Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ క్రైమ్‌ రచన: నమ్మాలా? వద్దా?

రష్యాకు, జపాన్‌కు మధ్య 1904-05లో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో జయాపజయాలను నిర్ణయించినది సైనికబలం కాదు, గూఢచర్యబలం! అందునా మామూలు గూఢచారిలా సమాచారం సేకరించడం కాదు, డబుల్‌ క్రాస్‌ చేయడం. ఈ గూఢచారి గురించి తెలుసుకోవాలన్నా, అతని ప్రతిభ అర్థం కావాలన్నా ముందుగా ఆ యుద్ధం గురించి కాస్త తెలుసుకోవాలి. 

రష్యాకు పసిఫిక్‌ మహాసముద్రం వైపు వున్న నౌకాశ్రయాలన్నీ శీతాకాలంలో గడ్డకట్టుకుపోయేవే. వ్లాదివొస్తోక్‌ రేవు వేసవికాలంలో మాత్రమే పని చేసేది. పోర్ట్‌ ఆర్థర్‌ అనే రేవు ఏడాదంతా వాడుకోవచ్చు కానీ అది చైనా అధీనంలో వుండేది. రష్యా కోరికపై చైనా దాన్ని వాళ్లకు లీజు యిచ్చింది. 1895లో జపాన్‌ చైనాను గెలిచిన తర్వాత రష్యా లీజు విషయం సందిగ్ధంలో పడింది. ఎందుకంటే జారిస్టు నియంతల పాలనలో వున్న రష్యా తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాలా అని నిరంతరం ప్రయత్నిస్తూండడం జపాన్‌కు రుచించలేదు. రష్యా పశ్చిమాన పోలండ్‌ను ఆక్రమించింది. దక్షిణాన ఆఫ్గనిస్తాన్‌ను ఆక్రమించింది. ఇటు తూర్పు వైపున మంచూరియా, కొరియాలను కూడా పూర్తిగా ఆక్రమించాలని చూస్తోంది. తూర్పు చివర వున్న వ్లాదివొస్తోక్‌ రేవు నుంచి కొరియాపై, జపాన్‌పై దాడి చేయడం అతి సులభం. కానీ యుద్ధం మొదలుపెట్టాక సైన్యాన్ని తరలించడం కష్టమవుతుంది. అందుకని మాస్కో నుంచి వ్లాదివొస్తోక్‌ వరకు 9335 కిమీ.ల ట్రాన్స్‌-సైబీరియన్‌ రైలు లైను ప్రాజెక్టును 1891లో మొదలుపెట్టాడు జార్‌ (రష్యా చక్రవర్తిని అలా పిలుస్తారు) రెండవ నికోలస్‌. అది 1916 నాటికి పూర్తయింది కానీ యీ లోపునే జపాన్‌కు భయం వేసింది - రష్యా తమపై కూడా కన్నేసిందని.

