Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40- 21

భారతదేశపు తొలి సార్వత్రిక ఎన్నికలు 1951 అక్టోబరు నుండి 1952 ఫిబ్రవరి వరకు జరిగాయి. జనసంఘ్‌ మూడు లోకసభ సీట్లు గెలుచుకుంది. శ్యామా ప్రసాద్‌ కలకత్తా (తూర్పు) నుండి గెలవగా, మేదినీపూర్‌ నుండి దుర్గా చరణ్‌ బెనర్జీ నెగ్గారు. రాజస్థాన్‌లోని చిత్తూర్‌ నుండి ఉమా శంకర్‌ త్రివేదీ నెగ్గారు. ఈ త్రివేదీ శ్యామా ప్రసాద్‌కు ఇంగ్లండులో క్లాసుమేటు. స్థానికంగా వున్న పలుకుబడితో నెగ్గారు. పార్టీ పోటీ చేసిన 94 సీట్లలో 49 వాటిలో డిపాజిట్లు దక్కలేదు. దేశం మొత్తం మీద 3% ఓట్లు వచ్చాయి. హిందూ మహాసభ పలుకుబడి అంతరిస్తున్నా దానికి 7 సీట్లు వచ్చాయి. రంగంలో వున్న మరో హిందూత్వ పార్టీ అఖిల భారతీయ రామరాజ్య పరిషద్‌ (ఆర్‌ఆర్‌పి)కి మూడు సీట్లు వచ్చాయి. దీన్ని ఉత్తర ప్రదేశ్‌లో స్వామి కరపత్రి అనే ఆయన స్థాపించాడు. భారతీయులందరికీ ఒకే సివిల్‌ కోడ్‌ వుండాలని, అది ధర్మశాస్త్రాలపై ఆధారపడి వుండాలని వాదించేవాడు. హిందూ కోడ్‌ బిల్‌ చేయడానికి హరిజనుడైన ఆంబేడ్కర్‌ తగడని, అది బ్రాహ్మణులు మాత్రమే చేయవలసిన పని అని బహిరంగ ప్రకటనలు చేశాడు. ఒక దశాబ్దం తర్వాత యీ పార్టీ జన సంఘ్‌లో విలీనమై పోయింది.

పార్లమెంటు ఏర్పడ్డాక హిందూత్వ పార్టీలన్నిటినీ కలిపి ఒక బ్లాక్‌గా గుర్తించాలని శ్యామా ప్రసాద్‌ స్పీకరును కోరారు. కానీ ఆయన తిరస్కరించారు. పార్లమెంటులో శ్యామా ప్రసాద్‌ నెహ్రూతో తరచుగా తలపడేవారు. ఒకరి నొకరు మతతత్వవాది అనుకునేవారు. కశ్మీరు సమస్య వారి మధ్య తీవ్ర వివాదానికి దారి తీసింది. బ్రిటిషువారు వెళ్లిపోయాక కశ్మీరు రాజు ఇండియా, పాకిస్తాన్‌లలో ఎవరితోనూ కలవకుండా స్వతంత్రదేశంగా వుందామనుకున్నాడు. అయితే పాకిస్తాన్‌ కిరాయి మూకలతో కశ్మీరులో కొంత భాగాన్ని ఆక్రమించడంతో గతిలేక ఇండియా సహాయం అర్థించాడు. రాజు పాలన అధ్వాన్నంగా వుండడంతో అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న షేక్‌ అబ్దుల్లాకు కశ్మీరు ప్రజలు మద్దతు యిస్తున్నారు. కశ్మీరును కలుపుకోవడానికి రాజు ఆమోదం ఒక్కటీ వుంటే చాలదు. ఎందుకంటే అతనికి ప్రజాదరణ లేదు. అతని మాట ఎవరూ వినరు. ఆ పరిస్థితుల్లో నెహ్రూ షేక్‌ అబ్దుల్లాతో 1952 జులైలో ఒక ఒప్పందం చేసుకున్నాడు. దాని ప్రకారం 1) కశ్మీరులో డోగ్రా రాజుల పాలన అంతం కావాలి. 2) రాజరికం స్థానంలో ఎన్నికల ద్వారా నెగ్గిన వ్యక్తి పాలకుడు కావాలి. అతన్ని సదర్‌-ఎ-రియాసత్‌ (ప్రధాని అని అర్థం) అని పిలవాలి 3) అప్పటికి రాష్ట్రవాసులు కానివారికి పౌరసత్వం యివ్వకూడదు 4) రాష్ట్రానికి ప్రత్యేక చట్టం, ప్రత్యేక పతాకం వుండాలి. 

