Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : దళితకోణంలో స్వాతి హత్య వివాదం

ఎమ్బీయస్‌ : దళితకోణంలో స్వాతి హత్య వివాదం

తమిళనాడులో దళితులు తమ హక్కుల కోసం పోరాడడం ఎప్పటినుంచో వుంది కానీ యిటీవలి కాలంలో పదును పెరిగింది. ఈ పోరాటం ప్రధానంగా ఒబిసిలకు, వారికీ మధ్య జరుగుతోంది. గతంలో దళితులు ఆలయప్రవేశం జరిగితే చాలని కోరుకునేవారు కానీ క్రమేపీ ప్రవేశమే కాదు, పూజల, పండుగల నిర్వహణలో తమకు భాగస్వామ్యం కావాలని అడుగుతున్నారు. అది యివ్వడానికి యితర కులాలు ఒప్పుకోవటం లేదు. 1998లో శివగంగ జిల్లాలో కందాదేవి ఆలయంలో రథాన్ని పండగల్లో తాము కూడా లాగుతామని దళితులలో ఒక తెగ అయిన కుల వెల్లాలర్లు అడిగారు. ఇతర కులస్తులు అంగీకరించలేదు. దాంతో రథానికి నిప్పు ముట్టించారు. వ్యవహారం కోర్టుకి వెళ్లింది. చివరకు హై కోర్టులో అనేక పిటిషన్లు, నిరసన ప్రదర్శనలు జరిగాక, 2005లో 26 దళిత కుటుంబాల వారిని రథం లాగడానికి కోర్టు అనుమతించింది. అంతే అప్పణ్నుంచి యిప్పటిదాకా యితరులు రథోత్సవం ఆపేశారు. ఏమైందని అడిగితే రథానికి మరమ్మత్తులు చేయించాలంటున్నారు.

ఇతరులు కట్టిన ఆలయాల్లోకి తమను రానివ్వటం లేదు కాబట్టి తామే డబ్బులేసి ఓ గుడి కట్టుకోవచ్చు కదా అనుకుని కరూరు జిల్లాలో నాగపల్లి గ్రామంలో 70 దళిత కుటుంబాల వారు ఏడేళ్ల క్రితం సొంత స్థలంలో విరాళాలు వేసుకుని మీనాక్షి మారియమ్మ గుడి కట్టారు. ప్రభుత్వం 25 వేలు యిచ్చింది. గుడి ట్రస్టులో దళితులే వున్నారు. శ్రీలంక నుంచి తరలి వచ్చిన గౌండరు, కొంగు (ఒబిసి) కులాలకు చెందిన తమిళులు కొందరు తాము కూడా విరాళాలు యిస్తామంటే పుచ్చుకున్నారు. అయితే వాళ్లిచ్చిన విరాళాలను నమోదు చేయకుండా దళితులు జాగ్రత్త పడ్డారు. అయినా గుడి కట్టిన ఐదేళ్లకు దళితేతరులు తమకు కూడా కొన్ని హక్కులుండాలంటూ అడగసాగారు. రెండేళ్లగా యీ వివాదం నడుస్తూనే వుంది. తమతో గొడవ పెట్టుకుంటే తాము ఇస్లాంలోకి మారిపోతామంటూ దళితులు బెదిరిస్తున్నారు. 

