Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40- 27

చౌధురీ చరణ్‌ సింగ్‌ పేరు చెప్పగానే పదవీలాలసే గుర్తుకు వస్తుంది. అధికారం కోసం ఎంతైనా మొండిపట్టు పడతాడని, పార్టీ మార్చడానికి, చీల్చడానికి వెనుకాడడని పేరు బడ్డాడు. కానీ ఆయన అవినీతిపరుడు కాదు. అవినీతిని సహించేవాడూ కాదు. రైతుబాంధవుడు, గ్రామీణసమస్యలపై పూర్తి అవగాహన కలవాడు. నగరీకరణ తగ్గి, గ్రామాలు పట్టణాలు స్వయంసమృద్ధి సాధించాలని కలలు కన్నవాడు. మతఛాందసత్వం లేనివాడు. కానీ నెహ్రూ విధానాలను, సహకారవ్యవసాయం వంటి ఆలోచనలను బహిరంగంగా ప్రతిఘటించేవాడు. పైగా ఆయన ప్రతీ సమస్యను కులమనే కోణంలో చూసేవాడు. బ్రాహ్మణులు, ఠాకూర్లు, బనియాలే అన్ని పదవులూ పట్టుకుపోతున్నారని, మీడియా కూడా వారి పట్ల ఉదారంగా వుంటోందని, తనలాటి జాట్‌ కులస్తులను సరైన కోణంలో చూపడం లేదని వాపోయేవాడు. ఆయన వ్యవసాయరంగం గురించి, భూసంస్కరణల గురించి ఎంతో చేసినా, అదంతా భూస్వాముల బాగుకోసమే చేస్తున్నాడనే పేరు వచ్చింది. అందువలన పేదరైతులు ఆయన్ని నమ్మలేదు. ఆయన సొంతంగా దుర్మార్గాలను ప్రోత్సహించక పోయినా, ఆయన అనుయాయులు తమ నియోజకవర్గాలలో హరిజనులను ఓట్లేయనీయకపోవడం వలన దళితులు యీయనపై కత్తికట్టారు. మీడియా ఆయనకు 'కులక్‌ నాయకుడు' అనే బిరుదు అంటగట్టింది. జనతా పార్టీ విజయానికి ఆయన ఎంత కారకుడో, వైఫల్యానికి కూడా అంతే కారకుడు. ఉపప్రధానిగా వుంటూ ప్రధానమంత్రితో ఎడమొగం, పెడమొగంగా వుండేవాడు. ఆయన లోపాలు ఎన్ని వున్నా యుపి, బిహార్‌, హరియాణాలలో ఆయన కొంతకాలం పాటు బలమైన శక్తిగా వెలిగాడు. 

1902లో పుట్టిన చరణ్‌ సింగ్‌ పుట్టినది చిన్నపాటి రైతు కుటుంబంలో! సైన్సులో డిగ్రీ చేసి ఆగ్రా యూనివర్శిటీలో పోస్టు గ్రాజువేషన్‌ చేశారు. న్యాయవిద్య చదివి, ఘజియాబాద్‌లో ప్రాక్టీసు పెట్టారు. 1929లో మేరఠ్‌కు మారి, కాంగ్రెసులో చేరి స్వాతంత్య్రోద్యమంలో దిగారు. 1937లో మొదటిసారి యుపి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత వరుసగా నెగ్గుతూ వచ్చారు. 1946 గోవింద వల్లభ్‌ పంత్‌ ప్రభుత్వంలో పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేశారు. 1951లో మంత్రి అయి 1966 వరకు డా|| సంపూర్ణానంద్‌, సిబి గుప్తా, సుచేతా కృపలానీల కాబినెట్లలో అనేక శాఖలు చూస్తూ వచ్చారు.  1967 ఎన్నికలలో కాంగ్రెసు దెబ్బ తింది. గతంలో కంటె 74 సీట్లు తగ్గి 425 సీట్లలో 199 మాత్రం వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శక్తి చాలదు. జనసంఘ్‌కు 98 వస్తే సోషలిస్టులు (ఎస్‌ఎస్‌పి) కు 44, కమ్యూనిస్టులకు 15 వచ్చాయి. 37 మంది స్వతంత్రులు నెగ్గారు. కాంగ్రెసు వ్యతిరేక పార్టీలన్నీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేయసాగాయి. కానీ పూర్తి లెఫ్ట్‌, పూర్తి రైట్‌ పార్టీలు కలవడానికి తటపటాయిస్తున్నాయి. ఇంతలో బిహార్‌లో మహామాయ ప్రసాద్‌ సిన్హా ఆ విధంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో యుపిలో కూడా అలాటి ప్రయత్నాలు మొదలయ్యాయి. దాంతో కాంగ్రెసు కంగారుపడింది. స్వతంత్రులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంది. కానీ అందర్నీ కలుపుకుని పోగల కాంగ్రెసు సీనియర్‌ నాయకుడు కమలాపతి త్రిపాఠీ ఓడిపోయాడు. అందువలన అతని స్థానంలో కాంగ్రెసు లెజిస్లేచర్‌ పార్టీ నాయకుడిగా సిబి గుప్తా, చరణ్‌ సింగ్‌ పేర్లు పరిశీలించి చివరకు గుప్తాను ఎంపిక చేసింది. 

