Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40- 34

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40- 34

దాంతో శాస్త్రి కాఠిన్యం వహించారు. పాక్‌తో యుద్ధం తప్పిద్దామనే ఆలోచన విరమించుకుని ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నారు. యునైటెడ్‌ నేషన్స్‌ వారి భద్రతా మండలి యుద్ధానికి దిగవద్దని యిచ్చిన సలహాను తృణీకరిస్తూ 'పాక్‌ ఒక పక్క యుద్ధానికి కాలుదువ్వుతూ వుంటే మేం యుద్ధవిరామాల గురించి ఆలోచిస్తూ వుండాలా?' అని జవాబిచ్చారు. మీకిచ్చే  సహాయాన్ని అమెరికా నిలిపివేయవచ్చు అని బెదిరించినా తొణకలేదు. ''చివరకు ఎలాగోలా సంధి తప్పదు, అప్పుడు యిచ్చిపుచ్చుకోవడాలపై బేరసారాలు సాగించాలంటే పాకిస్తాన్‌లో కొంత భాగాన్ని మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. అప్పుడే ఇండియాలో మన భాగం తిరిగి మనకు వస్తుంది. అందుకని మీరు పాకిస్తాన్‌లోకి చొచ్చుకుపోండి.'' అని సైన్యానికి ఆదేశాలు యిచ్చారు. దానికి ''ఆపరేషన్‌ రిడిల్‌'' అని కోడ్‌నేమ్‌ పెట్టారు. యునైటెడ్‌ నేషన్స్‌ సెక్రటరీ జనరల్‌ యు థాంట్‌ యుద్ధవిరమణ ప్రతిపాదనలతో రావల్పిండి వెళ్లి, ఢిల్లీ వస్తే మన సైన్యం పాకిస్తాన్‌ భూభాగాన్ని  ఆక్రమించేదాకా ఆయనతో మీటింగును శాస్త్రి వాయిదా వేశారు. చివరకు యు థాంట్‌ ప్రతిపాదన అంగీకరించి సెప్టెంబరు 24 న యుద్ధవిరమణకు రెండు పక్షాలూ అంగీకరించాయి. ఆ యుద్ధంలో రెండు దేశాలూ ఎదుటి దేశంలోకి 5-8 కి.మీ.ల లోపలకి చొచ్చుకుని వెళ్లాయి, రెండూ తాము విజయం సాధించామని చాటుకున్నాయి, ఆ 'విజయం'లో పాలుపంచుకున్న సైన్యాధికారులకు మెడల్స్‌ యిచ్చాయి. చైనా యుద్ధంలో ఓటమి చవిచూసి ఆత్మన్యూనతాభావంలో మునిగిన భారతీయులకు శాస్త్రి కారణంగా పోయిన దేశప్రతిష్ఠ తిరిగి వచ్చినట్టనిపించింది. ఒక్కసారిగా ఆయన హీరో అయిపోయాడు. ఆయన కూడా ''జై జవాన్‌, జై కిసాన్‌'' అనే నినాదం యిచ్చాడు. ఇనుమడించిన ఉత్సాహంతో విజయసభల్లో ''ఉభయదేశాల మధ్య నున్న సమస్యలను పరిష్కరించడానికి ఆయుధప్రయోగానికి దిగనని పాకిస్తాన్‌నుండి హామీ పొందేవరకు మనం హాజీ పీర్‌, తిత్వాల్‌ ప్రాంతాలను ఖాళీ చేయం.'' అని ఉద్ఘాటించారు. 