రష్యాను నిలవరించడానికి జపాన్‌ ఒక రాజీ ప్రతిపాదన చేసింది. 'మంచూరియాలో మీ ఆధిపత్యాన్ని మేం అంగీకరిస్తాం, కొరియాలో మా ఆధిపత్యాన్ని మీరు అంగీకరించండి' అని. 'మంచూరియా మాదే కానీ కొరియా మీది కాదు, దాన్ని తటస్థదేశంగా - బఫర్‌ జోన్‌గా - వుంచుదాం' అంది రష్యా. సంధి ప్రతిపాదనలు వీగిపోయాక 1904లో జపాన్‌ నేవీ పోర్ట్‌ ఆర్థర్‌లో వున్న రష్యా నౌకాదళాలపై దాడి చేసింది. ఇది యిలా చెయ్యబోతుందని రష్యా గూఢచారి వ్యవస్థ (జార్స్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌) ముందే వూహించింది అంటాడు దానిలో కీలకస్థానంలో పని చేసిన జనరల్‌ యాబ్లోన్‌స్కీ. అప్పటికింకా దౌత్య సంబంధాలు చెడిపోలేదు కాబట్టి యిరుదేశాలలో రాయబారి కార్యాలయాలు వుండేవి. వాటిలో పైకి అధికారులుగా నటిస్తూ గూఢచారులు పని చేస్తూ వుండేవారు. టోక్యోలో వున్న రష్యన్‌ రాయబార కార్యాలయంలో ఉద్యోగులుగా పని చేస్తున్న గూఢచారులు జపాన్‌లో సైనిక సమాచారం సేకరించి తమ ఇంటెలిజెన్సు సర్వీస్‌కు పంపుతూండేవారు. ''జపాన్‌పై యుద్ధం అనివార్యమయ్యే పక్షంలో సిద్ధంగా వుండడానికి మనం ఏయే యుద్ధప్రణాళికలు రచిస్తున్నామో అవన్నీ యిక్కడి గూఢచారులకు తెలిసిపోతున్నాయి. మన వ్యవస్థలో ఎక్కడో లీక్‌ వుంది. ఎవరో కానీ మన రాజధాని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో వున్న జపాన్‌ రాయబార కార్యాలయ ఉద్యోగికి మన రహస్యాలు అందిస్తున్నారు. అతని ద్వారా వీళ్లకు సమాచారం వస్తోంది. అతనెవరో కనుక్కోండి.'' అని వాళ్లు మాటిమాటికీ హెచ్చరించేవారు.

మిలటరీ యింటెలిజెన్సు డివిజన్‌ చీఫ్‌కు అసిస్టెంటుగా పనిచేస్తున్న కెప్టెన్‌ యాబ్లోన్‌స్కీ జపాన్‌ రాయబార ఉద్యోగులపై దృష్టి సారించి చూస్తే అతని కంటికి కెప్టెన్‌ తనామా కనబడ్డాడు. అతను రాయబార కార్యాలయానికి మిలటరీ ఎటాచీగా 1901లో వచ్చాడు. మామూలు జపనీయుల్లా కాకుండా ఆరడుగులుంటాడు. కంచురంగు శరీరం. ముఖంలో అందం లేదు కానీ కులీన కుటుంబంలో పుట్టడం చేత కాబోలు హుందాతనం వుంది. యూనిఫాం వేసుకుని, దర్జాగా తిరుగుతూంటే అతనిలో ప్రత్యేకమైన ఆకర్షణ కనబడి రష్యన్‌ మహిళలు అతనంటే పడి చస్తున్నారు. జపాన్‌లో ప్రఖ్యాత వంశానికి చెందిన ధనవంతుడతను. అతని తండ్రిని ప్రిన్స్‌ అంటారు. జపాన్‌ చక్రవర్తి మికాడోకు సన్నిహితుడైన సలహాదారు. తనామా మంచి మాటకారి. స్నేహశీలి. రష్యన్‌ సమాజంలోని పెద్దలందరితో యిట్టే పరిచయాలు పెంచుకున్నాడు. ధారాళంగా ఖర్చు పెట్టేవాడు. అతని మిత్రబృందంలో ఉన్నతాధికారులు, కళాకారులు, ప్రభుత్వోద్యోగులు, వ్యాపారస్తులు, జమీందార్లు అందరూ వుండేవారు. అందరితో పేకాట ఆడేవాడు. జూదంలో ఎప్పుడూ ఓడిపోతూనే వుండేవాడు. కానీ దిగులు పడకుండా చిరునవ్వుతో మళ్లీ ఆటకు కూర్చునేవాడు. యాబ్లోన్‌స్కీ సహోద్యోగులిద్దరూ అతనితో పేకాట ఆడి సంపాదించిన డబ్బుతో తమ వుంపుడుగత్తెలకు వజ్రాలు కొన్నారు. (ఇలా జూదంలో కావాలని ఓడిపోవడం మరో రూపంలో లంచం యివ్వడం లాటిదే. ఈనాటి సమాజంలో కొందరు వ్యాపారస్తులు అధికారులతో యిలాగే ఓడిపోతూ వుంటారు. గెలిచినవాడు ఓడిపోయినవాడిపై జాలి పడుతూ, స్నేహంగా వుంటూ, ఎపుడైనా అడిగితే రహస్యాలు చెప్పేస్తూ వుంటారు. స్నేహం పోగొట్టుకుంటే డబ్బు రాదన్న భయం వుంటుంది. లంచం రూపంలో పుచ్చుకోవడం లేదు కాబట్టి యిది తప్పు కాదంటూ అంతరాత్మను జోకొట్టవచ్చు)