నాగపట్టణానికి దగ్గరున్న పళంగకల్లిమేడు గ్రామంలోని 180 దళిత కుటుంబాల వారిని చూసి వీళ్లకీ ఐడియా వచ్చింది. ఆ గ్రామానికి దగ్గర్లో వున్న భద్రకాళి గుడికి చుట్టుపట్ల 18 వూళ్ల నుంచి భక్తులు వస్తూంటారు. అన్ని కులాలవారి ప్రవేశానికి ఎలాటి యిబ్బందీ లేదు. అయితే యీసారి ఆడి(ఆషాఢమాసాన్ని తమిళంలో అలా అంటారు. వాళ్లకు మాసం పౌర్ణమి నుండి పౌర్ణమి వరకు) మాసంలో జరిగే ఐదురోజుల పండగలో తమకు భాగం కావాలని దళితులు పట్టుబట్టారు. గుడి ఎండోమెంట్స్‌ శాఖలోకి వస్తుంది కాబట్టి ఆ 5 రోజుల్లో తొలిరోజు, చివరి రోజు ప్రభుత్వాధికారులే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక మధ్యలో వున్న మూడు రోజులలో పిళ్లయ్‌మార్‌, కళ్లిమేడు, తామరైపులం కులాల వారు నిర్వహిస్తూ వుంటారు. ఆ మూడు రోజుల్లో ఒక రోజు పూజలు మేం నిర్వహిస్తాం అని దళితులు అడిగారు. 'ఇది వదిలేయండి, మరో పండగలో మొత్తం మీకే యిస్తాం, దీనిలోనే కావాలంటే ఒక పూట యిస్తాం' అని యితర కులాల వారు అన్నారు. 'అదేం కుదరదు, యీ పండుగలోనే పూర్తిగా ఒక రోజు మాకు వదిలేయాలి' అని దళితులు పట్టుబట్టారు. శాంతి కమిటీ ఏర్పరచినా యిరుపక్షాలు పట్టుదలకు పోవడం వలన చర్చలు విఫలమయ్యాయి. దాంతో 6 కుటుంబాల దళితులు ఇస్లాంలోకి మారిపోయారు. మరో 180 కుటుంబాల వారు తామూ మారిపోతాం అన్నారు. చివరకు హై కోర్టు మధురై బెంచ్‌వారు ఆగస్టు 9న తీర్పు యిస్తూ రాజీ కుదిర్చారు. 2017 నుంచి అది అమల్లోకి వస్తుంది. 

ఇటీవలి కాలంలో దళితులకు, ఒబిసిలకు మధ్య తగాదా రావడానికి ఒక కారణం ప్రముఖంగా కనబడుతోంది. దళితుల్లో చాలామందికి గ్రామాల్లో భూములు లేని కారణంగా ఆ కులాల యువకులు చదువునే నమ్ముకుని రిజర్వేషన్ల పుణ్యమాని సీట్లు, ఉద్యోగాలు తెచ్చుకుని పెద్ద పట్ణణాల్లో, నగరాల్లో బాగా సంపాదించుకుంటున్నారు. ఒబిసి కులాల వారికి కొద్దో గొప్పో భూవసతి వున్న కారణంగా గ్రామాల్లోనే వుండిపోతున్నారు. ఇటీవలి కాలంలో యిరిగేషన్‌ సౌకర్యాల లేమి వలన ఆ భూముల దిగుబడి తగ్గిపోవడం లేదా వట్టిపోవడం జరుగుతోంది. గ్రామాల్లో, పట్టణాల్లో వున్న ఒబిసి యువతులు ఆర్థికంగా సుఖకరమైన నగర జీవితంపై మోజుతో తమ కులాల యువకుల కంటె దళిత యువకులను పెళ్లాడడానికి యిష్టపడుతున్నారు. ఇది ఒబిసి యువకుల్లో అసహనాన్ని పెంచుతోంది. 2012 నవంబరులో ధర్మపురి జిల్లాలో, 2013 ఏప్రిల్‌లో మరకణంలో, 2015 ఆగస్టులో శేషసముద్రం గ్రామంలో, 2016 మార్చిలో తిరుపూరులో యిలా పలు సందర్భాల్లో ముఖ్యంగా మధురై, తిరునల్వేలి, శివగంగ, విరుదనగర్‌, తేణి, దిండిగల్‌ జిల్లాలలో కులఘర్షణలు పెరుగుతున్నాయి. 

