Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40- 17

ఈ పరిస్థితుల్లో 1962లో చైనా భారత్‌పై దండెత్తింది. యుద్ధంలో గెలిచినా కొన్ని రోజులకు తమంతట తామే వెనక్కి తగ్గింది. కారణం అనూహ్యం. అంతర్గతంగా తనకు వస్తున్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని తప్పించడానికి మావో యుద్ధం తలపెట్టాడని యిటీవల పరిశోధకులు అంటున్నారు. స్వాతంత్య్రానంతర భారత్‌ సైన్యంపై, ఆయుధాలపై చేసే వ్యయాన్ని తగ్గించుకుని ఆ నిధులను పారిశ్రామికీకరణకు, వ్యవసాయాభివృద్ధికి వెచ్చిస్తేనే దేశం బాగుపడుతుందని నెహ్రూ అనుకున్నాడు. దానికి గాను యిరుగుపొరుగుతో సఖ్యత పాటించి యుద్ధాలు నివారిద్దామని ప్రయత్నించాడు. బౌద్ధంలో చెప్పిన 'పంచశీల' సిద్ధాంతాన్ని ప్రతిపాదించి చైనాతో స్నేహంగా వున్నాడు. అంతర్జాతీయంగా శాంతిదూతగా పేరు తెచ్చుకున్నాడు. అయితే యిప్పుడు మావో అకస్మాత్తుగా దాడి చేయడంతో నెహ్రూ పరువు పోయింది. దేశం మొత్తం చైనాపై విరుచుకుపడింది. ఆ సమయంలో కమ్యూనిస్టు పార్టీలో రష్యాకు, కాంగ్రెసుకు అనుకూలంగా వుండే వర్గం, (దరిమిలా సిపిఐగా రూపుదిద్దుకుంది) దేశంపై దాడి జరిగిన సందర్భంలో మనమంతా కాంగ్రెసుకు అండగా నిలవాలని అని వాదించింది. కానీ యింకో వర్గం (దరిమిలా సిపిఎంగా రూపుదిద్దుకుంది) 'చైనా చేసినది తప్పే. బ్రిటిషు వారు వారసత్వంగా వదిలిన సరిహద్దు వివాదం ఎప్పటికైనా తేలాల్సిందే. కానీ పెట్టుబడిదారీ విధానాలు అవలంబిస్తున్న నెహ్రూ ప్రభుత్వాన్ని గుడ్డిగా సమర్థించనక్కరలేదు' అని వాదించింది. 

రియాక్షనరీ పదంతో బాటు కమ్యూనిస్టులు వాడే మరో పదం 'రివిజనిస్టులు'. పూర్తి మార్పు రానీయకుండా కొద్దికొద్దిగా సంస్కరణలు చేసుకుంటూ ఆ దిశగా మెల్లిగా అడుగులు వేయాలని ప్రతిపాదించేవారిని మెతకవైఖరి అవలంబించేవారిని రివిజనిస్టులు (సంస్కరణవాదులు) అంటారు. వీళ్లని మాట్ల వాళ్లతో పోలుస్తారు. గిన్నెలకు చిల్లులు పడినా, సొట్టలు పడినా మాట్లవాడు దాన్ని పారేసి కొత్తది కొననీయడు. కొంటే అతనికి వ్యాపారం వుండదు. అందువలన 'గిన్నె నిక్షేపంలా వుంది, కొద్దిగా మాటు వేస్తే యింకో పదేళ్లు ఢోకా లేకుండా పనిచేస్తుంది' అని మనకి నచ్చచెపుతాడు. ఒక్కసారిగా సంఘాన్ని సమూలంగా మారిస్తే కానీ కమ్యూనిజం రాదని విప్లవవాదులు అంటూ వుంటే, కమ్యూనిస్టు వ్యవస్థ నెలకొనడానికి ప్రజలు యింకా సిద్ధంగా లేరు కాబట్టి దూకుడుగా వెళ్లే బదులు కొద్దిపాటి మార్పులతో సరిపెడదామంటారు రివిజనిస్టులు. స్టాలిన్‌ అనంతరం రష్యాలో మెతక నాయకులు అధికారానికి వచ్చి ఆ దేశంలో 'రివిజనిజం' నెలకొంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వున్న కమ్యూనిస్టు పార్టీలన్నీ దాని నేతృత్వాన్ని తిరస్కరించాలని చైనా పిలుపు యిచ్చింది. కొన్ని కమ్యూనిస్టు పార్టీలు రష్యాకు పంథాకు అనుకూలంగా మారితే, మరికొన్ని చైనా పద్ధతికి అనుకూలంగా మారాయి. మన దేశంలో 1964లో కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలి సిపిఐ, సిపిఎంలుగా మారింది. కాంగ్రెసుతో దోస్తీ, సంస్కరణల ద్వారా సమాజాన్ని కొద్దికొద్దిగా మార్చాలనే సిద్ధాంతం కారణంగా సిపిఐను రివిజనిస్టు  పార్టీగా సిపిఎం ముద్ర వేసింది. తర్వాతి రోజుల్లో సిపిఎం నుండి విడిపోయి ఏర్పడిన సిపిఎంఎల్‌ దృష్టిలో సిపిఎం రివిజనిస్టు పార్టీ! 