తనామా వ్యవహారాలను ఎంత నిశితంగా పరిశీలించినా యింటెలిజెన్సు డివిజన్‌కు ఏమీ తెలియరాలేదు. అతను అనేకమంది అమ్మాయిలతో తిరుగుతాడు. కానీ వాళ్ల దగ్గర్నుంచి ఏ రహస్యమూ సేకరించడు. ఎందుకంటే ఆ వేశ్యలలో కొందరిని డివిజనే నియమించింది. అధికారులను ప్రశ్నించి చూసినా ఎవరూ ఏమీ చెప్పలేదనే అంటున్నారు. అటు టోక్యోలో రష్యన్‌ గూఢచారులు 'గతంలో కంటె ఎక్కువగా రహస్యాలు బయట పడుతున్నాయి' అంటూ ఫిర్యాదు చేస్తున్నారు. ఇటు తనాకాను తప్ప వేరే వారిని శంకించడానికి ఎవరూ కనబడటం లేదు. అతను చూడబోతే దొరకటం లేదు. చివరకు డివిజన్‌ ఒక నిర్ణయానికి వచ్చింది - ఎలాగోలా తనాకాను దేశం నుంచి తరిమివేయాలి. అతని స్థానంలో వచ్చినవాడు యితనంత గ్లామరున్నవాడు, ఘటికుడు కాకపోవచ్చు. కానీ తనాకాను తరిమివేయడం ఎలా? అతని పరువు తీస్తే అవమానభారంతో అతను దేశం విడిచి వెళ్లిపోతాడు, జపనీయులకు ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి ఆత్మహత్య చేసుకున్నా చేసుకోవచ్చు. 'ఎలా జరిగినా మనకేం పోతుంది, అతని పీడ వదిలితే చాలు' అనుకున్నారు అధికారులు. 

అతన్ని ఎలా యిరికించాలా అని పథకం వేశారు. ఇలైయిన్స్‌కయా అనే నటీమణితో తనాకాకు ఎఫైర్‌ వుందని డివిజన్‌కు తెలుసు. ఆమె వద్దకు ఆఫీసర్లను పంపి ఆమెను ఒప్పించాలని చూశారు. కానీ అతనంటె ఆమెకు యిష్టం కాబోలు, సహకరించడానికి నిరాకరించింది. చివరకు బెదిరించి దారికి తెచ్చుకున్నారు. వారు చెప్పినట్లే ఆమె ఓ సాయంత్రం అతని వద్దకు వెళ్లి వెంటనే తనను పెళ్లి చేసుకోమని కోరింది. ''అది కుదిరే పని కాదు. జపాన్‌ అధికారి జపానేతర మహిళను పెళ్లాడితే ప్రభుత్వోద్యోగం వదిలేయాలి. నేను వెనక్కి వెళ్లిపోవాల్సి వుంటుంది. పోనీ అలా వెళ్లిపోదామనుకున్నా, నేను యిప్పటికే వివాహితుణ్ని. కావాలంటే నీకు కోరినంత డబ్బు యిస్తా.'' అన్నాడు. ''నాకు డబ్బు అక్కరలేదు, నీతో పెళ్లే కావాలి. లేదంటే రచ్చ కెక్కుతా. రేపు రాత్రి దాకా ఆలోచించుకో. నా మాట కాదనే నా నమ్మకం.'' అంటూ యీమె వచ్చేసింది.

