Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : కరోనా కలవరం

ఎమ్బీయస్‌ : కరోనా కలవరం

కరోనా గురించి నానా హడావుడి జరుగుతోంది. విపరీతంగా భయపెడుతున్నారు, దానితో బాటు అభయహస్తాలూ చూపుతున్నారు. ఆ వూరికి పాకింది, యీ వూరికి పాకింది, రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయి. బజార్లన్నీ వెలవెలబోతున్నాయి. మనుషులంతా ముక్కుమూసుకుని యింట్లో కూర్చున్నారు. బయటకి వెళ్లారో అంతే సంగతులు అని రోజంతా వార్తలు గుప్పిస్తున్నారు. ఇటు వాట్సాప్‌ లు చూస్తే ఆర్సెనిక్‌ ఆల్బమ్‌ వేసుకోండి, చారు కాచుకు తాగండి, రోజుకి అరగంట సేపు ఎండలో నించోండి, వ్యాధి రమ్మన్నా రాదు అని అభయాూ యిచ్చేస్తూన్నారు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియకుండా పోయింది. యునిసెఫ్‌ నుంచి వచ్చిన సందేశం అంటూ కొన్నాళ్లు వీరవిహారం చేశాక, యునిసెఫ్‌కు దానికి సంబంధం లేదని యింకో వార్త వచ్చింది.

రోగం సంగతి తేలకుండానే చిట్కాలా? - ఏదైనా వ్యాధి స్వభావాన్ని కనిపెట్టాకనే దానికి మందు కనిపెడతారు. కొంతకాలానికి వ్యాధి సోకకుండా వాక్సిన్‌ కనిపెడతారు. ఈ రోగం వచ్చిందో లేదో అప్పుడే మందు, రాకుండా చేసేందుకు చిట్కాలు ఎలా చెప్పేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. హోమియో మందు వ్యక్తిని బట్టి (కస్టమైజ్‌డ్‌) వేయాలి, అందరికీ ఒకటే మందు అంటే కుదరదు అంటారు. కానీ యిలాటి అంటువ్యాధుల్లో ఒకే మందు అందరికీ పని చేస్తుంది అంటారు. అలా అనుకున్నా, గతంలో లేని వ్యాధి కదా యిది, రోగుపై పరీక్షించి నిగ్గు తేల్చాలి కదా, యిండియాలో దీని రోగులు తగినంత మంది లేకుండానే పరీక్షలు ఎప్పుడు చేశారు? మరి దీనికి ఆర్సెనిక్‌ ఆల్బమ్‌ పని చేస్తుంది అని ‘ఆయుష్‌’ వంటి ప్రభుత్వసంస్థ ఎలా చెప్పిందో తెలియదు. ఇదే కాదు, వచ్చే శతాబ్దంలో రాబోయే కొత్త రోగానికి మందు ఆయుర్వేదంలో ఎప్పుడో కనిపెట్టేశారు మన ఋషులు అని చెప్తే నమ్మడానికి మనం రెడీగా ఉంటాం.

అలాగే వేడి వాతావరణంలో యీ వైరస్‌ మనజాలదు అంటున్నారు. అంటే అది ఒకరి నుంచి మరొకరికి ప్రయాణించే సమయంలో వేడి కారణంగా చచ్చిపోతుందన్నమాట. ఒకసారి ఒంట్లోకి వెళ్లాక యిక వేడేముంది? వైరస్‌ లోపలకి వెళ్లాక రోజూ కాసేపు ఎండలో నిల్చుంటే మాత్రం ఏమవుతుంది? ఎండలో ఉన్నంత సేపూ వైరస్‌ దగ్గరకు రాకపోయినా, తర్వాత లోకల్‌ ట్రైన్‌లో పక్కవాడి నుంచి అంటుకోవచ్చు కదా! ఇలా అడిగితే అబ్బే, బయట వేడి కాదు, శరీరంలో వేడి వుండాలి. అల్లపు రసం తాగండి, వెల్లుల్లి నమలండి అంటున్నారు. వీటి వలన వేడి ఎలా పుడుతుంది? పుట్టినా ఎంతసేపు ఉంటుంది? వెల్లుల్లి నమిలి, బస్సెక్కితే మాత్రం అందరూ దూరంగా జరుగుతారు. రోగం సంక్రమించినవాడు కూడా వారిలో ఉంటాడు కాబట్టి, మనకు సోకకుండా ఉంటుంది. అంతే తప్ప ఒకసారి వైరస్‌ లోపలికి వెళ్లాక యివేమీ పని చేయవు.