ఈ మధ్య కొన్ని జిల్లాలలో చిన్నప్పటినుంచి కులస్పృహ పెంచుతున్నారు. తిరునల్వేలిలోని గోపాలసముద్రం గ్రామంలో విద్యార్థులు తమ కులాలను చాటుకోవడానికి చేతికి రంగురంగుల కాశీతాళ్ల వంటివి కట్టుకుంటున్నారు. దేవర్లు ఎరుపు, పసుపు రంగు తాళ్లు, నాడార్లు నీలం, పసుపు రంగు, యాదవులు కాషాయం, దళితుల్లో పల్లార్లు ఎరుపు, ఆకుపచ్చ రంగు, దళితుల్లో అరుంధతీయులు నలుపు, తెలుపు రంగు తాళ్లు కట్టుకుంటున్నారు. తాడు చూడగానే వీడు ఫలానా అని తెలిసిపోయి, అక్కున చేర్చుకోవాలో, దూరంగా పెట్టుకోవాలో తేల్చుకోవచ్చన్నమాట. తిరునల్వేలి జిల్లా కలక్టరు యీ పద్ధతి మానాలని మౌఖికంగా ఆదేశాలిచ్చినా అమలు కాలేదు. 'ఇవి మా గుళ్లల్లో యిచ్చిన పవిత్రమైన తాళ్లు. కట్టుకోవద్దని చెప్పడానికి వీల్లేదు' అంటూ వాదించారు. అదే జిల్లాలోని కొన్ని వూళ్లల్లో పెద్దవాళ్లు వారి కులాల బట్టి పంచె రంగుల్ని ఎంచుకుంటున్నారట. కొందరు మెడలో వాళ్ల కులానికి చెందిన నాయకుల ఫోటోలను లాకెట్లలా వేసుకుంటున్నారు. నాడార్లయితే కామరాజు బొమ్మ, దేవర్లయితే ముత్తురామలింగ దేవర్‌ బొమ్మ.. యిలా. 

పశ్చిమ తమిళనాడులో గౌండర్లు ప్రధానకులం. వారి కులంలో ప్రముఖుడెవరా అని చూస్తే 19 వ శతాబ్దపు పాలెగార్లలో (చిన్న సంస్థానాధీశుడు) వీరుడైన చిన్నమలై దొరికాడు. అతని పేర ఒక సంఘం పెట్టి యువరాజ్‌ అనే నాయకుడు ఈరోడు, తిరుచెంగోడు ప్రాంతాల్లో స్కూళ్లకు వెళుతూ గౌండరు కులాలకు చెందిన విద్యార్థులను పోగేసి, వాళ్లకు తమ కులఔన్నత్యాన్ని నూరిపోస్తున్నాడు. ఇటీవలే గోకుల్‌రాజ్‌ అనే దళిత యువకుని హత్య కేసులో అతను అరెస్టయ్యాడు. కౌసల్య అనే దిండిగల్‌ జిల్లా దేవర్‌ కులానికి చెందిన అమ్మాయి ఇంజనీరింగు కాలేజీలో తన క్లాసుమేటు శంకర్‌ అనే దళితుడిని, ఉడుమల్‌ పేటకు చెందిన వాణ్ని ప్రేమించి పెళ్లాడింది. ఎంత నచ్చచెప్పినా ఆమె భర్తను విడవకపోవడంతో తలితండ్రులు పెళ్లయిన 8 నెలల తర్వాత 2016 మార్చి నెలలో ఉడుమల్‌పేట మార్కెటులో పట్టపగలు వాళ్లిద్దరిపై దాడి చేయించారని అభియోగం. ఆమె తీవ్రంగా గాయపడింది, అతను చచ్చిపోయాడు. తలితండ్రులు ప్రస్తుతం జైల్లో వున్నారు. కౌసల్యకు ప్రభుత్వం నెలనెలా రూ.11,600 పెన్షన్‌ యిస్తోంది. 'ఇతర కులాల జోలికి రాకండి' అని దళితులకు హెచ్చరిక యివ్వవలసిన అవసరం వుంది కాబట్టి యీ హత్య అవసరమే అని భావించేవారూ వున్నారు. 