మర్నాడే తనాకా యాబ్లోన్‌స్కీకి ఫోన్‌ చేశాడు. ''మీతో అర్జంటుగా మాట్లాడాలి.'' అన్నాడు. యాబ్లోన్‌స్కీ వెంటనే అతని యింటికి వెళ్లగానే సూటిగా ''ఇలైయిన్స్‌కయా వ్యవహారం విన్నారా?'' అని అడిగాడు. ఇతనికి ఏం చెప్పాలో తెలియక ''లేదు'' అన్నాడు. అతను విషయం చెప్పి ''ఆమె బెదిరింపుల వలన నాకు దారులన్నీ మూసుకుపోయాయి. నా పరువు పోయినా ఫర్వాలేదు, ఆత్మహత్య చేసుకోవడానికీ నేను వెరవను. కానీ మా నాన్న జపాన్‌ చక్రవర్తి ప్రివి కౌన్సిల్‌లో సభ్యుడు. వృద్ధుడు. నా గురించి తెలిస్తే తట్టుకోలేడు. ఆయన యీ వయసులో యీ కష్టాన్ని భరించలేడు. నేను ఆత్మహత్య చేసుకుంటే ఆయనా చేసుకుంటాడు. మా బాబాయీ చేసుకుంటాడు. పరువు ప్రతిష్ఠలకు మా జపాన్‌ వాళ్లిచ్చే విలువను మీ రష్యన్లు అర్థం చేసుకోలేరు.'' అన్నాడు. 

కాస్సేపాగి హఠాత్తుగా ''కెప్టెన్‌, కావాలంటే మీరు నన్ను రక్షించగలరు. ఆమె నోరు మూయించగలరు. ప్రతిగా నేను మీకే సాయం చేయాలి?'' అని డైరక్టుగా అడిగేశాడు. 

పథకం పారినందుకు లోలోపల సంతసిస్తున్నా ''ఆవిడ మా మాట వింటుందో లేదో నాకు తెలియదు కానీ నువ్వు రష్యా విడిచి వెళ్లిపోవడం మాత్రం తప్పనిసరి''' అన్నాడు యాబ్లోన్‌స్కీ. 

''అదెలాగూ చేస్తాను. నేను వెళ్లిపోయాకైనా ఆమె రచ్చ చేయవచ్చు. అలా చేయకుండా చూడడానికి మీకు యింకేం కావాలి?'' 

ఇంత సూటి ప్రశ్నకు సమాధానం చెప్పలేక యితను తడబడి ''మా సీనియర్లను అడిగి చెప్తాను.'' అని వచ్చేశాడు. 

ఆఫీసులో చెపితే అందరూ విజయగర్వంతో పకపకా నవ్వారు. ''తనాకా యింత సులభంగా వలలో పడతాడని అనుకోలేదు. ఇప్పుడు ఉత్తిపుణ్యాన యీ ఆఫర్‌ యిస్తున్నాడు. దీనిలో ఓ కుట్ర వుంటుంది. మనం ఉచ్చు వేసి అతన్ని తరిమివేశామని గ్రహించిన జపాన్‌ గూఢచారులు యితని ద్వారా అబద్ధపు సమాచారం యిచ్చి మనల్ని తప్పుదోవ పట్టిద్దామని ప్రయత్నించడానికి చూస్తున్నారు. ఓకే, మనం కూడా ఏమీ తెలియనట్లు అమాయకత్వం నటిద్దాం. 'పోర్ట్‌  ఆర్థర్‌, దక్షిణ మంచూరియాలలో మీ సైన్యం కదలికల గురించి రహస్య సమాచారం సేకరించి మాకు పంపు' అని చెపుదాం. సరేనంటాడు, కొంతకాలానికి పంపుతాడు కూడా. అవి ఉత్తుత్తివని మనకూ తెలుసు. కానీ అవి తయారు చేయడానికి జపాన్‌ వార్‌ కాలేజి వాళ్లు శ్రమ పడుతున్నారన్న తృప్తే మనకు చాలు.'' అన్నాడు డివిజన్‌ చీఫ్‌. 

