Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ క్రైమ్ రచన : ఇందిర గొంతు అనుకరించి 60 లక్షల దగా

1971 మే 24. ఢిల్లీలోని స్టేటు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పార్లమెంటు స్ట్రీటు బ్రాంచ్‌లో చీఫ్‌ కాషియర్‌గా పనిచేస్తిన్న వేద్‌ ప్రకాశ్‌ మల్‌హోత్రాకు మధ్యాహ్నం 11.30కు ఒక ఫోన్‌కాల్‌ వచ్చింది. ''నేను ప్రధాని ఆఫీసు నుంచి పిఎన్‌ హక్సర్‌ను మాట్లాడుతున్నాను. కాస్సేపు వుండండి, ప్రధాని ఇందిరా గాంధీ మీతో మాట్లాడతారు.'' అని ఫోన్లో ఒకతను చెప్పాడు. కొన్ని నిమిషాల తర్వాత అందరికీ సుపరిచితమైన ఇందిర వాయిస్‌ వినబడింది. ''బంగ్లాదేశ్‌లో నిర్వహిస్తున్న ఒక రహస్య కార్యక్రమానికి అర్జంటుగా రూ.60 లక్షలు అవసరం పడ్డాయి. ఇది జాతీయభద్రతకు సంబంధించిన వ్యవహారం. అందుచేత మీరు వెంటనే ఆ డబ్బు రెడీ చేసి కారులో చాణక్యపురి వద్దకు తీసుకురండి. అక్కడకు నా తరఫు మనిషి ఒకతను వస్తాడు. నేను యిప్పుడు చెప్తున్న కోడ్‌వర్డ్‌ 'బంగ్లాదేశ్‌ బాబు' అని మీతో అంటాడు. ''మీరు 'బార్‌ఎట్‌లా' అనాలి. అప్పుడు అతనికీ మీరు ఫలానా అని తెలుస్తుంది. మీరు డబ్బు అతనికి అప్పగించిన ఆ తర్వాత పార్లమెంటు హౌస్‌కు వచ్చి నన్ను కలిసి ఆ డబ్బుకు రసీదు తీసుకోండి.'' అని చెప్పారు. ''సరే, మాతాజీ'' అన్నాడు మల్‌హోత్రా. వెంటనే తన అసిస్టెంట్లు ఆర్‌ పి బాత్రా, ఎచ్‌ ఆర్‌ ఖన్నాలను పిలిచి చెస్ట్‌ లోంచి డబ్బు తీయమన్నాడు. క్యాష్‌ అడిగితే డిప్యూటీ చీఫ్‌ క్యాషియల్‌ రావల్‌ సింగ్‌ ఓచరుమీద ఎవరు సంతకం పెడతారని అడిగాడు. 'మల్‌హోత్రా పెడతాడు' అని జవాబిచ్చాడు ఖన్నా. సరే అని డబ్బు తీసి యిచ్చాడు రావల్‌ సింగ్‌. చెస్ట్‌ లోంచి డబ్బు బయటకు రాగానే అసిస్టెంట్లలిద్దరూ బ్యాంకు ట్రంకు పెట్టెల్లో రూ. 60 లక్షలు సర్ది యిద్దరు పనివాళ్ల ద్వారా కారులో పెట్టించారు. మల్‌హోత్రా ఆ డబ్బుతో చాణక్యపురిలో చెప్పిన చోటుకి చేరాడు. విదేశీరాయబారుల నివాసాలన్నీ అక్కడే వున్నాయి.