తెలుగులో రివిజనిస్టులను మితవాదులని, తక్కినవారిని అతివాదులని అనేవారు. ఆ విధంగా సిపిఐ మితవాద కమ్యూనిస్టు పార్టీగా, సిపిఎంను అతివాద కమ్యూనిస్టు పార్టీగా పత్రికల్లో వాడేవారు. మనం కూడా అదే పరిభాషను వుపయోగిద్దాం. సిపిఐను రష్యాకు అనుకూల పార్టీగా, సిపిఎంను చైనాకు అనుకూల పార్టీగా పరిగణించేవారు. అప్పటి రష్యా నాయకత్వం స్టాలిన్‌ను విలన్‌గా చూపుతూంటే సిపిఐ కూడా అదే దృక్పథంతో వుండేది. ఇక సిపిఎం స్టాలిన్‌ హయాంలో పొరపాట్లు జరిగాయని అంటూనే స్టాలిన్‌ నిజమైన కమ్యూనిస్టు అని కీర్తించేది. సిపిఐ కాంగ్రెసును మృదువుగా విమర్శిస్తూ వుంటే, సిపిఎం ఘాటుపదజాలం వుపయోగించేది. కాంగ్రెసు ప్రభుత్వం బూర్జువా, భూస్వామి, పెట్టుబడిదారుల, విదేశీ శక్తుల కొమ్ము కాసే ప్రభుత్వమనీ, రాజ్యాంగం అప్రజాస్వామికమనీ, పార్లమెంటరీ విధానం ద్వారా మార్పు రాదనీ, కార్మికుల నేతృత్వంలో గ్రామీణప్రాంతాల్లో తిరుగుబాటు తీసుకుని వచ్చి సాధ్యమైనంత త్వరలో సాయుధపోరాటానికి వాతావరణం సృష్టిస్తామనీ చెప్పేది. మరో పక్క ఎన్నికలలో పాల్గొంటూ, పార్లమెంటరీ విధానంపై ప్రజలకున్న భ్రమలను తొలగించి వేస్తామనీ, అధికారం చేజిక్కాక రాజ్యాంగాన్ని మార్చేస్తామనీ కూడా చెప్పింది. రష్యా, చైనాలకు తాము సమదూరం అంటూనే చైనాకు అనుకూల ధోరణులు కనబరుస్తూ రష్యా రివిజనిజానికి వ్యతిరేకంగా పోరాడమని పిలుపు యిస్తూండేది. సిపిఐ ప్రజాస్వామ్యం  ద్వారా, శాంతియుతంగా సోషలిస్టు వ్యవస్థను స్థాపించవచ్చని వాదించేది. 

రెండు కమ్యూనిస్టు పార్టీలు తర్వాతి రోజుల్లో మరింత చీలాయి. వాటి బలం కొన్ని రాష్ట్రాలకే పరిమితమై పోయింది. కానీ సోషలిస్టుల్లా కనుమరుగు కాకుండా అన్ని రాష్ట్రాలలో తమ ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు. కమ్యూనిస్టులు ప్రజలపై జాతీయవాదపు ప్రభావాన్ని అర్థం చేసుకోవడంలో పొరబడుతూ వచ్చారు. మానవులందరికీ అంతర్జాతీయ దృక్పథం వుండాలని, మతం, ప్రాంతం, దేశం వంటి సంకుచితపు భావనలకు లొంగిపోకూడదని ఉద్బోధిస్తూ వచ్చారు. కానీ ప్రజలకు వీటిపై సెంటిమెంటు గాఢంగా వుంటుంది. అది గమనించకుండా వీళ్లు జాతీయత అనేది బూర్జువా భావన అని ప్రచారం చేసి ప్రజలకు మానసికంగా దూరమై, విదేశీ మానసపుత్రులుగా ముద్ర వేయించుకున్నారు. కానీ సామాజిక సంస్కరణ విషయంలో కమ్యూనిస్టులదెప్పుడూ ముందంజే. కమ్యూనిస్టు కార్యకర్తలు ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతూ కమ్యూనిస్టులంటే నిజాయితీపరులన్న పేరు తెచ్చుకున్నారు. తమ కార్యకర్తలందరూ కచ్చితమైన నియమాలు పాటించాలనే తపనతో పార్టీ చాలా తక్కువమందికి సభ్యత్వం యిచ్చి, వారిపై అనేక ఆంక్షలు విధిస్తుంది. పార్టీపై విమర్శలు చేయాలన్నా అంతర్గత సమావేశాల్లో చేయాలి తప్ప బహిరంగంగా మాట్లాడడానికి వీల్లేదు. దేశంలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెసు పార్టీలో ప్రజాస్వామ్యం పేర క్రమశిక్షణారాహిత్యం నడుస్తూండడం చేత యీ పార్టీలలోని కఠోర నియమాలకు నియంతృత్వ పోకడలు అనే పేరు వచ్చింది. పార్టీ అధినాయకత్వం మూర్ఖంగా ప్రవర్తించినా, దాన్ని ఎదిరించే పరిస్థితి లేకపోవడం, ఆనక ఎప్పుడో పదేళ్లకు తాము గతంలో చేసినది తప్పని బహిరంగంగా ఒప్పుకోవడం జరుగుతూ వచ్చింది. ఇప్పటికీ అదే పరిస్థితి. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2015)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?