యాబ్లోన్‌స్కీ తనాకా వద్దకు వెళ్లి ''నువ్వు మాకు రహస్య సమాచారం పంపుతున్నంత కాలం మీ నటీమణి నోరెత్తకుండా చూస్తాం'' అని చెప్పి వచ్చాడు. తనాకా సరేనంటూ మరుసటి రోజే రష్యా విడిచి వెళ్లిపోయాడు. ఇదంతా 1902 ఉత్తరార్థంలో జరిగింది. ఆ ఏడాది డిసెంబర్లో డివిజన్‌ వారందరూ తనాకాను మర్చిపోయిన సమయంలో టోక్యోలోని రష్యా మిలటరీ ఎటాచీ పంపిన డిప్లొమాటిక్‌ పౌచ్‌లో (దౌత్యసంప్రదాయాల ప్రకారం దాన్ని జపాన్‌లో ఎవరూ తెరిచి చూడకూడదు) ఒక పార్శిల్‌ వచ్చింది. దానిలో పోర్ట్‌ ఆర్థర్‌లో జపాన్‌ సేనలు ఎక్కడ దిగుతాయో, ఎటు వెళతాయో, ఎంతమంది వస్తారో అతి చిన్న అంశం దగ్గర్నుంచి విశదంగా వుంది. యుద్ధం ప్రారంభం కాగానే ఎంతమంది ఎటు వెళతారో కూడా ప్లాన్లు వేసి వున్నాయి. ఆ ప్లాన్లను క్షుణ్ణంగా పరిశీలించిన రష్యన్‌ గూఢచారి డివిజన్‌ వారు వాటిలోని నవ్యత్వానికి ఆశ్చర్యపడ్డారు. ''మనల్ని మోసగించడానికి తయారుచేసిన ప్లాన్లను కూడా ఆషామాషీగా చేయలేదు. చాలా శ్రద్ధగా, ఓపిగ్గా చేశారు'' అని  ఓ సీనియరు అధికారి మెచ్చుకున్నాడు. 

''ఒకవేళ అవి నిజమైనవేమో..'' అని సందేహించాడు ఓ జూనియర్‌.

''నాన్సెన్స్‌! మనకు అలా తోచాలనే అంత విపులంగా తయారుచేశారు.'' అన్నాడు చీఫ్‌ మండిపడుతూ. అందరూ కలిసి వాటిని చుట్టచుట్టి అటక మీద పడేశారు. 

ఆర్నెల్ల తర్వాత 1903 వేసవికాలంలో యింకో సెట్టు వచ్చింది. ఈ సారి దక్షిణ మంచూరియాలో, మరీ ముఖ్యంగా ముక్‌డెన్‌లో జపాన్‌ సైన్యపు కదలికల గురించి వేసిన పథకాలు. అవి ఎంత ఆథెంటిక్‌గా వున్నాయంటే వాటిని నమ్మనివారు యీ సారి రెట్టింపయ్యారు. ఇద్దరు ముగ్గురు మాత్రం 'వీటిని నిర్లక్ష్యం చేయకుండా అవి నిజమే అనుకుని మనం కౌంటర్‌ ప్లాన్లు తయారు చేసుకుంటే మంచిది కదా' అన్నారు. 'ఆ పని అనుకున్నంత సులభం కాదు. మన పథకాలను పరిపూర్ణంగా మార్చవలసి వస్తుంది' అన్నాడు చీఫ్‌. ఫైనల్‌గా వీటినీ అటకెక్కించాలని దాదాపు అందరూ కలిసి నిర్ణయించారు.

1903 డిసెంబరులో మూడో సెట్టు కూడా వచ్చింది. ఈసారి యాలూ నది తీరంలో జరగబోయే యుద్ధం గురించి ప్రణాళికల గురించి. 'దీనిపై మళ్లీ చర్చకు కూర్చుందామా, అనవసరమా?' అని వూగిసలాడుతూండగానే జపాన్‌ నుంచి ఓ కబురు వచ్చింది. 'వార్‌ ఆఫీసు నుండి యుద్ధపథకాలను దొంగిలిస్తూ పట్టుబడిన నేరానికి తనాకాను శత్రు గూఢచారిగా నిర్ణయించి ఉరి తీశారు.' అని. ఇది కూడా జపానీయుల నాటకమేమో అని డివిజన్‌ వారు అనుకున్నారు. కానీ టోక్యోలో రష్యా రాయబారి ధృవీకరించాడు. అంతేకాదు, కొన్ని రోజుల తర్వాత తన కొడుకు చేసిన దేశద్రోహంతో మనసు కలత చెంది, అవమానభారంతో అతని తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అతని పదవి దృష్ట్యా యీ వార్త అంతర్జాతీయంగా అన్ని పత్రికలలోను వచ్చింది.