యుద్ధవిరమణ అయింది కానీ రాజీ యింకా కుదరలేదు. కుదిర్చే భారాన్ని తాము వహిస్తామని రష్యా ఆఫర్‌ చేసింది. మొదట శాస్త్రి యిష్టపడలేదు కానీ యునైటెడ్‌ నేషన్స్‌ కూడా తీర్మానం ఒకటి చేసి ఒత్తిడి చేయసాగింది. చివరకు 1966 జనవరి 10 న తాష్కెంట్‌లో యిరు దేశాల ప్రధానులు కలవడానికి నిశ్చయమైంది. ఇరుపక్షాల నుంచి దౌత్యాధికారుల చర్చలు ప్రారంభమయ్యాయి. శాస్త్రి కోరిన హామీ యివ్వడానికి పాక్‌ రెడీగా లేదు. ఎవరి సరిహద్దుల్లోకి వాళ్లు వెళ్లాలనే వాళ్లు ప్రతిపాదించారు. అప్పుడు తిత్వాల్‌ వదిలేసినా హాజీ పీర్‌ విడిచిపెట్టకూడదని శాస్త్రి అనుకున్నారు. అలా అయితే జమ్మూలోని ఛాంబ్‌ ఖాళీ చేయం అని పాక్‌ అంది. శాస్త్రి హోం మంత్రి గుల్జారీలాల్‌ నందాకు ఫోన్‌ చేసి సలహా అడిగారు. ఛాంబ్‌ వదిలేస్తే జమ్మూలోని హిందువులు నొచ్చుకుంటారని నందా అన్నారు. ఇక గత్యంతరం లేక పాకిస్తాన్‌ ఏ హామీ యివ్వకపోయినా, ఆక్రమిత ప్రాంతాలను వదిలేయవలసినదే అని శాస్త్రి అనుకున్నారు. 

అప్పటికే శాస్త్రికి అగ్రరాజ్యాల తత్త్వమేమిటో బోధపడింది. రష్యా ప్రపంచంలో కమ్యూనిజాన్ని వ్యాప్తి చేయడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయపడుతూ, వారిని కమ్యూనిస్టు సానుభూతిపరులుగా మారుస్తోంది. కమ్యూనిజం నుండి ప్రపంచాన్ని కాపాడడమే మా ధ్యేయం అనే పేరుతో అమెరికా తన సామ్రాజ్యవాదాన్ని విస్తరిస్తోంది. రష్యాతో ఎప్పటికైనా పోరాటం తప్పదన్న ఆలోచనతో ప్రపరచమంతా సైనిక స్థావరాలు పెడుతోంది. అలాటి స్థావరం పెట్టుకోవడానికి ఇండియా ఒప్పుకోలేదు కానీ పాకిస్తాన్‌ ఒప్పుకుంది. అందువలన కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టడం అనే మిషపెట్టి 1958 నుంచి పాకిస్తాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తోంది. కాపిటలిజం, కమ్యూనిజం రెండింటికీ సమదూరంగా అలీన (నాన్‌ ఎలైన్‌డ్‌) విధానాన్ని ప్రతిపాదించి నెహ్రూ అనేక దేశాలను దానిలో సభ్యులుగా చేర్పించడం, రష్యాకు సన్నిహితంగా మెలగడం అమెరికాకు నచ్చలేదు. పాకిస్తాన్‌కు అండగా నిలబడుతూ ఇండియాను బెదిరించి, తన వైపు తిప్పుకోవడానికి నిశ్చయించుకుంది. ప్రజాస్వామ్యమే మా వూపిరి అని చెప్పుకునే అమెరికాకు పాకిస్తాన్‌లో నెలకొన్న నియంతృత్వం, మతమౌఢ్యం, సైనికపాలన ఏవీ కంటికి ఆనవు. మద్దతు యిస్తూనే వుంటుంది. (ఇప్పటికీ అమెరికాది యిదే పాలసీ) ఇక రష్యా చూడబోతే మొదట్లో పాకిస్తాన్‌ కంటె ఇండియా పట్ల పక్షపాతం చూపించింది కానీ 1964లో కృశ్చేవ్‌ స్థానంలో కోసిగిన్‌ వచ్చాక, చైనాతో సంబంధాలు చెడాక, భారత్‌, పాక్‌ల మధ్య సమదూరం పాటించసాగింది. తాము ఇండియావైపు మొగ్గినకొద్దీ పాకిస్తాన్‌ అమెరికా కౌగిలిలోకి వెళ్లిపోతుందని వారి భయం. అందుకని ఎవరినీ చెడగొట్టుకోకుండా చూడాలనే వారనుకున్నారు. ప్రస్తుతానికి యీ షరతులకు ఒప్పుకోమనీ, కశ్మీరు ఆక్రమించడానికి పాక్‌ భవిష్యత్తులో సైన్యాన్ని ప్రయోగిస్తే తాము భారత్‌కు సైనిక సాయం చేస్తామనీ కోసిగిన్‌ శాస్త్రికి హామీ యిచ్చారు. 