వైరస్ ఎలా చొరబడుతుంది? - రోగగ్రస్తుడు తుమ్మినపుడు, దగ్గినపుడు బయటకు వచ్చిన వైరస్‌ గాలిలో నిలవదు, ఏదో ఒక సర్ఫేస్‌ మీద వచ్చి వాలి, నిలిచి వుంటుంది అంటున్నారు. చెక్క మీద యిన్ని గంటలు, బట్ట మీద యిన్ని గంటలు అంటున్నారు. అందువలన వేటినీ ముట్టుకోకండి, ముట్టుకున్న వాళ్ల అరచేతికి షేక్‌హాండ్‌ యివ్వకండి అంటున్నారు. ఎండకు వైరస్‌ చచ్చిపోతుందంటున్నారు కాబట్టి ఫర్నిచర్‌ను, బట్టలను మాటిమాటికీ ఎండల్లో పడేయాలేమో! షేక్‌హాండ్‌ వలన వ్యాపిస్తుంది అంటే రోగగ్రస్తుడి చెమట ద్వారా వైరస్‌ మన అరచేతి రంధ్రాల్లో దూరుతుందనా? అసలీ వైరస్‌ మన శరీరంలో ఎలా చొరబడుతుందో నాకు యిప్పటిదాకా అర్థం కాలేదు. ఏదో ఒక రంధ్రం ద్వారా వెళ్లాలి కదా! నోటి ద్వారానా? ముక్కు ద్వారానా? స్వేదగ్రంథుల ద్వారానా? ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి కాబట్టి ముక్కు ద్వారా వెళుతుందనే అనుకోవాలి. అలాటప్పుడు మాంసం ఉడికించి తినండి అంటూ తిండి గురించి జాగ్రత్తలు చెపుతున్నారెందుకు!

వైరస్‌ సోకిన వస్తువును ముట్టుకుని కళ్లు తుడుచుకున్నా, రోగం సోకేస్తోందని మరో వార్త. అంటే శరీరంలోని ఏ రంధ్రంలోంచైనా లోపలకి వెళ్లిపోతుందని అనుకోవాలా? నా ఉద్దేశం - రోగం గురించి వీళ్లకు ఏమీ పెద్దగా యింకా తెలియదని, ఎందుకైనా మంచిదని అన్ని రకాల జాగ్రత్తలూ చెప్పేస్తున్నారు. వేడి నీళ్లు తాగండి, వేడిగా ఉన్న అన్నం తినండి యివన్నీ గొంతు నొప్పి నివారించడానికి అయి వుంటాయి. ఎన్ని నీళ్లు తాగినా ఊపిరితిత్తులు బాగుపడవు కదా! వీళ్లు తెలిసీతెలియకుండా ఏదేదో చెప్పేస్తున్నారు, మనల్ని హడలగొట్టేస్తున్నారు.

సేకరించిన వివరాలు - కరోనా గురించి నేను సేకరించిన వివరా లేమిటంటే - ముందే చెపుతున్నా, ఇవి అసమగ్రం.  ఇంకా దీని గురించి శాస్త్రజ్ఞులకు, వైద్యులకే పూర్తి అవగాహన రాలేదు. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి - కరోనా అన్నది వైరస్‌ పేరు. 2019 లో వచ్చిన యీ కరోనా వైరస్‌కు ‘సివియర్‌ (ఎస్‌) ఎక్యూట్‌ (ఎ) రెస్పిరేటర్‌ (ఆర్‌) సిండ్రోమ్‌ (ఎస్‌) కరోనావైరస్‌ 2 - మొత్తం మీద సార్స్‌-సిఓవి-2 అన్నారు. మనవాళ్లు సింపుల్‌గా కరోనా అంటున్నారంతే! కోవిడ్‌-19 అనేది ఆ వైరస్‌ వలన సోకే వ్యాధి పేరు. చైనాలో ఊహాన్‌లో 2019 డిసెంబరులో వ్యాధి కొత్తగా బయటపడింది. ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలకు వ్యాపించింది.