తెల్లగా, పొడుగ్గా, భారీగా 50 ఏళ్ల వయసులో వున్న రుస్తుమ్‌ సొహ్రాబ్‌ నగర్‌వాలా కారు వద్దకు వచ్చి కోడ్‌వర్డ్‌ చెప్పగానే మల్‌హోత్రా అతన్ని కారులో ఎక్కనిచ్చాడు. సర్దార్‌ పటేల్‌ రోడ్డు, పంచశీల్‌ మార్గ్‌ కలిసే చోట వున్న టాక్సీ స్టాండ్‌కు పోనివ్వమన్నాడు. 65 కిలోల బరువున్న క్యాష్‌ ట్రంకు పెట్టెలను టాక్సీలో ఎక్కించుకుని ''ప్రధాని దగ్గర్నుంచి రసీదు తీసుకోండి.'' అంటూ వెళ్లిపోయాడు. మల్‌హోత్రా పార్లమెంటు హౌస్‌కు వెళితే ప్రధాని లేరు. అప్పుడు ఆవిడ సెక్రటరీ పి ఎన్‌ హక్సర్‌ వద్దకు వెళ్లి రసీదు కోసం అడిగితే ఆయన చివాట్లు వేసి ఎవడో మిమ్మల్ని దగా చేశాడు, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి అన్నారు. మల్‌హోత్రా వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే డి కె కాశ్యప్‌ అనే ఎఎస్‌పికి  నగర్‌వాలాను పట్టుకునే బాధ్యత అప్పగించారు. దీనికి 'ఆపరేషన్‌ తూఫాన్‌' అని పేరు పెట్టారు. నిజంగా తుపాను స్పీడుతో కేసు నడిచి, ముగిసింది. 

పోలీసులు టాక్సీ స్టాండ్‌కి వెళ్లి నగర్‌వాలాను ఎక్కించుకున్న టాక్సీ డ్రైవరును పట్టుకున్నారు. అతను నగర్‌వాలాను డిఫెన్సు కాలనీలో విడిచి పెట్టానని చెప్పాడు. అక్కణ్నుంచి అతను మరో టాక్సీ తీసుకున్నాడు. ఆ టాక్సీవాడు కథంతా చెప్పాడు - 'రాజేంద్రనగర్‌లో ఓ యింటికి తీసుకెళ్లాడు. ఒక పెద్ద సూటుకేసు వుంది ఆయనతో. నా ఎదురుగానే డబ్బు ట్రంకు లోంచి సూటుకేసులోకి మర్చాడు. బంగ్లాదేశ్‌లో ఒక మిషన్‌ గురించి తీసుకెళుతున్నా, ఈ రహస్యం ఎవరికీ చెప్పవద్దు అంటూ నాకు 500 రూ.లు యిచ్చాడు.' అన్నాడు. ఆ తర్వాత నగర్‌వాలా పాత ఢిల్లీలోని నికల్సన్‌ రోడ్డుకు, అక్కణ్నుంచి బహదూర్‌ షా జఫర్‌ మార్గ్‌లోని పార్శీ ధర్మశాలలోని తన గదికి వెళ్లిపోయాడు. ఇన్ని క్లూలు వదిలేయడంతో రాత్రి 9.45 కల్లా అతను పట్టుబడినట్లు, అతని దగ్గర రూ.30 వేలు దొరికినట్లు పోలీసులు ప్రకటించారు. 6 వేల రూపాయలు అప్పటికే ఖర్చు పెట్టేశాడు. తక్కిన డబ్బు డిఫెన్సు కాలనీలోని ఎన్‌ బి కెప్టెన్‌ అనే అతని మిత్రుడి యింట్లో పెట్టిన సూటుకేసులో దొరికిందన్నారు. అర్ధరాత్రి కల్లా అతను తన నేరాన్ని ఒప్పేసుకున్నట్లు, విచారణ ముగిసినట్లు కూడా ప్రకటించేశారు. ఇంత మెరుపువేగం ఏ కేసులోనూ కనబడదు. 

