Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40 - 11

జవాబులు - సంజయ్‌ గాంధీ 'దార్శనికత' గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకుందా మనుకునేవారు ఆనాటి మారుతి కథ పూర్తిగా చదవాలి. ప్రస్తుతం నేను  ఎమర్జన్సీ విధించడానికి దారి తీసిన పరిస్థితుల గురించే వివరిస్తున్నాను. రాజీవ్‌ హత్యలో ముందు హంతకుల గురించి, వారి సిద్ధాంతాల గురించి, రాజీవ్‌తో వారి వైరం గురించి పూర్తిగా చెప్పి హత్య ఎలా జరిగిందో చెప్పినట్ల్లే, దీనిలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన హంతకుల స్వభావాల గురించి, వారికి గల అవకాశాల గురించి, అవసరం గురించి చెపుతున్నాను. ప్రస్తుతానికి మారుతి గురించి కాస్త చెప్పి వదిలేస్తాను - ఇప్పుడున్న మారుతికి, సంజయ్‌ మారుతికి ముఖపరిచయం కూడా లేదు. ఇలాటి మారుతి ఒకటి వుంటుందని కూడా సంజయ్‌ వూహించను కూడా వూహించలేదు. అసలు సుజుకి అనే అనుభవం వున్న సంస్థతో టై-అప్‌ అవుదామని కూడా అతను అనుకోలేదు. సొంతంగానే ఓ కారు తయారుచేసి పడేయగలనని అనుకున్నాడు. 

అసలు చిన్నకారు కాన్సెప్టుపై అతనికి పేటెంటు కూడా లేదు. 1950లలోనే మనూభాయ్‌ షా ప్రతిపాదన యిది. ఒక దశలో పాండే కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఫ్రాన్సుకి చెందిన రెనాల్ట్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకోబోయింది. కేంద్ర ఆర్థికమంత్రి టిటి కృష్ణమాచారి అభ్యంతరాల వలన దాన్ని ఆపేశారు. ఆ తర్వాత అనేక పబ్లిక్‌, ప్రయివేటు అండర్‌టేకింగ్స్‌ టెండర్లు, ప్రోటోటైపులు సమర్పించాయి. మైసూరు స్టేట్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌వారు రూ.5-6 వేలలో చేయవచ్చని అంచనా వేశారు. స్థానికంగా డెవలప్‌ చేయాలా, ఫోక్స్‌వాగన్‌, టయోటా, రెనాల్ట్‌, మారిస్‌ వంటి కంపెనీలతో పొత్తు పెట్టుకుని విదేశీ టెక్నాలజీని తెచ్చుకుని తయారు చేయాలా అని తర్జనభర్జనలతో చాలాకాలం గడిచింది. సంజయ్‌ గాంధీ తిరిగి వచ్చి చిన్నకారు గురించి మాట్లాడాక అతన్ని దృష్టిలో పెట్టుకుని స్వదేశీ టెక్నాలజీతో ప్రయివేటు సెక్టార్‌లో చిన్నకారు తయారు చేయించాలని ఇందిర నిశ్చయించింది. పబ్లిక్‌ సెక్టార్‌లో ఎందుకు చేయకూడదు అని అడిగితే అది ప్రయారిటీ ఐటమ్‌ కాదు అని జవాబిచ్చింది. సంజయ్‌ తయారుచేసిన ప్రోటోటైప్‌లన్నీ విఫలమయ్యాయి. అయినా అతను బుకాయిస్తూనే పోయాడు. 1973 డిసెంబరులో ప్రకటన చేస్తూ ఆర్నెల్లలో కారు తయారవుతుందన్నాడు. ఏమీ కాలేదు. ఏడాదిన్నర తర్వాత అంటే 1975 మధ్యలో యింకో ప్రకటన చేస్తూ రోజుకి 200 కార్లు తయారు చేస్తామన్నాడు. 1976 మార్చిలో మాట్లాడుతూ మార్చి కల్లా కారు కొన్ని షోరూముల్లో కనబడుతుందన్నాడు. ఏమీ కాలేదు. కానీ మారుతీ కారులో తను ప్రయాణం చేశానని, అద్భుతంగా వుందని ఖుశ్వంత్‌ సింగ్‌ సర్టిఫికెట్టు యిస్తూ ఎమర్జన్సీ నడిచే రోజుల్లో ఇలస్ట్రేటెడ్‌ వీక్లీలో వ్యాసం రాశాడు. అంతా పచ్చి మోసమని ఎమర్జన్సీ ఎత్తేసిన తర్వాత తెలిసింది. 