ఆగస్టు నెలలో మధురైకు దగ్గర్లో వున్న ఒక గ్రామంలో దేవర్‌ కులానికి చెందిన ఓ కుర్రాడు దళిత విద్యార్థులు వెళుతూంటే వాళ్లను మారుపేర్లు పెట్టి ఏడిపించాడు. దాంతో వాళ్లు రాళ్లేసి కొడతాం జాగ్రత్త అన్నారు. మాటామాటా పెరిగింది. మర్నాడు దేవర్‌ కులాల తలితండ్రులు స్కూలుకి వచ్చి ఫిర్యాదు చేశారు. దేవర్‌ కులానికే చెందిన ఎమ్మెల్యే మద్దతుతో ఆ దళిత పిల్లలపై పోలీసులకు కంప్లయింటు యిచ్చారు. అంతే, పోలీసులు 4గురు దళిత విద్యార్థులు, 1 విద్యార్థినిపై పోక్సో (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌) చట్టం కింద కేసు పెట్టేశారు. ఇంతకీ ఆ పిల్లలు వయసు 9 సం|| లలోపే! ఇది బయటకు పొక్కి గొడవ కావడంతో పిల్లల్ని జైల్లోంచి విడిచివేశారు. ఇప్పటికీ ఆ స్కూల్లో దళితులకు, దళితేతరులకు విడివిడి డైనింగు రూములున్నాయి. చాపలు, గ్లాసులు, పళ్లాలు అన్నీ వేర్వేరే!

ఇలాటి సంఘటనల నేపథ్యంలో యిప్పుడు తమిళనాడులో ప్రతీ విషయాన్ని దళిత, దళితేతర కోణంలో పరామర్శించడం ఎక్కువై పోయింది. చెన్నయ్‌లోని నుంగంబాకం రైల్వే స్టేషన్‌లో అందరి ఎదుటా స్వాతి అనే అమ్మాయిని క్రూరంగా నరికి చంపిన కేసులో నిందితుడు రామ్‌కుమార్‌ దళితుడు కాబట్టి అతనికి అన్యాయం జరిగింది అని వాదించసాగారు. హతురాలు బ్రాహ్మణి కావడం, నిందితుడు దళితుడు కావటం వలన పోలీసులు పరిశోధనలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దానికి తోడు రామకుమార్‌ గత నెలలో అనుమానాస్పద పరిస్థితుల్లో పోలీసు కస్టడీలో మరణించడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి, పేదరికం నేపథ్యం కారణంగా అతనిపై జాలి చూపేవారు కూడా పెరుగుతున్నారు. రామకుమార్‌ తండ్రి రోజుకూలీ. తల్లి వ్యవసాయ కూలీ. అతనికి యిద్దరు చెల్లెళ్లున్నారు. ఇంజనీరింగు పూర్తి చేయలేకపోయాడు. ఉద్యోగం దొరకలేదు. చెన్నయ్‌కి వెళ్లి ట్రైనింగు తీసుకుంటే ఉద్యోగం వస్తుంది అక్కడకు చేరాడు. చూళైమేడులో అద్దెకుంటూ అదే కాలనీలో వున్న స్వాతిని చూసి మనసు పడ్డాడు. కానీ ఆమె స్పందించకపోవడంతో నరికి చంపాడు. చంపుదామని ఉద్దేశంతో దాడి చేయలేదని, కేవలం గాయపరుద్దా మనుకున్నానని, సాయంత్రం టీవీల్లో చూశాకనే చనిపోయిందని తెలుసుకున్నానని పోలీసు విచారణలో అతను చెప్పాడట.

స్వాతి హత్య వార్త పేపర్లలో రాగానే కొన్ని వర్గాల వారు 'ఇది మరో లవ్‌ జిహాద్‌ అని, ఒక ముస్లిం యువకుడు ఆమెను బుట్టలో పెట్టడానికి ప్రయత్నించి, విఫలుడై హత్య చేశాడని' సోషల్‌ నెట్‌వర్క్‌లో ప్రచారం చేయసాగారట. ఇద్దరు సినిమా కమెడియన్లు యీ ప్రచారంలో ప్రధానపాత్ర వహించారట. ఇది చూసి ఒక ముస్లిం సంస్థ 'నిరాధార ఆరోపణలతో మతసామరస్యాన్ని చెడగొడుతున్న వారిని అరెస్టు చేయాల'ంటూ పోస్టర్లు అంటించిందట. నిజానికి స్వాతికి ఒక ముస్లిము స్నేహితుడున్నాడు. అతనే స్వాతి గురించి, రామ్‌కుమార్‌ గురించి పోలీసులకు సమాచారాన్నిచ్చి విచారణకు సాయపడ్డాడట. రామ్‌కుమార్‌ ఏ కులంలో పుట్టినా, ఎంత దారిద్య్రంలో మగ్గినా కేవలం తనను ప్రేమించలేదన్న కోపంతో స్వాతిని హత్య చేయడం అమానుషం. అతనే చంపాడని స్టేషన్లో వున్న బుక్‌స్టాల్‌ ఓనరు ప్రత్యక్షసాక్షి. వీధుల్లోని సిసిటివి కెమెరాల్లో అతని ఫోటో పడింది. అతను హత్య చేయలేదేమోనని సందేహించేవారు ఫలానావారికి మోటివ్‌ వుంది, అవకాశం వుంది అంటూ యితరుల వైపు వేలెత్తి చూపగలగాలి. ఇంతటి ఓపెన్‌ అండ్‌ షట్‌ కేసును పోలీసులు మిస్‌హేండ్లింగ్‌తో భ్రష్టు పట్టించి అనవసరంగా అనుమానాలకు, కులపరమైన వాగ్వివాదాలకు తావిచ్చారు.