అదృష్టవశాత్తూ ఈ వ్యాధికి చికెన్‌గున్యా లాటి పేరు పెట్టలేదు. లేకపోతే అప్పట్లో కోళ్లను చంపేసినట్లు, యిప్పుడు ఆ పేరున్న జంతువులను చంపేసేవారు. ఇది చైనావాళ్లు గబ్బిలాలను తినడం వలన వచ్చిందని మొదట్లో అన్నారు. ఇక గబ్బిలాలకు మూడిందిరా అనుకున్నాను. కోళ్లయితే సులభంగా దొరుకుతాయి కానీ గబ్బిలాలు కనబడనే కనబడవు, ఎలా వెతుకుతారా? అనుకున్నాను. పాము, కప్పలు, కుక్కలు, కోతులు.. సమస్తం తినేసే చైనా వాళ్లకు ఆ జంతువుల శాపమే తగిలింది అని కార్టూన్లు వచ్చేశాయి. అలా అయితే మనకు కోళ్ల, మేకల, చేపల శాపాలు ఎన్ని తగిలి వుంటాయో అని మనకు తోచలేదు. ఇంతలో ఏమైందో కానీ గబ్బిలాలు తినడం వలన.. అని ఈ మధ్య అనడం మానేశారు.

కానీ యిది జంతువు వలన వచ్చిందనే అనుమానం ఉంది. ఎందుకంటే గతంలో వచ్చిన ‘మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ కరోనావైరస్‌’ (మెర్స్‌-సిఓవి) ఒంటెల ద్వారా వచ్చిందట. అలాగే 2002లో చైనాలో ప్రారంభమై 33 దేశాలకు వ్యాపించి 8 నెలల పాటు అవస్థ పెట్టిన ‘సివియర్‌ ఏక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌’ (సార్స్‌) వ్యాధి పిల్లుల కారణంగా వచ్చిందట. ఇప్పుటీ కోవిడ్‌ కూడా సార్స్‌ లాటిదే అనుకుంటున్నారు. నిజానికి సార్స్‌లో మరణాల శాతం 10% ఉంది. దీనిలో యింకా అంత లేదు. సార్స్‌తో వ్యవహరించిన అనుభవం యిప్పుడు దీనికి పనికి రావచ్చు. రోగం రాకుండా ఏం చేయాలి అనేదాని గురించి చాలానే చెప్తున్నారు. పునశ్చరణగా చెప్పుకోవాంటే - దగ్గుతో బాధపడేవారికి దూరంగా ఉండండి, జంతువుల మార్కెట్లకు కానీ, కబేళాలకు కానీ వెళ్లినపుడు జాగ్రత్తగా ఉండండి, పెంపుడు జంతువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి.

రోగలక్షణాలు - దీని లక్షణాలు ఫ్లూ లాగానే ఉంటాయి. ఇది ముక్కు కంటె ఊపిరితిత్తులను ఎక్కువ దెబ్బ కొడుతుంది. మన ఊపిరితిత్తులలో మ్యూకస్‌ను తయారు చేసే గోబ్లెట్‌ సెల్స్‌, వెంట్రుకలుండి ఊపిరితిత్తులలో వ్యర్థాలు, ఫ్లూయిడ్‌ చేరకుండా రక్షించే సిలియా సెల్స్‌ ఉంటాయి. ఈ వైరస్‌ ఆ రెండు సెల్స్ నీ ఎటాక్‌ చేసి వాటిని చంపేస్తుంది. ఇక అప్పణ్నుంచి ఊపిరితిత్తులలో నానా చెత్త చేరుతుంది. ద్రవాలు చేరి ఊపిరి పీల్చుకోవడం కష్టమౌతుంది. ఈ దశ ఒక వారం పాటు ఉంటుంది. ఇక ఆ పై జ్వరం, పొడి దగ్గు, అలసట, ఊపిరి పీల్చుకోవడంలో యిబ్బంది, కండరాల నొప్పి అనే ముఖ్యమైన లక్షణాలు బయటపడతాయి. బాగా ఎక్కువైతే న్యుమోనియా వస్తుంది. ఊపిరాడక చావు ముంచుకొస్తుంది.

