Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40- 26

కాంగ్రెసు పార్టీలో మొదటి నుండీ బహుళత్వం వుంది. భిన్నధోరణుల నాయకులందరూ కాంగ్రెసు ఛత్రం కిందే స్వాతంత్య్రం కోసం పోరాడారు, అధికారం అందాక ప్రభుత్వాన్ని తమ ఆలోచనలకు అనుగుణంగా మళ్లిద్దామని ప్రయత్నించారు. రైట్‌ కేసి కొందరు, లెఫ్ట్‌ కేసి కొందరు, మతఛాందసం కేసి కొందరు, సెక్యులరిజం కేసి కొందరు యిలా అంతర్గతంగా పోరాడుతూ ఆధిపత్యం కోసం పోటీ పడ్డారు. కాంగ్రెసు కొన్ని సార్లు యిలా, కొన్ని సందర్భాల్లో మరొకలా నడుస్తూ, దాని స్వభావం యితమిత్థంగా చెప్పలేని పద్ధతిలో పయనం సాగించింది. ఇతర నాయకులు ఎందరున్నా నెహ్రూ ఆలోచనావిధానమే కాంగ్రెసును స్వాతంత్య్రానంతరం గాఢంగా ప్రభావితం చేసింది. ప్రజల్లో నెహ్రూకు, అతని సిద్ధాంతాలకు గల ఆకర్షణను చూసి నెహ్రూ వ్యతిరేకులు తిరగబడలేక పోయారు. అధికారం దక్కేందుకు ముందు నెహ్రూ ప్రవచించిన సోషలిస్టు ఆదర్శాలు, తర్వాత ఆచరణలో కనబడలేదని ప్రతిపక్షంలో వున్న కమ్యూనిస్టులు, సోషలిస్టులు విమర్శిస్తూండడం వలన, ప్రజలకు సోషలిజంపై వున్న మోజు వుందనే విషయాన్ని గుర్తించిన నెహ్రూ తన పార్టీలోని సోషలిజం వ్యతిరేకులను కూడా ఒప్పించి 1955 జనవరిలో మద్రాసులోని ఆవడిలో జరిగిన కాంగ్రెసు జాతీయ సమావేశంలో 'సోషలిజమే మా బాట' అని తీర్మానం చేయించగలిగాడు. బ్యాంకులను జాతీయం చేసి ఋణాలు అందరికీ అందుబాటులో వచ్చేట్లా చేస్తామనీ, మాజీ సంస్థానాధీశులకు రాజభరణాలు రద్దు చేసి  ప్రభుత్వంపై భారం తగ్గిస్తామనీ పార్టీ వాగ్దానం చేసింది. 1959 నాగపూరులో జరిగిన సమావేశంలో కాంగ్రెసు జమీందారీ వ్యవస్థను రద్దు చేస్తామని, భూసంస్కరణలు అమలు చేస్తామని, ఒక వ్యక్తికి వుండవలసిన భూమిపై పరిమితులు విధిస్తామని, చిన్న కమతాల రైతులు ట్రాక్టర్ల వంటి ఆధునిక యంత్రాలను కొనలేరు, పంటను దాచుకుని సరైన సమయంలో మంచి ధరకు అమ్మి మార్కెట్‌ చేసుకోలేరు కాబట్టి రైతులతో సహకారసంఘాలు ఏర్పాటు చేసి వారు సామూహికంగా నిలదొక్కుకునేట్లా చేస్తామని ప్రకటించింది. 

ఇది కాంగ్రెసులోని రైటిస్టులను బాధించింది. దానికి తోడు నెహ్రూ అలీన విధానం కూడా వారికి నచ్చలేదు. అప్పట్లో ప్రపంచంలో అమెరికా, రష్యా రెండూ అగ్రరాజ్యాలు. ప్రపంచంలోని దేశాలన్నీ ఆ క్యాంప్‌లోకో, యీ క్యాంప్‌లోకో వెళుతున్నాయి. ఎవరితోనూ కలవకుండా అలీన(నాన్‌-ఎలైన్‌డ్‌) కూటమి పేర కొన్ని తటస్థ దేశాలను ఒక బృందంగా ఏర్పరచడానికి నెహ్రూ, ఈజిప్టుకు చెందిన నాజర్‌ తదితరులు ప్రయత్నించారు. ఇవి అమెరికా, రష్యాల నుండి సహాయసహకారాలు పొందుతూనే రాజకీయంగా సమానదూరం పాటించాయి. వాటికి సైనికసహకారం అందించలేదు. తమకు నచ్చిన రాజకీయ వ్యవస్థనే తమ దేశాల్లో నెలకొల్పుకున్నాయి. స్వాతంత్య్రానంతరం రష్యా ఇండియాకు సాంకేతికంగా చాలా సాయపడింది. తన టెక్నాలజీని అందించి, మన దేశంలో ప్రాజెక్టులు కట్టడానికి, ఉక్కు, నౌకానిర్మాణం తదితర రంగాల్లో పరిశ్రమలు నెలకొల్పడానికి భారీ పెట్టుబడులు పెట్టింది. దిగుమతుల విషయంలో కూడా రుపీ-రూబుల్‌ విధానం ద్వారా విదేశీమారకద్రవ్యం ఎక్కువగా ఖర్చవకుండా వెసులుబాటు కల్పించింది. ఇండియాకు స్నేహహస్తం చాచి, అనేక విధాలుగా సాయపడింది. ఇదంతా వీళ్లకు రుచించలేదు. 

