Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ క్రైమ్‌ రచన : కువో ఆయిల్‌ స్కామ్‌

జనతా ప్రయోగం విఫలమై 1980 జనవరిలో ఇందిరా గాంధీ అధికారానికి తిరిగి వచ్చిన పది రోజుల్లోనే యీ స్కామ్‌ జరిగింది. ప్రభుత్వాధీనంలోని ఐఓసి (ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌) మూడు లక్షల టన్నుల సుపీర్‌యర్‌ కిరోసిన్‌ ఆయిల్‌ (ఎస్‌కెఓ)ను, 5 లక్షల టన్నుల హై స్పీడ్‌ డీజిల్‌ ఆయిల్‌ (ఎచ్‌ఎస్‌డి)ని దిగుమతి చేసుకుందామని నిశ్చయించుకుని టెండర్లు పిలిచింది. ఫిబ్రవరి 5 నుంచి 15 లోపుల టెండర్లు పంపాలని చెప్పింది. 1979లో దేశంలో వర్షాభావం వలన పంటలు పండకపోవడంతో వీటికి విపరీతంగా డిమాండ్‌ వచ్చింది. అందుకే యింత పెద్దమొత్తంలో టెండర్లు పిలిచారు. కిరోసిన్‌ కోసం 10 ఆఫర్లు వచ్చాయి. ఐఓసి మామూలు పద్ధతిలోనే వాటిని డీల్‌ చేసింది. అయితే డీజిల్‌ విషయంలో వచ్చిన 14 కొటేషన్ల విషయంలో మాత్రం తమాషాలు జరిగాయి. 14లో 12 ఫ్లోటింగ్‌ ధర కోట్‌ చేశాయి. డీజిల్‌ విషయంలో ధర నిరంతరం మారుతూ వుంటుంది కాబట్టి గంటగంటకు ధరలో హెచ్చుతగ్గులు తెలిపే ప్లాటిస్‌ ఆయిల్‌గ్రామ్‌ అనే గ్లోబల్‌ టెలెక్స్‌ సర్వీసెస్‌ వుంది. అది తెలియపరచే ధరను ప్లాటిస్‌ యిండెక్స్‌ అంటారు. ఫ్లోటింగ్‌ రేటులో కొటేషన్‌ యిచ్చినపుడు ప్లాటిస్‌ కంటె యింత శాతం ఎక్కువ.. అని చెప్తూ వుంటారు. పెట్రోలు ధర పెరిగితే పెరిగినట్లు, తగ్గితే తగ్గినట్లు. అయితే తక్కిన రెండు కంపెనీలు ఫిక్సెడ్‌ ధర కోట్‌ చేశాయి. అంటే పెట్రోలు ధర భవిష్యత్తులో పెరిగినా, తరిగినా వాళ్లు యిదే ధరకు సరఫరా చేస్తారన్నమాట. పెట్రోలు ధరలు పెరగబోతున్నాయి అనే కచ్చితమైన సూచన వున్నపుడు యిలాటి స్థిరధరకు కొనుగోలు చేస్తారు. తగ్గుతున్నాయి అనుకున్నపుడు యిలాటి పద్ధతికి వెళితే కొనుగోలుదారుకు అంటే ప్రభుత్వానికి నష్టం, కంపెనీకి లాభం. దీర్ఘకాలిక ఒప్పందం చేసుకునేటప్పుడు ఎవరూ ఫిక్సెడ్‌ ధరకు కొనరు. ఎందుకంటే ఎప్పుడు తగ్గుతాయో, ఎప్పుడు పెరుగుతాయో తెలియదు కనుక. పైగా యింత బల్క్‌ ఆర్డర్‌ తీసుకునేటప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే కోట్లలో నష్టం. 