రామ్‌కుమార్‌ గురించి వెతకడంలో జరిగిన ఆలస్యం సహేతుకమే కావచ్చు. కానీ అతన్ని పట్టుకోవడంలో చేసిన డ్రామా ఎవరికీ అర్థం కాలేదు. హత్య చేశాక రామ్‌కుమార్‌ తన వూరికి పారిపోయాడు. అది కేరళ సరిహద్దుకు దగ్గరగా వున్న మీనాక్షిపురం అనే గ్రామం. పోలీసుల కథనం ప్రకారం - 'ఇద్దరు పోలీసులు మఫ్టీలో ఆ గ్రామంలో మాటు వేసి రోజంతా రామ్‌కుమార్‌ కదలికలను గమనిస్తూ వున్నారు. అతను గొఱ్ఱెలను మేపుతూండడం గమనించారు. చివరకు రాత్రి 11.30కు మరి కొందరు పోలీసులతో కలిసి అతని యింటిపై దాడి చేయడానికి నిశ్చయించుకుని ఆ ప్రాంతమంతా విద్యుత్‌ సరఫరా నిలిపేసి, వెళ్లి అతన్ని పట్టుకున్నారు. అప్పుడతను బ్లేడుతో పీక కోసుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించి, ఆ పై అరెస్టు చేశారు.' ఇక్కడ తలెత్తిన ప్రశ్నలేమిటంటే - అంత చిన్న గ్రామంలో యిద్దరు పోలీసులు, ఎంత మఫ్టీలో వున్నా - గ్రామస్తుల కంటపడకుండా పొద్దున్నించి తిరగగలరా? రామ్‌కుమార్‌ టెర్రరిస్టు కాదు, అతన్ని పట్టుకోవడానికి యింత హంగామా ఎందుకు? ఇవన్నీ చాలనట్లు ఎగ్మూరు మెట్రోపాలిటన్‌ కోర్టులో రామ్‌కుమార్‌ తనేమీ ఆత్మహత్యాప్రయత్నం చేయలేదని, పోలీసులతో బాటు వచ్చిన సాదాదుస్తులవారు తన పీక కోయడానికి చూశారని చెప్పాడు. ఎందుకైనా మంచిదని అతనిలో ఆత్మహత్యాధోరణులు పోగొట్టడానికి కౌన్సిలింగ్‌ సెషన్లు యిప్పించారు. చివరకు ఆత్మహత్య (?)తోనే అతని జీవితం ముగిసింది. 

