Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సినీమూలం- వేట- 1

ఎమ్బీయస్‌ : సినీమూలం- వేట- 1

''సినీమూలం'' అనే శీర్షిక ఆగిపోయి మూడేళ్లు దాటింది కాబట్టి దాన్ని మళ్లీ ప్రారంభించే వేళ ఆ శీర్షిక స్వభావం గుర్తు చేయడానికి దాని ప్రారంభంలో రాసిన వాక్యాలు గుర్తు చేస్తున్నాను - మన సినిమారంగంలో అన్నీ వున్నాయి, అందరూ వున్నారు. స్టూడియోలు, సెట్టింగులు,  కెమెరాలు, కాస్ట్యూములు, రికార్డింగ్‌ థియేటర్లు, ఆర్కెస్ట్రాలు, మైకులు, సింథసైజర్లు - యిలా అన్నీ వున్నాయి. అలాగే - తారలు, కొసరు తారలు, పాత్రధారులు, గాత్రధారులు, డైరక్టర్లు, డాన్సు డైరక్టర్లు, స్టంటు డైరక్టర్లు - యిలా అందరూ వున్నారు. వీళ్లందరినీ అమర్చడానికి బస్తాల కొద్దీ డబ్బుంది. డబ్బుంటే ఏది కావాలంటే అది వుంది వున్నట్టే. దేని గురించి వెతుక్కోనక్కరలేదు. అయితే అంధరూ నిరంతరం వెతికేది ఒక్కటే - కథ! హీరో కానీయండి, హీరోయిన్‌ కానీయండి, డైరక్టర్‌ కానీయండి, ప్రొడ్యూసర్‌ కానీయండి - ఇంటర్వ్యూలో అందరూ చెప్పేది ఒకటే! 'మంచి కథ గురించి చూస్తున్నామండి. దొరకగానే మా తరువాతి సినిమా మొదలెట్టేస్తాం.'

కథల గురించి అన్వేషణ యీనాటిది కాదు, సినిమా పుట్టినప్పటినుండీ వుంది. మరి పాతతరం వాళ్లు యీ సమస్యను ఎలా ఎదుర్కొన్నారు? ఎలా అంటే కాస్త అటూ, యిటూ చూడడం ద్వారా! అంటే మన తెలుగు సంస్కృతికి నప్పే హిందీ, ఇంగ్లీషు, బెంగాలీ, తమిళం, మరాఠీ సినిమాలను, నవలలను వాళ్లు నిరంతరం పరిశీలించేవారు. ఇక్కడ 'నప్పే' అనేది కీ వర్డ్‌. అండర్‌ లైన్‌ చేయవలసిన ముఖ్యమైన మాట. అన్నీ మనకు నప్పవ్‌. నప్పించడంలోనే వుంది వారి గొప్ప! అనగా - మూలకథను తీసుకుని దానికి మనకు కావలసిన రంగులద్ది, ఇది మన వాకిట్లోనే, మన పక్కింట్లోనే జరిగిన కథేమో అనిపించేలా తీయగలగాలి. అ విధంగా తీసిన మహానుభావులను స్మరిస్తూ, వారికి అంజలి ఘటిస్తూ ముందుకు సాగుదాం. 'సినీమూలం' అనే ఈ శీర్షిక ద్వారా కొన్ని తెలుగు సినిమాల మూలాలు వెతుకుదాం. డైరక్టుగా కాపీ కొట్టేసిన సందర్భాలను వదిలేసి వేరే చోట నుండి తీసుకుని దాన్ని యింప్రొవైజ్‌ చేసిన కేసులనే పరామర్శిద్దాం. అప్పుడే మనవాళ్ల ఘనత ప్రస్తావనకు వస్తుంది.