ఇక యిప్పుడు కేసు పెట్టాలి. మల్‌హోత్రా యిచ్చిన ఫిర్యాదుపై, అతని మీదనే సెక్షన్‌ 409 ఐపిసి (కేంద్ర ఉద్యోగి విశ్వాసఘాతుకం) కింద పెట్టారు. తర్వాత దాన్ని మార్చి అతని అసిస్టెంటు ఎచ్‌ ఆర్‌ ఖన్నా ఫిర్యాదు చేసినట్లు రాసుకుని సెక్షన్‌ 419 (వేరే మనిషిలా నటించడం), సెక్షన్‌ 420 (మోసగించడం) కేసు పెట్టారు. తర్వాత మల్‌హోత్రాకు దురుద్దేశం లేకపోయినా పొరపాటు పడినట్లు (ఎర్రర్‌ ఆఫ్‌ జజ్‌మెంట్‌) తీర్మానించి వదిలిపెట్టేశారు. 48 గంటల్లోనే నగర్‌వాలాపై కేసు పెట్టేశారు. కోర్టులో సాక్ష్యాలు ప్రవేశపెట్టలేదు. క్యాషియర్‌ మల్‌హోత్రాను, డబ్బు దాచిన యింటి ఓనరు కెప్టెన్‌ను, టాక్సీ డ్రైవర్‌ను ఎవర్నీ రప్పించలేదు. ఇందిరా గాంధీని సాక్షిగా పిలవలేదు సరి కదా, ఆమె స్టేటుమెంటు రికార్డు కూడా చేయలేదు. నగర్‌వాలా ఒప్పుకోలు పత్రంపై ఆధారపడి కేసు నడిచింది. 10 ని||లలో ప్రాసిక్యూషన్‌ వాదన ముగిసింది. తీర్పు కూడా వచ్చేసింది. నాలుగు సంవత్సరాల జైలు, రూ. 4000 ల జరిమానా విధించారు. ఈ తీర్పు వచ్చిన తర్వాత పోలీసులకు మల్‌హోత్రాపై కూడా కేసు పెట్టాలని తోచింది. మే 29 న ఆయన మీద ఐపిసి 409 కింద కేసు పెట్టారు. అప్పుడు నగర్‌వాలా తన తీర్పుపై సెషన్స్‌ కోర్టులో అప్పీలు చేసుకున్నాడు. మల్‌హోత్రాపై కేసు విచారణ జరిగి తీర్పు వచ్చిన తర్వాతనే తన అప్పీలు విచారించాలని కూడా నగర్‌వాలా కోరాడు. కానీ నవంబరు 16 న అతని అప్పీలు తిరస్కరించబడింది. మల్‌హోత్రాపై కేసు వీగిపోయింది కానీ నగర్‌వాలా మృతి తర్వాత 1972 నవంబరులో అతన్ని బ్యాంకు సర్వీసు నుంచి డిస్మిస్‌ చేశారు. అతనితో బాటు మరో నలుగురు బ్యాంకు ఆఫీసర్లపై చార్జిషీటు పెట్టారు. 

ఈ కేసు దేశప్రజల్లో అనేక సందేహాలను లేవనెత్తింది. ఫోన్‌ కాల్‌ చేసినంత మాత్రాన బ్యాంకు చీఫ్‌ కాషియర్‌ డబ్బెలా యిచ్చేస్తాడు? ఏ ఖాతాలోంచి యిచ్చాడు? ఇలా యిచ్చే సంప్రదాయం ముందునుంచీ వుందా? ఇది ఇందిరా గాంధీకి లేదా కాంగ్రెసుకు చెందిన నల్లధనమా? నగర్‌వాలాకు ముఖపక్షవాతం వచ్చి మాట ముద్దగా వుంటుంది. అతను ఇందిర గొంతును ఎలా అనుకరించగలడు? అతనికి వేరే మహిళ సహకరించిందా? మరి ఆమెపై కేసు పెట్టలేదేం? నగర్‌వాలాకు మోసం చేసే ఉద్దేశమే వుంటే అన్ని సాక్ష్యాలు ఎందుకు వదిలేస్తాడు? డబ్బు తీసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోకుండా సొంత గదికే ఎందుకు వెళతాడు? తన తరఫున డిఫెన్సు లాయరును ఎందుకు పెట్టుకోలేదు? బ్యాంకింగ్‌ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా చూపుతూ, డిపాజిటర్ల నమ్మకాన్ని అతలాకుతలం చేస్తూ 60 లక్షలు కొట్టేస్తే అంత తక్కువ శిక్షా? ముందుగా అనుకోలేదు, అప్పటికప్పుడు ఐడియా వేసి కొట్టేశా అని అతనంటే కోర్టు ఎలా నమ్మింది? ఆ బ్యాంకుకే, ఆ బ్రాంచ్‌కే, ఆ చీఫ్‌ క్యాషియరుకే ఎందుకు ఫోన్‌ చేశావ్‌ అని అడగవద్దా? ఒక ఓచరు లేకుండా, చెక్కు లేకుండా, ఖాతాలు నిర్వహించే అధికారి సంతకం లేకుండా, మల్‌హోత్రా అంత బాధ్యతారాహిత్యంగా 60 లక్షలు బయటకు పట్టుకుని వచ్చేస్తే పోలీసులు అతనిపై కాఠిన్యం చూపలేదేం? మళ్లా నగర్‌వాలా మరణం తర్వాతనే డిస్మిస్‌ చేశారేం? వీటిపై ప్రధానికాని, ప్రధాని కార్యాలయం కానీ నోరు మెదపరేం?.. యిలా అన్నీ ప్రశ్నలే. 