రైటిస్టు ధోరణులున్న కాంగ్రెసు వాదులందరూ రాజాజీ నాయకత్వంలో బయటకు వచ్చేసి 1959 ఆగస్టులో స్వతంత్ర పార్టీ పెట్టారు. దీనిలో ఎందరో మేధావులున్నారు. మన రాష్ట్రం నుండి ఎన్‌.జి.రంగా (అగ్రికల్చర్‌ యూనివర్శిటీకి యీయన పేరే పెట్టారు), గౌతు లచ్చన్న దీనిలో ప్రముఖ నాయకులు. మీనూ మసానీ, కెఎం మున్షీ, పీలూ మోదీ వంటి దిగ్గజాలు నాయకులుగా వున్నారు. వ్యాపారస్తులపై ఎట్టి నిబంధనలు వుండకూడదని, పరిశ్రమలు పెట్టాలంటే ప్రభుత్వం నుండి లైసెన్సులు, పర్మిట్లు తీసుకోవాల్సిన అగత్యం వుండకూడదని, అసలు పబ్లిక్‌ సెక్టార్‌ అనేదే వుండనక్కరలేదని, ఎవరి శక్తి కొలదీ వారిని వ్యాపారం చేసుకోనివ్వాలని, జాతీయకరణ చేయకూడదని, అసలు ఆర్థికాభివృద్ధిలో ప్రభుత్వానికి ఏ పాత్రా వుండనక్కరలేదని వీరి విధానం. దాంతో బడా పారిశ్రామికవేత్తలందరూ యీ పార్టీలో చేరారు. కాంగ్రెసు సోషలిజం బాట పడితే తమ భూములు, దానితో బాటు తాము చలాయిస్తున్న అధికారం పోతాయని భయపడిన భూస్వాములు, జమీందార్లు లాండ్‌ సీలింగు వంటి ఆలోచనలే చేయకూడదని వాదించే యీ పార్టీలో చేరారు. మాజీ రాజుల సంగతి సరేసరి. తమ రాజభరణాలు కాపాడుకోవాలని చేరారు. సోషలిజం వస్తే సొంత ఆస్తిని అనుమతించరని, అది నివారించాలంటే యీ పార్టీయే శరణ్యమని నమ్మిన మధ్యతరగతి మేధావులు దీన్ని ఆదరించారు. ఈనాడు సహకారసేద్యాన్ని ప్రతిపాదిస్తున్న నెహ్రూకు అడ్డుకట్ట వేయకపోతే రేపు చైనా తరహాలో సామూహిక వ్యవసాయక్షేత్రాలు నిర్మిస్తాడని, కష్టజీవుల శ్రమను సోమరులు దోచుకుంటారని రాజాజీ అందర్నీ భయపెట్టారు. నియంతృత్వాన్ని నిరోధించాలంటే తమ పార్టీయే గతి అని ప్రచారం చేశారు.