అప్పటిదాకా తనాకా పేపర్లను చిత్తుకాగితాల్లా చూసిన డివిజన్‌ ఉలిక్కిపడింది. అటక మీద నుంచి పాత కాగితాలను దింపి వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేయసాగారు. వాటికి కౌంటరు ప్లాన్లు తయారుచేయడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డారు. సైన్యం కదలికలపై యివ్వవలసిన ఆదేశాలను సాంతం మార్చుకోవలసి వచ్చింది. ఇంకో రెండు నెలలకే 1904 ఫిబ్రవరిలో జపాన్‌ హఠాత్తుగా దాడి చేయడంతో రష్యా కూడా యుద్ధంలో దిగిపోయింది. 1904 ఏప్రిల్‌ 30న యాలూ నదిపై జరిగిన యుద్ధం యుద్ధం దిశను మార్చింది. తనాకా కాగితాల ప్రకారం వేసుకున్న పథకాలకు అనుగుణంగా రష్యన్లు అక్కడ సైన్యాన్ని మోహరించారు. కానీ వీళ్ల సైన్యదళం వున్న ప్రతి చోట వీళ్లకు రెట్టింపు జపాన్‌ సైన్యదళాలు వున్నాయి. రష్యా దళాలు పారిపోయేటప్పుడు జపాన్‌ సైన్యం వారిని నాశనం చేసింది. ఎందుకంటే వెనుకంజ వేసినపుడు రష్యన్లు తప్పు దిశగా వెళ్లారు. ఎందుకు వెళ్లారు? తనాకా పేపర్లను నమ్మారు కాబట్టి! 

ఆ యుద్ధమనే కాదు, పోర్ట్‌ ఆర్థర్‌ వద్ద, ముక్‌డెన్‌ వద్ద అన్ని చోట్లా పరాజయమే ఎదురైంది. ఎందుకంటే తనాకా పేపర్లు తమను మోసగించాయని తెలిసినా ప్లాన్లను మార్చుకునే వ్యవధి రష్యన్లకు లేదు. 'ట్రాన్స్‌ సైబీరియన్‌ రైల్వే ద్వారా తగినంత సైన్యం వచ్చి చేరకపోయినందువలన మేం ఓడిపోయామని కొందరు చరిత్రకారులు రాస్తారు. కానీ అది నిజం కాదు. మాకు చాలినంత సైన్యం వుంది కానీ కావలసిన చోట లేదు. యుద్ధం ఒక చోట జరిగితే సైన్యం మరో చోట వుంది. ఇదంతా తనాకా కాగితాలను నమ్మిన ఫలితం.' అంటాడు యాబ్లోన్‌స్కీ. 