బ్యాంకు డబ్బును సొంత ప్రయోజనాలకు వాడుకోవడానికే ఇందిర బ్యాంకులను జాతీయం చేసిందని  ప్రతిపక్ష నాయకులు బయట ప్రచారం చేస్తూనే లోపల్లోపల యిది బంగ్లాదేశ్‌ ఆపరేషన్‌కు సంబంధించిన చర్యలో భాగమని సందేహించారు. నగర్‌వాలా శిక్షను ఛాలెంజ్‌ చేస్తూ రివిజన్‌ పిటిషన్‌ వేసే విషయం పరిశీలించడానికి వాజపేయి, మొరార్జీ, రాజ్‌ నారాయణ్‌, పిఎన్‌ లేఖీ వంటి ప్రతిపక్ష నాయకులు సమావేశమయ్యారు. చర్చలు చాలాసేపే జరిగాయి కానీ రివిజన్‌ పిటిషన్‌పై సంతకం పెట్టడానికి ఎవరూ సాహసించలేదు. చివరకు రాజ్‌ నారాయణ్‌ వద్ద ప్రయివేటు సెక్రటరీగా పనిచేసే ఊర్మిళేష్‌ ఝా సంతకం పెట్టాడు. పిఎన్‌ లేఖీ ఢిల్లీ హైకోర్టులో జూన్‌ 7న పిటిషన్‌ పడేసాడు. నగర్‌వాలా తరఫున వాదించడానికి ప్రభుత్వం నియమించిన లాయరు ఆర్‌ కె మహేశ్వరి, యీ పిటిషన్‌ను సమర్థించకపోగా వ్యతిరేకించాడు!

ఇలా ఎన్నో ఆశ్చర్యాలకు తోడు నగర్‌వాలాకు జైల్లో వుండగానే 1972 ఫిబ్రవరిలో గుండెపోటు వచ్చింది. తీహార్‌ జైలు ఆసుపత్రిలో చేర్చారు. ఫిబ్రవరి 21న జిబి పంత్‌ ఆసుపత్రికి మార్చారు. చివరకు 1972 మార్చి 2న తన 51 వ పుట్టినరోజు నాడు మరణించాడు. అంతకుముందే 1971 నవంబరు 20 న అతని కేసు విచారించిన కాశ్యప్‌ హనీమూన్‌కు వెళ్లబోతూ కారు యాక్సిడెంటులో పోయాడు. ఈ చావులన్నిటికీ ఇందిరా గాంధీయే బాధ్యురాలనే పుకారు విపరీతంగా బలపడింది. ప్రతిపక్షాలు దీనికి బాగా ఆజ్యం పోసాయి. చివరకు వారు 1977లో అధికారంలోకి వచ్చాక ఈ విషయం జస్టిస్‌ జగన్మోహన్‌ రెడ్డిగారి అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. 1978లో యిచ్చిన 820 పేజీల నివేదికలో ఆయన నగర్‌వాలా మృతి సహజమైనదే అని చెప్పడం మినహా తక్కిన ఏ సందేహాన్నీ నివృత్తి చేయలేకపోయారు. అధికారులు సహకరించటం లేదు, ఏ సమాచారమూ యివ్వటం లేదు అని ఫిర్యాదు చేయడమే కాక, రిపోర్టులో కూడా రాశారు. అప్పుడు అధికారంలో వున్న జనతా ప్రభుత్వం తన అధికారులపై ఒత్తిడి తెచ్చి సమాచారం ఎందుకు రాబట్టలేదో, నిజాలు ఎందుకు బయటపెట్టలేదో ఒక మిస్టరీగా మిగిలిపోయింది. 