ఆ రోజుల్లో నానాటికీ డీజిల్‌ ధర క్రమేపీ పడిపోతోందని ఫిబ్రవరి నెల ప్లాటిస్‌ యిండెక్స్‌ చూస్తే తెలిసిపోతోంది. ఇంకా పడిపోతాయని అంతర్జాతీయ పరిశీలకులు వ్యాసాలు రాస్తున్నారు. అలాటప్పుడు ఫిక్సెడ్‌ ధరకు కొనాలనుకోవడం అర్థరహితం, ఏదైనా వ్యక్తిగత అర్థలాభం వుంటే తప్ప! పెట్రోలియం శాఖ మంత్రిగా వున్న పిసి సేఠీ అదే పని చేశాడు. గడువు యింకో వారం పొడిగిస్తున్నామనీ, అన్ని కంపెనీలు ఫిక్సెడ్‌ ధరనే కోట్‌ చేయాలని ఆదేశాలిచ్చాడు. దెబ్బకు తక్కినవన్నీ తప్పుకుని మొదట్లో ఫిక్సెడ్‌ ధర కోట్‌ చేసిన రెండు కంపెనీలే రంగంలో నిలిచాయి. వాటిలో ఒకటి లండన్‌లోని సిట్కో కాగా, మరొకటి హాంగ్‌కాంగ్‌లోని కువో ఆయిల్‌ లిమిటెడ్‌. హాంగ్‌కాంగ్‌ కంపెనీకి ప్రాతినిథ్యం వహిస్తున్నది ఢిల్లీలో వున్న హిందూస్తాన్‌ మోనార్క్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌. ఈ కంపెనీకి ఆయిలుతో ఏ సంబంధమూ లేదు. దానికి హైదరాబాదులో ఒకటి, ఘజియాబాద్‌లో మరోటి రెండు ఫ్యాక్టరీలున్నాయి. ఒక దాన్లో లైట్‌ డిఫెన్స్‌ ఏన్సిలరీస్‌ తయారు చేయగా, మరో దాంట్లో సైకిల్‌ స్పేర్‌ పార్టులు తయారుచేసి ఎగుమతి చేస్తారు. మరి అలాటి దాని టెండరును ఎందుకు పరిగణించాలి? అంటే దాని అధినేత హరీశ్‌ జైన్‌ డెహ్రాడూన్‌లో కమల్‌ నాథ్‌కు స్నేహితుడు. తద్వారా సంజయ్‌ గాంధీకి కావలసినవాడు. కమల్‌ నాథ్‌ మధ్యప్రదేశ్‌కు చెందిన చింద్వారా నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు. పిసి సేఠీ కూడా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చేసి ప్రస్తుతం కేంద్రమంత్రి అయ్యాడు. ఈ డీల్‌ ద్వారా అప్పట్లోనే రూ.9 కోట్లు ప్రభుత్వానికి అదనంగా వ్యయం అయింది. అది కిక్‌బాక్స్‌ రూపంలో కాంగ్రెసు పార్టీకి చేరిందని అంటారు.

ఈ కంపెనీకి కాంట్రాక్టు యిద్దామని సేఠీ అనగానే పెట్రోలియం శాఖలో సెక్రటరీగా వున్న బిబి వోహ్రా అభ్యంతరం తెలిపాడు. నిజాయితీపరుడిగా ఆయనకు చాలా పేరుంది. జనతా ప్రభుత్వం ఆయనను ఇందిరా గాంధీతో బాటు అరెస్టు చేయించినప్పుడు అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇందిర ప్రధానిగా వుండగా ఓఎన్‌జిసికి బాంబే హై ఆయిల్‌ఫీల్డు వద్ద ఆఫ్‌షోర్‌ డ్రిల్లింగ్‌ విషయంలో కన్సల్టన్సీ సర్వీసెస్‌ నాలుగు మిలియన్ల డాలర్ల ఫీజుకే యిస్తానని అమెరికన్‌ కంపెనీ ముందుకు వచ్చినా 17 మిలియన్ల డాలర్ల ఫీజుతో ఫ్రెంచి కంపెనీకి కాంట్రాక్టు యిప్పించాడు అని అభియోగం. హోం మంత్రిగా వున్న చరణ్‌ సింగ్‌కు, బహుగుణకు మధ్య వున్న తగాదా వలన మధ్యలో వోహ్రాను యిరికించి చరణ్‌ సింగ్‌ అరెస్టు