యుద్ధంలో గెలుపోటములు సహజం. కానీ యీ యుద్ధం చరిత్ర గతినే మార్చేసింది. ఈ యుద్ధంలో మొట్టమొదటిసారి ఒక ఆసియన్‌ దేశం పాశ్చాత్య దేశాన్ని ఓడించింది. అమెరికా అధ్యక్షుడు థియోడోర్‌ రూజ్వెల్ట్‌ మధ్యవర్తిత్వం వహించి రష్యాకు మరీ నష్టం కలగకుండా చూశాడు కానీ రష్యన్‌ ప్రజలకు ఓటమిపాలైన జార్‌పై అసహ్యం పుట్టింది. తన సైన్యంపై, గూఢచారి వ్యవస్థపై అపారమైన నమ్మకంతో అతను యుద్ధాన్ని కొనసాగించి పరువు పోగొట్టుకున్నాడు. యుద్ధం ద్వారా తమకేమీ లాభం ఒనగూడనందుకు జపాన్‌ ప్రజలకు నిరాశ, మధ్యవర్తిత్వం వహించిన అమెరికాపై ఆగ్రహం కలిగాయి కానీ వారి ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. జపాన్‌ వంటి చిన్నదేశంలో ఓడిపోయినందుకు రష్యాకు అంతర్జాతీయంగా పరువు పోయింది. రష్యాను చులకనగా చూసిన జర్మనీ ధైర్యంగా ముందడుగు వేసి మొదటి ప్రపంచ యుద్ధానికి తెర తీసింది. జార్‌ పరువు బజార్న పడడంతో 1917 ఫిబ్రవరిలో రష్యాలో సామాన్యులు సైతం అతనిపై తిరగబడ్డారు. జారిస్టు రష్యా కూలిపోయి, సోషలిస్టు రష్యా ఆవిర్భవించింది. చరిత్ర గతిని మార్చింది.

ఇన్ని మార్పులకు కారణం యీ యుద్ధంలో జపాన్‌ గెలుపు. ఆ గెలుపుకు కారణం రష్యన్‌ గూఢచారి వ్యవస్థ తనాకా పథకాలను నమ్మి మోసపోవడం! తనాకా కాగితాలు నిజమైనవి కావని యుద్ధం జరుగుతూండగానే అర్థమైంది. కానీ జపాన్‌ గూఢచారులు తనాకాను కూడా మోసగించారా? పాపం తనకి తెలియకుండా అతను మమ్మల్ని తప్పుదోవ పట్టించాడా? అన్న సందేహం రష్యన్‌ గూఢచారి డివిజన్‌కు కలిగింది. యుద్ధఖైదీలుగా పట్టుబడిన జపాన్‌ సైనికాధికారిని యాబ్లోన్‌స్కీ 'తనాకా గురించి తెలుసా?' అడిగాడు. 'తెలియకపోవడమేం? ఆయన మా జాతీయ హీరో. మా చక్రవర్తి ఆయనకు, ఆయన కుటుంబానికి 'ఆర్డర్‌ ఆఫ్‌ రైజింగ్‌ సన్‌' బిరుదిచ్చి సత్కరించాడు.'' అన్నాడతను. 

''ఓ, అంటే అతని ఆత్మహత్య, అతని తండ్రి ఆత్మహత్య అంతా బూటకమన్నమాట!?''

''కాదు, కాదు. వాళ్లు నిజంగానే ఆత్మహత్య చేసుకున్నారు. తను ఆత్మహత్య చేసుకోకపోతే, గూఢచారిగా ముద్ర వేయించుకుని అప్రతిష్ఠపాలు కాకపోతే, మీరు ఆ కాగితాలను నమ్మరని అతనికి తెలుసు. అందుకనే జపాన్‌ గూఢచారులతో కలిసి అతను పన్నిన పన్నాగమిది. అతని తండ్రి కూడా దీన్ని ఆమోదించి, తన వంతు పాత్ర తను నిర్వహించాడు. అందుకే వారికి ఆ సత్కారం.'' అన్నాడు జపాన్‌ అధికారి.

రష్యన్‌ విప్లవం తర్వాత బ్రిటన్‌ పారిపోయి వచ్చిన యాబ్లోన్‌స్కీ యీ కథంతా ఓ జర్నలిస్టుకు చెప్పి 'ఆ తనాకాను మేం నమ్మకుండా వుంటే మా దేశంలో యీ కమ్యూనిస్టు రాజ్యం వచ్చేదే కాదు. కానీ మమ్మల్ని డబుల్‌క్రాస్‌ చేయడానికి ఏకంగా ఆత్మహత్య చేసుకునే వాళ్లుంటారని మేం మాత్రం ఎలా వూహించగలం? ఈ జపాన్‌ వాళ్ల దేశభక్తిని అర్థం చేసుకోవడం మహా కష్టం బాబూ' అని వాపోయాడు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2016)

[email protected]

Click Here For Crime Rachanalu

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?