వీటి కారణంగా యిదంతా భారత యింటెలిజెన్సుకు చెందిన వ్యవహారమని, దేశభద్రత దృష్ట్యా కాంగ్రెసే కాదు, అధికారంలోకి వచ్చిన ప్రతిపక్షాలు కూడా దాన్ని గోప్యంగా వుంచుతున్నారని అంచనాలు వున్నాయి. ఈ అంచనాకు ఊతమిచ్చే అంశాలు కొన్ని వున్నాయి. నగర్‌వాలా మామూలు వ్యక్తి కాదు. బ్రిటిషు ఆర్మీలో పని చేసిన మాజీ మిలటరీ యింటెలిజెన్సు ఆఫీసరు. బ్రహ్మచారి, వ్యసనాలేమీ లేవు. ఇంటెలిజెన్సు శాఖకు, రా (రిసెర్చి అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్‌ పేర నడిచే భారత గూఢచారి సంస్థ)కు నమ్మకమైన మనిషి. ఆర్మీ-బిఎస్‌ఎఫ్‌-రా దళాలు సంయుక్తంగా చేపట్టిన బంగ్లాదేశ్‌ మిషన్‌లో ట్రైనింగ్‌ ఆఫీసరు. అతను గ్రాజువేట్‌ కాకపోయినా జపాన్‌లో ఒక విద్యాసంస్థలో ఇంగ్లీషు టీచరుగా ఐదేళ్లు పనిచేశాడు. అంటే అక్కడ మనదేశం తరఫున గూఢచర్యం చేశాడని భావించాలి. నిజానికి తను అరెస్టు కాగానే నగర్‌వాలా ప్రధానితో కానీ, బిఎస్‌ఎఫ్‌కు డైరక్టరు జనరల్‌గా వున్న రుస్తొంజీతో కానీ మాట్లాడాలని కోరాడు. రుస్తొంజి పార్శీ, కుటుంబస్నేహితుడు కూడా. ఇంత కనక్షన్స్‌ వున్న నగర్‌వాలా కేవలం చీట్‌ అనుకోవడానికి వీలు లేదు. 

అప్పుడు తూర్పు బెంగాల్‌లో (బంగ్లాదేశ్‌ యింకా ఏర్పడలేదు) పాకిస్తాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముక్తివాహిని పేర తిరుగుబాటు దారులు విప్లవం లేవదీస్తున్నారు. వారికి భారతప్రభుత్వం చాటుగా సాయపడుతోంది. తూర్పు పాకిస్తాన్‌కు సరిహద్దు గ్రామాల్లో అంతర్జాతీయసమాజానికి తెలియకుండా భారత సైనిక యింటెలిజెన్సు వారికి తర్ఫీదు యివ్వడానికి నిశ్చయించుకుంది. మే నెలలో టైగర్‌ సిద్దిఖీ అనే 21 ఏళ్ల గెరిల్లా యోధుడు మైమెన్‌సింగ్‌ జిల్లా నుంచి 10 వేల మంది ముక్తివాహిని వాలంటీర్లను తెచ్చాడు. వారికి ఆయుధాలు, ఆయుధసామగ్రి సమకూర్చాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బును నగర్‌వాలా ద్వారా కలకత్తాకు పంపాలని నిశ్చయించింది యింటెలిజెన్సు శాఖ. ఆ శాఖకు ఆ బ్రాంచిలో రహస్యఖాతాలున్నాయి. వాటి ఆపరేషన్స్‌ చూసే బాధ్యతను మల్‌హోత్రాకు అప్పగించారు. అతను విశ్వసనీయుడు అనుకున్నారు కాబట్టే ప్రైమ్‌ మినిస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌ కమిటీలో, సిటిజన్స్‌ కమిటీలో సభ్యత్వం యిచ్చారు. నగర్‌వాలా గురించి మల్‌హోత్రాకు ముందే తెలుసు. అందుకే మల్‌హోత్రా ద్వారా నగర్‌వాలాకు నిధులు అందించడానికి ఫోన్‌ ద్వారా ఆదేశాలు వెళ్లాయి. గతంలో కూడా యిలాటి ఆపరేషన్స్‌ జరిగాయి కాబట్టి మల్‌హోత్రా సరేనన్నాడు.