కశ్మీరుకు యిలాటి ప్రత్యేక ప్రతిపత్తి యివ్వడం వివాదాస్పదం అయింది. హిందూ జనాభా ఎక్కువగా వున్న భూటాన్‌, నేపాల్‌లా దాన్ని స్వతంత్ర దేశంగా వదిలేద్దామంటే పాకిస్తాన్‌ దాన్ని అలా వదిలిపెట్టేట్లా లేదు. తన వశం చేసుకుందామనే ప్రణాళికతో వుంది. కశ్మీరు లోయలో ముస్లిం జనాభా ఎక్కువ కాబట్టి స్వతంత్ర దేశంగా వుండడం కుదరని పక్షంలో వారు ఇండియా కంటె పాకిస్తాన్‌వైపే మొగ్గు చూపవచ్చు. అదే జరిగితే సరిహద్దుల్లో నెత్తిమీద మరో శత్రుదేశాన్ని తెచ్చిపెట్టుకున్నట్లే. దాన్ని నివారించాలంటే ప్రజాబలం కోల్పోయి అపఖ్యాతి పాలైన రాజుతో ఒప్పందం చేసుకుంటే సరిపోదు. ప్రజలను చూడబోతే వారు భారతదేశంతో విలీనం కావడానికి యిష్టపడటం లేదు. స్వతంత్రదేశంగా వుండాలనే అనుకుంటున్నారు. ఈ విషయం ప్రపంచ దేశాలన్నీ గ్రహించాయి. అందుకే కశ్మీరు భారత్‌లో భాగమని వాదిస్తున్న ఇండియాతో 'అయితే అక్కడ ప్లెబిసైట్‌ నిర్వహించి, ప్రజాభిప్రాయం తెలుసుకోండి' అనసాగాయి. పాకిస్తాన్‌ కూడా అదే వాదించింది. ప్లెబిసైట్‌ నిర్వహించాలి అనే ఏకైక ఎజెండాతో ప్లెబిసైట్‌ ఫ్రంట్‌ అనే పార్టీ కూడా దరిమిలా వెలిసింది. ప్లెబిసైట్‌ నిర్వహిస్తే ఇండియాలో విలీనం కావడానికి హిందువులు ఎక్కువగా వున్న జమ్మూ ప్రాంతం మాత్రమే ఒప్పుకుంటుందని, కశ్మీరు లోయ వ్యతిరేకిస్తుందని, ఆ పరిస్థితుల్లో విలీనం చేసుకోవడం అసాధ్యం అనే విషయం తెలుసు కాబట్టి అప్పటి నుంచి యిప్పటివరకు ఇండియా కశ్మీరులో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించలేదు. అలాటి పరిస్థితుల్లో షరతులపైన ఇండియాతో విలీనానికి కశ్మీరు ప్రజలను ఒప్పించగల నాయకుడు షేక్‌ అబ్దుల్లా ఒక్కడే దిక్కయ్యాడు. అతను ఇండియా పక్షపాతి. అయితే అతని యిబ్బందులు అతనికి వున్నాయి. ఇండియాలో విలీనమైతే తమ ప్రత్యేకత పోతుందని, దేశంలోని యితర రాష్ట్రాల ప్రజలతో కశ్మీరులోయను నింపేసి, తమను మైనారిటీలుగా మార్చేసి, అప్పుడు ప్లెబిసైట్‌ నిర్వహించి, దాన్నే కశ్మీరు ప్రజల అభిమతంగా చాటుకుంటారని అతని అనుచరులు, ప్రజలు వాదించారు. అలాటి ప్రమాదం జరగకుండా యితర భారతవాసులు కశ్మీరులో స్థిరనివాసం ఏర్పరచుకోకుండా రాజ్యాంగరక్షణ పొందుతామని, వారి రాకపోకలు నియంత్రిస్తామని, కశ్మీరు ప్రత్యేకత అడుగడుగునా చాటుకుంటామని షేక్‌ అబ్దుల్లా వారికి హామీ నిచ్చాడు. ఆ విషయంపై భారతప్రభుత్వంతో పట్టుబట్టి సాధించాడు. అది చూపించి కశ్మీరు ప్రజలకు కూడా ఇండియాతో కలిసి వుండడంపై నచ్చచెప్పగలిగాడు.

