Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ క్రైమ్‌ రచన: సాహసము శాయరా డింభకా- 2/2

ఈ తరహా ఫ్రాడ్‌ 1950ల నాటిది కాదు. అంతకు 370 ఏళ్ల కితం నాటిది. 1588లో స్పెయిన్‌ సైన్యం ఇంగ్లీషు వారి చేతిలో ఓడిపోయింది. స్పెయిన్‌ వారి ఓడలు మునిగిపోయి నావికులు ఇంగ్లీషు తీరాలకు కొట్టుకుపోతే వారిని ఇంగ్లీషు జైళ్లలో పడేసి, డబ్బిచ్చి తీసుకెళ్లేదాకా వదలమని చెప్పారు. అది తెలిసి స్పెయిన్‌లో కొందరికి దుర్బుద్ధి పుట్టింది. ఖైదులో పడిన సైనికుల దురవస్థ గురించి వర్ణించి చెప్పి వారి బంధువులనుంచి, స్నేహితులనుంచి అవసరమైన దాని కంటె ఎక్కువ సేకరించి, ఇంగ్లీషువాళ్లకు కట్టేయగా మిగిలినది తమ వద్ద వుంచేసుకునేవారు. కొందరు ఖైదీలను విడిపించేవారు కూడా కాదు - బయటకు వస్తే తమ సంగతి బయట పడుతుందని. కొన్నాళ్లకు వాళ్లు సైనికులతో ఏ బంధుత్వం లేని వారి దగ్గర కూడా డబ్బు లాగడానికి కథలు అల్లసాగారు. ఖైదీకి ఒక గుప్తనిధి గురించి తెలుసని, యిప్పుడు ధనసాయం చేసి బయటకు తీసుకుని వస్తే ఆ నిధి రహస్యం తెలుస్తుందని, ఆ డబ్బు చెరిసగం పంచుకోవచ్చని ఆశ పెట్టసాగారు. బ్రిటిషు జైళ్లలో ఖైదీలు చనిపోయిన చాలా సంవత్సరాల తర్వాత కూడా వాళ్ల పేరు చెప్పి దండుకోవడం జరిగింది. 

ఆ తర్వాత కొంతమందికి యింకో ఐడియా వచ్చింది. స్పెయిన్‌లో ఖైదీలను నేలమాళిగలలో ఖైదు చేసేవారు. అక్కడ పెట్టే చిత్రహింసలు దారుణంగా వుండేవి. 'నేను అలాటి చీకటికొట్టంలో బందీగా వున్నాను. నాకు నిధి రహస్యం తెలుసు. నన్ను విడిపిస్తే మనం ఆ డబ్బు పంచుకోవచ్చు' అని విదేశాలలో వున్నవారికి ఉత్తరాలు పంపసాగారు. విడిపించడానికి మన జాన్‌కు వచ్చిన ఉత్తరంలో లాటి మార్గమే రాసేవారు. ఆశ పడి వచ్చాక జాన్‌ను చేసినట్లే కంగారు పెట్టి డబ్బు వూడలాక్కుని పంపేవారు. క్రమేపీ అమెరికా ధనికదేశం కావడంతో స్పానిష్‌ మోసగాళ్లు అమెరికన్లపై కన్నేశారు. వాళ్లకు ఉత్తరాలు రాసేవారు. 1900లలో రెండు నెలల కాలంలో యిలాటి ఉత్తరాలు వచ్చిన అమెరికన్లు తమకు రిపోర్టు చేయమని పోస్టల్‌ అధికారులు విజ్ఞప్తి చేస్తే 1431 మంది ఉత్తరాలు పట్టుకుని వచ్చి యిచ్చారు. ఇవ్వకుండా దాచుకున్నవారు, వెళ్లి మోసపోయినవారు ఎందరో తెలియదు. 1907 ఒక్క సంవత్సరంలోనే,  స్పెయిన్‌లో ఒక ప్రాంతంలోనే అమెరికన్లు 30 వేల డాలర్లు పోగొట్టుకున్నారని అంచనా. వాళ్లను కంగారు పెట్టి పంపేయడానికి ఫ్రాన్సు సరిహద్దుల్ని ఎంచుకునేవారు. సరిహద్దు అధికారులతో పాటు, పోస్టు టెలిగ్రాఫ్‌ ఉద్యోగులకు లంచాలిచ్చి వశపరుచుకునేవారు. 