చేయించాడంటారు. ఆయనను అరెస్టు చేయగానే అన్ని పార్టీల వారూ ఖండించారు. చివరకు కేసు ఎత్తివేయవలసి వచ్చింది. ఇందిర మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆయన్ను మళ్లీ పెట్రోలియం సెక్రటరీగా వేశారు. ఆ హోదాలో ఆయన 'ఆయిలు ధరలు మరింతగా పడిపోతాయని అందరికీ తెలిసిన యీ తరుణంలో ఫిక్సెడ్‌ ధరతో కొనకూడదు' అని ఫైలుపై రాశాడు. ఆయనలాగే తక్కిన అధికారులూ అభిప్రాయపడ్డారు. కానీ సేఠీ మాత్రం 'ఆయిలు ధరలు యిప్పుడు పాతాళంలో వున్నాయి. ఇంతకంటె తక్కువ కాలేవు. ఈ ధరలో బేరం కుదిర్చేసుకుంటేనే లాభం' అని వారితో వాదించాడు. అంతేకాదు, ప్రజాభిప్రాయాన్ని తన నిర్ణయానికి అనుకూలంగా మార్చుకోవడానికి మూడు పెద్ద పత్రికలలో కథనాలు వేయించాడు - ధరలింతకంటె తగ్గవు అని. ఫిబ్రవరి 22 న కువో ఆయిల్‌ కంపెనీకి స్థిరధరపై కాంట్రాక్టు యిచ్చేయడం జరిగింది. ఇక్కడ యింకో మోసం కూడా జరిగింది. ఐఓసి, ఓఎన్‌జిసి కొనుగోళ్లలో డైరక్టుగా విదేశీ కంపెనీలే ఒప్పందం చేసుకోవాలి తప్ప వారి యిండియన్‌ ఏజంట్లు ఒప్పందం చేసుకోకూడదనే నియమం వున్నా, దీని విషయంలో దాన్ని ఉల్లంఘించి హిందూస్తాన్‌ మోనార్క్‌ ద్వారా చెల్లింపులు సాగాయి. 

ఆ తర్వాత చూడబోతే అధికారులు చెప్పినట్లే ఆయిలు ధరలు వడివడిగా పడిపోయాయి. ఈ విధానంలో 5,12,155 టన్నుల డీజిల్‌కై ప్రభుత్వం మొత్తం 180.90 మిలియన్‌ డాలర్లు చెల్లించింది. అదే ఫ్లోటింగ్‌ రేటులో తీసుకుని వుంటే పది మిలియన్‌ డాలర్లు సరిపోయి వుండేది! ఈ విషయం బయటకు వస్తే ఎవరి కారణంగా యీ నిర్ణయం తీసుకున్నారనే చర్చ వస్తుంది. అది రాకుండా చేయాలంటే పి-20 అనే పేరుతో వున్న ఆ ఫైలు మాయం చేయాలి. మార్చి 7 న సేఠీని ఆ శాఖ నుండి తప్పించి అతని స్థానంలో వీరేంద్ర పాటిల్‌ను తెచ్చారు. అతను యీ ఫైలును ప్రధాని కార్యాలయానికి పంపాలని నిశ్చయించుకున్నాడు. ఎందుంటే ధరల విధానంపై మార్గదర్శకత్వం కోసమట! దస్త్రం మొత్తం ఆర్‌కె ధావన్‌ చేతికి వెళ్లిపోయింది కానీ యీ విషయాన్ని ఎక్కడా రికార్డు చేయలేదు. ప్రధాని కార్యాలయం నుంచి ఏ మార్గదర్శనమూ రాలేదు. దాని గురించి ఎక్కడా ప్రస్తావన కూడా లేదు. కొన్నాళ్లకు వీరేంద్ర పాటిల్‌ వెళ్లిపోయి సేఠీ మళ్లీ మంత్రి అయ్యాడు. వ్యవహారం మాటు మణిగింది. డిసెంబరులో ఆడిట్‌ వాళ్లు వచ్చి యీ డీల్‌ పూర్వాపరాలు పరిశీలిస్త్తామన్నారు. మంత్రిత్వ శాఖలోని డిప్యూటీ డైరక్టరు పెట్రోలియం సెక్రటరీకి డిసెంబరు 6 న లేఖ రాసి ఫైలు పంపమన్నాడు. వీళ్లు ఫైలు దొరకలేదన్నారు. పంపకపోతే ఎలా అని వాళ్లు రాశారు. దొరకకపోతే ఎలా పంపడమంటూ వీళ్లు రాశారు. అది అక్కడితో ఆగింది. 

