Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సినీమూలం- వేట - 2

నవలలో న్యాయాధికారి చేసిన ద్రోహం తక్కువది కాదు. అతను ఒక రాజవంశీకురాలిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడే యీ కేసు వచ్చింది. ఇది బయటకు వస్తే తన పెళ్లి పెటాకులు అవుతుందన్న భయంతో యింత ఘోరం చేశాడు. చరిత్రప్రకారం నెపోలియన్‌ అధికారంలోకి వచ్చాడు. అప్పుడు యీ ఖైదీ బయటపడవలసినదే. కానీ అప్పుడు ఈ న్యాయాధికారి అతని పేపర్లు తొక్కిపెట్టి వుంచాడు - నెపోలియన్‌ ఓడిపోయి మళ్లీ రాజరికం వస్తుందన్న లెక్కవేసి! సరిగ్గా అలాగే జరిగింది. నెపోలియన్‌ 100 రోజులు మాత్రమే అధికారంలో వున్నాడు. ఆ సమయంలో విప్లవకారుడి కొడుకన్న హోదాలో యీ న్యాయాధికారి పదవిలో కొనసాగాడు. తర్వాత రాజరికం రాగానే స్వయంప్రకాశంతో వెలిగాడు. మధ్యలో నాశనమైంది మన కథానాయకుడు. తను చేసిన నేరమేమిటో తెలియక దుర్భరమైన జైలులో నరకయాతన అనుభవించాడు. 

పుస్తకంలో హీరో తండ్రి డబ్బున్నవాడు కాదు. కొడుకు జైలుపాలు కావడంతో బాధతో, దారిద్య్రంతో చనిపోతాడు. కానీ తెలుగు సినిమాలో తండ్రి జైలరు వద్దకు వెళ్లి విడుదల చేయమని అడిగితే నువ్వు చచ్చినపుడు విడుదల చేస్తారని జైలరు అన్నాడు. యాదృచ్ఛికంగా విలన్లు చేసిన కుట్ర హీరో తండ్రి విని రియాక్టయ్యాడు. విలన్లు అతన్ని చంపేశారు.  హీరో చచ్చిపోయాడని విలన్‌ హీరోయిన్‌కు చెప్పాడు. ఆమె గత్యంతరం లేక అతన్ని పెళ్లాడింది. 

హీరో జైల్లో పడి ఎనిమిదేళ్లు గడిచాక ఒకసారి పక్కగదిలో ఖైదీ జగ్గయ్య సొరంగం ద్వారా అతని గదిలోకి వచ్చాడు. ఇద్దరూ స్నేహితులయ్యారు. హీరో కథ విని కుట్ర ఎలా జరిగిందో వూహించి చెప్పాడు జగ్గయ్య. విప్లవకారుడి కొడుకే న్యాయాధికారి అని కూడా చెప్పాడు. తన కథ చెప్పాడు - ఆయన ఒక సంస్థానాధీశుడు. విలన్‌ అతని వద్ద సేనాని. ఇతన్ని బ్రిటిష్‌వారికి పట్టిచ్చాడు. ఇతని భార్యను చంపి, కూతుర్ని అనాథను చేశాడు. ఆ కూతురు ఎక్కడుందో కనిపెట్టి, ఆమెకు ఆశ్రయం కలిగించాలని జగ్గయ్య కోరిక. ఇద్దరూ కలిసి సముద్రం వైపుకి సొరంగం తవ్వి పారిపోదామని ప్లాను.  కానీ సొరంగం తవ్వుతూండగానే జగ్గయ్యకు గుండెపోటు వచ్చింది. చనిపోతూ కూతురి భారం అప్పగించాడు. దానితో బాటు తన ఖజానా ఎక్కడ దాచాడో ఓ మ్యాప్‌ యిచ్చాడు. ఇప్పుడు హీరోకి ఒక ఐడియా వచ్చింది. జగ్గయ్య శవం వున్న గోనెసంచిలో తను దూరాడు. కాపలా వాళ్లు ఆ మూటను సముద్రంలోకి విసిరేశారు. ఆ విధంగా అతను విముక్తుడయ్యాడు. 