ఆ తర్వాత వారిలో కొందరికి అమెరికన్లపై జాలి కలిగింది. మోసపోవడానికి యింత దూరం రప్పించడం దేనికి, దగ్గర్లోనే మెక్సికోకు రప్పిస్తే పోలేదా అనుకున్నారు. లాటిన్‌ అమెరికాకు స్పెయిన్‌కు ఎప్పణ్నుంచో బంధాలున్నాయి కదా. 1922 నుంచి అక్కడ సెటప్‌ చేశారు. 1930లో స్పెయిన్‌ అంతర్యుద్ధం తర్వాత అక్కడ అశాంతి పెరగడంతో విదేశీయులు రావడానికి జంకుతారని, మోసగాళ్లందరూ పొలోమని మెక్సికో, యితర లాటిన్‌ అమెరికా దేశాలకు వచ్చిపడ్డారు. వీళ్లందరికీ అమెరికా వాళ్లే అప్పనంగా దొరికారు. ఒక ముఠాగా ఏర్పడి అనేకమంది జాన్‌లను బుట్టలో పెట్టారు. అందరూ యించుమించుగా జాన్‌లాగే ప్రవర్తించినా కొందరు కాస్త బుర్ర వుపయోగించారు. ఒక్కోసారి ఒక్కళ్లూ వెళ్లడం దేనికని యిద్దరు ముగ్గుర్ని వేసుకుని వెళ్లేవారు. వాళ్లను మొెదట్లో  భయపెట్టకపోయినా నాలుగో రోజున జడ్జి అరెస్టు వారంటు వార్తతో భయపెట్టి, లంచం యివ్వాలంటూ తలా మూడు వేల డాలర్లు గుంజారు. ఇంకోరు డ్రాఫ్టు చూసి యిది చెల్లుతుందో లేదో కనుక్కుని అప్పుడు నీకు డబ్బిస్తా అన్నాడు. సరే బ్యాంకుకు టెలిగ్రాం యివ్వండి అన్నాడు ముఠా సభ్యుడు. పోస్టు ఆఫీసులో మేనేజ్‌ చేసి, డ్రాఫ్టు చెల్లుతుందని బ్యాంకు నుంచి వచ్చినట్లు దొంగ టెలిగ్రాం పుట్టించారు. మరొకరు ట్రంకు వుందా లేదాని కస్టమ్‌ హౌస్‌కు టెలిగ్రాం యిస్తాం అన్నారు. మహరాజులా యిచ్చుకోండి అన్నారు ముఠా వాళ్లు. మళ్లీ పోస్టాఫీసులో గోల్‌మాల్‌, కస్టమ్‌ హౌస్‌ నుంచి టెలిగ్రాం. అమెరికాకు వెళ్లాక చూస్తే పెట్టె లేదు, టెలిగ్రాం చూపిస్తే మేం యివ్వలేదన్నారు. 