పబ్లిక్‌ అండర్‌టేకింగ్స్‌పై పార్లమెంటరీ కమిటీ (సిఓపియు) ప్రభుత్వసంస్థల లావాదేవీలన్నీ పరిశీలిస్తుంది. వాళ్లు కువో ఆయిల్‌ డీల్‌ విషయంలో 1982 ఫిబ్రవరి 20 న ఐఓసి చైర్మన్‌గా వున్న సిఆర్‌ దాస్‌గుప్తాను 'మీరు ఫిక్సెడ్‌ ధరపై ఎందుకు కొన్నారు?' అని అడిగారు. ఆయన ''మీరు ఆ ప్రశ్న మంత్రిత్వశాఖను అడగాలి. మాకు కొనమని, డబ్బులు చెల్లించమని ఆదేశాలు వచ్చాయి, అమలు చేశాం' అని జవాబిచ్చాడు.  కమిటీకి సందేహం వచ్చి ఫైలు చూస్తానంది. పెట్రోలియంకు శాఖలో అప్పటి సెక్రటరీ లవరాజ్‌ కుమార్‌ ఓ వారంలో ఫైలు వెతికి పంపిస్తామన్నాడు కానీ మార్చి 31 వరకు పంపలేదు. ఫైలు పోయిందని తెలియపరచాడు. కమిటీకి ఏం చేయాలో పాలుపోలేదు. ఈ విషయం రిపోర్టులో రాద్దామా అనుకుంటూండగానే పి-20 ఫైలు ఎక్కణ్నుంచో తేలి వాళ్ల ముందుకు వచ్చింది. వాళ్లు క్షుణ్ణంగా చదివి 'ఫిక్సెడ్‌ ధరకు కొని వుండాల్సింది కాదు' అని రిపోర్టులో వ్యాఖ్యానించారు. కానీ ఫైలు మిస్సయిపోయిందని, మళ్లీ దొరికిందని రాయలేదు. ఎందుకు రాయలేదని అనేకమంది సభ్యులు అభ్యంతరం తెలిపినా కమిటీ చైర్మన్‌ 'అవన్నీ చిన్న విషయాలు, రిపోర్టులో రాయనక్కరలేదు' అని కొట్టిపారేశాడు. చైర్మన్‌ మరెవరో కాదు, సంజయ్‌ గాంధీకి అత్యంత ఆప్తుడైన బన్సీ లాల్‌! కానీ సభ్యులు పట్టుపట్టారు. అప్పుడు బన్సీలాల్‌ నాకు ఒంట్లో బాగాలేదంటూ మీటింగు అర్ధాంతరంగా ఆపేసి వెళ్లిపోయాడు. ఆ రిపోర్టును పార్లమెంటుకు సబ్మిట్‌ చేసేశాడు. 

ఈ విషయం ''ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌'' ద్వారా బయటకు తెచ్చిన ఘనత అరుణ్‌ శౌరీదే! ఆ సందర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అంతర్గత కలహం కూడా అసక్తికరమైనదే. అది ప్రముఖ పాత్రికేయుడు బిజి వర్గీస్‌ ''ఫస్ట్‌ డ్రాఫ్ట్‌'' పేర రాసిన ఆత్మకథలో కనబడుతుంది. పాత్రికేయుడిగా మారి పరిశోధనాత్మక, సంచలనాత్మక పాత్రికేయుడిగా పేరు తెచ్చుకున్న అరుణ్‌ శౌరీ ప్రపంచబ్యాంకు ఎకనమిస్టు. రైటిస్టు విధానాలకు కట్టుబడినవాడు. లెఫ్ట్‌ అన్నా, కమ్యూనిజం అన్నా, సోషలిజం అన్నా, కాంగ్రెసు అన్నా ఒంటికాలిపై లేస్తాడు. ఎమర్జన్సీ తర్వాత ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అధినేత రామనాథ్‌ గోయెంకా యిచ్చిన అండదండలతో, రహస్యసమాచారంతో ధైర్యంగా కథనాలు రాసి దేశంలోని యువత కంతటికీ ఆరాధ్యదైవం అయిపోయాడు. అయితే స్వభావరీత్యా అతనికి ఆవేశం, తొందరపాటు ఎక్కువ, ఓర్పు తక్కువ. తాను పట్టిన కుందేలుకి మూడేకాళ్లు అనే రకం. తనతో విభేదించినవాణ్ని శత్రువుగా చూసే తరహా. ఆరెస్సెస్‌ను, బిజెపిని సమర్థిస్తూ వచ్చిన అరుణ్‌ శౌరీ ప్రస్తుతం అరుణ్‌ జైట్లీపై మండిపడుతున్నాడు.