పుస్తకం ప్రకారం జైలులో పడేనాటికి హీరో వయసు 19 యేళ్లు. అతను జైల్లోంచి బయటపడేనాటికి 33 యేళ్లు. 14 యేళ్లు జైల్లో వున్నాడు. మొహం అంతా మారిపోయింది. వయసు పైబడినవాడిలా అయిపోయాడు. తెలుగు సినిమా ప్రకారం 8 యేళ్లు వున్నాడు. మొహంలో పెద్ద మార్పు రాలేదు. పుస్తకం ప్రకారం అతనికి జైల్లో కలిసినది ఫెరయా అనే ఓ మహా మేధావి. 5 భాషలు వచ్చు. అనేక విద్యలు వచ్చు. హీరోని అభిమాన పుత్రుడిగా స్వీకరించి, వాత్సల్యంతో సకల శాస్త్రాలూ, భాషలూ నేర్పాడు. అతనికో కథ వుంది. 

అతను ఓ రాజవంశీకుడి వద్ద సెక్రటరీగా పనిచేసేవాడు. ఆ రాజవంశీకుడి పూర్వీకులకు సంబంధించిన ఓ పాతర గురించి యిద్దరూ తెగ వెతికేవారు. చివరకు అతను పోయాక ఆ నిధి రహస్యం ఫెరయాకు తెలిసింది. వెళ్లి దాన్ని తీసుకుందామనుకునే లోపున రాజకీయ కారణాలతో యితన్ని జైలుపాలు చేశారు. హీరోతో కలిసి జైల్లోంచి పారిపోయిన తర్వాత యిద్దరూ కలిసి ఆస్తి అనుభవిద్దామన్నాడు. కానీ అంతలో అతనికి పక్షవాతం వచ్చింది. 'నన్ను వదిలేయ్‌, నువ్వు పారిపో' అన్నాడు ఫెరయా. లేదు నువ్వు జీవించినంతకాలం నేను నిన్ను వదలను' అన్నాడు హీరో. అతను చలించిపోయి నిధి గురించి అంతా చెప్పేసి, 'దానికి వారసులు లేరు, నువ్వే తీసుకో' అని గుర్తులు చెప్పాడు.

హీరో ప్రేయసిని పెళ్లాడిన సేనాని ఓ గ్రీసురాజును శత్రువులకు అమ్మేసి, అతని కుటుంబాన్ని బానిసలుగా అమ్మేశాడు. అతని కూతురైన హైదీ దిక్కుమాలినదై పోయింది. తెలుగు సినిమాలో ఏం చేశారంటే - మేధావి అయిన ఫెరయాను, సేనాని మోసగించిన గ్రీసురాజును కలిపి జగ్గయ్య పాత్ర తయారుచేశారు. తోటి ఖైదీ చనిపోతే అతని స్థానంలో గోనెబస్తాలో తప్పించుకుని పారిపోయే ఘట్టాన్ని దీనికి ముందే ''అగ్గిదొర'' సినిమాలో కూడా వుపయోగించుకున్నారు. 

హీరోని కొందరు నావికులు రక్షించారు. కొన్ని రోజులకు వాళ్లని వెంటబెట్టుకుని అడవిలోకి వెళ్లాడు. అక్కడున్న ఖజానాను తీసుకున్నాడు. నా ప్రత్యర్థులను వేటాడుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఇక్కణ్నుంచి పగ సాధించడం వుంటుంది. పుస్తకం ప్రకారం యితను జైల్లోంచి బయటపడ్డాక నిధి వెతకడానికి వెళ్లడానికి కొంత టైము పడుతుంది. తర్వాత నిధిని కొద్ది కొద్దిగా తరలించుకున్నాడు. మాంట్‌క్రిస్టో అనే ద్వీపానికి హక్కులు కొని కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌క్రిస్టోగా పరిచయం చేసుకున్నాడు. తెలుగులో మలబార్‌ రాజా ప్రతాపవర్మగా గవర్నరు గారి నుంచి పరిచయపత్రం తెచ్చుకుని ఆ పేరుతో వూళ్లోకి ప్రవేశించాడు. వేట ప్రారంభమౌతుంది. 