ఇప్పటికే వ్యాధి ఉన్నవాళ్లకు ప్రమాదం ఎక్కువ. ప్రస్తుతానికి దీనికి ప్రత్యేకమైన చికిత్స కానీ, ప్రత్యేకమైన మందు కానీ లేవు. మామూలు కరోనా వైరస్‌ వస్తే ఎలా ట్రీట్‌ చేస్తున్నారో అలాగే చేస్తున్నారు. సహాయకంగా ఆక్సిజన్‌ యివ్వడం, ఫ్లూయిడ్‌ మేనేజ్‌ చేయడం చేస్తున్నారు. సడన్‌గా దగ్గు, గొంతునొప్పి, ఊపిరందకపోవడం వంటివి వస్తే ఆసుపత్రికి వెళ్లి ఈ వైరస్‌ వుందేమో టెస్టు చేయించుకోవాలి. ఈ వ్యాధి ప్రబలంగా ఉన్న ప్రాంతాలకు ప్రయాణించి వుంటే, మీకు దగ్గర్లో ఉన్నవారిలో యీ వ్యాధి వుండి వుంటే ఆ విషయం స్పష్టంగా డాక్టర్లకు తెలియచేయాలి. వ్యాధి సోకాక 2-14 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. ఈ సమయంలోనే యితరుకు వ్యాప్తి చేయగలుగుతారు. లక్షణాలు లేకపోయినా, మైల్డ్‌గా ఉన్నా యింకొకరికి సంక్రమించ చేయగలుగుతారో లేదో యిప్పటిదాకా తెలియదు.

రిస్క్ ఫ్యాక్టర్ - ఇది ఎంత ప్రమాదకరం అనే దాని గురించి గణాంకాలు (యిప్పటిదాకా లభ్యమైనవి) చూడబోతే - 81% మందికి మైల్డ్‌ సింప్టమ్స్‌ కనబడతాయి. కామన్‌ కోల్డ్‌ అనిపిస్తుంది. 14% మందికి సివియర్‌గా కనబడతాయి. ఆసుపత్రిలో చేర్చాలి. 5% మంది క్రిటికల్లీ ఇల్‌ అవుతారు. వీళ్లను ఐసియులో ఉంచాలి. మరణాల శాతం వూహాన్‌లో 2-4% ఉంది. చైనాలోని తక్కిన ప్రాంతాల్లో 1% ఉంది. వూహాన్‌లో ఎక్కువ ఎందుకు ఉందో యిప్పటిదాకా కారణం తెలియలేదు.  యూరోప్‌ వ్యాధిగ్రస్తుల్లో మరణశాతం ఎక్కువగా ఉందని రిపోర్టులు వస్తున్నాయి. వాటికి ప్రత్యేక కారణాలున్నాయేమో చూడాలి.

వయసు రీత్యా చూస్తే 50 వయసు కంటె తక్కువ ఉన్న వ్యాధిగ్రస్తుల్లో 0.5% మంది మాత్రమే చనిపోయారు. 50ల్లో ఉన్నవారిలో 1.3%, 60ల్లో ఉన్నవారిలో 3.6%, 70ల్లో ఉన్నవారిలో 8%, 80ల్లో ఉన్నవారిలో 15% మంది పోయారు. పూర్వం ఏ రోగమూ లేనివాళ్లలో 99.1% మంది యిప్పుడీ వ్యాధి సోకినా మరణించరు. ఉన్నవాళ్ల సంగతి చూడబోతే బిపి ఉన్నవాళ్లలో 6%, పొగతాగడం వంటి అలవాట్ల వలన ఊపిరితిత్తులు పాడు చేసుకున్నవాళ్లలో 6%, డయాబెటిస్‌ ఉన్నవాళ్లలో 7%, హృద్రోగం ఉన్నవారిలో 11% మరణం సంభవించే ప్రమాదం ఉంది. అదీ పైన చెప్పిన ఏజ్‌ గ్రూపులోకి వస్తే!

మనం గట్టిపిండాలం - గణాంకాలు మరీ అంత ప్రమాదంగా కనబడకపోయినా, చైనావాడు కనబడితే చాలు, మనం గడగడ లాడిపోతున్నాం. ఇబ్బందేమిటంటే మనం చైనావాళ్లను సరిగ్గా గుర్తించలేం. ఆగ్నేయాసియా దేశాల వాళ్లందరినీ చైనావాళ్లనే అనుకుంటాం. అంతదాకా ఎందుకు ఈశాన్య రాష్ట్రాల వాళ్లకూ, చైనా వాళ్లకూ తేడా తెలియదు మనకు. ఇక ఐటీ వాళ్లను చూసినా దడ పుడుతోంది. వీళ్లు ఏ దేశం వెళ్లి ఏం అంటించుకుని వచ్చారో అని! మనకే కాదు, వాళ్ల కంపెనీ వాళ్లకూ దడే, అందుకని వర్క్‌ ఫ్రమ్‌ హోం చేసుకోమంటున్నారు. ఐటీ వాళ్లకు అది కుదురుతుంది. తక్కినవాళ్లందరూ ఏం చేయాలిట? బయటకు వెళ్లక తప్పదు కదా!