అయితే ఈ వివరాలేమీ తెలియని డిప్యూటీ చీఫ్‌ కాషియర్‌ కేవల్‌ సింగ్‌కు మల్‌హోత్రా ఏ ఓచరూ లేకుండా అంత డబ్బు పట్టుకెళ్లి పోవడం ఠారెత్తించింది. ఓచరుపై మల్‌హోత్రా సంతకం పెడతాడని ఖన్నా చెప్పాక గంటన్నర వేచి చూసి, యింకా రాకపోతే ఏదైనా అయితే తన మీదకు వస్తుందని భయపడి వెంటనే పోలీసులకు మల్‌హోత్రాపై ఫిర్యాదు చేసాడు. అది రికార్డు చేసిన జూనియర్‌ ఆఫీసరుకు దీనిలో ఏదో గోల్‌మాల్‌ కనబడింది. వెంటనే పోలీసు స్టేషన్‌లో వుండే పత్రికా రిపోర్టర్లకు చెప్పేశాడు. కొద్ది సేపటిలోనే నగరమంతా గుసగుసలు ప్రారంభమయ్యాయి. అసలు విషయం బయటకు వస్తే  భారత్‌ తూర్పు పాకిస్తాన్‌లో తిరుగుబాటు చేయిస్తోందని అంతర్జాతీయంగా తెలిసిపోతుందని భయపడింది యింటెలిజెన్సు శాఖ. వెంటనే పోలీసులు నగర్‌వాలా వద్ద వున్న వాకీటాకీకి ఫోన్‌ చేశారు. నువ్వు పట్టుబడిపోయేట్లుగా వ్యవహరించు అని సలహా యిచ్చారు. అందుకే అతను అడక్కపోయినా టాక్సీ డ్రైవరు ఎదురుగా డబ్బు మార్చాడు. ఐదు వందలు బహుమతిగా యిచ్చాడు. అంతా అనుకున్న ప్రకారమే జరిగింది. పోలీసులు పట్టేసుకున్నారు. కథ అల్లేశారు. నగర్‌వాలా నేరం ఒప్పేసుకున్నాడన్నారు. గబగబా న్యాయవిచారణ జరిపించేసి, తీర్పు యిప్పించేశారు. అయితే తనను వదిలేస్తారనుకున్న నగర్‌వాలాకు షాక్‌ తగిలింది. పునర్విచారణ కోరాడు. జైల్లో వుండగానే ''కరంటు'' పత్రిక ఎడిటరు, పార్శీ అయిన డిఎఫ్‌ కరాకాకు తన దగ్గరకు వస్తే అన్ని విషయాలు చెపుతూ యింటర్వ్యూ యిస్తానని సందేశం పంపాడు. కానీ కరాకా అస్వస్థుడిగా వుండటం చేత అసిస్టెంటును పంపాడు. నగర్‌వాలా అతనితో మాట్లాడను పొమ్మన్నాడు. ఇవన్నీ బయటకు వస్తే ఎలా హ్యేండిల్‌ చేయాలా అని బెంగపడిన ప్రభుత్వానికి ఊరట కలిగించేలా నగర్‌వాలాకు గుండెపోటు వచ్చింది. చనిపోయాడు. రహస్యం అతనితో సమాధి అయిపోయింది. జగన్మోహన్‌ రెడ్డి కమిటీ అతనిది సహజమరణమే అంది.  కాశ్యప్‌ మృతి గురించి విచారణ జరిపిందో లేదో తెలియదు. అది నిజంగా యాక్సిడెంటో, కావాలని చేసినదో యిప్పటికీ బయటకు రాలేదు. భారత సైనిక గూఢచారి వ్యవస్థకు సంబంధించిన వ్యవహారం కాబట్టి యిది ఎప్పటికీ నిజం బయటపడదేమో! (ఫోటోలు - నగర్‌వాలా (టోపీతో), మల్‌హోత్రా)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2016) 

[email protected]

Click Here For archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?