ఇలా కొందరు అమెరికన్లు మోసపోవడం తెలుసుకున్న ఒక అమెరికన్‌కు మనం కూడా లాటిన్‌ అమెరికన్లపై యిలాటి ట్రిక్కెందుకు ఉపయోగించకూడదు అనుకున్నాడు. అతని పేరు సెలెడోనియో సెవిల్లా. అతనికో యాడ్‌ ఏజన్సీ వుంది. అతని కథనం ప్రకారం ఖైదీ అమెరికనే. పేరు నెల్సన్‌ లారెన్స్‌ వాట్కిన్స్‌. అమెరికాలో వ్యాపారం చేస్తూ తన వాటాదారులను మోసగించడంతో అమెరికన్‌ జైల్లో పడ్డాడు. అతనికీ ఓ కూతురుంది. వయసు పదిహేనే. ట్రంకులో డబ్బు దాచడం సంగతి, జరిమానా కట్టి డ్రాఫ్టు తీసుకోవడం, కస్టమ్స్‌ హౌస్‌లో ట్రంక్‌ తీసుకుని డబ్బు దాచడం -  డిటోడిటోయే. 'మెక్సికన్లు గౌరవనీయులు, నమ్మకస్తులు అని తెలియడం చేత  జైల్లో ఖైదీల తరఫున ప్రార్థనలు చేసే మతగురువు ఫాదర్‌ జాన్‌ మిల్లర్‌ను మధ్యవర్తిగా పెట్టుకుని మీకు యీ ఉత్తరం రాస్తున్నాను. మా అమ్మాయిని మీ యింట్లోనే పెట్టుకుని, నా ఆస్తిని కాపాడవలసిన బాధ్యతను మీకు అప్పగిస్తున్నాను.' అనే లేఖలు లాటిన్‌ అమెరికన్‌ దేశాలలో వేలాది మందికి గుప్పించాడు. ఉత్తరాలకు జవాబులు ఫాదర్‌ మిల్లర్‌ పేర వస్తాయి కాబట్టి దానికి కేరాఫ్‌ అడ్రసుగా చర్చి వుంటే బాగుంటుందని అనుకున్నాడు. తన ముఠా సభ్యుడొకణ్ని న్యూయార్కులోని కాథలిక్‌ చర్చికి పంపాడు. ''సౌత్‌ అమెరికా నుంచి నా స్నేహితుడు ఫాదర్‌ జాన్‌ మిల్లర్‌ అమెరికా పర్యటనకై వస్తున్నాడు. టూర్లలో తిరుగుతూ వుంటాడు, అతనికి వచ్చే ఉత్తరాలను మీ చర్చి కేరాఫ్‌గా పెడతానంటున్నాడు. నేను వారం వారం వచ్చి తీసుకుంటూంటాను.'' అన్నాడు. చర్చి ఫాదర్‌ అమాయకంగా సరేనన్నాడు. 

అంతే సెవిల్లా ఉచ్చులో పడిన లాటిన్‌ అమెరికన్ల నుంచి కుప్పలుతిప్పలుగా ఫాదర్‌ మిల్లర్‌ పేర ఉత్తరాలు రాసాగాయి. రోజుకి 40, 50 వచ్చేవి. వాటికి జవాబుగా ఫాదర్‌ మిల్లర్‌ పేర సెవిల్లా వివరంగా జవాబు రాసేవాడు. ''మీరు న్యూయార్కుకి వచ్చేటప్పుడు తగినంత డబ్బు తీసుకుని రండి. జరిమానా పెరుగుతుందేమో తెలియదు. ఫైనల్‌గా ట్రంకు తీసుకున్నపుడు దానికున్న పొరలు జాగ్రత్తగా విప్పండి. ఆ పొరల్లోనే 100 డాలర్ల నోట్లు వెయ్యి, 500 డాలర్ల నోట్లు 800, 4 వేల పౌండ్లు, ఆయిల్‌ కంపెనీల్లో పెట్టిన షేర్ల సర్టిఫికెట్లు, మా అమ్మాయి వజ్రాలు, 10 వేల డాలర్ల విలువైన ముత్యాల దండ, చనిపోయిన మా ఆవిడ వజ్రపుటుంగరం, బ్యాంకు ఆఫ్‌ అర్జెంటీనా వారి ఫిక్సెడ్‌ డిపాజిట్లు రెండు..'' యిలా నోరూరించేలా రాసేవాడు. ఇంత హంగు చేసినా సెవిల్లా పథకం ఫలించలేదు. ఎందుకంటే రోజూ ఏభై ఉత్తరాలు వస్తే చర్చికి అనుమానం వస్తుందని భయపడిన సెవిల్లా ఒక ఆఫీసు తెరిచి, ఒకమ్మాయిని కూర్చోబెట్టి, సగం ఉత్తరాలు అక్కడకు రప్పించేవాడు. నేనే ఫాదర్‌ మిల్లర్‌ను అంటూ వచ్చే వ్యక్తి మతగురువు డ్రస్సులో కాకుండా మామూలు దుస్తుల్లో వుండడంతో ఆమెకు అనుమానం వచ్చింది. పోలీసులకు ఉప్పందించింది. వాళ్లు వచ్చి ఉత్తరాలు తెరిచి చూసి సెవిల్లాను అరెస్టు చేశారు. ఏడేళ్ల జైలుశిక్ష పడింది. ఆ పాటికే చాలామంది లాటిన్‌ అమెరికన్‌ సాహసవీరుల న్యూయార్కుకి వచ్చి పదిహేనేళ్ల అందాల భరిణ, ఆమె వజ్రాల భరిణను కాపాడడానికి ఉవ్విళ్లూరారు. ఆ విషయం తెలుసుకుని అమెరికన్‌ పోస్టల్‌ యిన్‌స్పెక్టర్లు అమాయక చక్రవర్తులందరూ ఉత్తర అమెరికాలోనే గూడు కట్టుకుని లేరని, దక్షిణ అమెరికాకు కూడా విస్తరించారని తెలిసి ఆనందించారు.