దీనికి శ్యామా ప్రసాద్‌ అభ్యంతరం తెలిపాడు. ఇతర రాష్ట్రాలకు, వాటి ముఖ్యమంత్రులకు లేని సౌకర్యాలు కశ్మీరుకు, షేక్‌ అబ్దుల్లాకు ఎందుకు యివ్వాలని వాదించాడు. 'ఇండియన్‌ రిపబ్లిక్‌లో మరో కశ్మీరు రిపబ్లిక్కా? ఇన్ని ఆంక్షలుంటే అది విలీనమెలా అవుతుంది?' అని ప్రతిఘటించాడు. అతని సహచరుడు బలరాజ్‌ మధోక్‌ జమ్మూలో షేక్‌ అబ్దుల్లాను వ్యతిరేకించే హిందువులతో ఏర్పరడిన ప్రజా పరిషద్‌ పార్టీ సభ్యుడిగా వుండేవాడు. అందువలన అతను యీ విషయంలో శ్యామా ప్రసాద్‌ను రాజీ పడవద్దని గట్టిగా కోరాడు. తక్కిన రాష్ట్రాలతో కశ్మీరుకు పోలిక లేదని, అది సరిహద్దు రాష్ట్రమని, అందుకే దానికి ఆర్టికల్‌ 370 ద్వారా ప్రత్యేక ప్రతిపత్తి యివ్వవలసి వచ్చిందని, కశ్మీరుకు, భారతదేశానికి లింకు తెగిపోకుండా వుండడానికి ఎంతో కష్టం మీద యీ మేరకు సాధించామని అర్థం చేసుకోకుండా శ్యామా ప్రసాద్‌ అనవసరంగా అల్లరి పెడుతున్నాడని నెహ్రూ వాపోయాడు. శ్యామా ప్రసాద్‌ నెహ్రూకు, షేక్‌ అబ్దుల్లాకు చాలా లేఖలు రాశాడు. తమ యిబ్బందులు వివరిస్తూ వాళ్లు జవాబులూ రాశారు. చివరకు ఒక దశలో శ్యామా ప్రసాద్‌ ''కశ్మీరు లోయకు ప్రత్యేక ప్రతిపత్తి యిచ్చినా తప్పులేదు కానీ జమ్మూ, లడాఖ్‌లను మాత్రం ఇండియాలో ఆంక్షలు లేకుండా విలీనం చేయాలి.'' అని దిగివచ్చాడు. దానికి 1953 ఫిబ్రవరిలో జవాబిస్తూ షేక్‌ అబ్దుల్లా ''ఇప్పుడున్న జమ్మూ, కశ్మీరు రాష్ట్రానికి విడగొడితే అది బలహీనపడి పాకిస్తాన్‌, యితర ప్రపంచదేశాలు తాము అనుకున్న నిర్ణయాన్ని మనపై రుద్దే ప్రమాదం వుంది.'' అన్నాడు. 

జమ్మూ ప్రజా పరిషద్‌ పార్టీ మొత్తం రాష్ట్రాన్ని భారత్‌లో సంపూర్ణంగా విలీనం చేయాలని, ఒక దేశంలో రెండు జండాలు, యిద్దరు ప్రధానులు వుండడానికి వీల్లేదనీ ఆందోళన చేపట్టింది. శ్యామా ప్రసాద్‌ దానికి మద్దతు యివ్వడానికి నిశ్చయించుకుని కశ్మీరు వెళదామనుకున్నాడు. అయితే అప్పట్లో కశ్మీరులో ప్రవేశించాలంటే స్పెషల్‌ పర్మిట్‌ వుండాలి. ఈ పర్మిట్‌ పద్ధతిని వ్యతిరేకిస్తూ హిందూ మహాసభ, ఆర్‌ఆర్‌పి, జనసంఘ్‌ సత్యాగ్రహం చేపట్టాయి.  శ్యామా ప్రసాద్‌ కశ్మీర్‌కు వెళ్లి పర్మిట్‌ లేకుండా వెళ్లడానికి ప్రయత్నించారు. దాంతో 1953 మే 11 న ఆయన్ను అరెస్టు చేసి డిటెన్యూగా ఒక పాడుబడిన యింట్లో పెట్టారు. దాని కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. సరైన చికిత్స అందలేదు. శ్వాసకోశ వ్యాధి వచ్చింది. పెన్సిలిన్‌ యిస్తే అది పడలేదు. ఎలర్జీ వచ్చి మరింత జబ్బు పడ్డారు. శ్రీనగర్‌లోని ఆసుపత్రికి కారులో తరలించారు - ఆంబులెన్సులో కాదు! చివరకు జూన్‌ 23 న ఆయన చనిపోయాడు. అప్పటికి ఆయన వయసు 52కి 13 రోజులు తక్కువ. నెహ్రూ ప్రభుత్వమే ఆయనకు స్లో పాయిజన్‌ యిచ్చి చంపించేసిందని జనసంఘీయుల ఆరోపణ. కానీ అప్పటికి నెహ్రూకు వున్న ప్రజాదరణతో పోలిస్తే జనసంఘ్‌కు వున్న ఆదరణ బహు స్వల్పం. పైగా వారిది ప్రధాన ప్రతిపక్షమూ కాదు. శ్యామా ప్రసాద్‌ దేశం మొత్తం మీద తెలిసిన నాయకుడూ కాదు. పని గట్టుకుని చంపి వుండకపోవచ్చు కానీ ఆయన ఆరోగ్యం పట్ల కశ్మీరు ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందనడం మాత్రం కఠోర వాస్తవం. అందుకే తన కొడుకు మృతి పట్ల విచారణ జరిపించమని శ్యామా ప్రసాద్‌ తల్లి కోరినపుడు కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. (సశేషం) (ఫోటో - షేక్‌ అబ్దుల్లా)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2015) 

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?