వెళ్లాలంటే మాస్కు కట్టుకోండి, చేతులు శానిటైజర్స్‌తో కడుక్కోండి అంటున్నారు. దెబ్బకు మాస్కులు బ్లాక్‌మార్కెట్‌లో అమ్మసాగారు. శానిటైజర్సయితే మాయమై పోయాయి. ఇన్నాళ్లూ యిలాటి పరిశుభ్రపరిచే వస్తువులకు మన దగ్గర డిమాండ్‌ లేదు. అందుకని తయారీ పెద్దగా లేదు. ఇప్పుడు హఠాత్తుగా కావాలంటే ఎక్కడ దొరుకుతాయి? నిజానికి చెప్పాలంటే - యిది నా వ్యక్తిగత పరిశీలన సుమా - మన భారతీయులపై యిలాటి వైరస్‌ లు పెద్దగా ప్రభావం చూపవు. ఎందుకంటే మనం ఎప్పుడూ అపరిశుభ్రమైన వాతావరణంలోనే బతుకుతాం. అందువలన శరీరానికి యిమ్యూనిటీ ఏర్పడుతుంది.

బయటి దేశాల్లో వాతావరణ కాలుష్యం తక్కువ కాబట్టి, యిలాటి వైరస్‌ సోకితే ఊపిరితిత్తులు ఢామ్మంటాయి. ఇక్కడ మనం బతికేది దుమ్మూ, ధూళి, పొగల్లో. ఊరంతా ఎక్కడ చూసినా చెత్తే. ఎప్పుడైనా తీసుకెళ్లితే ఓ చోట పడేసి కాల్చేస్తారు. ఐదు మైళ్ల వ్యాసార్థం దాకా కంపు, పొగ, ఆ కాలనీల్లో జనాలు యివన్నీ పీల్చుకుని కూడా బతికే వుంటారు. చాలా ఔషధాలపై విదేశాల్లో చేసిన పరీక్షలు మన యిండియన్స్‌కి నప్పవు. అక్కడ నిషిద్ధమైన మందులు యిక్కడ హేపీగా వాడేసినా ఏమీ కావటం లేదు. విదేశీయులకు జలుబు చేస్తే పెద్ద హంగామా చేసేస్తారు. మనం 102 జ్వరం ఉన్నా సెలవు కలిసి వస్తుందని ఆఫీసుకి వెళ్లిపోతాం. కొలీగ్స్‌కు సోకుతుందన్న చింతే లేదు.

భయోవెపన్ లు - గతంలో ఎయిడ్స్‌ విషయంలో  యింకేముంది, మహమ్మారి వచ్చేసింది, ప్రపంచానికి ముప్పు తెచ్చేసింది అన్నారు. ప్రచారం మీద బిలియన్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు అబ్బే, పెద్దంత యిదేం కాదు అంటున్నారు. ఎయిడ్స్‌ సోకగానే జనాలు చచ్చిపోలేదు. అప్పటి కంటె యిప్పుడు మరింత గ్లోబల్‌ విలేజి కావడం చేత రోగం చాలా త్వరగా దేశదేశాలకు వ్యాప్తి చెందుతోంది. అపోహలూ మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రతీ వందేళ్లకూ యిలాటి మహమ్మారి వచ్చి జనాభాను తుడిచిపెట్టేస్తోందని రాసేస్తున్నారు.

బయో వెపన్‌ తయారు చేసి వదిలితే జనాలు మూకుమ్మడిగా చస్తారని విన్నాం. దాని తయారీలోనే యిది అనుకోకుండా తయారైందనే పుకారూ ఉంది. బయోవెపన్‌ మాట ఎలా ఉన్నా భయోవెపన్‌ మాత్రం పూర్తిగా ఉపయోగిస్తున్నారు. విమానాలు రద్దు చేసేశారు. ప్రయాణాలు కాన్సిల్‌ అయిపోయాయి. ఆఫీసులు మూసేశారు. వ్యాపారాలు దిగాలు పడ్డాయి. దెబ్బకు ఆర్థికవ్యవస్థ కుప్పకూలింది. పలు దేశాల స్టాక్‌ మార్కెట్లు కుదేలయ్యాయి. అసలే మాంద్యం. ఆపై యీ దెబ్బ.