''వేట'' అని 1986లో ఓ సినిమా వచ్చింది. దానికి ఆధారం అలెగ్జాండర్‌ డ్యూమా రాసిన ''కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌క్రిస్టో'' అనే 1844 - అంటే దానికి 140 ఏళ్ల క్రితం నాటి ఓ ఫ్రెంచ్‌ నవల. దాన్ని 1950 ప్రాంతాల్లో తెలుగులోకి అనువదించారు. మూలరచన ఆధారంగా ఫ్రెంచ్‌లోనూ, ఇంగ్లీషులోనూ సినిమాలు వచ్చాయి. ఒక అమాయకుడైన వ్యక్తిపై రాజకీయనేరం మోపి జైలుపాలు చేసిన దుర్మార్గులపై ఆ వ్యక్తి ఎలా కసి తీర్చుకున్నాడన్నది కథాంశం. కసి తీర్చుకోవడం అంటే చాటుగా వచ్చి పొడిచేయడం కాదు. మెంటల్‌గా టార్చర్‌ చేసి చంపుతాడు. చాలా గొప్ప పుస్తకం. 

పుస్తకంలో కథాకాలం 1815. ఫ్రెంచ్‌ రాజకీయాల నేపథ్యంలో కథ సాగుతుంది. అప్పటివరకు రాజ్యం చేసిన నెపోలియన్‌ను లూయీ చక్రవర్తి అనుయాయులు ఓడించి ఎల్బా ద్వీపంలో బంధించి వుంచారు. దేశంలో నెపోలియన్‌ అభిమానులు చాలామంది వున్నారు. అతన్ని ఎల్బా ద్వీపంనుండి తప్పిద్దామని, అధికారంలోకి తెద్దామని ప్రయత్నిస్తున్నారు. హీరోపై నెపోలియన్‌ అనుచరుడనే ముద్ర పడుతుంది. దానితో కష్టాలపాలవుతాడు. ఆ నేపథ్యం మనకు నప్పదు. మనవాళ్లకు నెపోలియన్‌ ఎవరో, లూయీ ఎవరో తెలియదు. మరి దాన్ని మన తెలుగులోకి ఎలా తీసుకువచ్చారో చూద్దాం.

అది 1939 వ సంవత్సరం. బ్రిటిష్‌వారు రాజ్యం ఏలుతున్న కాలం. స్వాతంత్య్రపోరాట యోధులు బ్రిటిష్‌వారిపై పోరాటం సలుపుతున్నారు. వారిలో కన్నమ దాసయ్య అనే విప్లవకారుడికి విదేశాలనుండి ఓ వుత్తరాన్ని మోసుకువస్తున్నాడు ఒక ఓడ కాప్టెన్‌.  వైస్‌ కాప్టెన్‌గా వున్న నూతన్‌ప్రసాద్‌ ఆశాపరుడు. కాప్టెన్‌ను చంపైనా తను అతని పదవిలోకి వచ్చేద్దామని ఆశపడుతున్నాడు. కానీ కెప్టెన్‌కు హీరో అంటే యిష్టం. ఇతని పేరు ప్రతాప్‌. ఓడలో చిన్న వుద్యోగి. మనసులో కల్మషం లేనివాడు. రాజకీయాలు అవీ తెలియవు. అతనికి తెలిసినదల్లా హీరోయిన్‌ జయప్రదను ప్రేమించడం. ఆమెకో బావ వున్నాడు. అతనే విలన్‌. అతను బ్రిటిష్‌ సైన్యంలో ఓ అధికారి. అతనికి యితన్ని చూస్తే అసూయ.

