కు ఆలస్యమైంది. చక్రపాణి ఒప్పుకోలేదు. తనకు కావాల్సిన సావిత్రిని అప్పటికప్పుడు ఫిక్స్‌ చేసేసుకున్నాడు. ఈ విషయంలో సావిత్రిని తప్పుపట్టడం లేదు. చక్రపాణినీ తప్పుపట్టడం లేదు. కానీ తనతో స్నేహంగా వుండటానికి నాకు మనస్కరించడం లేదు.'' అని వివరించింది. 

పసుపులేటి భానుమతి గారి జాతకాల సిద్ధాంతం సావిత్రి వద్ద ప్రస్తావిస్తే ఆమె ''పూజలూ, శాంతులూ మనిషి జీవితాలను బాగు చేస్తాయా? పెద్దావిడ ఏదో అన్నారు. వదిలేయండి. నేను కర్మను నమ్ముతాను. దాని నుండి సంప్రాప్తమయ్యే ఫలాన్ని నమ్ముతాను. అంతా అయిపోయాక యిప్పుడు ఆకులు పట్టుకుంటే సుఖం ఏమిటి? కొడిగట్టి పోతోంది జీవితం. రేపో మాపో ఆరిపోతుంది. ఆ రోజు కోసం చూడ్డమే మన వంతు.'' అని వైరాగ్యం ప్రకటించింది సావిత్రి. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2015) 

[email protected]

ఫోటో - ''మిస్సమ్మ''లో భానుమతి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?