ఒకటి మనం గుర్తించాలి - ఇది ప్రకృతికి, మానవుడికి నిరంతరం జరిగే పోరాటం. పాత వ్యాధికి మానవుడు మందు కనిపెట్టగానే ప్రకృతి మరో రోగం రూపంలో యింకో సవాలు విసురుతుంది. గతంలో కంటె యిప్పుడు మానవమేధ మరింత పదునయ్యింది. అందువన దీనికి పరిష్కారం కనుక్కోవడం అంత ఆలస్యం కాకపోవచ్చు. మరి ప్రకృతి ఓడిపోతుందా? లేదు! ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించి. మనల్ని మనమే నాశనం చేసుకుంటాం. వాతావరణాన్ని ధ్వంసం చేసి మనమే మన విలయాన్ని కొని తెచ్చుకుంటాం. తరాలుగా మనం అలవర్చుకున్న మంచి అలవాట్లను వదులుకుని రోగాల పాలవుతాం.

ఇవన్నీ చెప్పాలా ? - ఇప్పుడీ వైరస్‌ విషయంలో చూడండి, చేతులు కడుక్కోండి, మాంసం ఉడికించి తినండి, వేడిగా తినండి.. యివన్నీ ఎవరైనా ప్రత్యేకంగా చెప్పాలా? సిగ్గు కదా. ఇప్పటికీ రోడ్డు సైడు మురికి కాలవ పక్కన దుమ్మూ ధూళీలో ఉండే ఛాట్‌ భండార్‌లో విద్యాధికులు కూడా తింటూనే ఉంటారు. రోడ్డు పక్కన బండిలో ద్రాక్ష పళ్లు కొని, కడుక్కోకుండానే నోట్లో వేసుకుంటారు. మసాలాలు విపరీతంగా తింటూంటారు. అరిగించుకునే శక్తి వుందా లేదా అని చూసుకోకుండా రోజూ రెండు పూటలా భారీగా మాంసాహారం లాగిస్తారు. ఎంగిలి పాటించరు. అవతలివాడికి ఏ రోగం ఉందో అనే శంకైనా పెట్టుకోకుండా అందరూ ఒకే ప్లేట్లో తినడం, ఒకే గ్లాసులో తాగడం చేస్తారు. ఇంత కాలుష్యనగరంలో ఉన్నాం కదా, రోజుకి పావుగంటైనా ప్రాణాయామం చేసి ఊపిరితిత్తుల శక్తి పెంచుకుందాం అనుకోరు. వేళాపాళా లేకుండా తిని, తాగి, 30 ఏళ్ల వయసు నుంచి ఉదరవ్యాధులతో బాధపడతారు. వ్యాయామం జోలికి పోరు.

ఇలా యిష్టం వచ్చినట్లు బతికేస్తూ, యిలాటిది ఏదైనా వస్తే మాత్రం గడగడలాడిపోతారు. నిజానికి యీ వైరస్‌ చేత కంటె క్షయ, డయేరియా, మలేరియా వంటి వ్యాధులతో ఏటా ఎంతోమంది పోతున్నారు. పోకుండా ఉన్నవాళ్లు కూడా నీరసంగా, ఈసురోమంటూ బతుకుతున్నారు. మందులతో జీవితాన్ని లాక్కుని వస్తున్నారు. ఈ కరోనాని ఓ మూడునెలల్లో శాస్త్రజ్ఞులు స్వాధీనం చేసుకుంటారు. పరిస్థితి త్వరలోనే కుదుటపడుతుంది. కానీ అంతకంటె ముందు మనం బాగుపడాలి. మనల్ని మనం బాగుచేసుకోవాలి. తినడం, తాగడం విషయంలో మంచి అలవాట్లు పాటించాలి. శుభ్రమైన చోటే, పరిశుభ్రమైనదే తినాలి. మనం కచ్చితంగా ఉంటే హోటల్‌ వాళ్లూ దారికి వస్తారు. కిచెన్‌ శుభ్రంగా ఉంచుతారు. లేకపోతే మనం దీనితో కాకపోతే మరోదానితో పోతాం. 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2020)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?