ఏ మాట కా మాట చెప్పాలంటే ఉత్తర అమెరికాలో మోసపోయిన అమాయకుల కంటె మోసపోకుండా గడుసుగా ప్రవర్తించి, ఉత్తరం చింపి పారేసినవాళ్లు వంద రెట్లు వున్నారు. ఉత్తరం రాసినవాళ్లను హేళన చేసిన కొందరు గడుగ్గాయిలు కూడా వున్నారు. అలాటి కొంటె కోణంగి రాసిన ఉత్తరం ఒకటి - 

''మహాశయా, మీ ఉత్తరం చేరింది. నేను నమ్మదగినవాడినని నాకు బాగా తెలిసున్న వ్యక్తి మీకు చెప్పాడని రాశారు. అంటే దాని అర్థం అతనికి నా సంగతి బొత్తిగా తెలియదన్నమాట. నేనెలాటివాడినైనా మీ విషయంలో మాత్రం సాయపడదలచుకున్నాను. మీరు నాకిచ్చిన ఆఫర్‌ని మించిన ఆఫర్‌ మీకిస్తున్నాను. చాలా ఏళ్ల క్రితం టన్నుల కొద్దీ బంగారం మోసుకొస్తున్న ఒక ఓడ ఒకానొక సముద్రంలో మునిగిపోయింది. అది ఏ సముద్రంలో మునిగిపోయిందో నాకు తెలుసు. మీరు తక్షణం రెండు బోట్లేసుకుని మా వూరొస్తే మీకు ఆ సముద్రం పేరు చెప్పేస్తాను. ఆ రహస్యం మీరెవ్వరికీ చెప్పకూడదు. నిధి దొరికాక, యీ రహస్యం చెప్పినందుకు గాను నాకు దొరికినదానిలో నాల్గో వంతు యిస్తే చాలు. మీరు జైల్లోంచి త్వరగా బయటపడి సముద్రయానానికి సిద్ధపడతారని నా ఆశ. నా పేరు, వూరు యిక్కడ రాయటం లేదు. ఎవరైనా దొంగ వెధవల చేతిలో పడిందంటే రహస్యం బట్టబయలై పోతుంది. ఇట్లు మీ ఆప్తుడు, 'వెర్రి వెంగళప్ప' (సకర్‌) (సమాప్తం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2016)

[email protected]

Click Here For Part-1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?