సంజయ్‌ తనకు చేతకాలేదు కాబట్టి మంచి ఆటోమొబైల్‌ యింజనీర్లను తీసుకుని వచ్చి కారు తయారు చేయాలని అనుకోలేదు. ఎమర్జన్సీ సమయంలో అధికారం చలాయించడానికి, ఆ తర్వాత అధికారంలోకి రావడానికి తన సమయాన్ని వెచ్చించాడు తప్ప చిన్న కారు గురించి పట్టించుకోలేదు. మారుతి ఉద్యోగులను ఖాళీగా వుంచాల్సి వస్తోందని వాళ్ల చేత పెన్‌ క్యాప్‌లు, నేమ్‌ ప్లేట్లు, తాళాలు, యిలాటి చిల్లర వస్తువులు తయారుచేయించేవాడు. డిఫెన్సు వాళ్ల నుంచి బాంబు క్యాప్‌ ఛాంబర్స్‌ కాంట్రాక్టు ఓ సారి తెప్పించుకున్నాడు. కంపెనీ నష్టాల్లో మునిగిపోయింది. అతను చచ్చిపోయాక ఇందిరా గాంధీ అతని పేరు జనం గుర్తుంచుకోవాలనే ధ్యేయంతో సుజుకిని పిలిచి కారు తయారు చేసి దానికి మారుతి-సుజుకి పేరు పెట్టమంది. మామూలుగా సుజుకి యింకో పేరు చేర్చడానికి ఒప్పుకోదు కాబట్టి దానికి అనేక మినహాయింపులు, రాయితీలు యిచ్చి మారుతి పేరు (జాయింటుగానే) మీద ఒక కారు రోడ్ల మీద తిరిగేట్లు చేసింది ఇందిరలోని మాతృహృదయం. ఇది సంజయ్‌ అనుకున్న కారు కానే కాదు. ఇందిర అంటే మండిపడే సంఘీయులు కొందరు సంజయ్‌ని అభిమానించడానికి కారణం - అతని కమ్యూనిస్టులకు బద్ధవిరోధి, ముస్లిం వ్యతిరేకి! తుర్క్‌మాన్‌ గేట్‌ ప్రాంతంలో ముస్లిముల యిళ్లు కూల్పించేయడం, బలవంతపు కుటుంబ నియంత్రణలు యివన్నీ వాళ్లకు నచ్చాయి. అతని కుమారుడు వరుణ్‌ యీ రోజు బిజెపిలో నాయకుడై బహిరంగ సభల్లో ముస్లిము వ్యతిరేక ప్రసంగాలు చేస్తున్నాడు. మారుతి పేర ఎన్ని కంపెనీలు పెట్టి సంజయ్‌ రకరకాలుగా ఆర్జించాడో తర్వాత చెపుతాను.

తీర్పు వెలువడ్డాక సంజయ్‌కు అండగా నిలబడిన వారిలో డికె బరువా ఒకడు. వయసు 65 సం||లు. అసాంకు చెందిన కాంగ్రెసు నాయకుడు. కవి. ఫిరోజ్‌ గాంధీకి స్నేహితుడు. ఇందిరకు, భర్తకు గొడవలు వచ్చినపుడు రాజీ కుదర్చడానికి వస్తూండేవాడు. అలా ఇందిరకు చేరువై వీర విధేయుడిగా మారాడు. ఆమె అతన్ని బిహార్‌ గవర్నరుగా చేసింది, కేంద్ర కాబినెట్‌లో స్థానం యిచ్చింది. చివరకు కాంగ్రెసు అధ్యక్షుణ్ని చేసింది - చెప్పిన మాట విని పడి వుంటాడని. లావుగా, బట్టతలతో వుండే అతన్ని అందరూ ఆస్థాన విదూషకుడు అనేవారు. సోషలిజం గురించి కబుర్లు చెపుతూ సిపిఐ లీడర్లకు కాస్త దగ్గరగా వుండేవాడు. సంజయ్‌కు అది నచ్చేది కాదు, 'కమ్మీ' (కమ్యూనిస్టు) అని వెక్కిరించేవాడు. ఏమన్నా అతను పడేవాడు. సంజయ్‌, ఇందిర ఏం చేయమంటే అది చేయడానికి రెడీగా వుండేవాడు. ఎమర్జన్సీ సమయంలో ''ఇందిరా యీజ్‌ ఇండియా, ఇండియా యీజ్‌ ఇందిరా'' (ఇంగ్లీషులో రాసినప్పుడు ఇండియాకు ఇందిరకు ఆర్‌ అనే ఒక్క అక్షరం తేడా అంతే) అనే కొటేషన్‌ కొట్టి చరిత్రలో మిగిలిపోయాడు. వందిమాగధులు కూడా యితన్ని చూసి తలదించుకోవాలి. అలాటి వాడు కాబట్టే ఇందిర కాంగ్రెసు అధ్యక్షుణ్ని చేసింది. 

వీళ్లంతా కలిసి అలహాబాదు కోర్టు తీర్పు ఎలా వచ్చినా సరే ప్రజలు దాన్ని పట్టించుకోరని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందిర నాయకత్వమే కోరుకుంటున్నారనీ ఇందిరను నమ్మించడానికి పూనుకున్నారు. సంజయ్‌ సూచన మేరకు ధవన్‌ ఢిల్లీకి పరిసర రాష్ట్రాలైన పంజాబ్‌, హరియాణా, యుపి, రాజస్థాన్‌ ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడి ఇందిరకు మద్దతుగా ర్యాలీలు ఏర్పాటు చేయమని చెప్పాడు. సిండికేటుతో యుద్ధాల్లో 1969 నుండి ఇందిర యిలాటి ట్రిక్కు అనేకసార్లు ఉపయోగించింది. రాష్ట్రపతి పదవికి వివి గిరిని నిల్చోబెట్టడం, బ్యాంకుల జాతీయకరణ వంటి చర్యలు చేపట్టినపుడు ప్రగతిశీలతకు చిహ్నంగా ఆమెను కీర్తిస్తూ యిలాటి ప్రదర్శనలు ముఖ్యమంత్రుల సహకారంతో నిర్వహించేది. (సశేషం) (ఫోటో - డికె బరువా)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2015) 

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?