విదేశీ వ్యవహారాల్లో రష్యాతో పూర్తిగా తెగతెంపులు చేసుకుని అమెరికాతో, పశ్చిమ యూరోప్‌తో సఖ్యంగా వుండాలని, అమెరికా ఛత్రచ్ఛాయల్లో మెలగుతూ దాని రక్షణలో వుండాలని కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టడానికి అమెరికా ఏర్పరచిన ఆగ్నేయాసియా కాపిటలిస్టు దేశాల సమాఖ్య అయిన సీటోలో భారత్‌ సభ్యురాలిగా చేరాలని వీరు ప్రచారం చేయడంతో యీ పార్టీకి అమెరికా అండదండలుండేవి. అమెరికా అభిమానులైన రిటైర్‌డ్‌ సివిల్‌ సర్వెంట్స్‌ కూడా పార్టీలో చేరారు. స్వేచ్ఛావాణిజ్యం అనే వీరి నినాదం కొందరు ఔత్సాహికులను ఉత్తేజపరిచింది కానీ  కార్మికులకు, పేదలకు, చిన్న రైతులకు యిది ఎక్కలేదు. అయితే గ్రామాల్లో పేదల జీవితాలను, ఓట్లను అదుపు చేసే జమీందారులు, భూస్వాములు యీ పార్టీలో చేరి వాళ్ల ఓట్లు కూడా పార్టీకి పడేట్లు చేశారు. మాజీ రాజులంటే అప్పట్లో ప్రజలకు గౌరవాభిమానాలుండేవి. వారు ఏ పార్టీకి ఓటేయమంటే దానికే వేసేవారు. అలా కొన్ని ఓట్లు పడ్డాయి. రైతు నాయకులైన రంగా వంటివారిని చూసి కొందరు రైతులు ఓట్లేశారు. మొదటిసారి 1962 ఎన్నికల్లో పోటీ చేసినపుడు 8.8% ఓట్లు రావడానికి కారణం యిదే.  బిహార్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, ఒడిశా అసెంబ్లీలలో ముఖ్యప్రతిపక్షంగా నిలిచింది. 18 పార్లమెంటు సీట్లు గెలుచుకుంది. ఈ 18లో 7 గురు బిహార్‌నుండి గెలిచారు. వారిలో 5గురు ఒకే కుటుంబానికి చెందినవారు. రామగఢ్‌ మాజీ రాజు తల్లి, భార్య, సోదరుడు, అతని భార్య, వాళ్ల దివాన్‌! 1967 లోకసభ ఎన్నికలలో 8.7% ఓట్లు, 44 సీట్లు గెలుచుకుంది.  1971 వచ్చేసరికి 3% ఓట్లు, 8 సీట్లు మాత్రం వచ్చాయి. పార్టీ విడిగా మనుగడ సాగించడం కష్టమని తేలిపోయింది. మరో పార్టీతో కలిస్తే మంచిదనిపించింది.

ఆలోచనా విధానంలో స్వతంత్ర పార్టీ, జనసంఘ్‌ ఒకలాటివే, మద్దతుదారులూ కామనే. అయితే జనసంఘ్‌ పార్టీ మతంపై ఆధారపడిన పార్టీ కాగా స్వతంత్ర పార్టీ సెక్యులర్‌ పార్టీ. అందువలన రెండు పార్టీల నాయకులూ విలీనంపై తటపటాయించారు. ఇక స్వతంత్ర పార్టీ నాయకులకు మిగిలిన దారి కాంగ్రెసు, చరణ్‌ సింగ్‌ నడిపే భారతీయ క్రాంతి దళ్‌. 1974లో కొందరు అటూ కొందరు యిటూ పోగా మీనూ మసానీ నేతృత్వంలో కొందరు పార్టీలోనే కొనసాగారు. క్రమేపీ రూపుమాసిపోయింది. కాంగ్రెసులో నెహ్రూ సోషలిజం గురించి ఎంత చెప్పినా, మిక్సెడ్‌ ఎకానమీయే కొనసాగించాడు. భూసంస్కరణలు కాగితాల మీదే వుండిపోయాయి. కాంగ్రెసులో చేరిన పెట్టుబడిదారీ వర్గాలు, ధనిక రైతులు తమకు అనుకూల విధానాలు సాగేట్లే చూసుకున్నారు. పార్టీలో అనేకమంది ప్రముఖ నాయకులు వారి మద్దతుతో ఎదిగి, వారు చెప్పినట్లే ఆడేవారు. ఇందిరా గాంధీని వ్యతిరేకించిన సిండికేటు నాయకులందరూ ఆ భావాలున్న వారే. 1969లో పార్టీ చీలిన తర్వాత కాంగ్రెసు(ఓ)కి, స్వతంత్ర పార్టీకి సిద్ధాంతపరంగా తేడా లేకుండా పోయింది. అందువలన కాంగ్రెసు నుంచి వచ్చిన స్వతంత్రపార్టీ నాయకులకు తిరిగి కాంగ్రెసులోకి వెళ్లడానికి అభ్యంతరం లేకపోయింది. గ్రామీణ ప్రాంతాలలో భూస్వామ్యవర్గాల నుంచి వచ్చినవారు, కాంగ్రెసు అంటే పడనివారు చరణ్‌ సింగ్‌తో చేతులు కలిపారు. (సశేషం) 

(ఫోటో - స్వతంత్ర పార్టీ సమావేశంలో మధు మెహతా, పీలూ మోదీ, రాజాజీ) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2015) 

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?