Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : ఎమర్జన్సీ ఎట్‌ 40 - 25

20 ఏళ్లపాటు అధికారంలో వున్నాక ప్రజల్లో సహజంగా ఏర్పడే ప్రభుత్వవ్యతిరేకత కారణంగా కాంగ్రెసు పార్టీ బలహీనపడుతుందని, ప్రతిపక్షాలు ఆశిస్తున్న సమయంలో ఇందిరా గాంధీ కాంగ్రెసును చీల్చి, తనను తను పేదలపక్షపాతిగా చిత్రీకరించుకుని తన అధికారాన్ని పదిలం చేసుకుని ప్రతిపక్షాల్లో నిరాశ నింపింది. వామపక్షాలు చాలాకాలంగా కోరుతున్నట్లు బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు వంటి చర్యలతో ప్రజలకు సన్నిహితమైంది. దీన్ని ఎలా ఎదిరించాలో జనసంఘ్‌కు పాలుపోలేదు. 1969 ఆగస్టు నాటి తీర్మానంలో 'జనసంఘ్‌ కాపిటలిజాన్ని, స్టేటిజం (అంటే ప్రభుత్వమే అన్నిటినీ తన అధీనంలో వుంచుకోవడం) తిరస్కరిస్తుంది' అంది. నెహ్రూ కాలం నుండి అమలులో వున్న 'మిశ్రమ ఆర్థికవిధానం' (ప్రయివేటు, పబ్లిక్‌ రంగాలు రెండూ పోటీ పడే మిక్సెడ్‌ ఎకానమీ) కంటె యిది భిన్నమైనది కాదు. ఇలా అంటూనే జాతీయకరణ వంటి చర్యల వలన అధికారం కేంద్రం చేతిలో కేంద్రీకృతమై నియంతృత్వానికి దారి తీస్తుందనీ, రిజర్వ్‌ బ్యాంక్‌ స్వతంత్ర సంస్థగా వుండాలనీ బ్యాంకుల జాతీయకరణ రాజకీయ దురుద్దేశంతో చేసినదనీ జోడించింది. జనసంఘ్‌ భావాలు ఎలా వున్నా ప్రజలు జాతీయకరణను హర్షించారు. అందుకే బంగ్లాదేశ్‌ విజయం తర్వాత ఇందిరా గాంధీ బొగ్గు, పెట్రోలు పరిశ్రమలను కూడా జాతీయం చేసింది.  

ఇది గ్రహించిన వాజపేయి పార్టీపరంగా వాటిని వ్యతిరేకించడం మంచిదికాదన్నాడు. కానీ బలరాజ్‌ మధోక్‌, అతని అనుయాయులు మండిపడ్డారు. అలా అయితే కమ్యూనిస్టులకు, మనకు తేడా ఏముందని వాదించాడు. అతని భావాలు స్వతంత్ర పార్టీకి సన్నిహితంగా వుంటాయి. ఆ పార్టీ నిండా మాజీ సంస్థానాధీశులు, జమీందార్లు, పెట్టుబడిదారులు వుండేవారు. స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశం వుందని పార్టీ వాదించేది కానీ సాధారణ ప్రజలకు అది ధనవంతుల పార్టీగానే కనబడేది. అలాటి పార్టీలోకి జనసంఘ్‌ను విలీనం చేయాలని కూడా మధోక్‌ ఒక సమయంలో వాదించాడు. వాజపేయి అధ్యక్షపదవీకాలం ముగియగానే ఆ పదవిని చేపట్టాలని ఉబలాటపడ్డాడు. దీన్ని నివారించడానికి వాజపేయి, తన సహచరుడు ఆడ్వాణీని ముందుకు తోశాడు. ఈ ప్రయత్నంలో అతనికి నానాజీ దేశ్‌ముఖ్‌, జగన్నాథరావు జోషి సహకరించారు. దీనికి గోల్వాల్కర్‌ ఆశీర్వాదం లభించింది. మీడియాకు కొన్ని పార్టీ డాక్యుమెంట్లు లీక్‌ చేశాడన్న ఆరోపణపై మధోక్‌ను 1973 మార్చిలో పార్టీ నుంచి బహిష్కరించారు. ఆడ్వాణీ పార్టీకి అధ్యక్షుడయ్యాడు. 

