Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40- 33

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40- 33

అయితే ఓ మెలిక పెట్టింది. భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే రూపాయి మారకం విలువను తగ్గించాలని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిచేత చెప్పించింది. తన స్టేటు డిపార్టుమెంటు చేత నచ్చచెప్పించింది. అలా అయితే భారతదేశపు ఉత్పాదనలు అంతర్జాతీయ విపణిలో చవకగా అమ్మవచ్చని, దాని వలన ఎగుమతులు పెరిగి, అనవసర దిగుమతులు తగ్గి విదేశీమారకద్రవ్య నిలువలు పెరుగుతాయని చెప్పింది. ఇలాటి సలహాలు తొమ్మిదేళ్ల క్రితం కూడా యిచ్చింది కానీ నెహ్రూ నిరాకరించాడు. అప్పట్లో భారతదేశం ఎగుమతులు చేసే స్థితిలో లేదు. ఆహారధాన్యాలు సైతం దిగుమతులు చేసుకునే స్టేజిలో వుంది. కానీ యిప్పుడు శాస్త్రికి యీ ఆలోచన నచ్చింది. ఆర్థికమంత్రిగా వున్న టిటి కృష్ణమాచారి (టిటికె గ్రూపు స్థాపించినాయన)కి చెప్తే ఆయన వద్దన్నాడు. ''రూపాయి విలువను తగ్గించడమనేది దశలవారీగా చేయాలి. అది కూడా మనకు పంటలు బాగా పండి, దిగుమతుల అవసరం లేనప్పుడు చేయాలి. వాళ్లు చెప్పినట్లు ఒక్కసారిగా 36% తగ్గిస్తే దిగుమతుల భారం పడి ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుంది.'' అని వాదించాడు. ఈ విషయం విని అమెరికా కృష్ణమాచారిని అమెరికా వ్యతిరేకిగా ముద్ర వేసింది. పాక్‌ యుద్ధ విజయంతో ధైర్యం పెరిగిన శాస్త్రి 1965 డిసెంబరులో కృష్ణమాచారిని పదవిలోంచి తప్పించివేశారు. రూపాయి విలువ తగ్గిస్తున్నామని ప్రకటించారు. (ఆయన మరణం తర్వాత అది అమల్లోకి వచ్చింది). 

ఇవన్నీ కాంగ్రెసులో వున్న సోషలిస్టు భావాల వారిని బాధించాయి. కేరళలో పార్టీ నుండి ప్రతిపక్షాల్లోకి ఫిరాయించారు. ప్రభుత్వం పడిపోయింది. బయటనుండి నెహ్రూను విమర్శిస్తూనే కాంగ్రెసు పట్ల ఉదారంగా వుండే సోషలిస్టులు, కమ్యూనిస్టులు పూర్తిగా వ్యతిరేకమై పోయారు. అదే సమయంలో పూర్తి రైటిస్టు భావాలతో వెలిసిన స్వతంత్ర పార్టీ శాస్త్రికి మద్దతు పలికింది. ప్రతిపక్షాలు శాస్త్రి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినపుడు ఆ పార్టీ దానికి వ్యతిరేకంగా ఓటేసింది. జనసంఘ్‌ చాలా తటపటాయించి, చివరకు తీర్మానాన్ని బలపర్చింది. ఇక హిందీ విషయంలో శాస్త్రి ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు చర్య గురించి, దాని పర్యవసానాల గురించి తమిళ రాజకీయాలు-50 లో రాశాను. తన ప్రధానమంత్రిత్వాన్ని బలపరచిన దక్షిణాది కాంగ్రెసు నాయకులు తన హిందీవిధానాన్ని గట్టిగా వ్యతిరేకించడంతో శాస్త్రి వెనకడుగు వేశాడు. అలా వేయడం 'హింసకు లొంగిపోవడమే' అని మొరార్జీ విమర్శించాడు. ఇవన్నీ చూసి కాంగ్రెసు పూర్తిగా ఉత్తరాది పార్టీగా మారిపోతోందన్న భయం యితర ప్రాంతాల్లో వ్యాపించింది. ఎల్లెడలా శాస్త్రి పాలనపై వ్యాపించిన అసంతృప్తి నుంచి దృష్టి మరల్చడానికా అన్నట్లు పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చింది.