వర్గీస్‌ తన ఆత్మకథలో రాసిన దాని ప్రకారం ఆయన 1982 జూన్‌లో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో చేరడానికి ముందే గోయెంకాతో జరిగిన సమావేశంలో ఆయన అరుణ్‌ని పిలిచి అతని ఎదుటే వర్గీస్‌తో 'ఇతను రేసు గుఱ్ఱం లాటివాడు. పగ్గాలేసి ఆపుతూ వుండాలి' అని చెప్పాడు. 'మేం యిద్దరం స్నేహితులమే లెండి' అని చెప్పాడు వర్గీస్‌. అది జరిగిన నెల రోజుల్లోనే అరుణ్‌ ''కువో ఆయిల్‌ డీల్‌'' గురించి మూడు భాగాలుగా కథనం రాసుకుని వచ్చాడు. పార్లమెంటరీ కమిటీకి వచ్చిన పేపర్లను సంపాదించి దాని ఆధారంగా తయారుచేశానని చెప్పాడు. వర్గీస్‌ అంతా చదివి 'చాలా బాగుంది, వేద్దాం, అయితే కమిటీవాళ్లు తమ రిపోర్టు పార్లమెంటుకి సబ్మిట్‌ చేయడానికి ముందే మనం దీన్ని బయటపెడితే పార్లమెంటు హక్కులకు భంగం కలిగించినట్లవుతుంది. రిపోర్టు సబ్మిట్‌ చేశారో లేదో తెలుసా?' అని అడిగాడు. 'తెలియదు, తెలుసుకోనక్కరలేదు' అన్నాడు అరుణ్‌ బింకంగా. వర్గీస్‌ కావాలని కథనాన్ని తొక్కిపెడుతున్నాడని అతనికి అనుమానం కలిగింది. 'నేను ఆర్టికల్‌ విత్‌డ్రా చేసుకుంటున్నాను' అని కటువుగా చెప్పేసి గదిలోంచి బయటకు వెళ్లిపోయాడు. అతను కాస్త చల్లబడ్డాక నచ్చచెపుదామని వర్గీస్‌ ఆగాడు. 

కానీ అరుణ్‌ మర్నాటికల్లా ఒక ఉత్తరం రాసి పంపాడు. 'దీన్ని వెంటనే ప్రచురిస్తే బ్రీచ్‌ ఆఫ్‌ ప్రివిలేజ్‌ అవుతుందని నేను అనుకోవటం లేదు. మన పేపర్లో కథనం రాగానే పార్లమెంటులో చర్చ జరిగి, మన పేపరు ప్రతిష్ఠ పెరిగి, సర్క్యులేషన్‌ పెరుగుతుంది. కానీ గోయెంకాకు చెప్తే భయపడతారు. ఇప్పటికే ఆయన ఆర్థిక యిబ్బందుల్లో వున్నాడు. ఎమర్జన్సీ సమయంలో పడిన దెబ్బ తర్వాత ఇందిరా గాంధీతో పేచీ పెట్టుకోవడానికి సిద్ధపడరు. ఆయనే మీకు చెప్పి యీ కథనాన్ని ఆపించివుంటారు. కానీ ఆయనకు తెలియదు, యీ కథనాన్ని వేయడం వలన పత్రిక బలపడుతుందని! అందువలన  గోయెంకాగారు వద్దన్నా మనం యిద్దరం కలిసి దీన్ని పబ్లిక్‌లోకి తీసుకెళదాం. అంతిమంగా గోయెంకాగారికే మేలు కలుగుతుంది.' అని రాశాడు. రాసినవాడు ఊరుకోకుండా గోయెంకాకు కాపీ పంపాడు! దీని ప్రకారం ఎడిటరు, అతని అసిస్టెంటు కలిసి ప్రొప్రయిటరుపై కుట్ర పన్నాలన్నమాట - అదీ ఆయన క్షేమం కోరే! వర్గీస్‌కు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. గోయెంకాకు ఫోన్‌ చేశాడు. ఆయన బొంబాయి నుంచి అహ్మదాబాదుకి వెళుతున్నాడు. ఈయన విషయమంతా చెప్పాడు. తను కథనం ఎందుకు ఆపాడో కూడా చెప్పాడు. రెండు రోజుల తర్వాత గోయెంకా నుంచి స్పందన వచ్చింది. ఆయన విపరీతమైన కోపంతో అప్పటిదాకా సొంత కొడుకులా చూసుకున్న అరుణ్‌ను ఉద్యోగం నుంచి తీసేద్దామనుకున్నాడు. అరుణ్‌కు మరో ఛాన్సిద్దాం, తొందరపడకండి అని వర్గీస్‌ నచ్చచెప్పి అరుణ్‌కు ఫోన్‌ చేసి 'నువ్వు చేసినది పొరపాటు' అని చెప్పాడు. 