నిజానికి పుస్తకంలో ఈ వేట జైల్లోంచి బయటకు వచ్చిన 9 యేళ్లకు ప్రారంభమౌతుంది. అంతకుముందు హీరో ఒక కుటుంబానికి ఉపకారం చేస్తాడు. తను పనిచేసిన షిప్పింగ్‌ యజమాని చాలా మంచివాడు. అతన్ని విడుదల చేయిద్దామని ప్రయత్నించి విఫలమవుతాడు. కానీ క్రమేపీ వ్యాపారంలో సర్వం కోల్పోయి ఆత్మహత్య చేసుకునే టైములో యితను అజ్ఞాతంగా సహాయం అందిస్తాడు. ఆ తర్వాత పగ తీర్చుకోవడం మొదలెడతాడు. దానికి గాను పెద్ద నెట్‌వర్క్‌ తయారుచేసుకుంటాడు. దొంగలతో చేతులు కలుపుతాడు. రకరకాల మారువేషాలు వేస్తాడు. దర్జీ వద్దకు వెళ్లి తనకు ద్రోహం చేసిన వాళ్లు యిప్పుడు ఎక్కడెక్కడున్నారో తెలుసుకుంటాడు. వాళ్ల కుటుంబసభ్యులతో సహా అందర్నీ నాశనం చేయడానికి పెద్ద ప్రణాళిక వేసుకుంటాడు. సైనికాధికారి మోసం చేసిన గ్రీసురాజు కూతురును వేలంలో కొని తన వద్ద వుంచుకుంటాడు. 

తెలుగు సినిమాలో యీ భాగాన్ని సింప్లిఫై చేశారు. ప్రధాన విలన్‌ రాజవర్మది తప్ప తక్కినవాళ్ల కుటుంబాలను చూపించలేదు. రాజవర్మ కొడుకు హీరోకి పుట్టినవాడే అని చూపించారు. పుస్తకంలో అలా వుండదు. అతను సైన్యాధికారి కొడుకే. కథ చాలా నడిచాక హీరోతో ద్వంద్వయుద్ధానికి తయారైనప్పుడు మాత్రమే అతని తల్లి, హీరో ప్రేయసి అయిన మర్సిదా హీరో ఎదుట పడుతుంది. తక్కినవారందరూ గుర్తు పట్టకపోయినా ఆమె మాత్రం హీరోని గుర్తుపట్టి పుత్రభిక్ష పెట్టమని కోరుతుంది. హీరో ఆమె కోరికను మన్నిస్తాడు. ఆ ఘట్టానికి ముందు సైనికాధికారి కొడుకుని రోమ్‌లో యితను ఏర్పాటు చేసిన దొంగలు ఎత్తుకుపోతారు. ఇతను రక్షించినట్టు నటించి వాళ్ల కుటుంబానికి చేరువౌతాడు. అయితే తెలుగుసినిమాలో ఆ కొడుకుని చిన్నపిల్లాడిగా చూపించారు. అతను ఓ  ప్రమాదంలో చిక్కుకుంటే యితను అనుకోకుండా రక్షిస్తాడు. ఆ విధంగా సైనికాధికారికి పరిచయమవుతాడు. పిల్లాడి తల్లిని చూస్తూనే హీరో గుర్తుపట్టాడు - తన మాజీ ప్రేయసి అని. ఆమెపై కోపం వచ్చింది. తనకు గతంలో యిచ్చిన వుంగరం తిరిగి యిచ్చేశాడు. భగ్నహృదయంతో హీరో చనిపోదామనుకున్నాడు కానీ జగ్గయ్యకిచ్చిన మాట కోసం ఆగాడు. ఇంతకీ జగ్గయ్య కూతురు ఎక్కడుంది? ఆమె సుమలత. దొమ్మరిదానిలా తర్ఫీదై కత్తులు విసరడం నేర్చుకుంది. విలన్‌  యింట్లో జొరబడి అతన్ని చంపబోయింది. అతను బంధించి నూతన్‌ ప్రసాద్‌ అనుచరుణ్ని కాపలా పెట్టాడు.(సశేషం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?