రామ్‌కుమార్‌ తరఫున అడ్వకేట్‌ ''అతని మరణానికి ఒక రోజు ముందు 'ఈ హత్యలో నాతో బాటు మరి కొందరున్నారు. ముందే బయటపెడితే నా ప్రాణానికి హాని కాబట్టి కోర్టులోనే అన్నీ చెప్తాను' అన్నాడు. అరెస్టు చేసి 90 రోజులైనా పోలీసులు చార్జి షీటు ఫైల్‌ చేయలేకపోయారు కాబట్టి బెయిలు వస్తుందని మాకు చాలా ధీమాగా వుంది. సెప్టెంబరు 20 న బెయిలు కోసం అప్లయి చేయాల్సి వుంది. కానీ దానికి రెండు రోజుల ముందే అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. నమ్మశక్యంగా లేదు.'' అంటున్నాడు. జైల్లో ఆత్మహత్య మాట ఎలా వున్నా రామ్‌కుమార్‌పై కేసు దృఢంగానే వుందంటున్నారు విచారణాధికారి. 'హత్యాస్థలంలో కారిన రక్తం, దొరికిన ఆయుధం, రామ్‌కుమార్‌ చొక్కా యివన్నీ తమిళనాడు ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబ్‌కు పంపాం. ఆ రిపోర్టులు రాగానే హంతకుడెవరో నిర్ద్వంద్వంగా తేలిపోతుంది.' అంటున్నాడాయన. దాని మాట ఎలా వున్నా, జైల్లో ఆత్మహత్య మాత్రం చాలా వింతగా, నమ్మడానికి అసాధ్యంగా వుంది. తమిళనాడులో నాలుగు రోజుల కోసారి జైల్లో ఒకడు చచ్చిపోతున్నాడు. 2000 నుండి 2013 మధ్య 1155 మంది చనిపోయారు. 

ఇక రామ్‌కుమార్‌ మరణానికి వస్తే అతను చెన్నయ్‌కు దగ్గర్లో వున్న పుళల్‌ సెంట్రల్‌ ప్రిజన్‌లో హై సెక్యూరిటీ జోన్‌ ఐన రెండవ బ్లాకులోని డిస్పెన్సరీ వార్డులో సాయంత్రం 4.35 కు కరంటు తీగను పళ్లతో కొరికి చనిపోయాడంటున్నారు. సంఘటనకు ప్రత్యక్షసాక్షులెవరూ లేరు కానీ యిద్దరు వార్డర్లు, యిద్దరు జైలు అధికారులు ఆ దరిదాపుల్లోనే ఎక్కడో వున్నారంటున్నారు. ఆ జైలును 2006లోనే అధునాతనంగా కన్సీల్డ్‌ వైరింగుతో కట్టారు. వైర్లు సాలెగూళ్లలా వేళ్లాడే ప్రశ్న లేదు. ఇతను ఏదైనా స్విచ్‌బోర్డు దగ్గరకు వెళ్లి దాన్ని తెరిచి, వైరు బయటకు లాగి, నోట్లో పెట్టుకోవడం ఆ సెక్యూరిటీ జోనులో ఎలా సాధ్యపడింది? సిసిటివి కెమెరాలున్నాయా? ఎవరు గమనించారు? ఎప్పుడు మెయిన్స్‌ ఆఫ్‌ చేసి, విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు? ఆ డిస్పెన్సరీలో ప్రథమ చికిత్స ఎలా జరిగింది? దగ్గర్లో వున్న ఏదైనా ఆసుపత్రికి తీసుకెళ్లకుండా నగరమధ్యంలో వున్న రాయపేట హాస్పటల్‌కు ఎందుకు తీసుకెళ్లారు? ఆసుపత్రికి తీసుకు వచ్చేటప్పటికే అతను చచ్చిపోయాడని అక్కడి వైద్యులన్నారు. దారిలోనే పోయాడా? ఎప్పుడు? - ఇలా అన్నీ ప్రశ్నలే. ఏదైనా ఉన్నతస్థాయి విచారణ కమిషన్‌ వేసి నిజాలు వెలికితీస్తే తప్ప అసలు సంగతి బోధపడదు. రామ్‌కుమార్‌ కానీ, స్వాతి కానీ ప్రముఖ కుటుంబాలకు చెందినవారైతే పోలీసులు కక్షపూరితంగా వ్యవహరించారన్న అనుమానం వచ్చేది. ఇక్కడ అదేమీ లేదు కాబట్టి రామ్‌కుమార్‌ ఎవరో పలుకుబడి వున్న వ్యక్తుల పేర్లు బయటపెడతానని బెదిరించి వుంటాడని, అందుకనే అతని కథ యిలా ముగిసిందని అనుమానం వస్తుంది. అయితే తమిళనాడులో నెలకొన్న కులఘర్షణల వాతావరణంలో దానికి కులం రంగు పులుముతారన్న భయమూ వేస్తుంది.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2016) 

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?