అరుణ్‌ తగ్గలేదు. ఇంకా ముందుకు వెళ్లిపోయాడు. కువో ఆయిల్‌ డీల్‌పై తన కథనాన్ని 50 మంది ఎంపీలకు పంపాడు. పెట్రోలియం మంత్రికి కూడా! దీన్ని పార్లమెంటులో ప్రస్తావించండి అని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ లెటర్‌హెడ్‌పై లేఖ రాసి జత పరిచాడు. జులై 4 న వాటి కాపీలు వర్గీస్‌కు పంపారు కొందరు. వర్గీస్‌ తెల్లబోయి అరుణ్‌ని యిదేమిటి అని అడిగితే 'కమిటీలకు బాధ్యత వుండదు. వాళ్లు నిజాల్ని దాచవచ్చు. ఒక భారతపౌరుడిగా నిజాలు అందరికీ తెలిపే హక్కు వుంది' అని జవాబిచ్చాడు. 'పౌరుడిగా పాత్ర ధరిస్తూంటే ఎక్స్‌ప్రెస్‌ లెటర్‌హెడ్‌ వుపయోగించాల్సింది కాదు, దాని కారణంగా నువ్వు ఎక్స్‌ప్రెస్‌ పాత్రికేయుడిగానే చూడబడతావు. పిక్చర్‌లోకి పత్రికను తీసుకురావడం చేత యిబ్బందులు సృష్టిస్తున్నావు' అన్నాడు వర్గీస్‌. కానీ అరుణ్‌ వినలేదు.

అయితే యీ లోపున సేకరించిన సమాచారం ప్రకారం ఆ రిపోర్టు పార్లమెంటుకి ఏప్రిల్‌ 26నే సమర్పించడం జరిగింది. అందువలన దానిలోని విషయాలను బహిరంగంగా పబ్లిష్‌ చేయడం హక్కులకు భంగం కలిగించదు. 'కాస్త ఓర్పు వహించి, యీ ముక్క ముందే కనుక్కుంటే పోయేదానికి యింత గొడవ చేశావు కదా' అని అరుణ్‌ని మందలించి, వర్గీస్‌ ఆ కథనాలను ''ద కేస్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ ఫైల్‌'' పేర మూడు భాగాలుగా జులై 10 నుంచి ప్రచురించాడు. అరుణ్‌ యీ లోపున నాలుగో భాగం కూడా తయారుచేసి జోడించాడు. పార్లమెంటులో దీనిపై చాలా రోజుల పాటు రగడ జరిగింది. చివరకు ప్రభుత్వం దిగివచ్చింది. అప్పటి పెట్రోలియం మంత్రి శివశంకర్‌ 'ఈ డీల్‌ విషయంలో విచారించదగిన పొరపాటు (రిగ్రెటబుల్‌ ఎర్రర్‌) జరిగిందని ఒప్పుకున్నాడు. తర్వాత జరిగిన సంఘటనలతో అరుణ్‌ చల్లారాడు. వర్గీస్‌కు కృతజ్ఞతలు చెప్పాడు. గోయెంకా, అరుణ్‌ ఎప్పటిలాగా ఆత్మీయులై పోయారు. దేశానికి జరిగిన నష్టం మాత్రం పూడలేదు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2016)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?