ఆశాభంగం చెందిన చరణ్‌ సింగ్‌ మంత్రివర్గంలో చేరడానికి నిరాకరించాడు. అతనే కాదు, అతని అనుచరులు కూడా అంటీమట్టునట్లు వ్యవహరించడంతో గుప్తా ముఖ్యమంత్రి అయిన 15 రోజులకే పదవీగండం వచ్చింది. చరణ్‌ సింగ్‌ కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి జన కాంగ్రెసు అని ఏర్పాటు చేశాడు. ప్రతిపక్షాలతో చేతులు కలిపి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాడు. 18 రోజులకే గుప్తా ప్రభుత్వం పడిపోయింది. చరణ్‌ సింగ్‌ తన పార్టీ పేరు భారతీయ క్రాంతి (క్రాంతి అంటే విప్లవం) దళ్‌గా మార్చి 1967 ఏప్రిల్‌లో జనసంఘ్‌, ఎస్‌ఎస్‌పి, పిఎస్‌పి, స్వతంత్ర, కమ్యూనిస్టులు, రిపబ్లికన్‌ పార్టీ, స్వతంత్రులతో కలిసి సంయుక్త విధాయక దళ్‌ పేరిట మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటు చేశాడు. అందరూ ఒప్పుకున్న 19 పాయింట్లతో కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాం తయారుచేసుకున్నారు. వ్యవసాయదారులకు కిట్టుబాటు ధరల నుంచి, ఉద్యోగులకు హెచ్చుజీతాల వరకు అన్నీ యిరికించారు. ముఖ్యమంత్రి అవుతూనే చరణ్‌ సింగ్‌ 'ఇవన్నీ ఆచరణలో అసాధ్యం' అని ప్రకటించాడు. ప్రభుత్వం సజావుగా సాగలేదు. వ్యవసాయంపై పన్ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రామ్‌ మనోహర్‌ లోహియా ప్రభుత్వం నుంచి తప్పుకుంటానన్నాడు. విభేదాలు పెరగడంతో నాలుగు నెలల్లో చరణ్‌ సింగ్‌ రాజీనామా సమర్పించాడు. దాంతో భాగస్వాములు సర్దుకుంటామని దిగివచ్చారు. అదీ ఎక్కువకాలం సాగలేదు. చివరకు 1968 ఫిబ్రవరిలో చరణ్‌ సింగ్‌ గద్దె దిగడం, రాష్ట్రపతి పాలన విధించడం జరిగాయి. 

1969లో ఎన్నికలు జరిపారు. ప్రతిపక్షాలతో విసిగిన ప్రజలు కాంగ్రెసుకు పట్టం కట్టారు. కాంగ్రెసుకు 211, జనసంఘ్‌కు 49, ఎస్‌ఎస్‌పికి 33, సిపిఐకు 80, చరణ్‌ బికెడికి 98 వచ్చాయి. కాంగ్రెసు నాయకుడు సిబి గుప్తా 1970 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి అయి అక్టోబరు దాకా పాలించారు. కానీ తర్వాత అంతర్గత కలహాలతో దిగాల్సి వచ్చింది. అధికారం దక్కితే చాలు, శత్రువుల సాయం కూడా తీసుకోవడానికి వెనుకాడని చరణ్‌ సింగ్‌ కాంగ్రెసు మద్దతు తీసుకుని 1970 ఫిబ్రవరిలో మళ్లీ ముఖ్యమంత్రి అయి, 8 నెలలు పాలించాడు. అదీ కుప్పకూలడంతో 17 రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించి మళ్లీ కాంగ్రెసు పార్టీ నాయకుడైన త్రిభువన నారాయణ్‌ సింగ్‌ను ముఖ్యమంత్రిగా తెచ్చారు. ఆయన 1970 అక్టోబరు నుండి 1971 ఏప్రిల్‌ దాకా పాలించి గొడవల వలన దిగిపోయి, కమలాపతి త్రిపాఠీకి అధికారం అప్పగించాల్సి వచ్చింది. ఆయనా 1973 జూన్‌లో దిగాల్సి వచ్చింది. దాదాపు 5 నెలలు రాష్ట్రపతి పాలన విధించి, 1973 నవంబరులో ఎచ్‌ఎన్‌ బహుగుణను ముఖ్యమంత్రి చేసి అతను నాలుగు నెలలు పాలించాక 1974లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. దానిలో కాంగ్రెసుకు 215, జనసంఘ్‌కు 61, సిపిఐకు 16 రాగా బికెడికి 106 వచ్చాయి. బహుగుణ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన వుండగానే ఎమర్జన్సీ విధించడం జరిగింది. మధ్యలో జరిగిన 1971 పార్లమెంటు ఎన్నికలలో బికెడికి 2.18% ఓట్లతో ఒక్క పార్లమెంటు సీటు దక్కింది. ఈ ఎదురు దెబ్బలతో చరణ్‌ సింగ్‌ తన పార్టీలోకి యితర పార్టీలను కూడా ఆహ్వానించాడు. స్వతంత్ర పార్టీని, కాంగ్రెసు పార్టీలో నాయకుడిగా దశాబ్దాలపాటు వెలిగి, 1969లో బయటకు వచ్చేసిన బిజూ పట్నాయక్‌ (నేటి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ తండ్రి) పెట్టిన ఉత్కళ కాంగ్రెసును, సోషలిస్టు పార్టీని కలుపుకుని 1974 చివర్లో భారతీయ లోక్‌ దళ్‌ పార్టీగా ఏర్పరచాడు. ఎమర్జన్సీ విధించేనాటికి చరణ్‌ సింగ్‌ పార్టీ మరీ బలమైన నాయకుడేమీ కాదు, అలాటిది 1977 వచ్చేసరికి అతను అతి ముఖ్య నాయకుడై పోయి, ప్రధాని ఎవరో నిర్ణయించగల ఉపప్రధాని అయిపోయాడు. అది ఎమర్జన్సీ పుణ్యమే! (సశేషం) (ఫోటో - సి బి గుప్తా) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2015)  

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?