1971 పార్లమెంటు ఎన్నికలలో పార్టీ దెబ్బ తింది. కాంగ్రెసుకు గతంలో 283 వుంటే యిప్పుడు 352 వచ్చాయి. జనసంఘ్‌కు గతంలో 35 వుంటే యిప్పుడు 22 వచ్చాయి. 157 స్థానాల్లో పోటీ చేస్తే 15% సీట్లు కూడా గెలవలేదన్నమాట. 1972లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అవి కూడా జనసంఘ్‌కు ఆశాజనకంగా ఏమీ లేవు. పరిస్థితిని చక్కదిద్దాలని, పార్టీని కొత్త వర్గాలకు విస్తరించాలని వాజపేయి, ఆడ్వాణీ  ప్రణాళికలు రచించారు. గ్రామీణ ప్రాంతాల్లో, కర్షక, కార్మిక వర్గాలలోకి కూడా పార్టీ చొచ్చుకుని వెళ్లి వారి సమస్యలపై ఆందోళనలు చేయాలని నిశ్చయించారు. వెనకబడిన వర్గాలకు, దళితులకు నచ్చే కార్యక్రమాల కోసం వెతకసాగారు. ఇవన్నీ కొద్దికొద్దిగా ప్రభావం చూపి, పార్టీలోకి కొత్త వర్గాలు వచ్చి చేరనారంభించాయి.  ఇదీ జనసంఘ్‌ పరిస్థితి.

జవాబులు - ఎమర్జన్సీ అని పేరు పెట్టి నేను ఎక్కడెక్కడికో వెళిపోతున్నానని కొందరు పాఠకులు ఆందోళన చెందుతున్నారు. నేను ఒక ప్రణాళికతోనే రాస్తున్నానని విన్నవిస్తున్నాను. ఎమర్జన్సీ విధించినది ఒక నియంత, దానికి వ్యతిరేకంగా పోరాడిన శక్తులు కొన్ని వున్నాయి. ఇద్దరి మధ్య జరిగిన పోరాటం తీరుతెన్నులు తెలుసుకోవాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా నెగ్గిన నాయకురాలు నియంత ఎలా మారిందో తెలుసుకోవడంతో పాటు యితర పార్టీలు ఎందుకు, ఎలా బలహీనపడ్డాయో తెలుసుకోవాలి. ప్రస్తుతం అదే చెపుతున్నాను. 1977లో ఇందిరను మట్టి కరిపించిన జనతాపార్టీలో భాగస్వాములైన సోషలిస్టు పార్టీ కథ చెప్పాను. జనతాతో పొత్తు పెట్టుకున్న సిపిఎం పార్టీ కథ చెప్పాను. జనతాలో అతి ముఖ్యమైన భాగమైన జనసంఘ్‌ కథ యిప్పటిదాకా కాస్త విపులంగానే చెప్పాను. ఎందుకంటే జనతా పార్టీ గెలిచిన 295 సీట్లలో 28 మంది సోషలిస్టులు కాగా, 93 మంది జనసంఘీయులే. తర్వాత చెప్పుకోదగ్గ వర్గం చరణ్‌ సింగ్‌ది, అతని భారతీయ లోక్‌దళ్‌ సభ్యులు 71 మంది నెగ్గారు. అతని పార్టీలో మాజీ స్వతంత్ర పార్టీ సభ్యులు కూడా వున్నారు. అందువలన స్వతంత్ర పార్టీ గురించి కూడా క్లుప్తంగా చెప్పి చరణ్‌ సింగ్‌ గురించి చెప్తాను. తర్వాత 44 మంది నెగ్గిన కాంగ్రెసు (ఓ) గురించి చెప్పాలి. అక్కడే ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చిన తీరు, సిండికేటుతో ఆమె వైరం అన్నీ చర్చించాలి. అప్పటికి ఎమర్జన్సీ పోరాటవీరుల నేపథ్యం పూర్తిగా తెలుస్తుంది. ఆ తర్వాత 1971లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచిన ఇందిర పాప్యులారిటీ నాలుగేళ్లలో ఎందుకు తగ్గిందో, ఆనాటి ఆర్థిక వ్యవస్థ ఎంత అస్తవ్యస్థమైందో, దాన్ని ప్రతిపక్షాలు తమకు అనువుగా మలుచుకుని ఎలా బలం పుంజుకున్నాయో చెప్పాలి. దానికి స్ఫూర్తి నిచ్చిన గుజరాత్‌ 'నవనిర్మాణ్‌' ఆందోళన, ప్రతిపక్షాలకు పెద్దదిక్కుగా నిలిచిన జయప్రకాశ్‌ నారాయణ్‌, ఆయన 'సంపూర్ణ క్రాంతి' ఉద్యమం చెప్పాలి. ఇలాటి పరిస్థితుల్లో అలహాబాద్‌ తీర్పు రావడంతో గాబరా పడిన ఇందిర ఎమర్జన్సీ విధించింది. ఆ ప్రకటన వెలువడిన విధానం, ఎమర్జన్సీ నడిచిన తీరు, దాని మంచిచెడ్డలు, దానికి వ్యతిరేకంగా నడిచిన ఉద్యమాలు.. యివన్నీ తర్వాతి అధ్యాయంలో వస్తాయి. చివరగా ఎమర్జన్సీ ఎత్తివేత, ఎన్నికల ప్రకటన, ఎన్నికలలో ఇందిర పరాజయం, ప్రతిపక్షాలు అధికారం చేపట్టడంతో యీ సీరీస్‌ ముగుస్తాయి.  (సశేషం) (ఫోటో - బలరాజ్‌ మధోక్‌)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2015)  

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?