నూతన్‌ప్రసాద్‌ కెప్టెన్‌కు విషాహారం యిచ్చి చంపేశాడు. కానీ కథ అడ్డం తిరిగింది. కెప్టెన్‌ హీరోనే తన వారసుడిగా ప్రకటించాడు. దాంతోబాటు కన్నమదాసయ్యకు యివ్వవలసిన వుత్తరాన్ని యితనికి యిచ్చి అతనికి అందజెయ్యమన్నాడు. అది వీళ్లు చూశారు. నూతన్‌ ప్రసాద్‌ తన అనుచరులతో కెప్టెన్‌ను చంపిన విషయం చెపుతూంటే విని హీరో వాళ్లను పోలీసులకు అప్పగించాడు. యాదృచ్ఛికంగా వాళ్లని విలన్‌ వద్దకే తీసుకెళ్లారు. వీళ్లకు హీరోమీద వున్న అసూయ గమనించి అతను వీళ్లచేత ఆకాశరామన్న వుత్తరం రాయించాడు - ఫలానా ఓడ  కెప్టెన్‌ వద్ద స్వాతంత్య్ర యోధులకు సంబంధించిన వుత్తరం వుంది. అతను బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాడు అని. దాంతో సరిగ్గా పెళ్లి వేళ హీరోని అరెస్టు చేశారు. అతన్ని విచారణకై ఓ న్యాయాధికారి వద్దకు తీసుకుని వచ్చారు. న్యాయాధికారి రంగనాథ్‌కి యితను అమాయకుడని నమ్మకం కుదిరింది. వదిలేద్దామనుకున్నాడు. కానీ అంతలో అతని వుత్తరం చూశాడు. ఆ ఉత్తరం చేరవలసిన కన్నమ దాసయ్య అతని తండ్రే. మారుపేరుతో విప్లవోద్యమంలో పాలు పంచుకుంటున్నాడు. తను విప్లవకారుడి కొడుకని తెలిస్తే తన పదవికి ముప్పని అతని భయం. అందువలన వుత్తరం కాల్చేసి, కన్నమ దాసయ్య పేరు ఎక్కడా చెప్పనని ఒట్టేయించుకుని హీరోను ఓ రోజులో వదిలేద్దామనుకున్నాడు. కానీ విలన్‌కు యిది వూహించి, స్వయంగా వచ్చి న్యాయాధికారిని బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. అతనికి హీరోయిన్‌పై కన్ను కదా. హీరోకి యావజ్జీవ కారాగారం వేస్తే యీ విషయం ఎక్కడా బయటపెట్టనని డీల్‌. న్యాయాధికారి సరేనన్నాడు. అండమాన్‌ జైలుకి యావజ్జీవ శిక్షకు హీరోను పంపేశాడు.

మూలరచననుండి తీసుకునేటప్పుడు విలన్ల విషయంలో కాస్త మార్పు చేశారు. పుస్తకంలో కెప్టెనుది సహజమరణమే. అతనికి విషాహారం యిచ్చి చంపడం, వైస్‌ కెప్టెన్‌ను హీరో పోలీసులకు పట్టివ్వడం వుండదు. అతన్ని హీరోయిన్‌ బావ వద్దకు తీసుకురావడమూ వుండదు. అతనికి అనుచరుడు ఎవరూ వుండరు. ఉద్యోగరీత్యా వైస్‌ కాప్టెన్‌, ప్రేమరీత్యా సైనికాధికారి, పొరుగుదృష్టి రీత్యా హీరో యింటిపక్కన వుండే ఓ దర్జీ - యీ ముగ్గురు అసూయాపరులూ కలిసి ఆకాశరామన్న వుత్తరం తయారుచేసి పంపుతారు. నవలలో హీరోయిన్‌కు, సైనికాధికారికి బంధుత్వం లేదు. కుటుంబస్నేహం మాత్రమే! ఇక న్యాయాధికారి విషయంలో కూడా - అతని వద్దకు సైనికాధికారి వెళ్లి బెదిరించడం వుండదు. తన తండ్రి నెపోలియన్‌ తరఫున తిరుగుబాటు లేవదీస్తున్నాడు కాబట్టి, ఆ విషయం బయటకు పొక్కకుండా స్వార్థంతో అతనే సాక్ష్యాన్ని నాశనం చేసి హీరోని ఒక భయంకరమైన జైలుకి పంపేశాడు. అక్కడకు ఒకసారి వెళ్లినవాడు మళ్లీ తిరిగిరావడం కల్ల. ఇలా నలుగురు స్వార్థపరులు ఒక అమాయకుడి జీవితంతో ఆడుకున్నారు. తెలుగు సినిమాలో రాజవర్మను ఒక్కణ్నే మెయిన్‌ విలన్‌ చేయడానికి అతనే తక్కినవాళ్లచేత అన్నీ చేయించినట్టు చూపించారు. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?