తాష్కెంటులో జరిగిన ఒప్పందాన్ని ఒప్పందం అని పిలవడానికి కూడా పాక్‌ ఒప్పుకోలేదు. చివరకు తాష్కెంట్‌ డిక్లరేషన్‌ పేర ప్రకటించారు. ఈ వార్త బయటకు రాగానే ఇండియాలో నిరాశ వ్యాపించింది. పాక్‌కు బుద్ధి చెప్పామన్న తృప్తి ఆవిరై పోయింది. జనసంఘ్‌ నాయకుడు వాజపేయి ''భవిష్యత్తులో యుద్ధానికి దిగమని పాక్‌ నుండి నిర్దిష్టమైన హామీ ఏమీ తీసుకోకుండానే వారి ప్రాంతాలను వారికి అప్పగించడం పొరపాటు'' అని ప్రకటించారు. శాస్త్రి భార్య కూడా అలాగే అనుకున్నారు. సంతకాలు పూర్తయ్యాక ఇంటికి ఫోను చేసిన శాస్త్రికి ఆయన కూతురు యీ విషయాలు చెప్పింది. ఇది విని ఆయన ఆందోళనకు గురయ్యాడు. అసలే హృద్రోగి ఆయనకు మరోసారి గుండెపోటు వచ్చింది. ఆ రాత్రే అంటే 1966 జనవరి 11న 64 వ యేట మరణించారు. చనిపోవడంతో శాస్త్రి ఖ్యాతి మరింత పెరిగింది. ఆయన పరిపాలన మంచి చెడ్డలు అంచనా వేయాలంటే 1961-66 ల మధ్య నడిచిన మూడవ పంచవర్ష ప్రణాళిక కొంతమేరకు ఉపకరిస్తుంది. అది సాగిన 60 నెలల్లో సుమారు మూడోవంతు 19 నెలలు మాత్రమే శాస్త్రి పాలించారు. ఆ సమయంలోనే రెండు యుద్ధాలు వచ్చాయి. చైనా యుద్ధం తర్వాత సైన్యాన్ని, పరిశ్రమలను బలోపేతం చేయడానికి చేసిన ప్రయత్నాలు పాక్‌ యుద్ధంలో ఉపయోగపడినా నిధులు దానికి మళ్లించాల్సి వచ్చిందన్నది యదార్థం. పైగా యుద్ధం వలన ద్రవ్యోల్బణం ఏర్పడింది. ధరలు తగ్గించడంపై దృష్టి పెట్టవలసి వచ్చింది. 1965లో కరువు వచ్చింది. డాముల నిర్మాణం కొనసాగింది. పంజాబ్‌లో గోధుమ ఉత్పత్తి బాగా పెరిగింది. సిమెంటు, ఎఱువుల ఫ్యాక్టరీలు నిర్మించబడ్డాయి. చాలా గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు వెలిశాయి. పంచాయితీ రాజ్‌ వ్యవస్థను దృఢపరిచారు. రాష్ట్రాలలో విద్యుత్‌ బోర్డులు, ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్లు సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డులు నెలకొల్పారు. ఏది ఏమైనా 5.6% ప్రగతి ఆశిస్తే సాధించినది 2.4% మాత్రమే. దానితో యీ మూడో ప్రణాళిక విఫలమైందని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత మూడేళ్ల పాటు ఏ యేడాదికి ఆ యేడాది ప్లాను వేశారు. శాస్త్రి తర్వాత ప్రధాని అయిన ఇందిర గద్దె నెక్కేనాటికి దేశ ఆర్థికపరిస్థితి యిలా వుంది. (సశేషం)

(ఫోటో -తాష్కెంట్‌లో లాల్‌ బహదూర్‌ శాస్త్రి, ఆయూబ్‌, కోసిగిన్‌)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?