గుజరాత్‌లోని రాణ్‌ ఆఫ్‌ కచ్‌ ప్రాంతంలో వున్న కంజర్‌కోట్‌, బియార్బెత్‌ గ్రామాల్లో భూగర్భంలో పెట్రోలు దొరుకుతుందని అనుకునేవారు. అది భారత్‌, పాక్‌ సైన్యాలు యిరుపక్కలా మోహరించి వున్న ప్రదేశం. దాన్ని సరిహద్దు వివాదంగా మార్చి ఆక్రమిద్దామని పాక్‌ ఎప్పణ్నుంచో ప్రయత్నిస్తోంది. కొంతకాలం ఆక్రమించింది కూడా. 1960లో భారత్‌ సైన్యాలు వాళ్లని తరిమివేశాయి. 1965 జనవరి నుంచి పాక్‌ మళ్లీ ఆక్రమించాలని చూసింది. ఆ ఏడాది మార్చి 3న పార్లమెంటులో విదేశీ వ్యవహారాల మంత్రి చెప్పినదాని ప్రకారం భారత్‌కు చెందిన 13 వేల ఎకరాలు పాక్‌ ఆక్రమణలో వుంది. యుద్ధం చేద్దామని జనరల్‌ చౌధురీ ఉబలాటపడ్డారు. కానీ శాస్త్రికి యుద్ధం చేయడం యిష్టం లేదు. ఎందుకంటే పాక్‌కు ఆ సరిహద్దు నుండి 48 కి.మీ.ల దూరంలో ఎయిర్‌పోర్టు వుంది. భారత్‌కు అటువంటి సౌకర్యాలు లేవు. యుద్ధం ప్రారంభిస్తే అక్కడ చాలా సైన్యాన్ని మోహరించవలసి వస్తుంది. ఇతర ప్రాంతాల్లో యుద్ధం వస్తే అక్కడ చాలదు. ముఖ్యంగా పాక్‌తో యుద్ధం చేయవద్దని అమెరికా సలహా యిచ్చింది. పాక్‌తో నిర్యుద్ధ ఒప్పందం చేసుకుందామని శాస్త్రి అనుకున్నారు. కానీ పాక్‌ స్పందించలేదు. 

రెండూ కామన్‌వెల్త్‌ దేశాలే కాబట్టి మేం ఒక మధ్యేమార్గం చూపిస్తాం అంటూ బ్రిటన్‌ ముందుకు వచ్చింది. ఒక ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని, దానిలో భారత్‌ సూచించిన ఒక ప్రతినిథి, పాక్‌ సూచించిన మరో ప్రతినిథి, చైర్మన్‌గా యునైటెడ్‌ నేషన్స్‌ సెక్రటరీ జనరల్‌ సూచించిన ప్రతినిథి వుండాలని సూచించింది. ఇండియా యుగోస్లావియాకు చెందిన అలెస్‌ బెబ్లర్‌ను తన ప్రతినిథిగా ఎంచుకోగా, పాకిస్తాన్‌ ఇరాన్‌కు చెందిన నసరుల్లాను ఎంచుకుంది. స్వీడన్‌కు చెందిన గున్నార్‌ గెర్గున్‌ చైర్మన్‌గా వుండి నసరుల్లా మాటలకు ప్రభావితుడై వివాదంలో వున్న 87,500 చ.కి.మీలు పాకిస్తాన్‌కు యివ్వడానికి సిద్ధపడుతున్నాడని తెలిసి, ఇండియా ఉలిక్కిపడింది. న్యాయం తమ పక్షాన వున్నా ఇంగ్లండు పాకిస్తాన్‌వైపే నిలుస్తోందని అర్థమైంది. చివరకు రాజీగా 800 చ.కి.మీ.లు అప్పగించడానికి ఒప్పుకుంది. పాక్‌ అడిగినదానిలో 10% కంటె తక్కువ యిచ్చామని ఇండియా, ఉత్తిపుణ్యానికి భూమి వచ్చిందని పాక్‌ తృప్తిపడతాయని అందరూ అనుకున్నారు. కానీ పాక్‌ ఉద్దేశాలు వేరే వున్నాయి. దాని కెప్పుడూ కశ్మీర్‌ మీదే కన్ను. భారత్‌ దృష్టిని కచ్‌ సమస్యపై మరల్చి ఆ సమయంలో కశ్మీర్‌లో చొరబాట్లు సాగించింది. అప్పుడు పాక్‌ విదేశాంగ మంత్రిగా వున్న భుట్టో ముజాహిద్‌(విముక్తివీరులు)ల పేర 1965 ఆగస్టులో కొంతమందికి తర్ఫీదు యిచ్చి కశ్మీర్‌లో ప్రవేశపెట్టాడు. ప్రధాని ఆయూబ్‌ మౌనంగా సమ్మతించాడు. కశ్మీరు ప్రజలు తమను ఆహ్వానిస్తారని భుట్టో అనుకున్నాడు కానీ వాళ్లు అలా చేయకపోగా ఇండియన్‌ అధికారులకు ఉప్పందించారు. వెంటనే సైన్యం చొరబాటుదారులను వెనక్కి నెట్టుకుంటూ పోయి పాక్‌ లోని హాజీ పీర్‌, తిత్వాల్‌ ప్రాంతాల్ని ఆక్రమించింది. దానికి జవాబుగా పాకిస్తాన్‌ సెప్టెంబరు 1 న జమ్మూలోని ఛాంబ్‌ ప్రాంతాన్ని ఆక్రమించింది. (సశేషం) (ఫోటో - టి టి కృష్ణమాచారి)

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015) 

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?